23, నవంబర్ 2010, మంగళవారం

గుజారిష్ కవిత రూపం

బ్రతుకే బరువైతే
ఆశే కరువైతే 
మృత్యువు రానంటే
జాలితో చంపెయ్యమంటే
వైద్యుడు వద్దన్నా
లోకం కాదన్నా
చట్టం ఒప్పుకోకున్నా
నీ భాద నాకు తెలుసని  
చెలిమి చేసిన
చల్లని సాయం
చెలిగా మారి 
చంపేసిన కధే
ఈ గుజారిష్
( గుజారిష్ సినిమా చూసి ఒచ్చాక ఇలా రాయాలనిపించి)

15, నవంబర్ 2010, సోమవారం

అదే మా రోజుల్లో ఐతేనా .. కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో

అసలు మా రోజుల్లో దీపావళి తో పోలిస్తే ఈ రోజుల్లో దీపావళి  ఎందుకూ పనికిరాదు. అదే మా రోజుల్లో ఐతేనా..... వయసయిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటున్నారు కదూ? కాదండీ బాబూ. ఇది నిజ్జంగా నిజం. మారిన కాలంతో పాటూ మారిపోతున్న అలవాట్లు, మనుషులకి పండగ అంటే అందులో వుండే అసలు మజా రోజు రోజుకీ తగ్గిపోయి - ఒక సెలవు అనో .. లేదా సినిమా అనో.. లేదా నాలుగు దీపాలు పెడితే, నలభై - టపాకాయలు కాలిస్తే  దీపావళి అనో అనిపించేలా చేస్తోంది. అసలు పండగ అంటే నా దృష్టిలో సందడి. మళ్ళీ మా రోజుల్లోకి వెళ్ళిపోతే...


అసలు దీపావళి ఒస్తుందంటే ఎంత ముందుగా సిద్ధం కావాలి. ఇంట్లో చిన్నపిల్లల లెక్క పెట్టుకుని, ఎంత మంది వుంటే అంత ఎక్కువగా మతాబులు, చిచ్చుబుడ్డ్లు చేసుకోవాలి. వీటి తయ్యారీకి మందు పొడి తయ్యారు చేసుకుని ఎండ బెట్టాలి. బయట దొరికే మట్టి బుడ్లు కొనుక్కుని, న్యూస్ పేపర్ కాయితాలతో మైదా చేసుకుని అంటించి మతాబుల గొట్టాలు రెడీ చేసుకోవాలి . ఓపిగ్గా మందు వాటిలో దట్టించి కూరుకోవాలి. ఇంట్లో పెద్ద అన్నయ్యలో. మామయ్యలో, బాబాయిలో వుంటే పేకముక్కలతో తారాజువ్వలు చెయ్యడం  పెద్ద గొప్ప. మనకి అవి చూసే అవకాశమే ఇస్తారు, కొంచెం బతిమాలితే-  కాయితాలు చిన్నగా కట్ చేసుకుని సిసీన్ద్రీలు తయారు చేసుకోడం లో మనం హెల్ప్ చెయ్యచ్చు. అల్లా చెయ్యకపోతే మనల్ని అసలు కాల్చనివ్వరని మనకి ఒకటే వర్రీ.  అబ్బో అవన్నీ ఎండబెడుతూ వుంటే ఎప్పుడు కాలుస్తామా అని ఎంత ఆత్రంగా ఉండేదో. ఇంక పండగ దగ్గరికి ఒచ్చినా ఇంట్లో ఇంకా కాకర పువ్వోత్తులు, బాంబులు కొనట్లేదని ఒకటే టెన్షన్. అమ్మ దగ్గిర రోజూ బోలెడంత గొడవ చేసి, పదో-పావలనో తీసుకుని బయటకు వెళ్లి చిన్న చిన్న టేపులు (అవే తుపాకీలలో పెట్టుకుని కాల్చేవి) లాంటివి తెచ్చుకుని, నేల మీద పరిచి రాయితో కొట్టి పేల్చడం. అలా కాలుస్తే కాసేపు ఆనందం. మన అదృష్టం బావుంటే ఇంటి కొచ్చిన యే చుట్టమో ఐదు రూపాయలిస్తే అది అమ్మ దాచేస్తే, అవి నా డబ్బులు అని డిమాండ్ చేసి తుపాకీ కొనుక్కోడం. పండగ ముందు స్కూల్ లోను, ప్రైవేటు లోనూ ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారు, కొనుక్కోబోతున్నారు అని ఒకటే గుసగుసలు. అసలు పాటం పట్టించుకునే వాడు ఒక్కడూ లేడు.
ఇంక ఇంట్లో సామాన్లు తెచ్చాక వాటి చుట్టూ  మూగడం. ఆ తర్వాత ఆస్తి పంపకాలని మించిన గొడవలు సామాను పంపకాల దగ్గర. అందరికీ లక్ష్మి బాంబులు, పురుకోసా బాంబులు, ఏరోప్లైన్లు, వంకాయ బాంబులు కావాలి. కాకర పువ్వోత్తులు, పెన్సిళ్ళు చాలలేదని పెద్ద పద్దు చెప్పి ఒకటే గొడవ. ఎవరి వాటా వాళ్ళు సెపరేట్ పళ్ళేలలో ఎండ బెట్టుకోవటం- పైగా వాటికి కుక్కలా కాపలా ఒకటి. ఎవరు ముందుగా శాంపిల్ కని ఏదైనా కాలిస్తే, అది మన వాటాలోంచి కొట్టేసారేమోనని అన్నీ ఒక సారి లెక్కపెట్టుకోవడం. ఈ హడావిడిలో పండగ ఒచ్చేస్తుంది.


ఇంక పండగ ముందర బట్టల దగ్గర అయితే ఈ సారి నాకు నిక్కరు ఒద్దు, పాంటు కావాలని బిక్క మొహం వేసి సతాయించడం. ఐనా సరే మనకి పండగలు ఎన్ని వెళ్లినా నిక్కర్లు పోడుగయ్యేవి కాదు, పైగా అమ్మ చేసే పువ్వుల చొక్కా సెలక్షన్ నచ్చలేదని ఎప్పుడూ ఏడుపే. అమ్మేమో ఒచ్చే పండగ అని హై కోర్ట్ వాయిదా టైపు లో మళ్ళీ వాయిదా. పొద్దున్నే తలంటుకుని, సాయంత్రం దాకా ఆగలేక ఒకటి రెండు శాంపిల్ పేరుతో బాంబులు కాల్చేయ్యడం. అక్కడినించి ఎప్పుడు చీకటి పడుతుందా అని ఒకటే వెయిటింగ్. అమ్మ చేసిన పులిహార, పాయసం ప్రతి దీపావలికీ స్టాండర్డ్ మెను.. కన్సోలేశున్ గా ఆవడో, చంద్రకాంతమో చేస్తే వాటితో సరిపెట్టుకుని, మనలాంటి ఒకళ్ళిద్దరు గొట్టంగాల్లని వేసుకుని ఊర్లో అందరి టపాకాయల inventory ని సర్వే చెయ్యడం. ఎవడైనా దారిలో భారీగా కాలుస్తుంటే అక్కడ నిలబడి ఇంతిత కల్లేసుకుని దేబిరించుకుంటూ చూడడం. ఐపోయాక ఒక సారి షాప్ కి వెళ్లి thousandwaala , పారాచూట్, ఫ్లవర్ రాకెట్ లాంటివి దగ్గరగా చూసి, అవి కొనుక్కుని వెళ్లే వాడి కేసి ఆశగా చూసి.. ఇంకా సిగ్గు విడిచి యే టైం కి కాలుస్తారో అని కనుక్కోడం (వాళ్ళు మన ఇంటి దగ్గర వుంటే మనం కాల్చకపోయిన చూద్దామని, చూసి అందరికీ గొప్పలు చెప్దామని). ఈ హడావిడిలో అమ్మో చీకటిపడిపోతుంది అని పరిగెడుతూ ఇల్లు చేరడం. అప్పటికి అమ్మ పూజ చేసి,మనం పూజకి లేనందుకు రెండు అక్షింతలు వేసి (పూజ టైం కి ఇంట్లో లేనందుకు), బొట్టు పెట్టి, బట్టలు మార్పించి.. అన్ని జాగ్రత్తలతో గోంగూర కాడలతో ఒత్తులు వెలిగించిన దివిటీలతో పాట పాడించి నేలకేసి కొట్టాక ఇంక మొదలు మన దీపావళి ధమాకా...


 ముందుగా కాకర పువ్వోత్తులతో మొదలు పెట్టి, ఒకటి రెండు మతాబులు, చిచ్చుబుడ్లు, పెన్సిళ్ళు కాల్చి.. ఆ తర్వాత భూ చక్రాలు, విష్ణు చక్రాలు.. ఇంకా ముందుకెళ్ళి ఏరోప్లానులు.. ముందు కొంచెం దూరంగా బెట్టి కాల్చి.. ఆ తరవాత ఉత్సాహం పెరిగి, చేతితోనే డైరెక్ట్ గా కాల్చేస్తూ.. మధ్యలో ఆరిపోతున్న దీపాలని వెలిగిస్తూ అమ్మ. చెప్పులు వేసుకోండి, దూరంగా కాల్చండి అని తిట్లు తిట్టే నాయనమ్మ. చివ్వర్లో కొంచం శబ్దాలు సద్దు మణిగాక, మన బాంబులు బయటకు తీసి కాల్చి. బాగా లేటుగా తారా జువ్వలు.. అన్నీ ఐపోయాక రోడ్ల మీద పడి సిసింద్రీలు కాల్చుకోవడం. ఎవడైనా పారచూటు వున్న రాకెట్ కాలిస్తే ఆకాశంలోకి ఆశగా చూడడం, కింద పడ్డ పారచూటు ఏరుకోడం. కాల్చిన కాకర పువ్వోత్తులని జాగ్రత్తగా ఒక పక్కకే పడెయ్యడం. ఒకటో రెండో చోట్ల ఒళ్ళు కాలినా- ఆ సందడిలో మనకి అవేమీ పట్టేవి కాదు.     


పండగ అయిపోయిన తర్వాత రొజూ మామూలుగా పొద్దున్న లేవని మనం - ఆ రోజు కోడి కూయకుండానే లేచి, బయటకి ఒచ్చి మున్సిపాలిటీ వాళ్ళు రాకముందే పక్క ఇంటి ముందు, తర్వాత మన ఇంటి ముందు పేలని బాంబుల కోసం చెత్తలో వెతకడము. సగం కాలిన, ఒత్తులు వెలిగి పేలనివి బాంబులు గట్రా లాంటివి అన్నీ ఏరుకుని రావడం. అందులో పేల్చగలిగినవి మళ్ళీ పేల్చడం. మిగిలినవి అన్నీ కలిపి చింపి, వాటిలో మందు బయటకు తీసి ఒక పేపర్ లో వేసి అగ్గి పుల్లతో తగల పెట్టడం. అదో తుత్తి. మళ్ళీ రాత్రికి పాములు, మిగిలిన సామగ్రి నాగుల చవితి దాకా రాత్రి పూట కాల్చుకోవడం. ఇంక పగలంతా కాలిపోయిన కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని కడిగి, ఎండ బెట్టుకుని.. వాటి చివరలని గొడుగు ఆకారంలో ఒంచి, అక్కవో-అమ్మవో గుప్పెడు రబ్బరు బాండ్లు దొబ్బేసి జేబిలో పెట్టుకుని బయట పడడం.. ఆ రబ్బరు బాండు రెండు వేళ్ళ మధ్య సాగ దీసి,  కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని ముందు భాగానికి తగిలించి, రబ్బరు బాండు వెనక్కి లాగి.. దానితో కుక్కల్ని, పందుల్ని, ఇంటి పై కప్పులని, వెళ్లే వాహనాలని గురి పెట్టి కొట్టుకుంటూ ఊర్లో షికార్లు చెయ్యడం.  ఏరుకున్న పారచూటు ఒక చిన్న రాయికి కట్టి జాగ్రత్తగా చుట్టి గాల్లోకి వేసి, అది విచ్చుకుని కిందకు మెల్లిగా దిగుతుంటే క్యాచ్ పట్టుకుని.. అది డబ్బులు పెట్టి కొని కాల్చిన వాడికంటే పది రెట్లు పొంగిపోవడం. మన టైం బాలేక ఒక్క పారచూటు కూడా దొరకకపోతే, ఒక జేబురుమాలుకి నాలుగు కొసల్లో నాలుగు దారాలు కట్టి, అవన్నీ ఒక రాయికి కట్టి .. అదే మన పారచూటు అని గాలిలోకి విసరడం.


చూసారా పండగ ముందు, పండగ రోజు.. చివరకి పండగ అయిపోయిన తర్వాత కూడా ఎంత ఎంజాయ్మేంటో. అందుకనే అంటున్నాను మళ్ళీ .. అదే మా రోజుల్లో ఐతేనా .......కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో ఫుల్ ఎంజాయ్...

9, నవంబర్ 2010, మంగళవారం

గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - చివరి భాగం

వెనకడుగు వేసే వుద్దేస్సం నాకు లేదు. కానీ వాడి మొహంలో ఏమైనా వెనక్కి తగ్గేంత భయం ఛాయలు వున్నాయేమో అని వెదికాను. నేను కాదంటే, వాడు కూడా కాదనే పరిస్థితిలో ఉన్నాడని అనిపించింది. ఇలాంటప్పుడే నేను అసలు వెనక్కి తగ్గను. మనల్ని ఎవడైనా ముందు పెట్టారనుకోండి, మనం అసలు ఆగం. ఇంత దాకా ఒచ్చాక ఒక సారి చేసే వెళ్లాలని డిసైడ్ అయ్యా. ఆ మాటే వాడితో అంటే, వాడు కూడా సరే అన్నాడు. పైగా పక్కన కుర్రాళ్ళు మాంచి EXCITED గా వున్నారు, ఇలాంటప్పుడు తప్పుకుంటే మనం వయసు అయిపోయిందని ఒప్పెసుకున్నట్లే. ఇక ప్రేపరషన్ అయ్యింది, బయటకి వెళ్లి రక్షణకి సూట్ తొడుక్కోవడమే.
  ఒక అరగంట వేచి ఉన్నాక, తరవాత మీరే అని మాకు తొడిగారు. హమ్మయ్య! ఈ సాహసం తొందరగా ఐపోతే ఒక పని ఐపోతుందని, ఈ టెన్షన్ పోతుందని మేము సూట్ తోడిగేసుకున్నాము - మానసికంగా సాహస ఘడియలకు సంసిద్ధం అయిపోయి. మళ్ళీ ఏం జరిగిందో, మీరు ఇంకా వెయిట్ చెయ్యాలని మా చేత సూట్ ఇప్పించేశారు. ఒక పక్క టెన్షన్, మరో పక్క ఏమీ తిననందుకు ఆకలి. పోనీ వెళ్లి ఏదైనా తిందామంటే, ఇలాంటప్పుడు తిన్నా టెన్షన్ లో ఎక్కుతుందో లేదో, ఎక్కినా సాహసం చేసేటప్పుడు కడుపులో తిప్పిందంటే మళ్ళీ అదో కడుపులో కాందహార్ పరిస్థితి. అందుకని అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇంతలో ఈ సాహసం వీడియో తీసుకునే వాళ్ళు మీ చేతుల మీద ఏదైనా రాసుకోండి కావాలంటే, అని మాకు మార్కర్ పెన్నులు ఇచ్చారు. అక్కడ ఏమి రాయాలి అన్న విషయం మీద అందరూ చాలా సేపు తర్జన భర్జనలు మొదలు పెట్టారు. కొందరు "ఐ డిడ్ ఇట్" అని, కొందరు "ఐ లవ్ యు", కొందరు "TO MY MOM ", ఇంకొందరు తమ ప్రియురాలి పేర్లు రాసుకున్నారు. మా వాడు మటుకు బుద్ధిగా తన భార్యకి ప్రేమతో అని రాసుకున్నాడు. నేను ఏం రాయాలో తోచలేదు.. అసలు ఇదంతా ఎందుకు మన కిక్ కోసమే కదా అని, చివరకి కిక్ అని రాసుకున్నా.
    సమయం చాలా భారీగా గడుస్తోంది, ఏదైనా కొత్త పని చేసే ముందు వుండే టెన్షన్, ముఖ్యంగా అది సాహసం అయితే చాలా భయంకరంగా వుంటుంది. మనసులో అనేక సందేహాలు వస్తూ వుంటాయి, చాలా అవిశ్రాంతంగా ఉంటాము.  దేనిని ఎంజాయ్ చేసే పరిస్థితి వుండదు. అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరిగి, ఏం చెయ్యాలో తోచక.. అక్కడ సాహసం పూర్తి చేసిన వాళ్ళని విచారించడం మొదలు పెట్టాము.. మా ముందు వెళ్లినా వాళ్ళలో ఒక వ్యక్తికి సాహసంలో కళ్ళు తిరిగ వాంతులు అయ్యాయట, ఒక అరగంట బాత్రూం లో గడిపి తడిసిన బట్టలతో బయటకు ఒచ్చాడు. మన దగ్గర స్పేరు బట్టలు లేవు, మనకిలా అయితే ఏమిటి పరిస్థితి? ... ఇంతలో అందరూ హడావిడిగా కుడి వైపుకు చూసారు, కొందరు పరిగెత్తడం మొదలెట్టారు.. ఎందుకంటే ఎవర్నోరక్షించడానికి.. వ్హామ్మో! .. అని గుండె గుభేల్మంది... అలా ఎలా అయ్యిందని ఆరా తీస్తే.. అప్పుడప్పుడు ఇలా అవ్వడం మామూలే అని సమాధానం.... ఇంక లాభం లేదు... ఈ సాహసం ఇంకాస్సేపట్లో చెయ్యకపోతే, భయంతో నేను కూడా డ్రాప్ అయ్యేట్టున్నాను - అని అనుకుంటుంటే మమ్మల్ని పిలిచి సూటులు తోడుక్కోండి.. తర్వాత మీరే అన్నారు.
    ఇంతలో ఒక వ్యక్తి ఒచ్చి, " నా పేరు బాబ్. నువ్వు నేను కలిసి చేస్తాము" అన్నాడు. ఇంక సాహసం మొదలయ్యింది. అన్నిటికీ ముందు నేనే ఉండేలా చూసుకుని మొదలుపెట్టాము. ఎందుకంటె, మనం ముందు లేకపోతే మా కజిన్ భయ పడే అవకాశం వుందని.
     నేను తోడుకున్న సూటు లాంటి సూటు ఒకటి బాబ్ తొడుక్కుని వున్నాడు. నేను- బాబ్, మా కజిన్ తో పాటు ఇంకొకడు.. మా ఫోటోలు, వీడియోలు తియ్యడానికి ఇంకో ఇద్దరు.  మేమంతా మమ్మల్ని ఎక్కించుకుని తీసుకెళ్ళే విమానం కోసం రన్ వే దగ్గరికి ఒచ్చాము.మా ముందుకి CESSNA విమానం ఒచ్చి ఆగింది. నేను గతంలో ఒక సారి CESSNA విమానం ఎక్కి ఒక పావు గంట నడిపాను.కాబట్టి దానిలో ఇద్దరు కూర్చడానికి, మహా అయితే నలుగురు ఇరుక్కోడానికి కుదురుతుంది అని నాకు తెలుసు.  లెక్క పెడితే మేము ఆరుగురం, మాతో పాటు ఒక ఫైలట్. మొత్తం ఏడుగురు, ఇద్దరు పట్టే చిన్న CESSNA విమానంలో ఇంత మంది ఎలా ఎక్కుతారని నేను ఆలోచిన్చేలోపే, మమ్మల్ని పిల్లుల్లా ఒంగోబెట్టి, మోకాళ్ళ మీద పాకించి మూలన ఇరికించి రెండు వరసలలో నలుగురిని, డోర్ దగ్గర బల్లుల్లా మిగిలిన ఇద్దరినీ ఇరికించారు. మెల్లిగా CESSNA రన్ వే పైన వెళుతుంటే, మనం పది వేల అడుగుల పైకి వెళ్ళాక, నేల మీద పిల్లిలా ముందుకి పాకి, డోర్ దగ్గరకి ఒచ్చి, సైడ్ లో వున్న రాడ్ పట్టుకుని ఒక్క సారిగా కిందకి దూకేయ్యాలి... దూకిన తరవాత రెండు చేతులూ, రెండు కాళ్ళూ విశాలంగా చాచి తల పైకి ఎత్తి ఉంచాలి అని చెప్పారు.  


 ఇంక గుండె సెర వేగంతో కొట్టుకోడం మొదలెట్టింది. మెదడు పనైతే చేస్తోంది కానీ, దానికి అంతా అయోమయంగా ఉంది. CESSNA గాల్లోకి లేచింది. మా ఇద్దరి మొహాల్లో కత్తి వాటుకు నెత్తుటి చుక్క లేదు, తరవాత ఏమైనా జరగచ్చు అనే ఆలోచన... అసలు ఎందుకిలా చేస్తున్నాం.. ఇలా చేసినందుకు పశ్చ్చాత్తాప పడకుండా వుంటే చాలు.. అనే భావం ... మనసులో దేవుడిని ప్రార్దిన్చాలనే తలపు..... అంతలో ఇలా అవసారాలకే దేవుడిని ప్రార్ధిస్తే.. "ఒరేయ్.. నీ సంగతి నాకు తెలుసు.. నువ్వు నీకు అవసరం అయినప్పుడే ప్రార్దిస్తావు .. నేను అసలు వినను పో" అని కోపగించు కుంటాడేమో.. అని అనుమానం.. ఐనా సరే అని ఏదో క్లుప్తంగా ప్రార్ధించి.. ఇంత కన్న పెద్దగా ఏమి కోరట్లేదు అని బేరం ఆడిన రీతిలో .... చెయ్యాల్సిన స్టెప్స్ ని మరో సారి నెమరు వేసుకుంటూ.. ఏది చెయ్యకపోతే ఎక్కువ రిస్కో ముందే అంచనా వేసుకుంటూ .. మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాను...
    ఒక సారి మా కజిన్ వైపు చూసి... తెచ్చి పెట్టకున్న ధైర్యంతో.. ఒక సారి బొటన వేలు పైకెత్తి "ALL THE బెస్ట్" అన్నాను..నాలో వున్న నిస్సత్తువని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ.. వాడి పరిస్థితి నాకంటే రెండు రెట్లు హీనం...నేను కనీసం PARA సైలింగ్..HOT AIR బలూన్.. హెలికాప్టర్..లాంటి వన్నీ రుచి చూసాను.. వాడికి అన్నీ మొదటి సారి సాహసాలే... CESSNA మూడు వేల అడుగుల దాటాక కొంచెం చలి పెరిగినట్లు లోపల మాకు తగులుతున్న గాలి తెలియ చెప్తోంది. మెల్లిగా పైకి వెళ్లే కొద్దీ చలి ఇంకా పెరగడంతో నా డ్రెస్సింగ్ సరిపోతుందో లేదో అనే ఇంకో అనుమానం.. కిటికీలోంచి చూస్తుంటే అన్నీ బాగా చిన్నగా కనిపిస్తున్నాయి. మొదటి సారి నేను ఎక్కినప్పుడు కేవలం ఐదు వేల అడుగుల ఎత్తులోనే FLY అయ్యాము. అప్పుడే బోలెడంత భయం వేసింది, కాకపోతే మనం కిందకి ఎక్కువ చూసే అవసరం వుండదు కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసాను. నిజానికి నాకు  కొంచెం ఎత్తులంటే భయం- దూకేస్తానేమోనని. నేను ఎత్తైన బిల్డింగ్ల మీద వున్నప్పుడు అంచుల దగ్గరికి ఒస్తే నా మెదడు దూకెయ్, దూకెయ్ అని అంటున్నట్లు వుంటుంది... దీన్నే VERTIGO అనో, ఇంకేదో అనో అంటారు. అలాంటి నేను - నా అంతట- పది వేల అడుగుల పైనించి నేలని చూస్తూ దూకేయ్యడమే... నో వే... నాట్ ఎట్ అల్.....
   "మనం తొమ్మిది వేల అడుగుల దాకా ఒచ్చాము... అందరూ మోకాళ్ళ మీద, మో చేతుల మీద సిద్ధంగా వుండండి", అన్నాడు PILOT . అంతే ఇంక మెదడు మొద్దు బారి పోయింది.. ఇంతలో డోర్ తెరిచారు.. ఊపిరి అంత గాలిలోనూ, హోరులోనూ  గుండె ల్లోకి వెళ్లి..ఒస్తున్న విషయం తెలుస్తోంది... మెల్లిగా పాకుతూ... సహకరించడానికి మారాం చేస్తున్న మెదడుని బతిమాలుకుంటున్నాను... నేను మననం చేసుకున్నా, ప్రాక్టిసు చేసినా గుర్తు రాని స్టెప్స్ ని .. నా ముందే ఒక photographer కిందకి దూకేసాడు.. వుష్శ్శ్.. మన్న శబ్దం.. వెనకినించి బాబ్ తోస్తుంటే ముందుకి జరుగుతున్న నా మొహమ్మీద.. చల్ల గాలి ఈడ్చి తన్నినట్లు ఫీలింగ్... "జంప్.. జంప్... జంప్.." అని అరుపులు... CESSNA కుడి పక్కన వున్న ROD ని బలంగా పట్టుకున్న నేను కిందకి చూస్తే...కంటి చూపుకి అందినంత వరకూ నేల లేదు... అమ్మో!...... ఒక్క సారి కళ్ళు మెదడుకి సంకేతాలు పంపడం ఆపేశాయి... అప్పటికే మొద్దు బారిన నా మెదడు.. నో సిగ్నల్స్ ప్లీజ్.. అన్నట్లు ఉంది.. ఐనా కూడా ఇక్కడ ఆగిపోవడం అనేది "NOT ONE OF THE CHOICES " అని శరీరంలో ప్రతి భాగము.. మెదడు సంకేతంతో పని లేని అసంకల్పిత  ప్రతీకార చర్యలా... తెలియకుండానే... ఒక్క సారిగా దూకేసాను...
       ఒళ్లంతా స్పర్స తెలియకుండా చలి.... మగధీర సినిమాలోలా ఫ్రీ ఫాల్..రెండు చేతులూ రెండు కాళ్ళు చాపాలనే ప్రయత్నాన్ని అంత సులువుగా కానివ్వని గాలి.. ఇంతలో మెడ పైకి ఎత్తలేదని నెత్తి మీద ఒకటి ఇచ్చిన photographer , విశ్వ ప్రయత్నం చేసి మెడ ఎత్తి కళ్ళతో చూసి ఆస్వాదించాలనే ఆలోచన ఒచ్చి... వేగంగా నేల మీదకి పడిపోతున్న గమనంలో నూట ఇరవై పై చిలుకు సెకన్లు ఐనప్పటికీ... రెప్ప పాటు కాలంలా అనిపిస్తుంది... అప్పుడే కర్రెక్ట్ గా చెప్పాలంటే " గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది."
ఇంతలో బాబ్ నా సూటుకి తన సూటు లంకె వేసుకుని వున్నాడు కదా..తన మొదటి పారాచూట్ వోదిలాడు. విపరీతమైన కుదుపు... కళ్ళు తిరిగాయి... కాసేపు ఏదీ సరిగా చూడలేని.. స్తితి... బుర్రలో CONCUSSION ఒచ్చినట్లు ఫీలింగ్... అలా ఒక నాలుగు నిమిషాలకి ఏమీ అర్ధం కానీ పరిస్థితి.. అదుపు తప్పి మన ప్రాణాలు పోతున్నాయి అనిపించింది... ఇంక బతికే ఆస్కారం లేదు అని తెలిసిపోయిన నిస్సహాయ స్థితి..BRIAN డెడ్...


 ఇంతలోకి బాబ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చి ... రెండో పారాచూట్ వోదిలాడు... కాసేపు అయ్యాక బతికే అవకాశం ఉందన్న ఆలోచన మెల్లగా చలనం తీసుకొచ్చి.. చుట్టూ చూసేలా చేసింది... ఎంత ప్రయత్నించినా .. మనసుని వారించినా,. చూపు కిందకే పోతుంది... కింద చూస్తే మనకి భయ్యం... అదే భయ్యం...ఎత్తులంటే....అదే VERTIGO ..కాకపోతే.. ఇప్పుడు ఆల్రెడీ దూకేసాం.. కాళ్ళు, చేతులు, వెన్ను విరిగినా బతికే అవకాశం ఉండేలా ఎక్కడ పడితే బావుంటుందో అని చూపులు వెతుకుతున్నాయి... .    లాండింగ్ కోసం ప్రయత్నం...  ఇక్కడి అన్నీ చేసేది బాబ్ అయినా సరే.. ఆ భయంలోనే చుట్టో చూసే ప్రయత్నం చేస్తుండగానే.. "కాలు పైకి పెట్టుకో... లాండింగ్..." అని బాబ్ హెచ్చరిక.. కింద డామ్మంటూ.. bottom బ్రేక్ ఐన ఫీలింగ్ తో లాండ్ అయ్యాము..  
  'ఎలా ఉంది... ఎలా ఉంది..." అని ప్రశ్నలు.. నీరసంగా రెండు బొటన వేళ్ళు పైకి పెట్టి.. బలవంతపు నవ్వుతో ... SUCCESS అన్న సూచన చేసాను... నిజానికి నాకు సాహసం చేసిన ఫీలింగ్ కన్నా... అయిపోయిందన్న రిలీఫ్ ఆనందానిచ్చింది..


వెంటనే ఏదో  మర్సిపోయనని అనిపించింది.. మై కజిన్... వామ్మో!.... వాడికేం కాలేదు కదా... అని చుట్టూ చూసాను...వాడు నా తర్వాత దూకి ఉంటాడు కాబట్టి.. ఆకాశం వైపు చూడాలని గుర్తుకొచ్చి.. పైకి చూసాను.. వెయ్యి అడుగుల ఎత్తులో కిందకి ఒస్తున్న పారాచూట్ కనిపించింది... వాడేమోనని ఆశగా చూస్తూ.. వాడు సేఫ్ గా లాండ్ అవ్వాలని ప్రార్దిస్తున్నా.. నాకు రెండొందల అడుగుల దూరంలో ల్యాండ్ అయ్యాడు...వెంటనే వాడి ఆనందానికి అవధుల్లేవు... గడ్డిలో పిల్లి మొగ్గలు వేసాడు.... దగ్గరకి ఒచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు..వాడు ఎన్ని ఇంతలు బయపడి ఉంటాడో... ఇప్పుడు నాకు పదింతలు రిలీఫ్ ఉన్నట్లుంది..
మా సాహసానికి మేము బోలెడంత ముచ్చట పది.. ఫోటోలు.. వీడియోలు తీస్కుని ఇంటికోచ్చాము.. అప్పుడు చెప్పాము ఇంట్లో.. నమ్మలేదు.. వీడియో చూపించాము..
వీడియో చూసిన నా కూతురు... "డాడీ! I WANT TO FLY LIKE A BIRD... JUST LIKE YOU"..అంది.. తరవాత చేద్దువుగానిలే అని సర్ది చెప్పి..ఫోటోలు, వీడియోలు.. దానికి కనపడకుండా పెట్టేసా. మళ్ళీ మళ్ళీ అడుగుతుందని భయమేసి...


"నేనైతే పరవాలేదు కానీ... నా బంగారు కొండ చేస్తానంటే ఊరుకుంటానా.. అమ్మో! అలాంటి సాహసం గట్రా.. నాట్ అలోడ్...ఎంత సాహసి నైనా నేను కూడా తండ్రినేగా..."
                                                                                                                (సమాప్తం)
ఇలా దూకేయ్యడాన్నిTandem  Sky Diving అని అంటారు. 

5, నవంబర్ 2010, శుక్రవారం

గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - రెండవ భాగం

ఆ గదిలో ఈ సాహసానికి ఒడిగట్టిన మా లాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారో అని ఊహించుకుంటూ మేము ఆ గదిలోకి అడుగుపెట్టాము.  అక్కడ మాకు ముగ్గురు చాకులాంటి కుర్రాళ్ళు కనిపించారు. వారి వయసు పదహారు- పద్దెనిమిది మధ్యలో వుంటుంది. వాళ్ళు అంతా వయసులో వుండే వుద్రేకం తో ఒచ్చిన ఊపులో ఒక రకమైన ఉత్సాహం తో వున్నారు. "ఆ వయసులో చేస్తే ఒక సాహసం, ఈ వయసులో చేస్తే ఏం పోయేకాలం అని జనం అనుకుంటారు ...", అంటూ నా అంతరాత్మ మళ్ళీ లేచి మొత్తుకోబోయింది. "చస్స్.. నోర్ముయ్యసే.." అని దాన్ని తుంగలో తొక్కి, ఇంక నిశబ్దంగా వుంటే వీడు ఇలాగే లేస్తాడని, పక్క నున్న కుర్ర కారుని ప్రశ్నలతో గోకాను.. "ఎందుకు ఈ సాహసం చేస్తున్నావు? ఇంట్లో తెలుసా ఇలా చేస్తున్నట్లు?" అని. దానికి వాడు "ఇది చెయ్యకపోతే నన్ను నేను క్షమించుకోలేను, ఈ రోజు కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసా. నేను ఇలా చేస్తున్నట్లు మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది" అన్నాడు. బుద్ధున్న ఏ పెద్ద వెధవైనా ఇలాగే చెప్తారు.. ఈ మెంటలోడు తప్పితే.. అని మళ్ళీ నా అంతరాత్మ లేస్తూంటే... "నువ్వు ఒల్లకోరా!.. వూ.. జెల్ల కొట్టీస్తన్నావు.. " అని వాడిని అదమాయించే లోపు.. "అందరూ వృత్తాకారంలో మూగండి" అన్న కేకకి నేను అందరితోపాటు అక్కడ గుమిగూడాను.


ఇంకో పిల్లవాడు దీని కోసం వాడు డబ్బులు ఎలా పోగేసిందీ చెపుతున్నాడు. అది వింటే ఏదో రిక్షా తొక్కే పేద వాడు పొదుపు చేసి  నానో కారు కొన్న స్టొరీ కన్నా కూడా జాలిగా ఉంది. అందరూ వాళ్ళ తల్లి తండ్రులకి తెలిస్తే వాళ్ళని ఎలా చంపేస్తారు అన్న దాని మీద ఒకడిని మించి ఒకడు రేంజ్ పెంచుకుంటూ గొప్పలు పోతున్నారు. ఆ పిల్ల కాయల మధ్యలో మేమిద్దరమూ, ఇంకొక నడి వయసు ఆడా-మగా వున్నాము. మేము నలుగురం మాత్రము డాక్టర్ విజిట్ కి వెళ్ళిన పేషెంట్, వెయిటింగ్ రూం లో నిశబ్దంగా చుట్టు పక్కల వాళ్ళని గమనిస్తూ ఆలోచిస్తాడు చూడండి- అలా ఉన్నామన్న మాట. అక్కడ మన జబ్బు పక్కన పెట్టి -- పక్కన వాడికి ఎంత భయంకరమైన జబ్బో అనే అనుమానంతో మౌనంగా, అతనికీ మనకీ వున్న దూరం (ఆ జబ్బు మనకు అన్టనంత వుండాలి అని) మనసులోనే లెక్క వేసుకుంటూ కొంచెం దూరం జరుగుతూ...మనం మాట్లాడితే మన జబ్బు గురించి చెప్పాల్సిన  అవకాశం ఎక్కడ వుంటుందో అని మౌనంగా ఉంటాము కదా, అల్లా అన్న మాట.
  అందరం వృత్తాకారంలో గూడాక, "క్వయిట్ ప్లీజ్.." అనే అరుపుతో, అందరూ సంభాషణని ఆపేశారు. "ఈ సాహసానికి మీరంతా తయ్యారా? " అన్న ఇంస్త్రుక్టర్ ప్రశ్నకి "యే..." అని కుర్రాళ్ళ కేకలు.. అందులో సన్నగా "య" అన్న మా నలుగురి గొణుగుడు కలిసిపోయింది. ఈ సాహసం ఎలా చెయ్యాలి అన్న దానికి ముందు తర్ఫీదు ఇస్తుంటే, మెదడులో ఎన్నో ఆలోచనలు... "ఇవన్నీ నాకు అప్పుడు గుర్తున్టాయా?... ఒక వేళ భయంతో మెదడు ఫ్రీజ్ ఐపోతే, ఏంటి పరిస్థితి?  దేని తరవాత ఏది చెయ్యాలో ఎలా గుర్తుపెట్టుకోవాలి?... ఇక్కడ ఇన్నిఅనుమానాలూ నా ఒక్కడికేనా? అందరికీ అర్ధం అయ్యి, నాకు అర్ధం కాకపోతే మళ్ళీ ఎన్ని సార్లు అడిగినా చెప్తారా? అసలు మళ్ళీ చెప్పమంటే ఏమనుకుంటారో?.." లాంటి అనుమానాలతో నిశబ్దంగా ... మొదటి రోజు డ్రిల్ కి ఒచ్చిన కుర్రాడి లాగా - మందని ఫాలో అయ్యి టీచర్ కంట్లో పడకుండా మేనేజ్ చేసినట్లు చేసేసాను. ఇప్పుడు అనుమానాలతో డ్రిల్ అయ్యింది.. అసలు సాహసం ఇప్పుడుంది.. ముందుంది ముసళ్ళ పండగ అనుకుంటూ.. మిగిలిన మూడు ముసళ్ళనీ ... అదే ముసలాళ్ళనీ నా కళ్ళతో వెతికాను.. 
"ఇప్పుడు ఎవరికైనా భయంగా వుంటే ఇప్పుడే ఆపెయ్యచ్చు.. " అని ప్రకటించాడు instructor ... పక్క వాడు "నా వల్ల కాదు".. అంటే బావుండును అని అనుకుంటూ వున్నాను నేను... అలా అనే ధైర్యం చెయ్యడం కూడా ఒక గొప్ప అనిపించింది ఆ క్షణంలో .. మన భయాన్ని ఒప్పుకునే ధైర్యం చెయ్యకపోతే.. మనం ధైర్యం నటిస్తూ భయం మాటున ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ సాహసం చెయ్యడం ఎంత కష్టమో అని మెదడు బేరీజు వేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది.. "నేను డ్రాప్.. "  అన్నాడు మూడో ముసలి... కళ్ళల్లో మెరుపుతో మెచ్చుకున్నట్లు మా ముగ్గురి చూపులు... "నేను కూడా డ్రాప్" అంది అతనితో వున్న ఆడ ముసలి..


హమ్మయ్య!.. మనం ముందు డ్రాప్ అయ్యి ఎవ్వరూ అవ్వకపోతే అది పిరికితనం అని అనిపించుకుంటుంది.. అదే ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయితే మనం అందరిలో ఒకడు.. అసలు ప్రపంచంలో ప్రతీ మనిషీ ఈ గుంపులో ఉండడానికే ఇష్టపడతాడు. అందుకే ముందు కోచ్చేవాళ్ళు తక్కువ.. ఎవడైనా ఒస్తే.. ఆ ఒకడికి ఇద్దరు తోడైతే..  మందలో చేరడానికి అందరూ సిద్ధమే..


  నెక్స్ట్ నీదే వంతు అన్నట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము.. నేనూ.. నా కజినూ...
                (క్షమించండి.. రాత్రి ఒకటిన్నర.. రేపు ఆఫీసు..కాబట్టి ... Climax   తరువాత టపాలో.. కొంచెం ఓపిక పట్టండి...... సశేషం) 

4, నవంబర్ 2010, గురువారం

గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - మొదటి భాగం

"గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే  తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే" అని పదే పదే పాడుకుంటూ వుండేవాన్ని, జల్సా చూసిన తరవాత. అబ్బో ఏమి పోలిక అని జనాలు పొలికేక పెట్టేలా రాశారు మా గురువు గారు. అంతటితో ఆగకుండా
"ఒళ్ళు తూలినట్లుందే దమ్ము లాగినట్లుందే  ఫుళ్ళు బాటిలేత్తి దించకుండా తాగినట్లుందే" అనేసరికి,
అబ్బో! మా దమ్ము భాయీలు మరియు మందు భాయీలు అయితే చిందులేసి తీన్ మార్ డాన్సు చేసి కేక పెట్టారు.
మరి అలా క్లిక్ అయ్యింది మా గురువుగారి పాట.


అయితే ఈ ఫీలింగ్ ప్రేమలో కాకుండా ఇంకో రకంగా నాకు ఈ మధ్య అనుభవంలోకి ఒచ్చింది.
ఈ మధ్య మా బాబాయి కొడుకు ఒచ్చాడు మొదటి సారి అమెరికాకి.  అదే మా చేపలు కొన్న కజిన్. వాడికి ఏదో ఒకటి గుర్తు ఉండేలా చెయ్యాలని అనుకున్నాను. మెల్లిగా ఒక సారి మా ఆవిడని, కూతురిని తప్పించుకుని పొద్దున్నే వాడిని తీసుకుని మా ఇంటి దగ్గర ఎత్తైన పర్వత శ్రేణులు వున్న పోకేనోస్ అనే ప్రాంతానికి తీసుకెల్లా. అక్కడ చెయ్య బోయే విషయం చాలా సీక్రెట్ అనీ వాడికి ముందు నించీ చెప్తూ ఒచ్చా. దాని గురించి ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాకుడదని వాడికి గాట్టి హెచ్చరికలు జారీ చేశా. చెయ్యబోయే పని గురించి వాడికి విపరీతమైన ఉత్కంట కలిగేలా వాడికి దాని గురించి ఎన్నో విషయాలు గొప్పగా చెప్పా. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి ఒస్తుందని. ఒచ్చిన ఆ అవకాశం తీసుకుని చేసే ధైర్యం, తెగింపు చాలా అరుదని. నీకు తెలిసిన వాళ్ళలో బహుశా ఎవరూ ఇలాటివి చేసి ఉండరని చెప్పి వాడిని మానసికంగా ఎలాగైనా ఇది చెయ్యాలనే స్థితికి తీసుకొచ్చా. నేను పక్కనున్న ధైర్యం వల్ల ముందుకు ఒచ్చాడు గాని, వాడిలో ఇది చెయ్యలా-వొద్దా? అనే సందిగ్దం, దానితో పాటు ఎన్నో భయాలు, అనుమానాలు వాడి మొహంలో నాకు బాగా కనిపించాయి.


నాకు చెయ్యాలని ధైర్యం అయితే ఉంది గాని, అనుకోకుండా ఏదైనా జరిగితే? అమ్మో! అసలే పెద్ద వాడిని, వాడిని చేస్తుంటే వారిన్చాల్సింది పోయి, ఉసికోల్పినందుకు నన్ను అందరూ ఏమంటారని తలచుకుంటే నాకు ఒక్క సారి ఒళ్ళు గగ్గుర్పోడిచింది. అమ్మో! ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి రానియ్యకూడదు. ఐనా ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినకూడదు, వింటే పూరీ-మహేష్ కలిసి, నువ్వు పోకిరీ కాదురా ఎందుకీ ఫోజులు అని నన్ను చపాతీ చేసేస్తారు అని అనుకుని ఆ ఆలోచనలని తోవ మళ్ళించాను. అయితే, దీనికి వాడు నా బలవంతం మీద రావట్లేదని రేపు రుజువు కోసం, "ఒరేయ్! నీకు భయం వేస్తే నువ్వు చెయ్యకు. నేను చేస్తున్నానని, చెప్తున్నానని నువ్వు కమిట్ అవ్వకు" అన్నాను. వాడు కొంచెం బెరుగ్గానే "లేదన్నయ్యా. నేను చేస్తాను" అన్నాడు.


 మాటలలో మేము చుట్టూ వున్న ప్రకృతిని, దాని అందాలని సరిగ్గా చూడలేదు. నిజం చెప్పాలంటే మేము చెయ్యబోయే సాహసానికి కళ్ళ ముందు ఎంత సౌందర్యం అయినా మేము ఆస్వాదించ లేకపోదుము. ఆ సమయంలో సినిమా నటి తమన్నా ఒచ్చినా - తప్పుకోవమ్మా అని తల తిప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంతటి టెన్షన్ ఉంది మాలో.

అప్పుడప్పుడూ ఆలోచనల ముసురులో మా ఇద్దరి మధ్య నిశబ్ధం అలా ఒచ్చి వెళ్తోంది. ఇద్దరిలోని బెరుకునీ బయటకి కనిపించనీయకుండా (ముఖ్యంగా నేను) కేవలం మేము చెయ్యబోయే సాహసం గురించి మాత్రమే అప్పుడప్పుడు మేము క్లుప్తంగా మాట్లాడుతున్నాము. అది కూడా మేము చేసిన తర్వాత అది ఎంత గొప్పో అని మేము ప్రపంచానికి ఎలా చెప్పబోతామో అన్న టాపిక్ మీదే. నిజానికి మా భయాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం మా చేత అలా మాట్లాడేలా చేస్తోంది. మేము సాహసం చెయ్యబోయే పర్వతాల దగ్గరికి ఒచ్చాము. మా టెన్షన్ కనపడనీయకుండా రెండు దమ్ములు లాగి, ఒకటికి రెండు సార్లు బాత్రూం కెళ్ళి, వున్న మంచి నీళ్ళ బాటిల్స్  తాగేసాము.


 చివరికి వెళ్లి ధైర్యంగా డబ్బులు కట్టి ఎంత త్వరగా సాహసం చెయ్యచ్చో కనుక్కున్నాము. ఒక గంట కనీసం పడుతుందని చెప్పింది, ఇంతలో మీకు ముందుగా కొంత వర్క్ చెయ్యాలని మా ముందు కాయితాలు పెట్టింది. ఏదైనా జరిగితే వాళ్ళ భాద్యత లేదని, కోర్ట్ లో వాళ్ళని మేము సు చెయ్యకుండా పత్రాలు. సంతకం చెయ్యబోతే చెయ్య వొణికింది. మేము చెయ్యబోయే సాహసం ఎంత ప్రమాదకరమో మరో సారి అంతరాత్మ గట్టిగా వద్దని వారిన్చబోయింది. మళ్ళీ పోకిరీ గుర్తొచ్చి - జగడమే టైపు లో కేక పెట్టి అంత రాత్మ పీక నొక్కాను. తరవాత మీకు కొంచెం ట్రైనింగ్ఇవ్వాలని మమ్మల్ని ఇంకొంత మంది కుర్రాళ్ళతో ఒక గదిలోకి పంపింది.
                                                                                                                (సాహసం - తరవాత టపాలో)