26, అక్టోబర్ 2012, శుక్రవారం

పీడ కల

పచ్చటి తివాచి పరిచినట్లున్న
మెత్తటి నేలపైన నేనున్నాను

నాలోకి నేను ముడుచుకి పోయి
మూడంకె వేసి పడుకున్నాను

వెచ్చటి కిరణాలు నన్ను స్పర్శించి
మొగ్గలా  ముడుచుకున్న నన్ను
ఒళ్ళు విరుచుకుని బద్ధకం తీరి
రెక్కలు విచ్చుకునేలా చేసాయి

అడుగులో అడుగు వేసుకుంటూ
నడక మొదలెట్టిన నేను
ఉత్సాహం ఉరకలు వేస్తుంటే
నడకలో వేగం పెంచాను

పరుగులో గుండె లయ పెరిగి
ఊపిరి వేడెక్కి రక్తం ఉరకలేస్తుంటే
ఎదురుగా ఎత్తైన శిఖరం ఆహ్వానిస్తుంటే
అటు వైపు దూసుకుపోయాను

శిఖరం అంచుకు చేరుకుంటున్న నేను
నేలపై నా కాలు బలంగా తన్ని
తల పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ
నా శక్తీ కొద్దీ పైకేగిరాను

కొద్ది సేపట్లో కుప్ప కూలుతాననుకున్న నేను
ఆశ్చర్యంగా గాలిలో తేలుతున్నాను
నా ఒంటి బరువు నాకు తెలియట్లేదు
రెండు చేతులూ ఆడించి చూస్తే 
వినీలాకశంలో విహంగంలా
విశాలమైన రెక్కలు విచ్చుకుని
మబ్బుల్లో విహరిస్తున్నాను

అందంగా నా కింద ప్రపంచం
నా చుట్టూ సూర్య కిరణాలు
 మెరుగులు దిద్దినట్లనిపించే
వెండి రంగుల వెలుగుల
దూది పింజల్లాంటి మేఘాలు
అప్పుడప్పుడు గుంపుగా
నన్ను దాటే అందమైన పక్షులు
పలకరిస్తున్నట్లు అనిపించే
సంగీతం లాంటి వాటి కిలకిలలు 

ఎదురుగా ఆహ్వానిస్తూ ఇంద్రదనుసు
ఎంత అద్భుతం ఈ క్షణం అనిపించి
గుండె నిండా ఊపిరి పీల్చుకుని
ఈ అనుభవాన్ని అందమైన జ్ఞాపకంగా
మెదడు అరల్లో ముద్రించుకునే ప్రయత్నంలో
ఒక్క క్షణం రెప్ప వేసి తెరిచిన  వెంటనే

ఇంతలో ఏమైందో ....
అకస్మాత్తుగా .........
నలువైపులా నా చుట్టూ నిబిదాంధకారం
నేను నాకే బరువయ్యి నా వేగం తగ్గింది
ఎగురుదామని ఎంత ప్రయత్నించినా
నా చేతులలో కదలిక లేదు
నిస్సహాయతలో అరుద్దామంటే
నా గొంతులోంచి మాట రావట్లేదు
నింగిలో నిలిచిపోయిన నేను
వున్నపాటున నేల రాలిపోతున్నాను
సర్వ శక్తులూ కూడ గట్టుకున్నా
ఏం చెయ్యలేని స్థితిలో
నేలను తాకే క్షణాలను ఊహించుకుంటూ
గుండె ఆగే పరిస్తుతుల్లో
లేచి చూద్దునుగా

ఇది ఒక పీడ కల ......
నన్ను నిరంతరం వెంటాడుతోంది.......