30, నవంబర్ 2012, శుక్రవారం

కృష్ణం వందే జగద్గురుం - భాగవతం రెండు గంటల్లో

మా పెద్ద అమ్మాయి సిరికి రోజూ రాత్రి పడుక్కునే ముందు కధ చెప్పాలి. మన సంస్కృతీ సాంప్రదాయాలకి దూరంగా వున్నాము, దీనికి అవి చెప్పే అవకాసం ఇదేనేమో అని నేను ఏ భారతమో చెపుదామని అనుకుంటే, అది
  "Too many introductions..." అని అసలు కధలో కి వెళ్ళనివ్వదు. సరే ఈజీ కదా అని రామాయణం చెపుతామంటే, సింపుల్ గా రామున్ని పక్కన పెట్టి హనుమంతుడి గురించి చెప్పమంటుంది. చివరకి అది రామాయణం మొదలెడితే సుందర కాండ అయ్యి కూర్చుంటుంది. భాగవతం చెప్పాలని ఎంతో ట్రై చేస్తాను. కాని మన కధ చెప్పే పద్ధతో, మనకి భాగవతం పైన లోతైన అవగాహన లేకనో, చివరకి అది " లిటిల్ కృష్ణా" ఎపిసోడ్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భాగవతం చివరకి మనకే అసంతృప్తిగా అనిపిస్తుంది. టైం చాల్లేదనో, చెప్పాల్సిన చోట సరిగ్గా చెప్పలేకపోయాననో, ఏదో తెలియని వెలితి మిగిలిపోతుంది. ఇంకా ఏదో చెప్పాలి అని, ఎలా చెప్పొచ్చా అని నేను ఆలోచించే లోపు నా కూతురి గురక నా ఆలోచనని ఆపేస్తుంది. బహుశా రామాయణ, మహా భారతాలు మనకి ఎవరో చెప్తున్నట్లుగా వున్నందుకు వాటి గురించి మనకి కొంచెం బెటర్ అవగాహన ఉందేమో?

అదే భాగవతాన్ని నేటి కధగా రెండు గంటల్లో చెప్పాలంటే, ఆ పైన అందులో మాస్ మసాలా పాటలు జొప్పించి, సెన్సార్ బోర్డు ని మెప్పించి, ఇంతలోనే ముగింపు చూపాలంటే?  అదే క్రిష్ చేసిన ప్రయత్నం.

సినిమా ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన కధనం
ట్విస్టుల తో బాగా అల్లిన కధ
దేవుడంటే సాయం అని ఒక మంచి సోషల్ మెసేజ్ నాటకాలతో చెప్పే ప్రయత్నం 
పదునైన డైలాగ్ లు.. కధ వేగంలో చాలామంది గమనించక పోవచ్చు
దగ్గుబాటి రాణా జనాలకి హీరో అని అనిపిస్తాడు ఈ సినిమాతో
ప్రతీ పాత్రకి విలువ వుంటుంది -- అతి చిన్న పాత్రకి కూడా కనీసం ఒక విలువైన డైలాగ్ వుంటుంది

మైనస్ పాయింట్లు;
అతి వేగంగా పరిగెత్తే కధ - ఎడిటింగ్ వల్ల అనుకుంటా
సినిమాటోగ్రఫీ - క్రిష్ ఎందుకో గమ్యం అంత బాగా ఆ తర్వాత ఏ సినిమాలో లేదు
నాటక రంగం ఈ తరానికి తెలియదు కాబట్టి రిలేట్ చేసుకోలేరు
పాటలు తక్కువైనా, బావున్నా - కధ వేగానికి అడ్డు వేసినట్లున్నాయి
ముఖ్యంగా ప్రేక్షకుడు అంత వేగంగా కధతో పరిగెత్తలేడు

నా లాంటి వాళ్లకు ఎంత నచ్చినా, ఈ చిత్రం మాస్ ని పాటలకోసం, ఫైట్ ల కోసం సినిమాకి మళ్ళీ మళ్ళీ రప్పించ లేకపోతే, హిట్ అవ్వడం చాలా కష్టం. నాకెందుకో ఇది నేను నా కూతురికి చెప్పాలనుకునే భాగవతం లా మొదలై - దగ్గుబాటి రాణా లిటిల్ కృష్ణా గా ముగిసిందని అనిపించింది. ఎడిటింగ్ ఈ సినిమా విలువని కొంత మరుగున పడేసింది. ఈ సినిమా ఎందుకో జనాలు టీవీ లో ఒచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది.

గమనిక: ఈ సినిమా ఒక సారి తప్పక చూడండి.. వేరే వాళ్ళ అభిప్రాయం తో పని లేకుండా... 

28, నవంబర్ 2012, బుధవారం

పిక్సీ డస్ట్ - పుట్నాల పొడి

మీరు గనక డిస్నీ వాళ్ళ సినిమాలు, కార్టూన్లు చూస్తే అందులో టింకర్ బెల్ అని ఒక చిన్న ఫెయిరీ వుంటుంది.

ఒరేయ్ ఇంగ్లీష్ మీడియం అసలు ఫెయిరీ అంటే ఏమిటి రా వెధవా, తెలుగులో తగలడు,  అని  అంటారా? అదేనండీ మన పాత కధల్లో యక్షినో,  మొహినో అని చెపుతూ వుంటారు కదా! అలాంటి క్యారెక్టర్ అన్నమాట. కాకపోతే పిక్సీ లు చాల చిన్నగా, ఇంచుమించు మన వేలు సైజు లో వుంటారు.

ఈ ఫెయిరీ తను కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కధా నాయకుడికో, కధా నాయకి కో అవసరం ఒచ్చినప్పుడు పిక్సీ డస్ట్ అనబడే ఒక పొడిని జల్లి అప్పటికి ఆ గండాన్ని గట్టెక్కేలా చేస్తుంది. పీటర్ పేన్ కధలో పిల్లలు ఎగరడానికి ఈ పిక్సీ డస్ట్ ఉపయోగిస్తుంది. ఇదీ పిక్సీ డస్ట్ అంటే...

మరి పిక్సీ డస్ట్ ఇంద్రజాలం పుట్నాల పొడి ఎలా చేస్తుందని అని మీకు అనుమానం రావొచ్చు.

మా పెద్దమ్మాయి తిండి విషయంలో మహా మొండి.. మా చిన్నమ్మాయి ఇంకా పాలూ, పండ్లూ, సీరియల్ పిండులూ
కాబట్టి ఇంకా మాకు పెద్ద కష్టం తెలియదు కానీ, పెద్దమ్మాయికి బెండ కాయ కూర  తప్ప ఏది పెట్టినా ఒక  పట్టాన అస్సలు నచ్చదు.  దీనికి తోడు నోట్లో ముద్ద పెట్టిన వెంటనే  "హాట్", అని ఉమ్మేస్తుంది. చిన్నప్పటినించీ కారం అలవాటు చెయ్యలేదేమో, అందుకు మాకు శిక్ష అన్న మాట. దానికి నచ్చక పోతే పంచదార కూడా హాటే.  దానికి తిండి పెట్టేటప్పుడు మా ఆవిడ వేసే చిందులకి, ముద్ద ముద్దకీ మా ఆవిడ పిచ్ పెంచి పిచ్చ కేకలు వేస్తుంటే, చూస్తున్న నాకు బీపీ పెరిగి పోతుంది.  దీనికి పరిష్కారం ఏమిటి దేవుడా! అని తల పట్టుకుని కూర్చున్న తరుణంలో మాకు దొరికిన దివ్య ఔషధం ఈ పుట్నాల పొడి. మా అమ్మాయికి తెలుగు పెద్దగా రాదు కాబట్టి, ఇది నాయనమ్మ చేసిన పొడి కాబట్టి దీనికి "నాయనమ్మ పొడి" అని పేరు పెట్టింది.

దీనికి ఇంచుమించు పిక్సీ డస్ట్ కున్నంత  మహిమ వుంది. అసలు డిస్నీ వాడు అందరినీ అబ్బుర పరిచే ఇంద్ర జాలం ఈ పిక్సీ డస్ట్ తో ఎలా చేస్తాడో, పుట్నాల పొడి మా ఇంట్లో అంత మహిమ చూపిస్తుంది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే.........

పిక్సీ డస్ట్ జల్లితే  వస్తువులు గాల్లో తేలిపోతాయి, అదే పుట్నాల పొడి జల్లితే మా అమ్మాయికి నచ్చని ప్లేట్ లో ఐటమ్స్ తేలిగ్గా నోట్లో కి వెళ్లిపోతాయి.. అక్కడ నించి నోట్లో ఎక్కువ నానకుండా పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇష్టం లేకపోతే బుగ్గల్లో పెట్టుకుని ఎంతకీ మింగరుగా మన గడుగ్గాయిలు.

ఫైరీస్ కి చేతిలో వున్న వస్తువు రూపం మార్చాలంటే  పిక్సీ డస్ట్ అవసరం, అలాగే మా అమ్మాయికి నచ్చని పప్పో-కూరో ఏమార్చాలంటే మాకు ఈ పుట్నాల పొడి చాలా అవసరం.. పైన ఒక పొర పొడి జల్లితే సరి.

తిండి పెట్టే  సమయంలో మా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం చల్లారి ప్రశాంతం గా ఉండాలంటే , ఇంట్లో వుండే పిక్సీ డస్ట్ పదార్ధాల మీద జల్లాల్సిందే.

అదేమీ మహిమో మా అమ్మ చేసిన్దయితేనే దానికి నచ్చుతుంది..  అది ఐపోయాక వాళ్ళ అమ్మ అలాగే ట్రై చేసినా సరే - రంగో, రుచో, వాసనో బాలేవని కనిపెట్టి ఇక  తినడం  మానేస్తుంది. ఫైరీ లకి  పిక్సీ డస్ట్ రేషన్ లో ఒక ఫైరీ కి ఒక టీ కప్పు ఇస్తారట, అలాగే మా అమ్మ చేసిన పొడి కూడా ఒక డబ్బాయే వుంది. ఇండియా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద డబ్బాడు చేసి పెట్టింది .. రోజుకో కప్పు చొప్పున నేనో ఇంద్రజాలం చేసే యక్షినిలా ఇడ్లీలో, దోసల్లో, అన్నంలో, పప్పులో, కూరల్లో మరియు పెరుగులో జల్లు తుంటా. అది రోజూ కరిగిపోతుంటే నా గుండె తరుక్కు పోతుంది.. ఇది లేక పోతే దీనితో తిండి తినిపించడం ఎల్లారా దేవుడా అని.

ఆ డబ్బాలో పుట్నాల పొడి అడుగంటుతోంది, మీరు ఎవరైనా ఇండియా వెళుతుంటే, "బాబ్బాబు మాకు కొంచెం తిరిగి ఒచ్చేటప్పుడు మా అమ్మ గారింటి నించి కొంచెం పిక్సీ డస్ట్ ప్యాకెట్ ... అదే పుట్నాల పొడి తెచ్చి పెట్టరూ?"15, నవంబర్ 2012, గురువారం

నీకు తెలుసా ప్రేమంటే?

ప్రేమంటే ఏంటో నాకు తెలియదన్నావు...
అసలు నాకు ప్రేమించడం చేతకాదన్నావు

నీకు తెలుసా ప్రేమంటే ఏమిటో..?
ఇన్నాళ్ళ మన సాన్నిహిత్యంలో

నీకేం కావాలో ఎప్పుడూ అడిగే నువ్వు
నన్ను ఎప్పుడైనా ఏం కావాలో అడిగావా?

నీ ఇష్టాల గురించి నాకెప్పుడూ గుర్తు చేస్తూ
నాకూ ఇష్టం ఉంటుందని తెలుసుకో  లేక పోయావు

నీ చేరువలో నేనున్నప్పుడు
నేను  నీకిచ్చిన స్వేచ్ఛ
నీకు దూరంగా వున్నా సరే
నాకు లేకుండా చేస్తున్నావు

నావన్నీ నీవేనని లాక్కునే నువ్వు
నీవన్నీ రహస్యంగా దాచుకున్నావు

నీ ప్రపంచాన్ని నా మీద రుద్దే నువ్వు
నా ప్రపంచాన్నించి నన్ను దూరం చేస్తున్నావు

నా చుట్టూ వుంటే నీకు సంతోషం అంటూ
నా చెంతకొచ్చి నీ విషాదాన్ని చల్లుతావు

నీ  చుట్టూ ఈ వెలుగెక్కడిదని
నా ఏకాంతాన్ని భగ్నం చేసి

నా చిరునవ్వుల దీపాలని ఆర్పేసి
చీకట్లో నన్నొదిలి నీ దారినపోతావు

అవసరాలకోసం అనుబంధాలని  ఆశ్రయించే నువ్వు
నిజాలని భరించలేక నింద లని సంధిస్తావు

నీ బాధ్యతా రాహిత్యానికి, నిర్లక్ష్యానికి
నన్ను బలిపశువుని చేస్తుంటావు

నా నిస్వార్ధంలో కూడా నీ స్వార్ధమే వెతుక్కునే  నువ్వు
నా ప్రేమ విలువ ఎప్పటికీ తెలుసుకోలేవు

నీలా నేను నిన్ను నిలదియ్యకున్నా
నీ పై జాలిపడే నా మనసు  అడుగుతోంది

అసలు .......

నీకు తెలుసా ప్రేమంటే?