28, నవంబర్ 2012, బుధవారం

పిక్సీ డస్ట్ - పుట్నాల పొడి

మీరు గనక డిస్నీ వాళ్ళ సినిమాలు, కార్టూన్లు చూస్తే అందులో టింకర్ బెల్ అని ఒక చిన్న ఫెయిరీ వుంటుంది.

ఒరేయ్ ఇంగ్లీష్ మీడియం అసలు ఫెయిరీ అంటే ఏమిటి రా వెధవా, తెలుగులో తగలడు,  అని  అంటారా? అదేనండీ మన పాత కధల్లో యక్షినో,  మొహినో అని చెపుతూ వుంటారు కదా! అలాంటి క్యారెక్టర్ అన్నమాట. కాకపోతే పిక్సీ లు చాల చిన్నగా, ఇంచుమించు మన వేలు సైజు లో వుంటారు.

ఈ ఫెయిరీ తను కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కధా నాయకుడికో, కధా నాయకి కో అవసరం ఒచ్చినప్పుడు పిక్సీ డస్ట్ అనబడే ఒక పొడిని జల్లి అప్పటికి ఆ గండాన్ని గట్టెక్కేలా చేస్తుంది. పీటర్ పేన్ కధలో పిల్లలు ఎగరడానికి ఈ పిక్సీ డస్ట్ ఉపయోగిస్తుంది. ఇదీ పిక్సీ డస్ట్ అంటే...

మరి పిక్సీ డస్ట్ ఇంద్రజాలం పుట్నాల పొడి ఎలా చేస్తుందని అని మీకు అనుమానం రావొచ్చు.

మా పెద్దమ్మాయి తిండి విషయంలో మహా మొండి.. మా చిన్నమ్మాయి ఇంకా పాలూ, పండ్లూ, సీరియల్ పిండులూ
కాబట్టి ఇంకా మాకు పెద్ద కష్టం తెలియదు కానీ, పెద్దమ్మాయికి బెండ కాయ కూర  తప్ప ఏది పెట్టినా ఒక  పట్టాన అస్సలు నచ్చదు.  దీనికి తోడు నోట్లో ముద్ద పెట్టిన వెంటనే  "హాట్", అని ఉమ్మేస్తుంది. చిన్నప్పటినించీ కారం అలవాటు చెయ్యలేదేమో, అందుకు మాకు శిక్ష అన్న మాట. దానికి నచ్చక పోతే పంచదార కూడా హాటే.  దానికి తిండి పెట్టేటప్పుడు మా ఆవిడ వేసే చిందులకి, ముద్ద ముద్దకీ మా ఆవిడ పిచ్ పెంచి పిచ్చ కేకలు వేస్తుంటే, చూస్తున్న నాకు బీపీ పెరిగి పోతుంది.  దీనికి పరిష్కారం ఏమిటి దేవుడా! అని తల పట్టుకుని కూర్చున్న తరుణంలో మాకు దొరికిన దివ్య ఔషధం ఈ పుట్నాల పొడి. మా అమ్మాయికి తెలుగు పెద్దగా రాదు కాబట్టి, ఇది నాయనమ్మ చేసిన పొడి కాబట్టి దీనికి "నాయనమ్మ పొడి" అని పేరు పెట్టింది.

దీనికి ఇంచుమించు పిక్సీ డస్ట్ కున్నంత  మహిమ వుంది. అసలు డిస్నీ వాడు అందరినీ అబ్బుర పరిచే ఇంద్ర జాలం ఈ పిక్సీ డస్ట్ తో ఎలా చేస్తాడో, పుట్నాల పొడి మా ఇంట్లో అంత మహిమ చూపిస్తుంది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే.........

పిక్సీ డస్ట్ జల్లితే  వస్తువులు గాల్లో తేలిపోతాయి, అదే పుట్నాల పొడి జల్లితే మా అమ్మాయికి నచ్చని ప్లేట్ లో ఐటమ్స్ తేలిగ్గా నోట్లో కి వెళ్లిపోతాయి.. అక్కడ నించి నోట్లో ఎక్కువ నానకుండా పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇష్టం లేకపోతే బుగ్గల్లో పెట్టుకుని ఎంతకీ మింగరుగా మన గడుగ్గాయిలు.

ఫైరీస్ కి చేతిలో వున్న వస్తువు రూపం మార్చాలంటే  పిక్సీ డస్ట్ అవసరం, అలాగే మా అమ్మాయికి నచ్చని పప్పో-కూరో ఏమార్చాలంటే మాకు ఈ పుట్నాల పొడి చాలా అవసరం.. పైన ఒక పొర పొడి జల్లితే సరి.

తిండి పెట్టే  సమయంలో మా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం చల్లారి ప్రశాంతం గా ఉండాలంటే , ఇంట్లో వుండే పిక్సీ డస్ట్ పదార్ధాల మీద జల్లాల్సిందే.

అదేమీ మహిమో మా అమ్మ చేసిన్దయితేనే దానికి నచ్చుతుంది..  అది ఐపోయాక వాళ్ళ అమ్మ అలాగే ట్రై చేసినా సరే - రంగో, రుచో, వాసనో బాలేవని కనిపెట్టి ఇక  తినడం  మానేస్తుంది. ఫైరీ లకి  పిక్సీ డస్ట్ రేషన్ లో ఒక ఫైరీ కి ఒక టీ కప్పు ఇస్తారట, అలాగే మా అమ్మ చేసిన పొడి కూడా ఒక డబ్బాయే వుంది. ఇండియా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద డబ్బాడు చేసి పెట్టింది .. రోజుకో కప్పు చొప్పున నేనో ఇంద్రజాలం చేసే యక్షినిలా ఇడ్లీలో, దోసల్లో, అన్నంలో, పప్పులో, కూరల్లో మరియు పెరుగులో జల్లు తుంటా. అది రోజూ కరిగిపోతుంటే నా గుండె తరుక్కు పోతుంది.. ఇది లేక పోతే దీనితో తిండి తినిపించడం ఎల్లారా దేవుడా అని.

ఆ డబ్బాలో పుట్నాల పొడి అడుగంటుతోంది, మీరు ఎవరైనా ఇండియా వెళుతుంటే, "బాబ్బాబు మాకు కొంచెం తిరిగి ఒచ్చేటప్పుడు మా అమ్మ గారింటి నించి కొంచెం పిక్సీ డస్ట్ ప్యాకెట్ ... అదే పుట్నాల పొడి తెచ్చి పెట్టరూ?"



6 కామెంట్‌లు: