27, ఏప్రిల్ 2012, శుక్రవారం

దుమ్ము రేపిన దమ్ము...మీరు జూనియర్ NTR ఫాన్స్ అయితే

మాస్ మసాల సినిమా డైరెక్టర్ బోయపాటి శీను, మాస్ లో మంచి ఫాలోయింగ్  వున్న జూనియర్ NTR తో తీసిన సినిమా దమ్ము. అసలు సినిమా మొదలు ఒక తల నరకడం తో స్టార్ట్ అవుతుంది.. అక్కడి నించీ చివర వరకు ఇంక చూసుకోండి కొడితే కనీసం ఒ పది అడుగులు ఎత్తు యెగిరి నేల మీద పడి బంతిలా పైకి ఎగిరే ఫైట్స్. అక్కడక్కడా విరివిగా రక్తపు జల్లులు, నరికితే చెట్లతో పాటు యెగిరి పడే తలలు, ఇంట్లో పిల్లలు విసిరేసినట్లు విసిరేయబడ్డ కార్లు. కావలసినన్ని మాస్ డయలాగులు, తొడ కొట్టడాలు, అక్కడక్కడా మనం ఊహించే ట్విస్టులు. ఇవి కాక ద్వంద అర్దాల మాటల హీరోయిన్లు, కాలేజీ లో కుర్రాళ్ళ బూతులకు కొంచెం డోసు తక్కువ ఐన పాటలు.  వెరసి జూనియర్ NTR ఫాన్స్ కి  అన్నీ సమ పాళ్ళలో వున్న సినిమా. ఇలాంటి సినిమా స్టొరీ గురించి పెద్దగా మనం చెప్పుకో నక్కర్లేదు, ఎందుకంటె ఇలాంటి పగ ప్రతీకారం సినిమాలు తెలుగు లో ఎన్నో వున్నాయి.. ఇంకా చెప్పాలంటే ఈ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాల లాంటిదే ఇది. కాబట్టి సినిమాలో హై లైట్స్ - డ్రా బాక్స్ చెప్తాను..
హై లైట్స్:
  • ఫోటోగ్రఫి 
  • మాస్  డయలాగులు
  • మాస్ పాటలు 
  • స్క్రీన్ ప్లే
  •  ఎఫ్ఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ 
  • అందాలు విచ్చల విడిగా ఆరబోసిన హీరోఇన్లు
డ్రా బాక్స్:
  • హీరో పక్కన సూట్ అవ్వని హీరొయిన్ లు 
  • మోతాదు ఎక్కువైన హింస 
  • సెన్సార్ అయ్యిన చాలా  డయలాగులు
  • పిల్లలతో సహా చూడలేకపోవడం 
సినిమాలో  జూనియర్ NTR రాజకీయాలలోకి ఒచ్చే ఉద్దేశ్యం వున్నట్లు ఇంట్రో సీన్ లో ఒక డైలాగ్. దానికి తోడు కాంగ్రెస్ మీద కొన్ని పంచులు. ఇలాంటివి కొన్ని అందరికీ రుచించక పోవచ్చు.. త్రిషా వయసు బాగా క్లోజ్ షాట్ లో కనిపిస్తోంది. కార్తిక అంత పెద్ద గ్లామర్ గా అనిపించదు,  పైగా బాగా పొడుగు కాబట్టి హీరో పక్కన కొంచెం ఎబ్బెట్టుగా వుంది. ఆద్యంతం కట్టి పడేసిన స్క్రీన్ ప్లే తో అక్కడక్కడా కామెడీ కలిసి, మాస్ డయలాగులు మరియు ఫైట్ ల తో సినిమా బానే అనిపిస్తుంది. 

చివరగా ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ NTR ఫాన్స్ కి సరిపడా మాస్ సినిమా. 
దమ్ము- మీరు జూనియర్ NTR ఫాన్స్ అయితే దుమ్ము రేపుతుంది.

11, ఏప్రిల్ 2012, బుధవారం

నాన్న ఉత్తరం

మై డార్లింగ్ సిరి,

                     
  ఇప్పుడు నీకు ఆరేళ్ళు. మొదటి ఐదేళ్ళు కంటే చాలా డిఫరెంట్ గా ఈ ఇయర్ అనిపించావు. దానికి ఒక కారణం చెల్లెలు సాహితి అయితే, ఇంకో కారణం నువ్వు బడికి వెళ్ళడం. నువ్వు పెద్ద అయ్యాక ఎప్పుడైనా చిన్నప్పటి విషయాలు అడిగితే అన్నీ నాకు గుర్తులేకపోవచ్చునని  నీకు ఇలా నాన్న ఉత్తరం రాస్తున్నాడు.

ఈ సంవత్సరం నేను దూరంగా పని చెయ్యడం వల్ల నేను ఆఫీసు కి వెళ్ళే ప్రతీ మంగళ వారం నువ్వు వుండిపో మని అడుగుతుంటే నిన్ను బుజ్జగించి ఆఫీసు కెళ్ళడం నాకు కష్టంగా వుండేది. నీకు కావలసినవి అన్నీ కొని పెట్టడానికి డబ్బులు కావాలని నేను దూరంగా పని చేస్తున్నానని చెప్పినప్పుడు మనం కూడా ఐస్ క్రీం షాప్ పెడితే అందరూ మనకి బోలెడు డబ్బులు ఇస్తారని నువ్వు చెప్పినప్పుడు నవ్వు ఒచ్చింది. "నాన్నా! నా దగ్గర డబ్బులు వున్నాయని", నువ్వు పిగ్గీ బ్యాంకు లో డాలర్స్ తీసి నా పర్సు లో  పెట్టి.. 'నువ్వింక ఆఫీసు కి వెళ్ళకర్లేదు" అని చెప్పినప్పుడల్లా ఎంతో ముద్దొచ్చావు.  

నీతో కలిసి చేసిన కాగితపు పడవలు, ఎగరెయ్యలేక పోయిన గాలి పటాలు, ఇంటి నిండా మనం గాల్లోకి విసిరేస్తే కింద పడిన కాగితపు ఏరో ప్లేనులు, వీటన్నిటికి మధ్యలో కాయితాలు తగలేస్తున్నామని మీ అమ్మ కేకలు నాకు చిన్నతనం మళ్ళీ ఒచ్చినట్లు అనిపించాయి.

రాత్రి  పడుకున్నే ముందు నువ్వు అడిగే త్రిమూర్తుల కధలు, ముఖ్యంగా పదే పదే చెప్పమనే  దశావతారాలు నీ పక్కనే పెట్టుకునే "The Little Book of Hindu Deities" పుస్తకం నాకు కూడా హిందూ దేవతలు గురించి తెలుసుకునే అవకాసం కలిపించింది.

నాన్నలాగా నేను కూడా మేజిక్ చేస్తానని చెప్పి ENO టాబ్లెట్ ని గాల్లో అడ్డంగా, నిలువుగా ఊపి, చెయ్యి రౌండ్ తిప్పి, నేల మీద కొట్టి, ఉస్సు.. బుస్సు.. అని శబ్దాలు చేసి, అబ్రకదబ్ర అని మంత్రాలు చదివి గ్లాసు నీళ్ళలో టాబ్లెట్  వేసి పొంగే తెల్లటి బుడగలని చూసి గంతులేసి నాకు కూడా మేజిక్ ఒచ్చిందని అమాయకం గా ఆనందించే నిన్ను చూసి ఎంత మురిసిపోయానో..

మొదటి రోజు స్కూల్ కోసం నువ్వు పడిన ఉత్సాహం ... మొదటి సారి స్కూల్ కెళ్ళి నప్పుడు నీ మొహంలో సంతోషం.. నువ్వు స్కూల్ లో ఎలా అడ్జుస్ట్ అవుతావో అనే నా భయ్యాన్ని మాయం చేసేసాయి.


పడుక్కునే ముందు దుప్పటి రెండు చేతులతో పట్టుకుని మంచం మీద  దూకి పడిపోయాక కప్పేసుకోడం,  కత్తెర తో కాయితాలని పోగులు పోగులుగా కట్ చెయ్యడం, గోడల మీదా రంగు పెన్సిళ్ళతో గీతలు గీయడం, ప్లేట్ చేత్తో పట్టుకుని గరిట తో బాదుతూ మ్యూజిక్ అని చెప్పడం, తెలుగు పాటలు ముద్దు ముద్దు గా పాడడం.. అల్లరి చేస్తున్నావని కోపగించుకుంటే భయం నటించి కళ్ళు ఆర్పి కోపం కరిగేలా చెయ్యడం.

అన్నిటికన్నా ముఖ్యంగా చెల్లిని నువ్వు జాగ్రత్త గా చూసుకునే పద్ధతి (కింద పడుతుందని నిలబడ్డ చోట చుట్టు పక్కల  దిండ్లు పరచడం, నోట్లో ఏది పెట్టుకున్న తీసెయ్యడం, పక్క మీంచి పడిపోకుండా నువ్వు అడ్డుగా వుండడం,  చెల్లిని నవ్వించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు చూసి నువ్వు ఎంత పెద్ద పిల్ల ఐపోయావో అని ఆశ్చర్యపోతుంటాను.


అమ్మా నాన్నకి సాయం చేస్తానని ఉల్లి పాయలు వొలవడం, అంట్లు తోముతానని సింక్ లో సబ్బు నీళ్ళ ఆట ఆడుకోవడం,  ఇంటి కొచ్చిన ప్యాకెట్ లని ఓపెన్ చేస్తానని కత్తి పట్టుకుని తిరగడం, మనమంతా ఒక టీం అని గెలుస్తున్నప్పుడు పదే పదే గుర్తు చెయ్యడం నాకు ఎంత సరదా అనిపిస్తాయో..


నీతో కలిసి చూసిన RIO , KUNG FU PANDA , CARS 2 ఎప్పటికీ నాకు గుర్తుంటాయి..


MANY HAPPY RETURNS OF THE DAY ...........
సిరి నవ్వు తో కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవిస్తూ...


నీ నాన్న...

3, ఏప్రిల్ 2012, మంగళవారం

నన్ను వెంటాడుతున్న మా అమ్మాయి పీడ కల

మనకేమైనా పీడ కల ఒస్తే... మెలకువ తెచ్చుకునే అవకాసం వుంది.. ఆ మెలకువలో కలని మర్చిపోయే ప్రయత్నం చెయ్యచ్చు. ఒక వేళ మళ్ళీ నిద్రలో అదే కల కంటిన్యూ అయితే ఆ రాత్రికి నిద్ర మానేసి మన కలని మర్చిపోవచ్చు.. అదే మనల్ని వెంటాడే పీడ కల మనది కాకపోతే......?

   అందరు సగటు సుబ్బారావు ల లాగానే నేను కూడా ఆఫీసు లో బాస్ నన్ను ఫుట్ బాల్, క్రికెట్ లాంటివి ఆడుకుంటే.. అక్కడ బాస్ ముందు భయం నటించి, మౌనం పాటించి, తడపడుతూ పొరపడినట్లు, కరునించమని దీనం గా వేడుకునే భక్తుడిలా అప్పటికా గండం గట్టెక్కి.. ఆఫీసు బయట పడుతూనే పీక తాడు ఒదులు చేసి అది బాసు గాడి పీక  కేసేంత ఆవేశంగా బార్ వైపు అడుగులు వేసి.. గరళ కంటుడిలా ఓ రెండు పెగ్గులు వ్హిస్కీ (సోడా లేక పోతే మనకి తేడా చేస్తుందని తెలిసున్నాసరే) గొంతులో పోస్కుని.. పక్కన వున్న మన సాటి సురులు.. (అదే నండీ బార్ లో మనతో పాటు సురాపానం  గావించే వాళ్ళు)  ఓదారుస్తుంటే బాసుని బండ బూతులు తిట్టి... ఇంక బూతులు రాక ఇంటి కెళ్ళి పెళ్ళాం మీద విరుచుకు పడాలని అనుకుంటాను........

"ఏడిసావు వెదవ... నీకంత లెంతు లేదు", అని నా గురించి తెలిసున్నోల్లు ఈ పాటికి అనేసుకుని ఉంటారు.. ఒక వేళ అలా జరిగితే నెక్స్ట్ డే మా బాసు జాలి పడి నాకు రెండు వారాలు సిక్ లీవు .. అది కూడా పెళ్ళాం చేతిలో అన్ని తన్నులు తిని బతికి బట్ట కట్టి నందుకు మానవతా దృక్పదం కోణం లో ఆలోచించి ... కంపెనీ పాలసీ లని కాదని మరీ ఇచ్చినట్టుగా... మా ఆవిడ గురించి తెలుసున్నోలు ఊహించేసుకుని వుంటారు.. మరి ఏమిటి సమస్య అనుకుంటున్నారా...  
  నిజానికి ఆఫీసు లో గొడవ అయితే పెద్ద నష్టం లేదు... వాడి మొహాన్న రెండు తిట్టేసో.. రాజీనామా పారేసో ఇంటికోస్తాము... అక్కడే మనకి పెద్ద సమస్య.. ఇక్కడ బాసు తోటే మనకి రిస్కు ఎక్కువ.. అక్కడ పని తోటే తంటా... ఇక్కడ పని చేస్తే ఒక తంటా.. చెయ్యకపోతే మరో తంటా.... ఒక్కో సారి ఏమి చేసినా అర్ధం కాని (మనకి), అర్ధం చేసుకోలేని... కడుపు మంట (ఇది మనకి కాదు లెండి)..  అలాంటి ఒకానొక ఆవేశ కావేశాల హోరులో.. రక్తం సల సల మరిగి.. ఆ కోపం లో నా పెద్ద కూతురు మీద గట్టిగా అరిచాను...   అది బిక్క మొకం వేసుకుని ఏడుపు లంకించుకుంది.. మా చిన్న అమ్మాయికి నేనేదో తమాషా చేస్తున్నానని అనిపించి ముందు నవ్వినా.. ఆ తరవాత కేకలకి అది కూడా ఏడవడం మొదలెట్టింది... 

  ఇంత జరిగినా మళ్ళీ సాయంత్రానికి మనది సంసారి బతుకే.. అదే ఏ ఇండియా లోనో అయితే సన్యాసి కొంప చూసుకుని.. సురాపానం లో మునిగి తేలే అవకాసం వుంది.. ఇలాంటప్పుడే నాకు అమెరికా అంటే విపరీతమైన విరక్తి కలుగుతుంది.. పెళ్ళాం మీద కోపం ఒచ్చినా ఎక్కడికీ వెళ్ళలేము... సాయంత్రానికి మా పెద్ద అమ్మాయికి రెండు మూడు సార్లు సారీ చెప్పి.. అమ్మా-నాన్నల మధ్య ఇలాంటివి జరుగుతాయని ఎలా చెప్పాలో తెలియక.. నా కూతురు మళ్ళీ నా దగ్గరకి ఒచ్చి " ఐ లవ్ యు.. డాడీ" అనేన్తవరకూ ఎన్నో  బుజ్జగింపు ప్రయత్నాలు..
  మొత్తానికి గట్టేక్కానని అనుకుంటే రాత్రి నిద్ర పోయే ముందు కధ చెప్పమని... అది కూడా "అమ్మా-నాన్నకి కోపం ఒస్తే ఏడుపొచ్చిన అమ్మాయి కధ"... అని అడిగితే.. ఎలాగోలా దాటేసి.. వేరే కధ చెప్పి నిద్ర పుచ్చాను.. నిద్రలో ఒకటి రెండు సార్లు మెలకువ ఒచ్చి "డాడీ.. ఐ లవ్ యు.. డాడీ ఐ యాం సారి" అని ముద్దు పెట్టి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది... 
  పొద్దునే లేచి నాకు దాని కలలోని కబుర్లు చెప్పడం రొటీన్.. అది చెప్పిన పీడ కల నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది..
మా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, దాని ఫ్రెండ్ పరిగేడుతున్నారట.. వాళ్ళని ఒక బిగ్ బాడ్ వోల్ఫ్ (తోడేలు) వెంటాడుతూ ఉందిట.. దాని నించి తప్పించుకుని వెళ్లి వాళ్ళు ఒక్కో ఇల్లు కట్టుకున్నారట.. మా చిన్న అమ్మాయి గడ్డి ఇల్లు కడితే, వాళ్ళ  ఫ్రెండ్ కర్రల ఇల్లు కట్టిందిట, మా అమ్మాయి ఇటికల ఇల్లు కట్టిందట. ఆ తోడేలు అరుస్తూ వాళ్ళని వెంటాడుతుంటే వాళ్ళు ముందు గడ్డి ఇంట్లో దాక్కుంటే, తోడేలు ఆ ఇంటిని ఊది పారేసిందట.. అప్పుడు వాళ్ళు కర్రల ఇంట్లో దాక్కుంటే తోడేలు ఆ ఇల్లు కూడా వూదేసిందట.. అప్పుడు వాళ్ళు ఇటికల ఇంట్లో దాక్కున్నారట.. ఇది "త్రీ లిటిల్ పిగ్స్" కధ అని నాకు అర్ధం అయ్యింది. కానీ ఆ కధలో నేను ఊహించని మలుపు ఏమిటంటే ఆ తోడేలు నేనే అని.
  ఇప్పటికీ  ఆ పీడకల నన్ను వెంటాడుతుంది.. నిజానికి నా కోపంలో ఎప్పటికీ వెంటాడుతుందని నా అనుమానం.... అద్దంలో నా ప్రతిబింబం తోడేలు లా అప్పుడప్పుడు నాకు...

1, ఏప్రిల్ 2012, ఆదివారం

నేను నీకు నచ్చలేదు కదూ?


నన్ను సరిగ్గా చూడు  
నేను నీకు నచ్చలేదు కదూ?..

మరెందుకు నువ్వు నా వెంటే వున్నావు 
మరొక్క సారి ఆలోచించు 

నన్నొదిలే అవకాసం నీకెప్పుడూ నేనిచ్చా 
మరెందుకిలా నిత్యం నా వెంటే?

నీకు నచ్చినట్లు నేను లేనని 
నిరంతరం నన్ను నిలదీస్తావు 

నాకు నచ్చినట్లు నువ్వు లేవని 
నేనెప్పుడైనా నిన్ను నిందిచానా?

నీకు నచ్చేటట్లు నేను మారితే 
నాకు నేనే నచ్చను..

అప్పుడు నేను కూడా నీలాగే 
నిరంతరం నిట్టూరుస్తూ
నిప్పులు చెరుగుతూ వుంటాను 

అందుకే నేను నాలానే వుంటాను 
అప్పుడప్పుడు నీకు నచ్చకున్నా
నాకు నేను ఎప్పుడూ నచ్చుతాను ...

నీకోసం నువ్వు చెప్పినట్లు మారలేను 
నీకు అప్పుడప్పుడు నువ్వు నచ్చకపోయినా
నేను నాకు ఎప్పుడూ నచ్చుతాను

నాతో అప్పుడప్పుడు వుండే నీకోసం
నాతో ఎప్పుడూ వుండే నేను మారలేను

నేను నీకు నచ్చలేదు కదూ?
నిజానికి అది నా సమస్య కాదు..
నీదే?...ముమ్మాటికి... నీదే?......