1, జనవరి 2011, శనివారం

అమ్మ గుండె.... - 1

అమ్మని ఎలాగైనా చంపెయ్యాలి... ఛ ఛ.. ఆలోచించడానికి కొంచెం భయంగా ఉంది... కానీ ఈ మధ్య జీవితం బాగా డిస్టర్బ్ అయ్యింది. మా ఆవిడకీ అమ్మకీ అస్సలు పడట్లేదు. పిల్లలు కూడా అమ్మ మీద బోలెడంత పితూరీలు చెప్తున్నారు. అమ్మకి అప్పటికీ ఒకటి రెండు సార్లు చెప్దామని ట్రై చేశా. కానీ చాదస్తం కదా.. పోనీలే అని సరిపెట్టుకున్దామంటే .. మా ఆవిడ చెప్పినట్లు మా వెనకాల అందరిలో మా గురించి చెడ్డగా చెప్తోందట.. నేను ఎలా నిలదీసి అడగను... దీనికి తోడు అమ్మ అనారోగ్యం.. చుట్టు పక్కల అందరూ ఆరా తీయడం.. అసలే మధ్య తరగతి జీవితం.. అపార్ట్మెంట్ బతుకులు.. అమ్మ మందుల ఖర్చు కోసం నా భార్యా పిల్లలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.. ఎంత చేసినా చుట్టు పక్కల వాళ్లు మేమేదో ఆవిడని రాచి రంపాన పెడుతూ మందు మాకూ లేకుండా చేస్తున్నామని గుస గుసలు.. రాత్రుళ్ళు ఒకటే దగ్గు.. పిల్లలకి..మాకూ నిద్ర లేకుండా.. దీనికి తోడు ఎక్కడికన్నా సరదాగా ఫ్యామిలీ తో వెళదామంటే తీసుకెళ్తే మాకు కష్టం.. ఒదిలేస్తే అందరిలోనూ మాట. నలుగురులోకి ఒచ్చే పరిస్థితి కూడా కాదు. ఒంటి మీద మచ్చలు.. కుష్టి రోగి ఏమోనని అందరూ మనల్ని చూసి దూరంగా జరుగుతున్నారు అంటుంది  మా ఆవిడ..

అప్పటికీ నేను ఎంత కష్టపడి అందరికీ న్యాయం చెయ్యాలని చూసినా అమ్మ పద్ధతి మూలంగా నేను కూడా సహనం కోల్పోతున్నాను.. పోనీ ఏమైనా జాగ్రత్త పడుతుందా అంటే.. వున్న ఒక్క బంగారం గొలుసు ఎవరికో ఇచ్చేసింది.. నాన్న పోయాక నాలుగు గాజులు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియలేదు.. ఎంత అడిగినా చెప్పట్లేదని మా ఆవిడ చాలా బాధ పడుతూంటుంది. అసలు అమ్మ ఎందుకిలా మారిపోయింది... ఎంత బావుండేది చిన్నప్పుడు.. నా ఆలోచనలు నా భయంకర బాల్యం లోకి లాక్కెల్లాయి.

  మేము మొత్తం ముగ్గురు సంతానం. నాకు ఊహ తెలిసిన సమయానికి  రోజూ తప్ప తాగి ఒచ్చి అమ్మని బాదే నాన్న తెలుసు. ఇల్లు ఎలా గడిచేదో నాకు అసలు తెలియదు. అందరి పిల్లల లాంటి జీవితం మాది కాదని అర్ధం అయ్యేది. నాన్న కోరల నించి మమ్మలిని రక్షించడానికి అమ్మ పడే కష్టం కనిపించేది. మీ నాన్న ఎవ్వరినో ఉంచుకున్నాడని అందరూ గేలి చేస్తుంటే వాళ్ళని ఒక తుపాకీతో కాల్చేయ్యలని వుండేది. దీపావళి కి బొమ్మ తుపాకి దిక్కు లేని నాకు ఒక తుపాకీ కావాలని, అదీ నిజం తుపాకీ.. నాన్నను గేలి చేసే వాళ్ళని కాల్చి పారెయ్యడానికి... అమ్మ అప్పుడప్పుడు చుట్టాల కి సాయం చేసి వాళ్లు జాలితో ఇచ్చిన పప్పులు, ఉప్పులు, బియ్యం మాకోసం దాచి పెట్టి మాకు పెట్టేది. మధ్య రాత్రిలో అమ్మ లేచి బాగా నీళ్ళు తాగేది. మొదట్లో అర్ధం అయ్యేది కాదు..కానీ గమనిస్తే తెలిసింది. మాకే చాలని తిండి.. అమ్మ రోజూ పస్తులుండేది. కడుపులో ఆకలికి నిద్ర పట్టకపోతే లేచి మంచి నీళ్ళు తాగి పడుక్కునేది.. చుట్టు పక్కల ఇళ్ళలో అందరికీ బట్టలు కుట్టడం, అప్పడాలు లాంటివి చేసి అమ్మడం, స్వీట్లు అవీ చేసి పార్టీ లకి ఆర్డర్లు సప్లయ్ చెయ్యడం లాంటివి చేసి ఒచ్చిన డబ్బులు నాన్నకి తెలియకుండా దాచి నా స్కూల్ ఫీసు కట్టేది.. ఇంటికి పలకరించడానికి ఒచ్చిన వాళ్లు మీ అమ్మ ఎంతో కష్టపడుతోంది నిన్ను చదివించడానికి, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పేవారు. కష్టం-చదువు రెండే అర్ధం అయ్యేవి. నాకు చదువు అంటే ఎంతో ఇష్టం. బహుశా జీవితంలో ఆడుకోడానికి ఏ ఆట వస్తువూ లేకేమో. లేదా ఎప్పుడు చదువు ఆగిపోతుందో తెలియకేమో.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ లోనే వుండే వాడిని. అమ్మ - ఆకలి, బడి-చదువు, నాన్న -భయం అని మాత్రమే తెలిసిన బాల్యం. ఒక్కో సారి ఆ భయం భాగా పెరిగిపోయేది.


 రోజు అమ్మ దేవుడికి దణ్ణం పెట్టి ప్రార్ధన చేసుకోమన్నప్పుడు.. దేవుడిని యేమని అడగాలో పెద్ద లిస్టు వుండేది.. అన్ని ప్రార్ధనల లిస్టుల్లోనూ ఒక్క కోరిక మాత్రం తప్పక వుండేది. అది ఎవ్వరికీ చెప్పే వాడిని కాదు. నాన్నని నువ్వు తీసుకేల్లిపో అని. అన్ని వేల సార్లు అడిగితే దేవుడు ఎందుకు కాదంటాడు. ఆ రోజు నాకు దేవుడి మీదా, ప్రార్ధన మీదా బాగా నమ్మకం కుదిరిన రోజు... ఆ రోజు నించీ ఏది మానినా నేను ప్రార్ధన మటుకు మానలేదు.. ఆ రోజు నాన్నని దేవుడు తీసుకెళ్ళిన రోజు. ఆ రోజు అదేమిటో చిత్రం గా.. అమ్మ రొజూలాగానే ఏడిచింది, కాకపోతే అందరిలో ఏడిచింది. ఎప్పుడు ఒక్కత్తే తనలో తను ఒంటరిగా ఏడిచేది. నాకు మాత్రం అసలు ఏడుపు రాలేదు. అసలు నవ్వితే బావుండదని తెలుసు, కాబట్టి నవ్వలేదు. ఈ రోజుతో దెబ్బల కష్టాలు తీరిపోయాయని చాలా ఆనంద పడ్డాను, కాని డబ్బుల కష్టాలు అలాగే వున్నాయి.

ఆ రోజు నించీ అమ్మ ఇంకా ఎక్కువ కష్టపడడం మొదలెట్టింది, మొగుడు పెట్టే బాధలు లేనందుకు అనుకుంటా... ఎక్కువ సమయం, ఓపిక వున్నందుకేమో? నేను మటుకు అమ్మ చెప్పినట్లు బుద్ధిగా చదివే వాడిని, తమ్ముళ్ళు మాత్రం అసలు మాట వినేవాళ్ళు కాదు. వాళ్లకి చదువు ఒంటబట్టలేదు. అమ్మ మంచితనాన్ని, చదువు లేని అమాయకత్వాని ఆసరాగా తీసుకుని చదువు నిర్లక్ష్యం చేసి చెడు తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు. నేను అమ్మకి చెప్పినా- నాన్న భయం లేనందుకు అనుకుంటాను, వాళ్లు సరైన దారిలో పడలేదు. కానీ నేను మాత్రం అమ్మ ఆశించినట్టు గానే బాగా చదివి పదో తరగతి  ఫస్ట్ రాంకు తో పాసు అయ్యాను. 

ఆ రొజూ అమ్మ కళ్ళల్లో ఆనందం నేను ఎప్పటికీ మరిచిపోను. అందరికీ గర్వంగా చెప్పింది. ఆ రోజు అమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు చూసాను. మొట్ట మొదటి సారి అవి ఆనందంతో వర్షించాయి.. అమ్మ కష్టంతో పాటూ నేను కూడా టైపు, షార్ట్ హండు నేర్చుకుని చిన్న చిన్న మొత్తాలు సంపాదించి నా చదువుకు, ఫీసుకు లోటు లేకుండా డిగ్రీ కానిచ్చాను. పూర్తిగా చెడిపోయిన తమ్ముళ్ళు ఇల్లు వదిలి పోయేవాళ్ళు. ఎప్పుడో ఒక సారి అక్కడ, ఇక్కడ కనిపించారని చుట్టాల్లు చెప్పేవారు. ఎప్పుడో ఆరోగ్యం బాలేనప్పుడో, డబ్బులు ఐపోయినప్పుడో ఒచ్చి అమ్మ పెట్టింది తిని, పదో పరకో పట్టుకుని మళ్ళీ మాయమయ్యే వాళ్లు. జీవితం బాగానే గడిచినట్లుండేది, నాకు పెళ్లి కాకపోతే... 
                                                                      

                                                                     (సశేషం... కధ మళ్ళీ ఎప్పుడైనా కంటిన్యూ చేస్తా)

6 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. "నాకు చదువు అంటే ఎంతో ఇష్టం. బహుశా జీవితంలో ఆడుకోడానికి ఏ ఆట వస్తువూ లేకేమో."

    "నాన్నని నువ్వు తీసుకేల్లిపో అని. అన్ని వేల సార్లు అడిగితే దేవుడు ఎందుకు కాదంటాడు."

    "ఆ రోజు అదేమిటో చిత్రం గా.. అమ్మ రొజూలాగానే ఏడిచింది, కాకపోతే అందరిలో ఏడిచింది."

    These 3 lines are excellent.

    రిప్లయితొలగించండి
  3. Jyothi Nayak,
    Sorry for not completing Part 2. This is a real story. I want to do full justice to it. Not getting enough time to finsh and don't want to finish in hurry.

    రిప్లయితొలగించండి