24, డిసెంబర్ 2010, శుక్రవారం

ఒంటరి మనసు

ఒంటరి మనసు ప్రశ్నిస్తోంది...
అన్ని వేల పరిచయాలు ఏర్పడినా...
ఎందుకిలా మిగిలిపోయావని...

నీ స్వార్ధం నిన్నందరికీ దూరం చేసిందా అని అడిగింది...
నిస్వార్ధం తో ఏమి కూడబెట్టలేదు కదా.. అన్నాను...

నీ అవసరాలు అందరినీ పారిపోయేలా చేశాయేమో అంది.
ఏ అవసరం తీర్చుకున్నాను గనక అన్నాను

ఆశతో అందలాలు ఎక్కడానికి అందర్నీ తొక్కేసి ఉంటావు అంది
అందరికంటే కిందే వున్నానుగా అన్నాను

పక్కవాడి కష్టాల్లో పాలు పంచుకుని వుండవు అంది
కష్టాలు తీర్చిన తరవాత వాళ్ళే దూరం అయ్యారన్నాను

ప్రేమని పంచలేక పోయుంటావేమో అని అడిగింది
అప్పుడు తెలిసింది నాలో ఇంకా చాలా ప్రేమ మిగిలుందని

అందరికీ ప్రేమ, డబ్బు ఏదో ఒకటి ఇస్తానన్నా..
అందరూ డబ్బే కావాలన్నారు ...
నా దగ్గర ప్రేమ మిగిలిపోయింది

పరిచయమైన వాళ్లు అవసరం తీరి
ముఖం చెల్లక దూరం అయిపోయారు

ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు
అందుకే ఎవరూ దగ్గరికి రావట్లేదు

కానీ నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది
పంచడానికి తెలిసున్నోలు లేరు
విశాలమైన ప్రపంచం ఉంది

మనసుకి సమాధానం దొరికింది
నా విలువ నాకు తెలిసింది


Image source: http://fsb.zedge.net/content/6/1/2/4/1-2007746-6124-t.jpg

Tangled - చివరి డిస్నీయానిమేషన్ ప్రిన్సెస్ చిత్రమా?

ఈ మధ్య కాలంలో ఒచ్చిన డిస్నీ ప్రిన్సెస్ సినిమాలు అంతగా పిల్లలని ఆకట్టుకోలేదు. ఇంతకు ముందు ఒచ్చిన "ప్రిన్సెస్ అండ్ ది ఫ్రొగ్" చిత్రం కేవలం ఒక వర్గం ప్రేక్షకులను (అది కూడా ఒక రంగు అనచ్చేమో) కొంత ఆకట్టుకున్నా, ఆశించినంత గుర్తింపు గానీ, రెవిన్యూ గానీ తేలేదు. చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఆడ పిల్లల్లో వుండే ప్రిన్సెస్ క్రేజ్ ని డిస్నీ సంపూర్ణంగా కాష్ చేసుకోవట్లేదని అందరికీ అనిపిస్తోంది. టింకర్ బెల్ పిల్లలని కొంచెం ఆకర్షించినా అవి ఫైరీలే గనుక ప్రిన్సెస్ కుమ్మరించినంత లాభాలు తేవడం కొంచెం కష్టం. ఎందుకంటె ప్రిన్సెస్ తో IDENTIFY చేసుకున్నంతగా ఆడపిల్లలు ఫైరీ లతో IDENTIFY చేసుకోలేరు. నిజానికి పిక్సార్ తో పాటుగా డిస్నీ నిర్మిస్తున్న చిత్రాలు మంచి గుర్తింపుతో పాటు ఆర్ధికంగా మంచి లాభాలు తెప్పిస్తున్నపటికీ, డిస్నీ సొంతంగా నిర్మించే చిత్రాలు ఎక్కువ శాతం నష్టాలనే మిగులుస్తున్నాయి.డిస్నీ లో CREATIVITY తగ్గిందని అందరికీ అనిపిస్తున్న తరుణంలో TANGLED చిత్రం రిలీజ్ అయ్యింది. పైగా ఇదే తమ చివరి ప్రిన్సెస్ చిత్రమని, ఇంతకు ముందు అనుకున్నమరో రెండు ప్రిన్సెస్ చిత్రాల నిర్మాణం రద్దు చేసామని  డిస్నీ వెల్లడించిందని L A TIMES లో ఆర్టికల్ కూడా రాశారు. అసలే మా లిటిల్  ప్రిన్సెస్ ప్రతీ దానికీ నేను స్లీపింగ్ బ్యూటీ అని  ప్రిన్సెస్ డాన్సు చేస్తూ వుంటుంది. ఎప్పుడూ డిస్నీ తీసుకెళ్ళమని అంటూ వుంటుంది. నా కూతురు రాత్రి పడుకోబోయే ముందు చదివే కధల్లో ఒకటి ఈ TANGLED కధ. ఇది బావుందన్న రివ్యూ లని చదివి, సరే మా సిరికి చూపిద్దామని ఒక రోజు నడుం కట్టాను.
 పొడవైన జుట్టు అన్నది కధకి అసలైన ఆకర్షణ. ఇది చూపించి రోజూ పాలు తాగితే నీకు కూడా అంత జుట్టు ఒస్తుందని మా అమ్మాయిని నమ్మించి పాలు తాగించేయ్యచ్చు అనే కుళ్ళు ఐడియా కూడా ఉందనుకోండి.
ఇక కధ విషయానికొస్తే:
అనగనగా ఒక రాజు-రాణి. కడుపుతో వున్న రాణి గారికి విపరీతమైన అనారోగ్యం చేస్తే రాజ్యంలో అందరూ ఒక ప్రత్యేకమైన పువ్వు కోసం గాలిస్తుంటారు. ఆ పువ్వు గోతల్ అనే ఒక అనాకారి ముసల్ది తను నిత్య యవ్వన వతిగా కనిపించాలని, తన కోసమే దాచిపెట్టుకుని వుంటుంది. ఆ పువ్వు రాణి గారి అనారోగ్యం నయం చేస్తుందని నమ్మకం. ఆ రాజు సైన్యం ముసల్ది దాచిన పువ్వుని వెతికి పట్టుకోస్తారు.అది తిని ఆరోగ్యంగా పండంటి పాపని కంటుంది రాణి. ఆ పాపే రఫున్జల్. ఆ పాప జుత్తు కు రోగాలను నివారించే, యవ్వనంగా కనిపించే మహిమ/శక్తి వుంటుంది.


ఆ జుట్టు కోసం రాజమందిరంలోకి దొంగతనంగా ఒచ్చిన అనాకారి ముసల్ది (గోతెల్) , జుట్టు కత్తిరించి చూస్తుంది. కత్తిరించిన జుట్టుకి మహిమ లేదని గ్రహించి, పాపని ఎత్తుకేల్లిపోతుంది. అలా ఎత్తుకెళ్ళిన రఫున్జల్ ని ఒక నిర్జన ప్రదేశంలో వున్న పొడవైన భవనం లో దాచి పెడుతుంది. తనే తల్లినని రఫున్జల్ ని నమ్మించి, ఆ భవనం నించి కిందకి దిగకుండా కట్టడి చేస్తుంది గోతల్. రఫున్జల్ పెంపుడు జంతువు పాస్కాల్ అనబడే ఒక ఊసరవెల్లి.


తప్పిపోయిన యువరాణి కోసం ప్రతీ పుట్టిన రోజు నాడు రాజు-రాణి లతో పాటు రాజ్యంలో అందరూ వెలిగే లాంతర్లను ఒదులుతుంటారు.
 ఆ రాజ్యంలో దొంగతనాలు చేసే FLYNN యువరాణి కిరీటం దొంగిలించి పారిపోతూ ఆ భవనం చేరుకుంటాడు. అతన్ని కట్టి పడేసి, అతని దొంగ సొమ్ముని దాచేసి, నాకు ఆ లాంతర్లు ఎగరేసే స్థలం చూపించి మా అమ్మ ఒచ్చే లోపు తిరిగి తీసుకొస్తే నీవి నీకిస్తానని ఒప్పందం కుదుర్చుకుని అతనితో మొదటి సారిగా బయటకు అడుగు పెడుతుంది రఫున్జల్. FLYNN మీద పగబట్టి MAXIMUS అనే ఒక గుర్రం వెతుకుతూ వుంటుంది. ఈ గుర్రం తన హావ భావాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. రఫున్జల్ ని బయపెట్టడానికి ఒక భారీ కాయులున్న దొంగలున్న బార్ లాంటి చోటుకి తీసుకెళతాడు FLYNN. MAXIMUS , సైనికులు, దొంగ సొమ్ము వాటా కోసం FLYNN సహచరులు తరుముతుంటే అక్కడి నించి తప్పించుకుని రాజకోట దగ్గరకి వెళ్తారు. 
 
ఇంతలో రఫున్జల్ మీద అనుమానం ఒచ్చి గోతల్ భవనం వద్దకి తిరిగి ఒచ్చేస్తుంది. రఫున్జల్ లేదని తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్తుంది. FLYNN రఫున్జల్ కి లాంతర్లు వొదిలే ప్రదేశం చూపిస్తాడు (ఇది చాలా అద్బుతంగా ఉంది. యానిమేషన్ ఎంత అభివృద్ది చెందిందో ఇలాంటి సీన్లు చూస్తే తెలుస్తుంది). వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. FLYNN ని దొంగగా, మోసగాడిగా నమ్మించి, వీళ్ళ మధ్య అపోహలు సృష్టించి గోతెల్ రఫున్జల్ ని తిరిగి తీసుకెళ్తుంది. FLYNN ని కట్టేసి రాజ సైనికుల దగ్గర చేరేలా ఒక పడవలో ఒదిలేస్తుంది.స్పృహ ఒచ్చిన FLYNN - MAXIMUS మరియు బార్ లోని భారీ కాయుల సాయంతో తప్పించుకుని రఫున్జల్ కోసం భవనం దగ్గరకి ఒస్తూ ఉంటాడు. ఇంటికి ఒచ్చిన రఫున్జల్ ఆ లాంతర్లు తన కోసమే ప్రతీ ఏడు ఒదులుతున్నారని తెలుసుకుని గోతల్ ని నిలదీస్తుంది. నిజం తెలిసిపోయిందని రఫున్జల్ పారిపోకుండా బంధిస్తుంది గోతల్. 
మామూలుగా అయితే తరవాత కధ ఊహించంచ్చు. కానీ ఇక్కడే డిస్నీ వాళ్ళు కధని కొంచెం మార్చారు. అందరినీ ఆకట్టుకునే climax చెప్పాలని ఉంది, కానీ ఇక్కడ చదివే వాళ్లకి సినిమా చూస్తే థ్రిల్ వుండాలి కాబట్టి నాకు బాగా నచ్చిన CLIMAX ఇక్కడ చెప్పట్లేదు. చూసి మీరే తెలుసుకోండి.నచ్చిందో-లేదో కామెంట్లో కొట్టండి.
 
ఈ సినిమా ఆడపిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళతో పాటు అబ్బాయిలకే కాదు పెద్ద వాళ్లకు కూడా బావుంటుంది. నాలుగేళ్ళు పైనున్న వాళ్ళు చూడవచ్చు. పాటలు కూడా బావున్నాయి. యానిమేషన్, కధ, పాటలు, CLIMAX ఈ సినిమా హై లైట్. మంచి సందేశం కూడా ఉంది ఈ చిత్రంలో. ఇంట్లో ఆడ పిల్లలుంటే ఈ సినిమా తప్పకుండా చూపించండి. మళ్ళీ డిస్నీ వాళ్ళు ఇలాంటి సినిమా ఇంకోటి తీస్తారో, లేదో?

15, డిసెంబర్ 2010, బుధవారం

కూతురి చావుని కోరుకున్న మా అమ్మమ్మ - ఒక గుజారిష్ తల్లి

చాలా మందికి గుజారిష్ నచ్చలేదు అని రాశారు. ఎన్నో రివ్యూ లు చదివి, అందులో చాలా మంది చూడక్కర్లేదు అని రాసినా, డబ్బులు వేస్ట్ అని చెప్పినా, ఇంటర్ర్నేట్ లో ఈ సినిమా వుందని లింకులు పంపినా నేను ఆగలేదు. అంతకు ముందు సంజయ్ సినిమాలు కొంచెం నన్ను నిరుత్సాహ పరిచాయి, ఐనా సరే ఈ సినిమాకి వెళ్ళాను. చూసినప్పటి నించీ దీని గురించి రివ్యూ రాద్దామని ప్రయత్నం. ఈ సినిమా నన్ను చాలా బాధ పెట్టింది. అంటే చూడలేనంత చెత్త సినిమా అని కాదు. మరో విధంగా ఆలోచనల్లో వెంటాడి.  ఈ సినిమాలో హ్రితిక్ తల్లిని కోర్ట్ లో ఒక ప్రశ్న వేస్తారు, "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అని. ఈ ప్రశ్న నన్ను అప్పటినించి వెంటాడుతూ ఉంది. చచ్చిపోయిన మా అమ్మమ్మ లాగ హ్రితిక్ తల్లి "అవును" అంటుంది. ఎంత నిర్దాక్షిణ్యం, ఒక తల్లి ఇలా అనచ్చా? అనిపిస్తుంది.  కానీ ఇలా అనే తల్లులు వున్నారు. ఆ తల్లి బాధ మనకి అర్ధం కాదు.   
చిన్నప్పుడు నాకూ అర్ధం కాలేదు, ఎలా అంటే నాకో అమ్మమ్మ వుండేది. ఎంతటి సహనశీలి అంటే నాకు తెలిసి ఆవిడ ఎవ్వరినీ తిట్టి ఎరగదు, ఈవిడకి కోపం ఒస్తే ఎప్పుడైనా చూడాలని అనుకునేవాడిని. ఎంత ట్రై చేసి కోపం తెప్పించినా కేవలం "కక్క గట్ట" అన్న తిట్టుతో సరిపెట్టేసేది. నేను, మా ఆన్నయ్య అమ్మ ఇంట్లో లేని టైములో ఇల్లు కిష్కింద చేసి, రక్తాలు ఒచ్చేల కొట్టుకున్నా కూడా ఏమీ అనేది కాదు. గయ్యాళి గంపల్లాంటి కోడళ్ళు, పెళ్ళాల నోరుకి జడిసి బతికే కొడుకులు, ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేయకుండా పోయిన భర్త, భర్త పోయే నాటికి బడికెళ్లే చిన్న కొడుకు, ఉద్యమాలలో జైలుకెళ్ళిన పెద్ద కొడుకు, చిల్లి గవ్వ లేని ఆస్తి. ఇవన్నీ కూడా నెట్టుకుని ఎవ్వరినీ నొప్పించకుండా చివరి దాకా బతుకు లాగించిన మా అమ్మమ్మకి మిగిలిన బెంగ ఏమిటయ్యా? అంటే అది తన పెద్ద కూతురి చావు.  బతికినంత కాలం ఎవరి మీద ఒక్క పితూరీ చెప్పడం గానీ, తిట్టు గానీ తిట్టి ఎరగదు. మాటకి ముందు ఒక "అయ్యో పాపం" అని చేర్చి మాట్లాడేది.  అంతటి సహనశీలి ఒక విషయంలో నాకు నచ్చేది కాదు. అదేమిటంటే తన పెద్ద కూతురు తనకంటే ముందే చచ్చిపోవాలని భగవంతుని కోరేది. అలా అన్నప్పుడల్లా నేను "అదేంటి అమ్మమ్మ? ఏ తల్లైనా అలా కోరుకుంటుందా? తప్పు కదా!" అని అనేవాడిని. నేనే కాదు, అమ్మ, అక్క అందరూ ఇలాగే అనేవాళ్ళం. "మీకు తెలీదర్రా? దాని అమాయకత్వానికి, పరాధీన బతుక్కి. నేను ఉండగానే నా కళ్ళ ముందు పోతే నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను" అనేది. మానసికంగా ఎదగని పెద్ద కూతురు తన కంటే ముందే పోవాలని ఎంతగానో ప్రార్ధించిన అమ్మమ్మ ముందే చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పెద్ద కూతురి కష్టాలు చూస్తుంటే నాకు అమ్మమ్మ లోని అమ్మ మనసు అర్ధం అవుతుంది. "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అన్న సినిమాలో ప్రశ్నకి, శాంత మూర్తి ఐన మా అమ్మమ్మ "అవును..అవును...ను...ను....ను.... " అని అరిచి బిగ్గరగా సమాధానం చెప్పినట్లు వుంటుంది - ఆ సమాధానం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ.
 నిజానికి ఈ సినిమా చాలా బాగా తీసాడు.  అయితే ఇది సగటు ప్రేక్షకుడికి అస్సలు నచ్చదు. చాల మంది హ్రితిక్ నో, ఐస్ నో చూసి డాన్సుల కోసం సినిమా కెళ్తే చాలా నిరుత్సాహ పడతారు. అలాగే చాలా మంది రివ్యూ లలో రాసినట్టు సంజయ్ లీల బన్సాలి కధలు ఇంగ్లీషు సినిమాలు చూసి చాలా మటుకు కాపీ కొట్టినవే. నేను ఈ సబ్జెక్టు మీద ఒచ్చిన "ది సీ ఇన్ సైడ్" లాంటివి చూడలేదు. అదీ గాక కొంచెం సినిమా విషయంలో కొందరు బావుందని అన్నారు. EUTHENASIA లేదా MERCY KILLING లాంటి టాపిక్ మన జనాలకు ఎక్కదు. ముఖ్యంగా మన దేశంలో జనాలకి సినిమా అంటే ఒక ENTERTAINMENT , డబ్బులు పెట్టి ఏడిపిస్తే ఒప్పుకునేది లేదు అంటారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమా ఎలా చూసినా జనాలకి నచ్చదు. అంత మాత్రాన నాలాంటి సినిమా పిచ్చోడు ఒదిలేస్తాడా? సినిమా బాలేక పోతే, బన్సాలి అంతటి ఘనుడు ఎక్కడ పప్పులో కాలేసాడో మనం చూసి, ఎవడూ అడగకపోయినా మన అభిప్రాయాన్ని చెప్పెయ్యమూ? అదే మరి సినిమా  పిచ్చి అంటే .....

ఇక సినిమాలో కొస్తే, చాలా POSITIVES వున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హ్రితిక్ రోషన్.  ఆ తరవాత సినిమాటోగ్రఫీ. ముఖ్యంగా అన్ని పాత్రలూ పరిమితికి మించకుండా చేసారు. మేజిక్ అయితే హ్రితిక్ చాలా అద్భుతంగా ఒక డాన్సు చేసినట్టు, భలే పండించాడు. ఈ పాత్రకి హ్రితిక్ తప్ప ఇంకొకళ్ళు న్యాయం చెయ్యలేరు అన్న విధంగా నటించాడు.  ఐసు పరవాలేదు అనిపించింది, నాకైతే కొంచెం వయసు ముదిరిన ఛాయలు కనిపించాయి. ఆ పాత్ర ఐసు మాత్రమే చెయ్యగలదు అనిపించే పాత్ర కాదు. సినిమాలో కొన్ని సీన్లు గుండెలు పిండేస్తాయి. పెద్ద హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన పాట "WHAT A WONDREFUL WORLD " సినిమాలో వాళ్ళ అమ్మ దహన కాండ దగ్గర హ్రితిక్ పాడతాడు. ఈ పాట నేను అంతకు ముందు చాలా సార్లు విన్నాను. దీనిని LOUIS ARMSTRONG చివరి దశలో రాసిన పాట. మడగాస్కార్ అనే యానిమేషన్ సినిమాలో కూడా ఈ పాట చిన్న బిట్టు ఒస్తుంది. ఇది చాలా అద్భుతమైన పాట. ఈ పాట 1969 లోది అయినా, ఆ తరవాత ఎంతో మంది ఆర్టిస్టులు ఈ పాటని మళ్ళీ మళ్ళీ చాలా చోట్ల వాడారు. ఈ సినిమాలో ఆ సందర్భానికి ఈ పాట మనకి కన్నీళ్ళు తెప్పిస్తుంది. తన మొదటి మేజిక్ ట్రిక్ గురించి  హ్రితిక్ చెప్తుంటే  అతని శిష్యుడు "అయితే కురిసే నాణెములు అన్న మాట మీ మొదటి ట్రిక్" అని అంటే......  "కాదు, అమ్మ చిరునవ్వు" అన్న సెంటిమెంటు బాగా పండింది.
చివర్లో హ్రితిక్ స్పీచ్ ఒక అద్బుతం, మిగిలిన పాత్రలను గురించి హ్రితిక్  చెప్పినదానికి తన కవిత్వం జోడించి దీన్ని అమోఘంగా తెలుగులో రాసిన నరేష్ నున్నాగారి  నవతరంగం బ్లాగు పోస్ట్  చదవండి.
అయితే సినిమా లో స్టొరీ చెప్పిన పద్ధతి కొంచెం మారిస్తే ఇంకా క్లిక్ అయ్యేదేమో. సినిమాలో హ్రితిక్ బాధ మనకి అర్ధం అయ్యేటప్పటికి మనకి సినిమా మూడు ఒంతులు అయిపోయినట్లు వుంటుంది. సినిమాలో ఒకటి రెండు పాత్రలు తొందరగా హ్రితిక్   నిర్ణయంతో ఏకీభవిస్తాయి, కానీ మిగిలిన పాత్రల లాగ మనము కూడా తేల్చుకోలేకపోతాము. అయితే మొదటి నించీ మనకి హ్రితిక్ తరపునుంచి సినిమాని చూపిస్తే, చివరకి మనమే పాపం చచ్చిపోనివ్వచ్చు కదా! అనుకుంటాము. పక్క వాడు పడిపోతే నవ్విన వాళ్లకి వాళ్ళు పడిపోయాక గానీ తెలియదు ఆ బాధ ఎలా వుంటుందో.  ఇలా బాధ పడే వాళ్ళు మనకి ఒకళ్ళు కూడా తారసపడక పోతే మనకి ఇది అర్ధం అవ్వడం కష్టం. ఇందులో హ్రితిక్ కి శరీరం మెదడు మినహా చచ్చుబడి పోతుంది, కిడ్నీలు చెడిపోయి, గుండె బలహీనమై, ఊపిరి తిత్తులు క్షీణించి ఏనాటికైనా నయం అవచ్చు అన్న ఆశ చచ్చిపోతుంది. అలాంటి మనిషి చచ్చిపోవాలని అర్జీ పెట్టుకుంటాడు. వృద్ధాప్యంలో అనారోగ్యాలు వున్నా,  కొంచెం కాళ్ళూ చేతులూ ఆడుతూ, ఆర్ధికంగా పిల్లల మీద ఆధారపడే పరిస్థితుల్లో , వాళ్ళు సరిగ్గా పట్టించుకోక, పలకరించే దిక్కులేక ఎప్పుడు చస్తానురా అని ఎదురు చూసే మనుషులు మన చుట్టూ వున్నారు. వాళ్ళని మనం పలకరించి చూస్తే తెలుస్తుంది. విదేశాలకి వెళ్లి పది ఏళ్ళు ఐనా ఒక్క సారి ఇండియా ఒచ్చి తల్లి తండ్రులని చూడని  పిల్లలు, ఒకే ఊరులో వున్నా పట్టించుకోని పిల్లలు, పెళ్లి అయ్యాక పెళ్ళాం బెల్లం అయ్యి - తల్లి తండ్రులు శత్రువులు అనుకుని పలకరించని పట్టించుకోని పిల్లలు వాళ్ళ అమ్మ-నాన్నల  మనసుల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది... మనకి విలువ లేని మన మనుషులే మనల్ని పట్టించుకోని వాళ్ళు ఒక్క సారైనా అలా ఆలోచిస్తారని. 

  ఒక మనిషి చావుని కోరుకోడం మనం సమర్ధించం. ఎందుకో మనకి పూర్తి అవగాహన లేకపోయినా, అది అంతే అనుకుంటాము. చాల మంది దృష్టిలో అది భగవంతుడి పని. కానీ ఒక మనిషి జీవితానికి ఒక్కో సారి బతుకే శిక్ష అయితే? నేను ఈ సినిమా ఒక పదిహేను , ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే నేను కూడా తప్పు అనుకునేవాడినేమో. కానీ కొన్ని జీవితాలు చూసాక ఒక్కో సారి నాకు కొందరి విషయంలో అది తప్పు కాదేమో అనే ఆలోచన ఒస్త్తుంది. ముఖ్యంగా మా పెద్దమ్మ జీవితం చూసి. బతికినంత కాలం తన రెక్కల మాటున మానసికంగా యదగని కూతుర్ని లోకులనించి, మాటలతో తూట్లు పొడిచే రాబందుల్లాంటి తన కోడల్లనించి అరవై ఏళ్ళు రక్షించిన మా అమ్మమ్మ తల్లి మనసు  తొమ్మిదేళ్ళ క్రితం తన ప్రాణం పోయేటప్పుడు దీని గతి ఏంటా? అని ఆలోచిస్తూ ఎంత వేదనకి గురి అయ్యుంటుందో! తమ అధీనంలో వున్న మా పెద్దమ్మని హీనంగా చూస్తూ చెల్లెళ్ళ ఇంటికి కూడా పంపకుండా చూసే  మా అత్తల రాక్షసత్వాలు అర్ధం కాని ఆరేళ్ళ పసి మనసుతో అరవై తొమ్మిదేళ్ళ  మా పెద్దమ్మ పెట్టే కన్నీటి జీవితానికి మృత్యువు ముగింపు కోసం మా అమ్మమ్మ ఆత్మ ఈ లోకంలోనే ఎదురుచూస్తోందేమో?

1, డిసెంబర్ 2010, బుధవారం

ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది

 చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పినట్లు నీరు పల్లమెరుగు , అలాగే ప్రేమ కూడా అంతే. స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ మనకి తల్లి తండ్రుల నించి దొరుకుతుంది. అలాగే మనం కూడా మన పిల్లలకి ఇచ్చినంత ప్రేమ మనకి జన్మ ఇచ్చిన తల్లి తల్లి తండ్రులకు కూడా ఇవ్వం. ఎందుకంటే ఆశించకుండా ఇచ్చే ప్రేమే గొప్పది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఈ సినిమా సబ్జెక్టు జీవిన్తాంతం ప్రేమించడం సాధ్యం కాదు అన్న హీరో స్టొరీ. అయితే అది చేదు నిజం. ప్రేమని అందమైన రంగులలో ప్యాక్ చేసి అమ్మే సినిమా అనే ఒక వస్తువుని నిజం చెప్తానంటే కొనుక్కోడానికి ఎవడూ రాడు. అందుకనే ఆరంజ్ అందరికీ నచ్చదు.  పరుగు కూడా ఇలాంటి నిజం చెప్పే ప్రయత్నం. అదీ ఆడలేదు.
సినిమా లో కొన్ని మంచి పాయింట్స్ ఏంటంటే - అందరూ ప్రేమ వుందని అబద్ధం చెప్పి తన భాగస్వామిని నమ్మిస్తారు.
నిజం చెప్పి ప్రేమించడం కష్టమే. అలాగే కొన్ని ఏళ్ళ తరవాత ప్రేమ కరిగిపోతున్దన్నది కూడా వాస్తవమే. విడిపోయే అవకాశాలు చాలా మందికి ఒచ్చినా వాటిని ఎవ్వరూ (చాలా మంది) వుపయోగించుకోరు. చివర్లో ఇంకొంచం ప్రేమించే ప్రయత్నం చేస్తా అన్న కాన్సెప్ట్ బావుంది.మన ప్రేమ మన కార్ హెడ్ లైట్ లాంటింది - దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి కానీ, అవతలి వాళ్ళ ప్రేమ ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది ఎదుటి బండి హెడ్ లైట్ లో చీకట్లో డ్రైవ్ చెయ్యడం అన్నది మంచి ఉదాహరణ. భాస్కర్ ఆలోచనలు బావున్నా, దానికి మంచి పాయింట్స్ తయారు చేసుకున్నా, సబ్జెక్టు చెప్పే పద్ధతి మార్చాలి.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రా బ్యాక్. ముఖ్యంగా జేనేలియా హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది. ఆ హెయిర్ స్టైల్ మూలంగా కొంచెం ముదురుగా కనిపించింది. చరణ్ నవ్వు, DIALOGUE డెలివరీ అస్సలు బాలేదు. ఈ నాటి తెలుగు హీరో లెవ్వరూ పెళ్లి అనే పదాన్ని సరిగ్గా పలకలేరు. ఎవడైనా పెళ్లి అని సరిగ్గా అంటే వాడికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేయచ్చు. దానికి తోడు సినిమాలో సగం వరకు మనం హీరో కాన్సెప్ట్ తో ఏకీభవించం.తరవాత మనకి హీరో కాన్సెప్ట్ ఎక్కే టైం కి  CLIMAX ఒచ్చేస్తుంది. చివరకి హీరో కాన్సెప్ట్ మార్చేస్తాడు. సినిమా మొదటి నించి మనం ప్రేక్షకుడిని మనతో తీసుకెళ్ళకపోతే ఆ సినిమా చివరకి నచ్చడం చాలా కష్టం. దానికి తోడు పాటలు సినిమాలో అంత IMPACT అనిపించలేదు. బయటే బావుండి వుంటాయి. FIGHTS అసలు సినిమాకి నప్పలేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం లిప్ సింక్ కూడా సరిగ్గా లేనట్లు అనిపించింది. సినిమాలో అన్ని పాత్రలు -చివరకి హీరో తో సహా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. దానితో ప్రేక్షకుడు అస్సలు ఒప్పుకోడు. సినిమా అంతా అందులో పాత్రల లాగే CONFUSE ఐన ప్రేక్షకుడు సినిమా బాలేదు అన్న క్లారిటీ తో హాలు నించి బయటకు ఒస్తాడు.
అసలు మనం కోరుకునే ప్రేమ, గుర్తింపు కోసం మనం పడే తపన మాత్రమే. అలా ప్రేమించబడాలంటే మనలో ప్రేమించ దగ్గ లక్షణాలు వుండాలి. ప్రేమించుకునే ఇద్దరి మధ్య మొదట్లో వుండేది ఆకర్షణ మాత్రమే. అది కరిగిపోయే నాటికి వాళ్ళ మధ్య అవగాహన కుదిరితే ఆ బంధం నిలుస్తుంది. ఆ అవగాహనకి పునాది నమ్మకం. మనం అవతల మనిషి మంచి కోసం మన స్వార్ధం లేకుండా కృషి చేసినప్పుడే అవతల మనిషి మనల్ని తన కోసం ప్రేమిస్తాడు. అవన్నీ ఒదిలేసి ప్రేమ అనే గుర్తింపు కోసం నిత్యం డిమాండ్ చేస్తూ అవతల మనిషిని సతాయిస్తుంటే, ప్రేమ సంగతి దేవుడు ఎరుగు - భరించడమే కష్టం అయిపోతుంది.  
  సినిమాలో  పీసులు పీసులు గా చెప్పిన కాన్సెప్ట్స్ బావున్నాయి. మహిళా ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. కానీ కొంచెం పరిపక్వత వున్న వాళ్ళని ఆలోచించేలా చేసే కాన్సెప్ట్స్ వున్నాయి. ఆలోచించేలా చేసినా కూడా సినిమా నచ్చుతుందని లేదు.
 అందుకే ఈ సినిమా మీద నా రివ్యూ, "ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది".