30, సెప్టెంబర్ 2010, గురువారం

మా నాన్నకి జంతువుల గురించే కాదు, దేని గురించీ తెలియదు

  నాకు యానిమేషన్  అంటే చాలా ఇష్టం. మాట్లాడే బొమ్మలతో ఏదైనా చెయ్యాలంటే చాలా కష్టం. నిజానికి మనుషుల మీద చిత్రీకరించిన దాని కంటే ఎన్నో రెట్లు కష్టపడితే కానీ మనం యానిమేషన్ చెయ్యలేము. నా కూతురు చిన్న పిల్లగా వున్నప్పుడు, అంటే దానికి ఇంచుమించు ఒకటో సంవత్సరం దాటిన తరవాత నించి అది నేను కంప్యూటర్ మీద కూర్చుంటే ఒచ్చి కీ బోర్డు మీద వాయించడం మొదలు పెట్టింది. అప్పటికి నేను ఇంకా అంత ఎక్కువ లఘు చిత్రాలు (యానిమేషన్ వి) చూసే వాడిని కాదు. నిజానికి pixar వాడు లఘు చిత్రాలు యానిమేషన్ చేస్తాడని తెలుసు కానీ వాటి కోసం ఎప్పుడూ యుట్యూబ్ వెదికే ఆలోచన రాలేదు. ఎప్పుడైతే నా కూతురు నాతో పాటు కంప్యూటర్ ముందు కూర్చోడం మొదలు పెట్టిందో అప్పుడు ఈ యానిమేషన్ల లఘు చిత్రాలు కోసం వెదకడం మొదలు పెట్టా. ముందుగా pixar వాడి యానిమేషన్ లను చూపించేవాడిని. ఆ తరవాత యాద్రుచ్చిక్కంగా ఈ యానిమేషన్ దొరికింది.
  దీనిని ఇప్పటిదాకా (ఈ బ్లాగ్గు రాసేటప్పటికి) నేను కింద ఇచ్చిన లింక్ నొక్కి ఒక కోటి నలభై లక్షల మంది చూసారు. నా కూతురు ఈ రోజుకి కూడా ఇది పెడితే చాలా ఆసక్తిగా చూస్తుంది. మా ఇంటికి ఒచ్చిన చిన్న పిల్లలందరికీ కూడా ఇది చూపించాను. అందరు పిల్లలకీ నచ్చింది. దీనికి లింక్ ఇదిగో.




  ఈ పాట నాకు ఏనుగులు అంటే ఇష్టం అని ఎరిక్ హెర్మన్ అనే వ్యక్తి పాడుతూ - అవి చెట్ల మధ్య ఊగుతుంటే నాకు చాలా ఇష్టం అంటాడు. వెంటనే ఒక చిన్న పిల్ల "కాదు కాదు. అలా వూగేది ఏనుగులు కాదు, కోతులు" అని అంటూంది. అక్కడినించి చేప,కుక్క,పిల్లి,కోడి,ఎలుగు బంటి, కప్ప, ఎలుక గురించి అలాగే చెప్తే ఆ అమ్మాయి తప్పు అని చెప్తుంది. చివరకి గాడిద గురించి దాని తొండం గురించి చెప్తుంటే "అది గాడిద కాదు, ఏనుగు" అని చెప్తుంది. అదే నేను చెప్పేది నాకు ఏనుగులంటే ఇష్టం అని మళ్ళీ పాట మొదలెడతాడు ఎరిక్ హెర్మన్. "జంతువుల గురించి నీకు ఏమీ తెలియదు" అని అమ్మాయి అనడం తో ఈ యానిమేషన్ ముగుస్తుంది.ఇందులో ముఖ్యంగా పిల్లలు రంగులు వేసినట్లుగా వాళ్ళని నచ్చే రంగులు వాడడం వల్ల అనుకుంటా పిల్లలని బాగా ఆకట్టుకుంటుంది. దీనికి రంగుల బొమ్మలు చిన్న పిల్లలు వేసినవే తీసుకున్నారని ఎక్కడో చదివిన గుర్తు. ఇతని పాటల్ని ఇప్పటిదాకా ఇరవై కోట్ల మంది యుట్యూబ్ లో వీక్షించారని ఇతని వెబ్ సైట్ లో ఉంది. ఇతని సైట్  http://www.erichermanmusic.com/

  ఇలాగే ఇంకొన్ని పాటలు వున్నాయి ఇతనివి. కానీ ఇది ఆకట్టుకున్నంతగా మిగిలినవి వుండవు. మీ ఇంట్లో పిల్లలు వుంటే ఇది చూపించండి. మీకే అర్ధం అవుతుంది. నాకు కూడా బానే అనిపిస్తుంది. ఈ పాట లాగ నేను కూడా మా అమ్మాయితో ఎప్పుడూ తప్పు చెప్పి దానితో ఒప్పు చెప్పించాలని ప్రయత్నిస్తా. కానీ పక్కనే వుండే నా అర్ధాంగి మా అమ్మాయి కంటే ముందు "నీకు ఇది కూడా తెలీదు" అని తనే చెప్పేస్తుంది. ఇక్కడ పంచ్ ఏంటంటే నేను ఎన్ని వందల సార్లు ట్రై చేసినా మా ఆవిడ నేను మా అమ్మాయి చేత చెప్పించే ప్రయత్నం చేస్తునాననే విషయం గుర్తుండక, ఇదేదో నన్ను సరిచేసే అవకాశం అనుకుని రెచ్చిపోయి "నీకు తెలీదు, నాకు తెలుసు. చివరకి నీ కూతురుకి కూడా తెలుసు" అని నన్ను వెర్రి పప్పని చేస్తుంది. ఇలాగే నడిచిందంటే మా అమ్మాయి ఇందులో పిల్లలాగ "మా నాన్నకి జంతువుల గురించే కాదు, దేని గురించీ తెలియదు" అని నాకు తప్ప అందరికీ చెప్పేస్తుందేమో అని నా భయం.
మా ఆవిడ ఎలాగో దానికి వంత పాడుతుంది కదా, ఇదే అవకాశం అని.

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

బాల్యం

లేత బుగ్గల లేలేత ఆలోచనల ప్రాయం - బాల్యం

పారేసుకున్న పలక
దొరకలేదన్న ఉక్రోషం
బడికి వెళ్ళడానికి మనసొప్పక
కడుపు నొప్పని మారాం చేసే ప్రాయం - బాల్యం

కల్మష మైన ఆలోచనలు
వంచనల వలల ఆనవాళ్ళు
అస్సలు ఎరుగని ప్రాయం - బాల్యం

కమ్మనైన పాలు
అమ్మ గోరు ముద్దలు
ఎత్తుకుని చేసే గారాలు
ఏడుపుతో చేసే మారాలు - బాల్యం

అడుగులు ఎన్ని వేసినా
అందుబాటులో అమ్మ ఉందనే ధైర్యం - బాల్యం

పిడుగుపడిన అలజడికి
అమ్మ కౌగిలి అభయం - బాల్యం

విలన్ - నాకు నచ్చాడు

మొన్న టీవీ లో వేసిన విలన్ రికార్డు చేసుకుని ఈ రోజు చూసా. చూసినంత సేపు ఒకటే బాధ. డబ్బింగు పరమ ఛండాలంగా ఉంది. ముఖ్యంగా ఆ తమిళ పైత్యం కి మన వాళ్ళు డబ్బింగ్ లో అస్సలు న్యాయం చెయ్యరు. ఈ సారి మణి రత్నాన్ని పట్టుకుని, బాబూ కావాలంటే నేనే ఏదో తంటాలు పడి రాయిస్తాను కానీ ఎలా పడితే అలా డబ్బింగ్ చేయించకు అని చెప్పాలని అనిపిస్తుంది. దొరికితే చెప్తా కూడా.
    ఆ రోజుల్లో మౌన రాగం, నాయకుడు, ఘర్షణ లాంటివాటికి నడిచిపోయింది. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమాలు అంత వైవిధ్యంగా ఉండేవి కావు, దానికి తోడు సాంకేతిక విలువల కోసం సినిమా ఎలా వున్నా సరే చూసే ఓపిక వుండేది. పైగా కొంత మైల్డ్ గా వుంటే తమిళ పైత్యం ఎలాగో నడిపించచ్చు. మరీ ఇలాంటి తమిళ ఆవేశమున్న సినిమా డబ్బింగ్ బాలేకపోతే సినిమా దొబ్బింగే. ఇక పోతీ గీతాంజలి మన తెలుగు సినిమా కాబట్టి దానికి డబ్బింగ్ జబ్బు లేదు. అంజలి మరీ స్లో సినిమా - పైగా పిల్లలు లొల్లి, climax మన వాళ్ళు విషాదాలు అసలు ఒప్పుకోరు కాబట్టి నడవేదు. దళపతి లో తమిళ ఆవేశం కొంచెం ఎక్కువున్నా ఇదీ విలన్ మాదిరి (ఈ మేటర్ మళ్ళీ చర్చిద్దాం) కాబట్టి ఆడలేదు. రోజా - రెహమాన్ సంగీతం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ తో ఆదరగోట్టింది కాబట్టి బంపర్ హిట్టు అయ్యింది. మధ్యలో దొంగా దొంగా మణి రత్నమే అంత సీరియస్ గా తీసుకోలేదు - కాబట్టి జనాలు కూడా పట్టించుకోలేదు. బొంబాయి సినిమా controversy మీద నెట్టుకొచ్చింది. అక్కడనించి మొదలు మణి రత్నం సినిమా డబ్బింగ్ కష్టాలు.
    అప్పటికి మన తెలుగు సినిమాలు కూడా మంచి సాంకేతిక విలువలు, కధ, కధనం తో ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. అందుకని ఇద్దరు,ప్రేమతో,సఖి అంతగా ఆకట్టుకోలేదు. తెలుగు జనాలు రామ్ గోపాల్ వర్మ -శివ,క్షణం క్షణం లాంటి సినిమాలు. కృష్ణ వంశి -గులాబి, నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమాలు. పూరీ జగన్నాధ్ - బద్రి  సినిమా చూసి కేవలం సాంకేతిక విలువలకోసం డబ్బింగ్ సినిమా భరించక్కర్లేదు అనే స్థితికి వొచ్చినట్లున్నారు. ఆ తరవాతనించి సాంకేతిక విలువలు బావున్న సినిమాలు మన తెలుగులో కూడా బోలెడు ఒచ్చి వున్నాయి. పైగా టాలెంట్ కూడా విపరీతం గా పెరిగింది, budget గురించి మన నిర్మాతలు కూడా ఆలోచించట్లేదు.

     ఆ తర్వాత అమృత సినిమా ఒచ్చింది. ఇది అయితే అసలు సింహళీ గొడవ తెలుగోడికి తెలియనే తెలీదు, దానికి తోడు డబ్బింగ్ ఇబ్బంది డైలాగ్ వరకే తట్టుకోలేమంటే, ఇందులో కవిత్వం కూడాను. ఈ డోసుకి పూర్తిగా బోల్తా కొట్టింది సినిమా. ఏమైందో ఏమిటో మణికి, ఆ తరవాత పూర్తిగా బాలీవుడ్ సినిమాలు తీస్తూ సమాంతరంగా తమిళ్ లో అదే సినిమా లాగించేస్తున్నాడు. ఎలాగో చెత్త డబ్బింగ్ తక్కువ ఖర్చులో తెలుగులోకి తోసేసి యువ, గురు సినిమాలు మన నెత్తిన పడేసారు.

    ఇంక లేటెస్ట్ గా విలన్. అసలు భారతం, రామాయణం లాంటి కధలు మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి సినిమా చూపించడం పెద్ద తప్పు. ఎందుకంటే, అక్కడే సినిమా పట్ల ఒక రక మైన ఎలా తీస్తాడో అనే అనుమానం తో చూస్తారు, దానికి తోడు చూసినంత సేపు మనకి తెలిసున్నదాన్ని అవతల వాడు చెప్తే మనలోని మనిషి (అదే నండీ అంతరాత్మ) "ఒరేయ్! నువ్వు దీన్ని అంత తొందరగా ఒప్పుకోకూడదు" అని మనకి పదే పదే గుర్తు చేస్తూ వుంటుంది.

   అప్పటికీ నాలాంటి సినిమా పిచ్చోడు, మణి రత్నం మీద మౌన రాగం నించి పెంచుకున్న అభిమానం, నాయకుడితో పెంచుకున్న ఆరాధన, గీతాంజలి తో పెంచుకున్న గౌరవం కొద్దీ సినిమా చూసి ఎలాగోలా బావుందని నలుగురికి చెప్పి నాలుగు ఆటలు ఆడిద్దామంటే- ఎక్కడా? అసలే మణి రత్నం సినిమా పాటల్లో సాహిత్యం బావుండదు, అరవ ఆవేశం - సాంబారు డైలాగ్ లు ఇంకేం చేస్తాం..

అలా అని అంత బాడ్ గా లేదు విలన్ సినిమా. climax నాకు నచ్చింది. ఐస్ అయితే "అబ్బో! ఎందుకు లెండి".
మొత్తానికి నాకు సినిమా మణి రత్నం రేంజ్ కాకపోయినా climax లో మాత్రం విలన్ - నాకు నచ్చాడు.
Image taken from http://3.bp.blogspot.com/

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

బొమ్మ పడితే రెప్ప పడదు - సినిమా pause లో పెట్టు piss కొట్టి ఒస్తా

పొదిగిన గుడ్డు పిల్ల ఐనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలిగే ఆనందం లాంటి
పుత్రోత్సాహం అని ఒకటి వుంటుంది కదా. ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ! నిజమే, మీ బుర్ర ఇంకా తెలుగు సినిమాలు అంతగా మర్చిపోలేదు. ఇది "నువ్వు నాకు నచ్చావు" లో వెంకటేష్ డైలాగ్. అయితే ఇక్కడ చిన్న తేడా. నా విషయంలో అది పుత్రికోత్సాహం అని మార్చుకోవాలనుకోండి. అలాంటి సందర్భాలు కొన్ని మనకు పిల్లల చిన్నప్పుడు ఒస్తాయి కదా. అల్లాంటి ఒక సందర్భం గురించే ఈ బ్లాగు.


ఈ మధ్య నా కూతురు దానికిష్టమైన యానిమేషన్  సినిమా చూస్తుంటే, "నాన్నా!  సినిమా pause లో పెట్టు, piss కొట్టి ఒస్తా" అంది. మా ఆవిడ ఒకటే నవ్వు. ఆ నవ్వు చివరలో నాకేసి ఒక రకమైన నాసిరకం చూపు. ఎలాంటి చూపు అంటే - మనం బోలెడు డబ్బులు కొనుక్కుని విమానం ఎక్కి కొంచెం స్టైల్ కొడుతుంటే, మన పక్కనే spicejet వాడి ఆఫర్ లో వందరూపాయలు పెట్టి (రూపాయి చిల్లర తిరిగి తీసుకుని మరీ) టికెట్ కొని వాడు మన పక్క సీట్ లో కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటే ఎలా చూస్తాము. అలాంటి చూపు అన్న మాట. ఇంకా అర్ధం కాలేదు కదా, మన క్లాసు పక్కన ఈ మాస్ ఏంటి అనే ఫీలింగ్ తో చూసే చూపు అన్న మాట.  ఇంతసేపు చూపు గురించి చెప్పావు, ఇంక మేటర్ లోకి వెళ్ళకపోతే నీ అంతు చూస్తా అని మీరు అనుకునే లోపు నేను కొంచం నా గురించి మరి కొంచెం మా ఆవిడ గురించి చెప్పాలి. 
              ఈవిడ నన్ను చేసుకునే (అంటే ఏమిటి నువ్వు చేసుకోలేదా ఈవిడని అని అడక్కుండా వినండి.. అదే చదవండి)  రోజులకి ఈవిడకి తెలుగు సినిమాలు తెగ చూసే వాళ్ళమీద అంత మంచి అభిప్రాయం వున్నట్లు లేదు. నాకు పెళ్ళైన కొత్తలో ఒక సారి మా ఆవిడని సినిమాకి తీసుకేళ్తానంటే, "అబ్బ! నేను రెండో ఆటకి రాను, నిద్ర చెడిపోతుంది" అంది. నాకు అస్సలు అర్ధం కాలేదు. అసలు మనం శివ రాత్రి అయితే రాత్రి అంతా సినిమాలు వేస్తారు కదా అని చూసే బాపతు. అమెరికాలో సినిమాకి మొగుడు తీసుకు వెళ్ళట్లేదు అని బాధపడే భార్యలని చూసిన నాకు, ఇది అనుకోని షాకు. పైగా ఎన్నో చోట్ల సినిమా హాలులో తెలుగు సినిమా చూసే అవకాశం అరుదు ఈ అమెరికాలో.  ఒక వేళ వున్నా, టికెట్ ధర మరియు దూర భారం లాంటి వంకలతో చాలా మంది చూడరు. ఇందులోంచి తేరుకుంటున్న రోజుల్లో, మా ఆవిడ ఒక సారి "అంత కక్కుర్తిగా తెలుగు సినిమా చూడడం ఎందుకు" అనే మాట ఎవరితోనో అంటూంటే విన్నాను. అంటే మా ఆవిడ కొంచం తెలుగు సినిమా అంటే తక్కువగా చూసే టైపు అని అర్ధం అయ్యింది.
       నా గురించి చెప్పాలంటే, నేను చదువుకునే రోజుల్లో నోట్ బుక్ పట్టుకుని బయటకు వెళుతుంటే మా ఇంట్లో అందరూ "ఇవ్వాళ్ళ ఏ సినిమాకో?" అని కామెంట్ కొడితే, వాళ్ళు గుర్తు చేసినందుకు తప్పకుండా సినిమాకి వెళ్లే టైపు. అసలు రోజుకొక సినిమా చూస్తే గాని నిద్ర పట్టని కజిన్ ఒకడున్నాడు నాకు. వీడూ నేను కలిసి ఎంసెట్ కోచింగ్ జాయిన్ చేస్తే, అది నచ్చక - రోజుకు రెండు సినిమాలు చూసి ఇంటికి వోచ్చేవాళ్ళం. మాతోపాటు కోచింగ్ లో వున్న మిగిలిన కజిన్ గాడు అక్కడ క్లాసు లో, ఇక్కడ ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేసేవాడు, ఎందుకంటే వాడు బుద్ధిమంతుడు అని బ్రాండ్ వేయబడ్డ వాడు. మనం చదువుకునే రోజుల్లో అలా సినిమా చూసిన బేవార్స్ బాపతు అన్నమాట.
    ఆ తర్వాత కాలం కలిసిరాక మనం సినిమాలు చూడడం తగ్గిపోయి, మెల్లగా రోజుకొక సినిమాతో సరిపెట్టుకుని ఏదో వుద్యోగం చేస్తూ గడిపేసేవాడిని. పెళ్లి ఐన తరవాత, సినిమా చూసేటప్పుడు మా ఆవిడ పక్క నించి వేసే కామెంట్ తట్టుకోలేక ఒక్కో సారి ఇద్దరి మధ్యా యుద్ధం అయిపోయేది. "వాడెవడి సినిమా మీదో మనం కామెంట్ చేస్తే వీడికేంటి మంట" అని మొదట్లో మా ఆవిడకి అర్ధం కాలేదు. మెల్లిగా తెలుసుకుంది, ఇదొక కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి టైపు లో సినిమా పిచ్చి అని.
        అల్లా కామెంట్ కొట్టేసే మనిషిని మార్చకుండా వుంటే మన జీవితం ఎలా? అందుకని మెల్లిగా మా ఆవిడ బుర్రలో సినిమా అంటే వెర్రి కాకపోయినా, కనీసం చూసేవాడు పిచ్చోడు కాదు అనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం అప్పుడే మొదలెట్టేసా. కొద్ది కొద్ది గా సినిమాల పట్ల hype తీసుకురావడం, సినిమా ముచ్చట్లు,  తీయడానికి పడే కష్టాలు లాంటి వాటి మీద TV9 వాడు రోజూ పొద్దున్న పెట్టే కార్యక్రమాల లాంటివి తరచూ పెట్టడం. నాలాంటి కొందరు సినిమా పిచ్చోలని పోగేసి వందల మైళ్ళు కారు వేసుకుని సినిమాకెళ్ళడం, వగైరాలు చేసి కొంచెం మా ఆవిడని సినిమా చూసే హాబీ లోకి తీసుకొచ్చాను. అప్పుడే సినిమాలో ట్విస్ట్ లాగ నా జీవితంలో ఒక ట్విస్ట్ - నా కూతురు పుట్టింది.
          అక్కడి నించి చిన్న పిల్లను తీసుకుని సినిమా హాల్ కేంటి? అని రెండేళ్ళు సినిమా లేకుండా గడిచింది. ఆ తరవాత ధైర్యం చేసి నా కూతురితో  సినిమా కెళ్తే నా కూతురు మొదటి సారి ఆ సౌండ్ కి ఒకటే ఏడుపు. ఐన మనం వదలుతామా, ఏంటి? ప్రతీ ఆరు నెలలకి ఒక  trial వేసి చూసేవాడిని.  మన పరిస్థితి, హాల్లో తక్కువ బయట ఎక్కువ. మరి కష్ట పడి సినిమా అలవాటు చేసి మనం చూడనివ్వక పోతే మా ఆవిడ ఊరుకుంటుందా, అందుకని మనం హాల్ బయట పిల్లని ఆడించడం.  ఇదేదో బావుందని ఏడ్చే పిల్లల తల్లులు, వాళ్ళ పిల్లల్ని కూడా నాతో ఒదిలేయడం. బయట పాప్కార్న్అమ్మే వాడు నన్ను చూసి కిసుక్కున నవ్వడం. ఇలా, ఎన్నో సినిమాలకు వెళ్లి కనీసం అరగంట కూడా చూడకుండా వొచ్చిన రోజులున్నాయి. నా కూతురుకి సినిమా పడకపోతే నా జీవితం ఇలా ఉంటుందా అని నేను విపరీతమైన బాధపడి, "చచ్చీ- చెడీ మా ఆవిడని సినిమా దారిలోకి తెచ్చాను, ఇప్పుడు మళ్లి కధ మొదటికి వొచ్చింది కూతురితో" అని అనుకుంటున్న రోజుల్లో జరిగిందీ సంఘటన.
             వీడికి బొమ్మ పడితే రెప్ప పడదు అని ముద్ర పడ్డ తండ్రికి - "నాన్నా!  సినిమా pause లో పెట్టు piss కొట్టి ఒస్తా" అన్న నా కూతురి మాటలు (పక్కన మా ఆవిడ చూపుని కూడా పట్టించుకోకుండా) గొంతులో విస్కీ పోసినట్టు (సారీ చెవిలో సీసం పోసినట్టు) అనిపించి , నన్ను అంతులేని పుత్రికోత్సాహంతో పొంగిపోయేలా చేసాయి. నేను వెంటనే మళ్ళీ సగటు తండ్రిలా, మనం అవ్వలేక పోయినా దీన్నైనా ఒక రైటరో, డైరెక్టర్ఓ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఇదేమి పోయేకాలం డాక్టరో, ఇంజనీరో అవ్వాలనుకోవాలి కానీ! అని బాక్గ్రౌండ్ లో మా ఆవిడ గొణుగుడు. కౌంటర్ వేద్దామని మా ఆవిడ వైపు తిరిగితే అవే చూపులు, అదేనండి! ముందే చెప్పానుగా మనది spicejet వాడి ఆఫర్ లో 99 రూపాయల టికెట్ అని.

22, సెప్టెంబర్ 2010, బుధవారం

రాముడు Gentleman హనుమంతుడు Superman

హమ్మయ్య! పైన టైటిల్ తో మీరు అనేకానేక ఆలోచనలతో ఈ బ్లాగ్గరుడు ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నార్ధకంతో చదవడం మొదలుపెట్టారా.
అసలు విషయం ఏమిటంటే. నా నాలుగేళ్ల కూతురికి రామాయణం లాంటివి చెప్పాలని చాలా సార్లు అనుకుంటూ, అలా చెప్పే ప్రయత్నం చెయ్యని నన్ను నేను నిందించుకుంటూ, బద్ధకం బూజు దులిపి ఒక సారి వుపక్రమించా. అప్పుడు గాని తెలియలేదు కధలు చెప్పడం ఎంత గొప్ప కళో అని. ఒక సారి కళ్ళ ముందు గుండ్రాలు చుట్టుకుని నా బాల్యం లో నాకు రామాయణం లాంటివి ఎవరు చెప్పినవి మెదడులో ముద్ర పడ్డాయి అని గతం లోకి వెళ్ళాను. అప్పుడు గుర్తుకొచ్చింది మా లంక మామ్మ.

ఇక్కడ లంక మామ్మ గురించి కొంత చెప్పి తీరాలి. తప్పదు! నాకు వున్న అభిమానం అలాంటిది. చిన్నప్పుడు పెళ్లి పేరంటం లాంటివి జరిగేటప్పుడు పిల్లలని అందరిని ఒక చోటి చేర్చి కధలు చెప్పే ఒక నాయనమ్మో, అమ్మమ్మో వుంటారు కదా. సరే! ఒక వేళ మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్లకు ఐనా సరే ఉండి వుంటారు. అలాంటి బామ్మ కోసం పిల్లలు అందరూ ఎంతో ఎదురు చూస్తూ వుంటారు. అలాంటి మామ్మే ఈ లంక మామ్మ. ఈ లంక మామ్మ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ ఆ రోజుల్లో రామాయణం రాసింది. ఆ సంగతి నాకు పెద్దయాక తెలిసింది అనుకోండి. ఇంతకీ ఈవిడ కధ చెపుతుంటే ఏడ్చే పిల్లవాడు కూడా ఆపేసి, మనం ఏదో మిస్ ఐపోతున్నాము, ఈ ఏడుపు తరవాత ఏడవచ్చులే అని కళ్ళు పత్తి కాయల్లా తెరుచుకుని, చెవులు రిక్కించి మరీ వింటారు. అంత అద్భుతంగా వుండేది. మన చిత్ర పరిజ్ఞానం వుపయోగించి అంత బాగా చెప్పడంలో సూత్రం గురించి ఆలోచించడం మొదులు పెట్టా.

ఇంతకీ నీ కూతురు కి చెప్తున్న రామాయణం ఏమయ్యిందిరా? అనే ఒక చొప్పదంటు ప్రశ్న మీకు వొచ్చి ఉండవచ్చు. అంటే మరి మామూలుగా అంటే, అంటే మామూలుగా ఇలాంటి పరిస్థితిలో ఏ తండ్రైనా ఏమి చేస్తాడు. టీవీ, కంప్యూటర్ లాంటివి కూతురి చేతిలో పెట్టి పెళ్ళాం రాకుండా కవర్ చేయడమో, ఒస్తే ఏం చెప్పాలో ఆలోచించుకుని రెడీ గా వుంటారు. (ఇక్కడ కొందరు ఆడవాళ్ళు పళ్ళు నూరి, కుడి చేతి వేళ్ళు ఎడం చేతిలో - ఎడం చేతి వేళ్ళు కుడి చేతిలో విరిచి, సచ్చినోళ్ళు -మగాళ్ళందరూ ఇంతే అని అనుకునే అవకాశం ఉంది). మళ్ళీ నా ఆలోచన లంక మామ్మ కధల వైపు సాగింది. మొహమ్మీద చుట్టిన గుండ్రాలు ఫేడ్ అవుతుండగా - ఆవిడ చెప్పిన కధలలో రామాయణం, భారతం మరియు బాగవతం గుర్తు చేసుకుంటుంటే నాకు లంక మామ్మ కధలు ఏవీ సరిగ్గా గుర్తు రావట్లేదు,  సరికదా చెప్పేటప్పుడు లంక మామ్మ చేసే హావ భావాలు, ముఖ కవళికలు మాత్రమె గుర్తుకొచ్చాయి. అప్పుడు అర్ధం అయ్యింది లంక మామ్మ కధ కంటే- కధ చెప్పే పద్ధతి బావుందని, అది మన దగ్గిర లేదు కాబట్టి మన కధలు కంచికి మన పిల్లలు టీవీ కి దగ్గిరవుతున్నారని.
  ఐనా సరే పట్టు వదలని విక్రమార్కుడు, లంచం వదలని అక్రమార్కుడు లాగ ఏదో ఒక కధ చెప్పాలని రామాయణం మొదలు పెట్టాను. దశరధుడు గురించి మొదలు పెట్టి పెళ్ళాల లిస్టు, పిల్లలకోసం కష్టాలు చెపుతుంటే నాకే అంత ఆసక్తి అనిపించలా. ఇక రాముడు గురించి పొగుడుతుంటే నాకు ఎందుకో చిన్నప్పుడు నీతులు చెప్తే నిద్దరవొచ్చినట్లు వొచ్చేసింది. రాముడు ఎంత gentleman అని అనుకుని కధ  మర్చిపోవచ్చు. ఇంతలో నా కూతురు "హనుమాన్ గురించి చెప్పు, హనుమాన్ గురించి చెప్పు" అని ఎగురుతుంటే మన బుర్రలో బల్బ్ వెలిగింది. లంక మామ్మ సుందర కాండ అద్భుతంగా చెప్పేది, హనుమంతుడి లా మూతి పెట్టి, ఒక చేతిలో గద పట్టుకున్నట్లు చిత్ర విచిత్రమైన హావ భావాలతో చెప్పేది. అది చాలా ఆకట్టుకునేది మమ్మల్ని. మేము అంతా మళ్ళీ మళ్ళీ అని అల్లరి చేస్తుంటే, అందరికీ ముద్దలు కలిపి పెట్టేసేది పనిలోపని. ఇంకా లోతుగా ఆలోచించాక తెలిసింది అసలు concept,  రాముడు gentleman హనుమంతుడు superman అని. Gentleman సినిమాలు ఆడవు, అదే Superman సినిమాలైతే మళ్ళీ మళ్ళీ తీస్తారు, మనం మళ్ళీ మళ్ళీ చూస్తాము.
   మనం కావాలంటే Gentlemen ని పొగుడుతాము కొంచెం పెద్దయ్యాక, కానీ Superman ని ఆరాధిస్తాము చిన్నప్పటినించి. పిల్లల దగ్గర చూడండి హనుమాన్, చోటా భీం లాంటి కధలు ఆకట్టుకుంటాయి. అంతే కాదు మనకి కష్టం వొస్తే మనం ఎవరికి మొక్కుకుంటాం? Superman కి!.  పిల్లలకైనా సరే కధ చెప్పేటప్పుడు వాళ్లకి ఆసక్తి కలగాలంటే Gentleman తో మొదలు పెట్టినా Superman  కధతో ఆకట్టుకోండి.

నేను మటుకు డిసైడ్ అయిపోయా! గో Superman - ఇక నించి ఇంట్లో మనం కధ చెప్పాల్సి వొస్తే కిష్కింద కాండే. వేరే వాళ్ళింట్లో అయితే లంకా దహనమే. మీ పిల్లలకి మీరు కధలు చెప్పలేక ఇబ్బంది పడితే నాకు చెప్పండి. మీ ఇంటికొస్తా, నా కూతుర్ని తీసుకొస్తా. మంచి interesting  కధ చెప్తా. మీరు ఇంక పూరీ జగన్నాధ్ "పోకిరి" లో లాగ "దహనమే" అని పాడుకుంటూ గడిపేయచ్చు - నేను కధ చెపుతుంటే.  మీకు నాకు గొడవయితే తరవాత నేను "జగడమే" అని పాడుకుంటూ నిష్క్రమిస్తా- మా వానర సేనతో.

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఏం చేస్తున్నాం ?

ప్రభు పోస్టింగ్ ఈ లింక్ లో చదివాక స్పందిస్తూ
ఏం చేస్తున్నాం?

ఏమీ చెయ్యం.

ఎందుకంటే ఆది మన బాధ్యత కాదు అని అనుకుంటాము కాబట్టి
ఎవరో ఏదో చెయ్యాలని ఎదురు చూస్తాము
ఎవరూ ఏమీ చేయట్లేదని తిట్టుకుంటూ ఉంటాము
మన వరకూ ఒస్తే లంచం ఇచ్చేస్తాము
ఇంకా అవసరం ఐతే మనం కూడా తీసేసుకుంటాము
అలా చేయకపోతే బతకలేమని సరిపెట్టేసుకుంటాము
తప్పు చేసినోడు మన కులపు వాడైతే తప్పు కూడా ఒప్పు అంటాము
మన బంధువైతే రాబందులకు కూడా కొమ్ము కాస్థాము
ఎందుకంటే మనం స్వార్ధం తో పుచ్చిపోయాం
ఎలాగోలా బతకాలనే భయంతో ఎప్పుడో చచ్చిపోయాం
ఎవడైనా పొరపాటున పోరాడినా
వాడికి దూరంగా పారిపోతాం
మనం బతకడం నేర్చాము
సంఘంలో మన బాధ్యత ఎప్పుడో మరిచాము

20, సెప్టెంబర్ 2010, సోమవారం

నా విషాదం

నా విషాదం నీ ఆనందాన్ని
పాడు చేస్తుందని నాకనిపిస్తే
నా విషాదాన్ని నాలోనే
సమాధి చేసేసుకుంటాను

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఒక్కోసారి నేను

ఒక్కోసారి నేను
                  ఎగసి పడే కెరటంలా
                  ఉవ్వెత్తున పైకెగసి
                  అందని తీరాలని
                 అందుకోడానికి పరిగేడుతూంటాను

ఒక్కోసారి నేను
              మబ్బుల వెనక జాబిల్లిలా
              మొహానికి ముసుగేసుకుని
              నలుగురిలో నేనున్నా
               సిగ్గుతో ముడుచుకుపోతాను

16, సెప్టెంబర్ 2010, గురువారం

నా ప్లాస్టిక్ నవ్వుల ప్రపంచం

మనసులోని ఆలోచనలని మూట కట్టి మూల పారేసి
విషాద భావాలన్నిటికీ రహస్యంగా వీడ్కోలు పలికి
మనసుకు ముసుగు వేసి మొహానికి రంగులు వేసి
అసహజమైన ప్లాస్టిక్ నవ్వులు అలవోకగా చిందిస్తూ
నిత్య జీవన స్రవంతి నాటకంలో
ప్రపంచ రంగస్థలం మీద
ఏ హంగూ లేని
నా సహాయక పాత్రని పోషించేస్తున్నాను

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఏదో ఒక రాగం

sree బ్లాగ్ లో రాసిన పోస్ట్ (http://sreeszone.blogspot.com/2010/09/naa-chitti-koona.html#లింక్స్)
చదివాక నాకు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఈ పాట గుర్తుకొస్తుంది.

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

నా చూపుల దారులలో చిరు దివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

                ఏదో ఒక రాగం ||

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రావమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

                 ఏదో ఒక రాగం ||

గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం
             
                  ఏదో ఒక రాగం ||

అమ్మ గురించి సిరివెన్నెల రాస్తే మనకి అమ్మ గుర్తుకొస్తుంది. అంత అద్బుతంగా వుంటుంది సిరివెన్నెల పాట. దానికి చిత్ర గొంతు కలిస్తే అంతే. అమృతాన్ని తలదన్నే అమ్మ తనం విలువ మనకు గుర్తు చేస్తుంది.

ఇది చదివిన అందరూ ఒక్క సారి అమ్మను గుర్తుచేసుకుంటారు కదూ.
లేదంటే పక్కన వున్న మనిషిని ఒకటి పీకమని రిక్వెస్ట్ చెయ్యండి. వెంటనే గుర్తుకొస్తుంది అమ్మ. ఫీల్ అవ్వకండి. అమ్మ మరి బాధల్లోనే గుర్తుకొస్తుంది.

పాట లింక్
Link will take you to http://www.raaga.com/

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

దూరం చెరిపేదేలా?

నీ చేరువలో నేను వున్నప్పుడు
అడుగడుగునా నన్ను నిలదీస్తావు
అనుమానంతో కడిగేస్తావు

నిన్ను కాపాడుతుంటే కస్సుమంటావు
ఓదారుస్తుంటే అక్కర్లేదంటావు
తప్పు దిద్దుతుంటే తూర్పార బడతావు
సాయం చెయ్యబోతే కసురుకుంటావు

నిన్ను పల్లకి ఎక్కించాలనుకునే నా బలగాలని
నీ పదునైన పలుకులతో పొడి చేస్తావు

నా వెనక గోతులు తవ్వి
నావన్నీ శ్రీరంగ నీతులని చాటేస్తావు

నేను నీకు పట్టం కట్టిన మన సామ్రాజ్యంలో
నీ అసూయ తో ఆరని చిచ్చు పెడుతుంటావు

నీ నిందలు నిజాలు కావని నీకు తెలుసు 
నీ మాటలు నిజాలు కావని నాకు తెలుసు

మన అనుబంధం నా ప్రేమకి ప్రతిబింబం
నీకే అర్ధం గాని నువ్వు నాకు అర్ధమవుతావు

చేరువలో మనమున్నా మన మధ్య వున్న
ఈ దూరం చెరిపేదేలా?

అంకితం: అనుబంధాలని నమ్మకం పునాదుల మీద నిర్మించలేని మనుషులని సహనంతో భరిస్తున్న అందరికీ
Image taken from: http://www.freakingnews.com/

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వెలిగే దీపం నేనైతే... వెలిగించే చమురువి నువ్వు


వెలిగే దీపం నేనైతే
వెలిగించే చమురువి నువ్వు

నా ఆశలు గాలిలో ఆరిపోకుండా
ఆపే అరచేతులు నీవి

నాలో వెలుగుందని చెప్పి
ఆలోచనల అగ్గిపుల్లతో అంటించింది నువ్వు

నిరాశలు నన్ను కన్నీటితో తడిపేస్తుంటే
ఆశల ఉషోదయాలని ముంగిటికి తీసుకొచ్చింది నువ్వు 

నా చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దంలో 
నా గుండె సంగీతాన్ని గుర్తు చేసింది నువ్వు 
  
అంకితం: తనని నమ్ముకున్న వాళ్ళన్ని నిస్వార్ధంగా నడిపించే ప్రతీ మనిషికీ 
Picture taken from http://blastmagazine.com/

9, సెప్టెంబర్ 2010, గురువారం

నీతోపాటు మరో బాల్యం

నా చిన్నారి తల్లికి,
    నీతోపాటు మరో బాల్యం గడిపే అవకాశం కల్పించినందుకు ఆ దేవుడికి ఎన్నోకృతజ్ఞతలు. నిజానికి నిన్ను మోసింది తొమ్మిది నెలల పాటు మీ అమ్మే ఐనా, మరి మీ అమ్మని మోస్తూ (అంటే భరిస్తూ, మరి భరించేవాడే భర్త అని అన్నారు కదా? అందుకే అలా రాసేసానన్న మాట) వున్నది నేను కాబట్టి పరోక్షంగా నేను కూడా నిన్ను మోసినట్టే. నీ కోసం ఆసుపత్రిలో మీ అమ్మ డెలివరీ కి నేను షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేసే extra ప్లేయర్ అంత ఉత్సాహంగా ఎదురు చూసాను. మీ అమ్మకి ధైర్యం చెప్తూ మా అమ్మ వొచ్చిన దేవుడి శ్లోకాలన్నీ చదివేస్తూ వుంటే,  అయోమయంగా నేను చూస్తుంటే, నరసమ్మ (మంత్రసాని అంటే అమెరికాలో తంతారేమో) నిన్ను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టింది. అక్కడినించి గేమ్ స్టార్ట్.
 నిన్ను చూసిన వాళ్ళు అందరూ నా పోలిక అని చెప్తుంటే, విపరీతంగా కుళ్లుకునే మీ అమ్మని చూసి-- నా విజయదరహాసాన్ని ఆపుకోలేక చాలాసార్లు మీ అమ్మకి దొరికి పోయి దెబ్బలు తినేసాను. అప్పట్నుంచి మొదలు నా కష్టాలు, నిన్ను ఎలా పెంచాలో అని కంగారు. నిన్ను ఎవరి చేతిలో పెట్టినా, ఎక్కడ వాళ్ళు సరిగ్గా పట్టుకోలేదో అని వాళ్ళ చేతులకిందే చేతులు పెడితే.. "పోవయ్యా బడాయి.. ఇంతోటి గొప్పలు" అని తిడుతున్నట్టు వాళ్ళు చూసే చూపులకి అప్పుడప్పుడు నాకే ఎక్కువ చేస్తున్నానా అని అనిపించేది. నువ్వు ఇంటికి వొచ్చిన మొదటి రోజు మేడమీదకి నిన్ను కార్ సీట్ లోనే తీసుకెళ్తానని అమ్మకి చెప్తుంటే.. అమ్మ ఒకటే నవ్వడం.  తాతకి దగ్గులు నేర్పించినట్లు, పెళ్లి కూతురికి సిగ్గులు నేర్పించినట్లు, నీ కూతురు పుణ్యమా అని నేను ఇప్పుడు నీ దగ్గర పిల్లల్ని ఎత్తుకోడం నేర్చుకోవాలా?  అని అమ్మ విసుక్కోడం. 

 నువ్వు తుమ్మినా, దగ్గినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం. అక్కడేమో నన్నూ, నా కంగారుని చూసి డాక్టర్లు కోపం వొచ్చినా, co pay వొస్తోంది కదా అని భరించడం. ఇంకా నువ్వు దూకేటప్పుడు కింద పడేలోపు నేను దిండ్లు వేసే ప్రహసనం చూసి మీ అమ్మ నన్ను వుడికించడం. నువ్వు పాకడం మొదలు పెట్టాక ఇంట్లో అన్నీ అటక ఎక్కించడం. నడక ఒచ్చాక అన్నింటికీ తాళాలు వెయ్యడం. నీతో పాటు Curious George, చిన్నారి చిట్టి గీతాలు, DORA లు చూడడం. నువ్వెక్కడ నోట్లో పెట్టుకుంటావో అని కార్పెట్ మీద పాకుతూ అన్నీ ఏరడం. నీ కోసం లాలి పాటలు, జోల పాటలు నేర్చుకోవడం.

అసలు ఎలా గడిచిపోయిందో కాలం.. నీకిప్పుడు నాలుగేళ్ళు అంటే నాకే ఆశ్చర్యంగా వుంటుంది. ఈ నాలుగేళ్ళలో నీతో పాటు నేను అమెరికాలో బాల్యాన్ని చూసాను. చిన్నప్పుడు నాకసలు బొమ్మలు వున్నట్లు గుర్తు లేవు, కానీ ఇప్పుడు మనకి ఎన్ని బొమ్మలో.  నా మొదటి బాల్యం నాకు అస్సలు గుర్తు లేదు, నా ఈ రెండో బాల్యం లో మీ అమ్మకి నీ మీద వున్న ప్రేమ, మా అమ్మకి  నా మీద వున్న ప్రేమ (అదే నీ మీద ప్రేమ చూపించినప్పుడు) రెండూ కళ్ళారా చూసి ఎంత పొంగిపోయానో.    

అమెరికాలో నీతో పాటు మరో బాల్యం ఎంత బాగుందో. 

8, సెప్టెంబర్ 2010, బుధవారం

అబే ఓ ఇంగ్లిష్ మీడియం

నిన్న నా తమ్ముడు కాని తమ్ముడు (వీడు మన జూనియర్ ఎన్ టి ఆర్ ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు "ఒక తల్లి కి పుట్టక పోయినా, తమ్ముడే టైపు అనుబంధం అన్నమాట)  గాడితో మాట్లాడుతూ "అయితే నువ్వొక పాతిక వేలు పెట్టి కొను" అని ఏదో సందర్భంలో సలహా పారేసాను. వాడు వెంటనే "అన్నయ్యా! పాతిక అంటే ఎంత?" అని ఒక దిక్కుమాలిన ప్రశ్నవేసాడు. వెంటనే నా నోట్లోంచి "అబే ఓ ఇంగ్లిష్ మీడియం" అనే డైలాగ్ ముందు ఒచ్చి, ఆ తరవాత ఇండియా లో పుట్టి అమెరికా కి ఉద్యోగానికి ఒచ్చిన వీడి పరిస్థితి ఇలా వుంటే ఇంక నా కూతురి తెలుగు పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆలోచించేలా చేసి నన్ను బ్లాగ్గేలా చేసింది.

ఏడిసావులే, ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత బాధపడతావు, అడప్పా పావి అని మా ఆవిడ టైపు లో మీరు నన్ను తిట్టకుండా వుండాలంటే, నేను మీకు ఎన్ టి ఆర్ వారసుల సినిమాలలో డప్పు కొట్టినట్లు మా వంశం డప్పు కొట్టాలి. తప్పదు మరి. మరీ మీరు అనుకున్నట్లు ఏ "నేను కొడితే చస్తూ బతుకుతావు, మా నాన్నని తలుచుకుని కొడితే చస్తావు, మా తాతని తలుచుంటే కొట్టకముందే  చస్తావు" అన్న టైపు లో లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తా.

మా అమ్మ - ఒక తెలుగు టీచర్. ఏ సబ్జెక్టు లో ఫెయిల్ అయినా క్షమించేస్తుంది కానీ, ఒక వేళ మనకి తెలుగు లో క్లాసు ఫస్ట్ రాంకు రాలేదో మన పని అయిపోయేది ఇంట్లో. దీనికి తోడు నా క్లాసు కి మా అమ్మ తెలుగు టీచర్ అయితే మన పేపర్ లో చిన్న తప్పులకి పెద్ద శిక్ష వేసి నట్లుగా ఎక్కువ మార్కులు తీసేసి నన్ను ఎలాగైనా టాప్ చెయ్యనీకుండా విశ్వ ప్రయత్నం చేసేది.
మా తాత - అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఈయనో తెలుగు పండిట్, తెలుగు వ్యాకరణం లో ఈయన పుస్తకాలు రాసారు. పదమూడేళ్ళకే   మా అమ్మని తెలుగు టీచర్ చేసిన ఘనత ఈయనది. ఆ లెవెల్ లో నూరి పోశారు తెలుగు.
మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేయడానికి కారణం మా నాన్నది కవుల వంశం అని మా అమ్మమ్మ చెప్తూ వుండేది. మా ముత్తాత ఆ రోజుల్లో ఒక పెద్ద కవి. ఆహా! ఇంతకు మించి వివరాలు ఎందుకు లెండి. కవుల వంశంలో మన అమ్మాయిని ఇస్తున్నామని సంబరం తో మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేసేసారట. ఈ కవిత్వం తరవాతి తరాలలో కొంచెం కొంచెం గా తరిగిపోయి, ఇప్పుడు పూర్తిగా ఇగిరిపోతోంది.  అయితే ఈ తరంలో నాలాంటి వాళ్ళు తుంటరి సమాధానం చెప్తే పెద్ద వాళ్ళు కవిత్వాలు పోయాయి ఈ కపిత్వాలు మిగిలాయి అని మా వంశం వాళ్ళని దేప్పిపొడవడం ఎక్కువగా జరుగుతుంటూంది నలుగురూ కలిసినప్పుడు.

సరే ఈ బాధ అంతా ఎందుకంటే, నేనో అయోమయం ఆంధ్రుడు (Confused దేశి లాగ), నా కూతురు అయితే పుట్టిన తరవాత భారత దేశానికి మూడు సార్లు చుట్టపు చూపుగా ఒచ్చింది(దాని వయసు నాలుగు). దేశం లో వుంటే ముక్కలు విరగ కొట్టినట్లు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంది.  దేశంలో వున్నప్పుడు ముద్దుగా తెలుగు మాట్లాడినా, ఇక్కడకి ఒచ్చాక మళ్ళీ ఎంగిలిపీచే.  కానీ దానికి మన భాష ఎలా నేర్పాలో అన్నది నాకు ఒక చిక్కు ప్రశ్నే? అప్పటికీ కుదిరినప్పుడల్లా దీనిని తెలుగులో ఏమంటారు అని అడగడం అలవాటు చేసి పక్షులు, చెట్లు, ఏనుగు లాంటి తేలికైనవి చెప్పేసి మురిసిపోయేలోపు మా గడుగ్గాయి "కారు అంటే తెలుగు లో ఏమిటి" లాంటి ప్రశ్నలు విసిరేసి నాన్నని ఇరుకు లో పెడుతుంది. దీనికి ఇప్పుడు తెలుగు లో ఇలాంటివి ఎలా చెప్పాలి అని సమాధానం కోసం తడుముకునే లోపు పక్కన నా ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం కిసుక్కున నవ్వుతుంది. "మొగుడు కొట్టిన మంట కాదు, తోటికోడలు నవ్విందన్నబాధలా"  కడుపు మండి, దానికి కౌంటర్ మా ఆవిడ రాసిన కూరగాయల లిస్టు లో "కొత మీర, పోటా కాయ" లను మా ఆవిడకి గుర్తు చేసి నీకన్న నేనే బెటర్ అని మొగుడు జులుం (ఇది అందరు మొగుళ్ళకి పెళ్ళయిన తరవాత ఒచ్చే జులుం) చూపిస్తాను.  దానికి నేర్పించే తీరిక నాకు లేదు, మా ఆవిడకి రాదు. పోనీ విడిగా ఎక్కడైనా క్లాసు పెట్టించాలంటే ఇంగ్లీష్, లెక్కలు, ఈత, సంగీతం మరియు ఆటలు ఇవన్నీ వారంలో ఐదు రోజులు సరిపోతే, వారాంతాలు తిరుగుడుతో గడిపాక ఇంక చదివించే సమయం ఎక్కడది, నా కూతురికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఏది?

  నా కూతురు నా ముత్తాత టైపు లో కంద పద్యం రాయడం కల్ల, కనీసం నాలా సీస పద్యం రాయాలనే కల కనడం కూడా కష్టమే, పోనీ  నా భార్యామణి రేంజ్ లో "కొత మీర, పోటా కాయ" లిస్టు లెవెల్ కి ఎదిగినా సరిపెట్టుకుంటా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది తెలుగులో మాట్లాడితే చాలు అని అనిపిస్తోంది.   ఇంక నన్ను, మా వంశం ప్రతిష్టను, నా తెలుగు ఆత్మాభి మానాన్ని పరదేశం లో నిలబెట్టే ప్రయత్నాలని ఆ తెలుగు తల్లే కాపాడాలి. గట్టిగా అంటే నీ సాహిత్యంతో నువ్వు ఏం పీకావు అంటారు. అదే కదా! మన బాధ, మనకు తెలిసేటప్పటికి వయసు ఐపోయింది, పైగా మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతున్నామా అనే ఆలోచన.
 
అమెరికా కూతురు, ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం తో పరదేశం లో ఈ తెలుగోడి గోడు ఎవడు పట్టించుకుంటాడు లెండి!!!.

2, సెప్టెంబర్ 2010, గురువారం

వర మంటి మనసే పొంది విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం

ఈ రోజు టీవీ లో భద్రి సినిమా వొచ్చింది. ఈ సినిమాలో నాకు నచ్చిన అద్భుతమైన పాట కోసం చూస్తూ కూర్చున్నాను. తీరా లాస్ట్ లో ఆ సాంగ్ ఒచ్చినప్పుడు చూస్తే ఆ పాట మొత్తం రాలేదు. కొన్ని సినిమాలలో స్టొరీ మొత్తం చెప్పే పాట ఒకటి వుంటుంది. సినిమా చూడక ముందు ఈ పాట వింటే మనకి స్టొరీ అర్ధం అవుతుంది. ఇలాంటి పాటలు మచ్చుకి కొన్ని "చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక",
"జాలిగా జాబిలమ్మ, రే రేయంత రెప్పవేయనే లేదు ఎందుచేత", "మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా", "కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు". ఇలా ఎన్నో సాంగ్స్, వాటి కోవలోకి వొచ్చే పాట ఈ సినిమాలో "వరమంటి మనసే పొంది".
తీరా సినిమాలో ఆ పాట వోచ్చేటప్పటికి చూద్దును కదా, పల్లవి ఒక్కటే వొచ్చింది. చరణాలు మన పూరీ ఎడిటింగ్ రూం లో నిడివి తగ్గించడానికి కట్ చేసాడో, లేక పోతే అసలు తీయనే లేదో కానీ, జనం మాత్రం మంచి సాహిత్యం వున్న పాట మిస్ అయ్యారు.
అందుకని, ఆ పాట పూర్తిగా వినని వాళ్ళ కోసం, ఇదిగో ఇక్కడ పూర్తి పాట రాస్తున్నాను.

వర మంటి మనసే పొంది   విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం
ఉదయాలు ఎదురుగ ఉండి  కనుమూసి అడుగేస్తుంటే పడదోసి పోదా జీవితం

పూవంటి మనసుని కోసి
ఆపైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా 

దేహాన్ని జ్వాలగ చేసి
జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా

ఎడారెంట పరిగెడతావ
దరీ దారి లేదంటావ
తడి లేక అలసే  ప్రాణమా

పాదాలు నీవంటావ
పయనాలు మాత్రం కావా
పై వాడి పైనా భారమా

కాలాన్ని  కవ్వించేలా
పనిలేని పంతాలేల
అటు పైన విధిపై  నిందలా

పాటకి లింక్ : Play Song
(Links to Raaga.com)

జల్సా - హైప్ లేకపోయుంటే పవర్ ఫుల్ మూవీ అయ్యేది పవన్ కి

హైప్ లేకపోయుంటే జల్సా పవన్ కి పవర్ ఫుల్ మూవీ అయ్యేది. ఇదేంటిరా అని అనుకుంటున్నారా. నిజమే, లేకపోతే మొదటి సారి చూసినప్పటికీ రెండో సారి చూసినప్పటికీ సినిమా మనకి తేడా కనిపిస్తుంది. నేను ఈ సినిమా మ్యూజిక్ రిలీజ్ ఐనప్పుడు టీవీ లో ప్రోమోస్ చూసాను. దేవిశ్రీ సంగీతం అదిరింది, దానికి తోడు ఇక మా గురువు సిరివెన్నెల గారు రాసిన టైటిల్ సాంగ్ అయితే కేక. అప్పుడే జనాల మెమరీ లో ఫ్రెష్ గా వున్న సునామీ లాంటి పదాలు ప్రయోగించడంతో,  జల్సా టైటిల్ సాంగ్ జనాలలో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది.  ఇంకో పాటలో "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే" విని ప్రతి మగాడూ "ఆహా! ఎంత బాగా రాసారు ఫీలింగ్ అని ఫీల్ అయ్యారు".
 సినిమా  రిలీజ్ ఐనప్పుడు హైదరాబాద్ లో వున్నాను.  వందలాది హళ్ళలో ఒకే సారి రిలీజ్ చేస్తున్నారని, అంటే సినిమా అంత బాలేదని టాక్. దానికి తోడు సినిమా చూసినప్పుడు హాల్లో హడావిడి. సాంగ్స్ అనుకున్నంత బాగా షూట్ చెయ్యలేదని, సినిమాలో కంటే బయటే బావున్నాయని అనిపించింది. మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ పుట్టిన రోజు నాడు మరో సారి చూస్తుంటే, "అరె! ఇది మనం అనుకున్నంత బ్యాడ్ గా లేదు అనిపించింది." ముఖ్యంగా కామెడీ తో పాటు కొన్ని పవర్ ఫుల్ డైలాగులు- త్రివిక్రమ్ మార్క్ కామెడీ లోనే కాదు, సీరియస్ డైలాగులు కూడా బావుంటాయి అనిపించింది.

నిజ్జంగా నిజం, కావాలంటే ఈ కింద డైలాగ్ చదవండి.

"కష్టాలా! ఖరీదైన బైక్ లో తిరుగుతూ, ఏసీ రూముల్లో ఉంటూ, వేలకు వేలు ఖరీదు చేసే డిజైనర్ గుడ్డలు వేసుకు తిరిగుతూ రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసే నీకు, కష్టాల గురించి మాట్లేడే హక్కు లేదు.
 స్కూల్ కి వెళ్ళాలంటే పోను నాలుగు కిలోమీటర్లు, రాను నాలుగు కిలోమీటర్లు రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవాలని సంగతి నీకు తెలుసా?
 అన్నం అంటే జొన్న అన్నం తినాలని , వరి అన్నం ఆర్నేల్లకోసారే వండుకుంటారని,  పరమాన్నం వండినప్పుడే  పండగ అంటారని నీకు తెలుసా?
ఆడుకోవలసిన పసి వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారనే విషయం నీకు తెలుసా?
ఆకలేస్తే నేల వైపు, దాహమేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతికే వున్నారని- నువ్వు బతికే ఈ సమాజంలో బతుకుతున్నారని నీకు తెలుసా?
తండ్రి చచ్చిపోయిన ఆరు గంటలకు తల్లి చచ్చిపోతే ఆ భాద ఎలా వుంటుందో, నువ్వు ఎప్పుడైనా అనుభవించావా?
కంటికి కనిపించని ఏదో ఒక శక్తి మనల్ని కొన్ని టన్నులు బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్లు నీకు ఎప్పుడైనా అనిపించిందా?
వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవడం నువ్వెప్పుడన్నా అనుభవించావా?
ఈ సమాజంలో బతకడానికి మనకున్న పేరు, మనకున్న  అధికారం,  మన శక్తి-  ఏదీ  సరిపోదు. ఈ జనం మధ్య బతకలేక దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా.
అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా అనిపించిందా.
తుపాకీ పట్టుకుంటే ధైర్యం గా ఉంటుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా
 బతకాలంటే ఇంకొకడిని చంపడం తప్ప మనం బ్రతకలేమని నీకు ఎప్పుడైనా అనిపించిందా. నాకు అనిపించింది.
ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు, కచ్చితంగా నీకు లేదు"
ఇది కాక ఒక మంచి డైలాగ్.  హీరోయిన్ తో హీరో ఒక సీన్ లో.
"అందంగా వుండడం అంటే మనకి నచ్చేలా వుండడం, ఎదుటి వాళ్లకు నచ్చేలా వుండటం కాదు."

బావుంది కదా?. అందుకనే అన్నాను హైపు లేకపోయుంటే జల్సా పవర్ ఫుల్ మూవీ అయ్యేది పవన్ కి.
ఈ సారి మా టీవీ (అంటే మీ టీవీ లో వొచ్చే MAA ఛానల్ లో) లో మళ్ళీ వేస్తే సరిగ్గా "జల్సా" చూసుకుని జల్సా చేసుకోండి.

Island Green.. Every Man's Challenge

After a long time, got an opprutnity to play golf with my old nemesis, will call him R2 for the sake of anonymity. Even though I used to play all summer at least once a week ever since I moved to this house, surprisingly- I haven't touched my clubs in the last two years. With all the hectic schedule at work along with my toddlers Kumon, music and swimming classes, I did not even get to driving range once in the last two years. No Naagamani and no plans for this weekend - I was planning on staying home, drinking and watching movies in between the long phone conversations. Out of the blue R2 called and said how about a Game. I don't remember the last time I said "no" when some one offered me a smoke,drink,movie or a Golf Game, may be because I never did.

My nemesis R2 is known for learning a sport for the first time playing by my side and within no time will beat me at the sport. It happened with Tennis, Bowling, Snooker and next it looks like Golf. The guy who gives a lot of excuses to visit my place, is ready to come just because we can play Golf. So here we are at the beautiful Bella Vista Golf course where I have played for three summers continuosly. The picture shown is the 15th hole on this course - the Golfers refer to as "The ISLAND GREEN".
It's funny how men obsessed with Golf (as a matter of fact any sport) brag about their talent. The hype starts right from the parking lot before even teeing off. In between the parking lot and teeing off every one has their to do things. Getting enough beer, practicing few puts, hitting a few balls, finding your cart partner, getting the handicaps and most importanly deciding on the wood(club) you are going to use. This all happens while warming up on intimidating your opponent. When the game starts the intimidation increases. Men give so many excuses on Golf course when having a bad round, it almost makes you think they are no different from women. Bad clubs, gloves, back problems, wrong clubs, bad lie, jinxing, pulling, stands, and even more practice is also an excuse for a bad round of golf. 

 When every one gets to the 15th hole, the island green shown in picture it brings out the challenge in men. You will understand the challenge if you look at R2 teeing off on 15th hole. The flag is placed on the island with 20 feet radius with slope starting at the center and to the lower first half of the circle. The distance to flag is 165 yards. Even though the island green has 20 feet radius the front hemisphere is slopy and if you hit in there the ball might roll down into water. Your only chance is to use a high number iron (6,7 or 8) depending on your swing and hit it at 25 degrees trajectory aiming at the flag.  Club selection and accuracy with luck is the only way you will end up on green. Most of the players do not end up on the green when they tee off at this hole.

As usual we both did not end up on green on our first shots and ended up in water. That's where you think players will take a drop and move on to the green. Not willing to accept the defeat we both pulled another set of balls and tried again. This time R2 went right and I went left. We continued with a few more unsuccessful hits, before we realized we left with just enough balls to finish the 18th hole. It happens with men, because they are challenged. When challenged, men strecth too far rather than accepting defeat and moving on. That's why I think "Every man's challenge is knowing how far he needs to go before he accepts the defeat".
After a bad round of Golf for me and an awful round of Golf for R2, I have earned bragging rights for winning. Called R2 next day to see what he is upto, guess what he is at the driving range practicing for the next week challenge. The hype, intimidation and bragging again in the next week. I already picture myself winning the next round and R2 is determined to win in the next round. 

Men don't like to accept defeat.