9, నవంబర్ 2011, బుధవారం

ఇది కధ కాదు... మీరేమంటారు?

ఏవిటది "ఇది కధ కాదు" అని టైటిల్ పెట్టాడు? కధ కాకపోతే ఇది ఆసక్తి కరమైన నిజంగా జరిగిన యదార్ధ సంఘటనా? లేక ఇది కధ కాదు సినిమా సమీక్షా? అని అనుకుంటున్నారు కదూ? ఇది కధో? కాదో? యదార్ధ సంఘటనో? తెలుసుకోవాలంటే మీరు మొత్తం చదవాల్సిందే..
   
మా పెద్ద అమ్మాయి సిరికి ఐదేళ్ళు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా కధ చెప్పమని అడుగుతూ వుంటుంది. ఇష్టం లేని తిండి పెట్టాలంటే, ఏదో ఒక కధ అప్పటికప్పుడు కల్పించి ఆ కధలో మా అమ్మాయి లీనం అయ్యేలా చేసి ఇష్టం లేని కూరో, చారో, పప్పో నోట్లో కుక్కెయ్యాలి. రాత్రి పూట అయితే పడుకునే ముందు ఒక పుస్తకం లో కధ చదివినా, లైట్ ఆర్పేక నాలో CREATIVITY పదును పెట్టి, దానికి నచ్చిన క్యారెక్టర్ ల మీద కధ చెప్పాలి. మా అమ్మాయి కుక్కల్నో, పిల్లుల్నో, కుందేల్నో, మనుషులనో.. ఎవరిని చెప్తే వాళ్ళ మీద కధ చెప్పాలి. అప్పటికీ ఒక జోల పాట పాడితే మనకి ఈ బుర్రకు పదును పెట్టి కధలు చెప్పే శ్రమ తప్పుతుందని ఎన్నో సార్లు పాట పాడే ఛాయస్ ఇచ్చినా, మా అమ్మాయి కధ చెప్తే  గాని కుదరదని మొండి పట్టు పట్టేది.
  
మొదట్లో మనకు తెలిసిన వాటిల్లో అవసరానికి గుర్తొచ్చిన కధలు కొన్ని చెప్పి కాలక్షేపం చేసినా, ఆ తరవాత కధలకి తడుముకునే పరిస్థితి ఒచ్చింది. సరే ఏ మహా భారతమో చెపుదామంటే సగం తెలుగు- సగం ఇంగ్లీష్ లో చెప్పలేక.. ఒక వేళ మొదలెట్టినా అందులో క్యారెక్టర్ లని ఇంట్రడ్యుస్ చెయ్యగానే మా అమ్మాయి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దాని నిద్ర సంగతి దేవుడెరుగు నాకు నిద్ర ఎగిరిపోయేది. ఎలాగో కధలన్నీ ఆ వయసులో నీతి కధలే కాబట్టి, మనం చెప్పాలనుకున్న నీతులు కధల్లో జొప్పించి కధలు చెప్తే బావుంటుందన్న ఒక ఐడియా బుర్రలో మెరుపులా మెరిసింది. ఇంక మనకి కొన్నాళ్ళు తిరుగులేకపోయింది.. కధలకి కొరతలేకుండా పోయింది..

 అయితే ఇలాంటి కధలు చెప్పేటప్పుడు కధలో క్యారెక్టర్ మా అమ్మాయిదే ఐనా, దానికి ఊరూ, పేరు, మన నీతికి కావాల్సిన కధ, కధనం మరియు CLIMAX అన్నీ అప్పలరాజే కదా.. అదే నండీ నేనే కద.. అందుకని మెల్లగా కొన్ని విషయాల్లో ఈజీ టెక్నిక్ లు పట్టాను. అంటే మన కద BEAR ల గురించి అనుకోండి పేర్లు సింపుల్ గా MAAMA BEAR , PAAPA BEAR , BABY BEAR అన్న మాట. కధలో మా అమ్మాయికి నీతి చెప్పాలని సృష్టించిన క్యారెక్టర్ మా అమ్మాయి టైపు అన్న మాట, అంటే మా అమ్మాయికి ఇష్టమైన రంగులు, హరివిల్లులు, సీతాకోకలు, మిణుగురులు, ఆట ఒస్తువులు, తిను బండారాలు అన్నీ మా అమ్మాయికి లానే అన్న మాట. ఆ క్యారెక్టర్ చేసే అల్లరి మా అమ్మాయి చేసింది అయ్యుంటుంది... కానీ చివరికి MORAL OF THE STORY మాత్రం మనం చెప్పాలని అనుకున్నది చెపుతాము అన్న మాట.. అబ్బో..మీరు నా తెలివికి బోలెడంత ఆశ్చర్యపోయారా.... అలా చెపుతున్నప్పుడు నా కళ్ళల్లో మెరుపులు .. నెత్తి వెనక స్పీడుగా చక్రం తిరిగి .. మొహమ్మీద నవ్వు (చిరు దరహాసం)తో  ... "అసలు నీకు తిరుగు లేదురా ... కధ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం నువ్వే రా అప్పలరాజు" అని నా భుజం నేనే చరుచుకున్నా.. 

  ఇది కధ కాదు అని మనకి తెలిసినా, చిన్న పిల్లకి కిలోల లెక్కన కధలు చెప్పిన మన ప్రతిభకి ఆస్కార్ కాకపోయినా ఏదో ఒక పురస్కార్ ఏనాటికి అయినా మనకి ఒస్తుందని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఒక రోజు జరిగిందో సంఘటన. "రెండు రోజులు నించి సరిగ్గా తిండి తినలేదు, ఏం తింటావు నాన్నా?" అని అడిగితే మా అమ్మాయి "పూరీ" అంది.  మా ఆవిడకి పూరీ చెయ్యడం రాదు. నాకేమో పూరి కోసం యు ట్యూబ్ లో RECIPE చూసి చేసే ఓపిక లేదు. మా అమ్మాయి అడిగింది కదా అని మా ఇంటికి ఒక ఇరవై మైళ్ళ దూరంలో వున్న  ఒక హోటల్ కి తీసికెళ్ళి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి పూరీ తినిపిస్తున్నా. (పూరి జగన్నాధ్ సినిమాలోలా నాకు  ఉప్మా తిందామని ఉన్నామా ఇంట్లో ఉప్మానాకు తప్ప ఇంకెవరికీ  నచ్చదు) .. అదే టైం లో అక్కడకి తెలుసున్న ఫ్యామిలీ రావడంతో వాళ్ళ అమ్మాయిని చూసి మా అమ్మాయి కంట్రోల్ తప్పింది. మా అమ్మాయి ఇంట్లో కొంచెం మన కంట్రోల్ లో వుండే కోతి (ఆడరా రామా... టైపు) . మేము కాకుండా తెలిసున్న మూడో మొహం.. ( ఇప్పుడు నాలుగో మొహం మా చిన్నమ్మాయితో కలిపి) కనిపిస్తే .... అదీ దానితో ఆడుకునే పిల్లలు అయితే  కళ్ళు తాగిన కోతిలా మన కంట్రోల్ తప్పుతుంది.. అంటే మిగిలిన టైం లో మన కంట్రోల్ లోనే  వుండే కోతి.. మా ఆవిడ అప్పటికీ మా అమ్మాయిని ఎంత అదుపులో పెడతామని ట్రై చేసినా, అసలు మాట వినట్లేదు.. ఒక పక్కన పిల్లని కంట్రోల్ చెయ్యలేని కోపంలో మా ఆవిడ కంట్రోల్ తప్పుతుంటే... మామూలుగా మనం ఉగ్ర నరసింహావతారం ఎత్తుతాము ఇలాంటి టైం లో (ఇంట్లో వుంటే) .. అప్పుడు అందరూ కంట్రోల్ లో కొస్తారు.. (అని నేను అనుకుంటూ వుంటాను కానీ, అది నా ఒత్తి భ్రమ అని ఆ తర్వాత తేల్చేస్తారు అనుకోండి) మరీ హోటల్ లో అవి కుదరవు కదా అని కళ్ళు పెద్దవి చేసి కాళికా అవతారం తో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశా.. మా ఆవిడకేసి - మా అమ్మాయి కేసి అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తే వాళ్ళు కంట్రోల్ లోకి రాలేదు.. సరి కదా కళ్ళు , నరాలు నొప్పెట్టాయి. ఒక పక్క మా చిన్న అమ్మాయి పాల కోసం ఏడుపుతో తలనొప్పి కూడా ఒచ్చింది..  హోటల్ లో జనాలు ఇదేమిటి ఫ్యామిలి ఫ్యామిలీ మొత్తం జూ లోంచి ఇక్కడికి ఎలా ఒచ్చారు అన్నట్లు ఆశ్చర్యంగా కౌంటర్ దగ్గర మానేసి మా ముందు క్యూ కట్టి చూస్తున్నారు.. ఈ గొడవకి ఆ హోటల్ వాడు "మీ ఫ్యామిలీ బయటికేల్తే మేము బిజినెస్ చేసుకుంటాము" అన్న లెవెల్ లో చూస్తున్నాడు.. ఆ దెబ్బకి "ప్యాక్ అప్" అని డైరెక్టర్ లా పెద్ద కేక పెట్టి అందరినీ కార్ లో ఎక్కించేసి హోటల్ నించి బయట పడ్డాము. 

దారి పొడుగునా  మా అమ్మాయికి ఒక పెద్ద క్లాసు పీకేసాను.. పనిలో పని మా ఆవిడ కూడా రెండు కేకలేసేటప్పటికి మా అమ్మాయి కంటి కొళాయిలు తిప్పింది... మెల్లిగా ఇంటి కొచ్చాక ఒక టైం అవుట్ తర్వాత ఒక జాదూ కి చప్పి (అదే నండీ మన మున్నా భాయ్ లాగా) ఇచ్చాక మా అమ్మాయి నా పక్కన సోఫా లో సెటిల్ అయ్యింది. కాసేపాగి డాడీ కూల్ అయ్యాడని అర్ధం అయ్యాక డాడీ నీకో కధ చెపుతానంది.. కధే కదా విందామని సరే నన్నా. మా అమ్మాయి చెప్పిన కధ తెన్గిలీసులో (నా తెలుగు మా అమ్మాయి ఇంగ్లీష్ లో).

ఒక KINGDOM లో ఒక కింగ్ K వున్నాడు, ఒక QUEEN Q వుంది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఒక ప్రిన్సుస్స్ P మరియు ఒక BABY ప్రిన్సుస్స్ B వున్నారు. ప్రిన్సుస్స్ P చాలా గుడ్ గర్ల్ కానీ అప్పుడప్పుడు కొంచెం అల్లరి చేస్తుంది. ఎందుకంటె అప్పుడప్పుడు బోర్ కొడుతుందని. బేబీ ప్రిన్సుస్స్ B కూడా ఏడుస్తూ వుంటుంది ఎందుకంటె మాటలు రావు కదా, అందుకని.. అయితే కింగ్ K అండ్ QUEEN Q ఎప్పుడూ ప్రిన్సుస్స్ P ని మాత్రమే తిడతారు. బేబీ ప్రిన్సుస్స్ B ని ఎప్పుడూ ఏమీ అనరు. ప్రిన్సుస్స్ P కి అప్పుడు బాగా ఏడుపు ఒస్తుంది.. ఎందుకంటె ప్రిన్సుస్స్ ని కింగ్ తో సహా ఎవ్వరూ తిట్టకూడదు కదా!  మోరల్ అఫ్ ది స్టొరీ ప్రిన్సుస్స్ P ని తిడితే ఏడుపొస్తుంది, కానీ ప్రిన్సుస్స్ లు ఏడవకూడదు. (ప్రతీ కధకి చివరన మోరల్ అఫ్ ది స్టొరీ చెప్పడం తప్పని సరి అని మా అమ్మాయి అనుకుంటుంది).

ఈ దెబ్బతో నాలో వున్న అప్పలరాజు.. అదే నండీ కధ-స్క్రీన్ ప్లే-DIRECTION ..రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా UTTER FLOP RAAJU (KING K ) అయ్యి కూర్చున్నాడు.. కంట్లో మెరుపుల దీపాలు ఆరిపోయి...వెనక తిరిగే చక్రం ఆగిపోయి... నా నవ్వు (దర హాసం) కెవ్వుగా మారి.. భుజం తడుముకోవడం మానేసి బుర్ర గోక్కోడం మొదలెట్టా.....  

ఇప్పుడు చెప్పండి అసలు ఇది కధ అంటారా? కాదంటారా? ఆ CONFUSION లోనే. ఇది కధ కాదని మొదలు పెట్టాను..మీరేమంటారు?