31, ఆగస్టు 2010, మంగళవారం

హీరోఇజం పండుతుంది.. పైగా సిగరెట్టుకి మర్యాదకి లింక్ లేదట

  టైటిల్ చూసిన వెంటనే వీడెవడురా సిగరెట్టూ,మర్యాద  అంటూ ఏ మాత్రం మర్యాద లేకుండా పాడు అలవాటును సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నారా. ఇంకా ముందుకెళ్ళి కొంత మంది "అమర్యాద చంద్రన్న" అని ముద్ర వెయ్యక ముందే, వస్తున్నా వస్తున్నా .. అసలు సబ్జెక్టు లోకి. పైన డైలాగ్ "ప్రస్థానం" సినిమాలోది. ఈ మధ్య కాలంలో నాతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళు ఈ పాటికి తల పట్టుకుని మళ్ళీ "ప్రస్థానం" మొదలెట్టడురా వీడు అని తిట్టుకుంటూ వుంటారు అని తెలుసు, కాని ఏం చెయ్యను మనకి అలా ఎక్కేసింది మరి ఈ సినిమా.  టైటిల్ కొంచెం తేడాగా వున్నా నేను చెప్పాలనుకున్నది అంత బాడ్ సబ్జెక్టు కాదులెండి (ఆ అందరు bloggerlu ఇలాగే చెప్తారు అనుకుంటున్నారు కదూ).

  చిన్నప్పుడు చాలా మంది అబ్బాయిలకు (కనీసం నా తరం, అంటే నాది ఈ తరం కాదని ఈ పాటికి గ్రహించే వుంటారు చదువరులు), తండ్రి అంటే భయం వుంటుంది, అమ్మ దగ్గర మనకి ఎంత చనువు వున్నా, నాన్న అంటే ఇంట్లో పులి అన్న మాట. నాన్నకి కోపం వొచ్చే పనులు ఏది చేసినా అమ్మ చాటున దొంగతనంగా నక్కి అమ్మ మేనేజ్ చేసేవరకు నాన్న కంట పడకుండా వుండడం, అమ్మ ఇచ్చిన డబ్బులు సరిపోకపోతే పుస్తకాలనో, ప్రాజెక్ట్ వర్క్ అనో లేని కారణం చెప్పి అమ్మ ద్వారా నాన్నకి రికమండేషను చేయించి డబ్బులు కొట్టేయడం లాంటివి చేస్తూ వుంటారు. బయట ఫ్రెండ్స్ కి మటుకు "నాన్న అంటే భయం కాదు రెస్పెక్ట్" అని బిల్డప్ ఇస్తారు. ఆ తరవాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లి చేసుకుని పిల్లలని కన్నా కూడా అదే  రెస్పెక్ట్ అల్లా కంటిన్యూ అయిపోతుంది. నిజానికి అప్పుడే తండ్రికి-కొడుకుకి అవసరమైన స్నేహబంధం కరువైపోతుంది.

ఇంటికి వొచ్చి "నాన్నా ఎలా వున్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? నీకేదైనా కావాలా?" అని అడిగే చనువు కొడుకుకి వుండదు, "అమ్మ కోసమైనా నాలుగు రోజులు వొచ్చి పోరా. మనవరాలిని పండక్కి తీసుకురా" అని కొడుక్కి గట్టిగా చెప్పే చనువు తండ్రి తీసుకోలేడు. ముసలి వయసులో తండ్రి అవసరాలు, ఇబ్బందులు కొడుక్కి తెలిసే అవకాశం లేదు. కొడుకు ఆలోచనా విధానాన్ని, పరిస్థితులని కొడుకుతో మాట్లాడి నేరుగా తెలుసుకునే స్నేహం ఇద్దరి మధ్యా లేదు. ఈ రోజులలో ముసలివాళ్ళు, పలకరించే మనుషులు లేని స్థితిలో ఆశగా మనుషులకోసం ఎదురు చూస్తున్నారు. వూరిలో వున్న వాడికేమో పలకరించే ఖాళీ లేదు, విదేశాలనించి వొచ్చిన వాడికేమో schedule tite. పైగా నాలుగు రోజులు ఉండరా అని అడగాలంటే- పుట్టింటికి వాడిని లాక్కు పోయే పెళ్ళాంతో  మన కళ్ళ ముందు వాడు గొడవ పడితే మనకు బాధ.

అలా అనిపించి నప్పుడు ఒక సందర్భంలో ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది.

ప్రస్థానం లో హీరో తన తండ్రి ముందు సిగరెట్టు తాగుతుంటే:
తండ్రి:  పబ్లిక్ లో మర్యాదకోసమైనా నా ముందు సిగరెట్టు కట్టేయచ్చు కదరా?
కొడుకు: సిగరెట్టుకీ మర్యాదకీ సైంటిఫిక్ గా లింక్ లేదట నాన్నా. చిన్నప్పటి నుంచి నువ్వు నా ముందు తాగబట్టే ఇలా తయారయ్యాను. పైగా హీరోఇజం పండుద్ది.

 ఆడపిల్లలకి ఈ సమస్యలేదు. నాన్న గారాబం, అమ్మ స్నేహం తో ఎదిగిన అమ్మాయిలు తండ్రిని కావాలంటే ప్రేమతో కట్టి పడేయ్యగలరు, ఇంకా అవసరం అయితే రెండు చుక్కలు కంటి కొళాయి తిప్పితే చాలు. బంధం పేరుతో కట్టేయ్యలేకపోతే బాధ్యత పేరుతో కట్టి పారేయచ్చు. (మా అక్క ఈ కాన్సెప్ట్ బాగా వాడుతుంది మా నాన్నతో)
ఇంతకీ ఇదంతా ఎందుకంటే వుద్యోగం వొచ్చి కాళ్ళ మీద నిలబడ్డ తరవాత తండ్రికీ తనకీ మధ్య వున్న వున్న ఈ గ్యాప్ తగ్గించే ప్రయత్నం కొడుకులే చెయ్యాలి. అసలే ఈ తరం ఉన్నత విద్యలకి, ఉద్యోగ అవకాశాలకి వూరు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న రోజులు. తన దగ్గర పెట్టుకుని పిల్లలు ఎలాగో చూసుకోరని తండ్రులకు తెలుసు, కానీ రోజూ కాకపోయినా కనీసం వారానికి ఒక సారి తండ్రితో క్రికెట్ గురించో, సినిమా గురించో, రాజకీయాల గురించో రెండు నిమిషాలు మాట్లాడి, మెల్లిగా ఆరోగ్యం గురించి, ఆర్ధిక పరిస్థితి గురించీ అడిగే చనువు లేని దుస్థితిలో చాలా మంది కొడుకులు వున్నారు. ఇందుకు అవసరం అయితే చనువు పెంచుకోడానికి తండ్రితో ఒక రౌండ్ మందు వేసి, అవసరం అయితే ఒక సిగరెట్టు దమ్ము లాగి తండ్రిని స్నేహితుడుగా కొత్త పరిచయం చేసుకునే ప్రయత్నం చేయడంలో తప్పులేదు.

అందుకనే నేనంటున్నా కొడుకులు తండ్రితో కలిసి మందు కొట్టినా, దమ్ము లాగినా "హీరోఇజం పండుతుంది.. పైగా సిగరెట్టుకి మర్యాదకి లింక్ లేదట".

ముఖ్య గమనిక: ఇది మీ పిల్లలు చూడకుండా కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ నాన్నఅంటే నీకు చిన్నప్పుడు భయం వుండేది, కానీ నీ పిల్లలకి నువ్వంటే భయం అస్సలు లేదుగా.. నీ లక్ బావుంటే పెద్దయ్యాక వాడికి గౌరవం ఉండొచ్చు.. అంత శీను లేదురా చందుగా అని అనుకుంటున్నారు కదూ. అవును మరి మన సంగతి మనకి బాగా తెలుసు.

కాబట్టి కనీసం నాన్నతో దమ్ము లాగించి హీరోఇజం పండించుకోండి. సిగరెట్ట్-మర్యాద సైంటిఫిక్ లింక్ పక్కన పెట్టి, కనీసం తండ్రీ-కొడుకు లింక్ నిలబెట్టండి. దీనికి సైంటిఫిక్ గా నేనేమి నిరూపించలేను కానీ, చుట్టూ బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి - సరిగ్గా చూస్తే.

ఆడపిల్ల ఆర్తనాదం - Gender based abortion culture

అమ్మా! నన్ను చంపెయ్యకు
నీ నీడలో పెరుగుతున్న మొగ్గని
నన్ను నువ్వే చిదిమెయ్యకు

ఆడపిల్లనైన పాపానికి
ఆదిలోనే నన్ను తుంచేయకు
కడుపులో నేనునప్పుడే
నీ కర్కశత్వానికి బలి చేయకు

ఆడదానివి కాబట్టే కదా నువ్వు
అమ్మ అనబడే అదృష్టానికి నోచుకున్నావు
ఆడపిల్లనని తెలిసాక -  నన్ను ఎందుకిలా
అంతం చెయ్యాలని చూస్తున్నావు

ఆడపిల్లగా పుట్టడం నా శాపం అయితే
పుట్టించడం ఆ దేవుడి పాపం
దేవుడి పాపానికి నాకెందుకు శిక్ష
లోకం చూడని నాపై ఎందుకింత కక్ష

నెలలు నిండిన ఆ రోజుల్లో
నీ కడుపులో నేను కదులుతుంటే
నువ్వెంతగా ఆనందించావని
కాళ్ళతో నిన్ను నేను మెత్తగా తంతుంటే
బాధని ఎంత ప్రేమగా భరించావని

ఇప్పుడు నేను అబ్బాయిని కాదని తెలిశాక
పసిపాపనని చూడకుండా పగ తీర్చుకుంటావా

నిన్నింక ఎప్పుడూ కష్టపెట్టనమ్మా
నన్ను కూడా నీలాగే బ్రతకనివ్వమ్మా

30, ఆగస్టు 2010, సోమవారం

ఏ చోట వున్నా నీ వెంట లేనా

       ఎందుకో చాలా సార్లు పాట గుర్తుకొస్తూ వుంటుంది. ఒక మనిషి మనతో లేనప్పుడు మనిషిని మనం ఎంత ఎక్కువ గుర్తు చేసుకుంటే మనం అంత మిస్ అవుతున్నట్లు - ముఖ్యంగా మనం కష్టంలోనో, బాధలోనో వున్నప్పుడు. ఆకలేసినప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది.  డబ్బు అవసరం వున్నప్పుడు నాన్న, అనారోగ్యం అప్పుడు మనని చూసుకునే అమ్మో, అక్కో, అమ్మమ్మో, సహాయం కావాలంటే స్నేహితులు బాగా గుర్తుకు వొస్తారు. ముఖ్యంగా అందరికీ దూరంగా బతికే వాళ్లకి అయిన వాళ్ళు, ఆప్తులు గుర్తుకు వొచ్చే సందర్భాలు అన్నీకష్టాలో, బాధలో, అవసరాలో, ఒంటరితనమో అయ్యుంటాయి.

  Lion King సినిమా లో సింబా అనే చిన్న సింహంతో వాళ్ళ నాన్నముఫాసా, ఆకాశం చూపించి "మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన సంగతి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆకాశంలో (చుక్కలు చూపిస్తూ) చూడు, మన పూర్వీకులు అక్కడ నించి మనల్ని చూస్తూ వుంటారు. నువ్వు ఒంటరి నని అనిపించినప్పుడు, ఆకాశంకేసి చూస్తే నీకు మార్గం  చూపించడానికి వాళ్ళు తోడుగా వుంటారు - నాతో పాటుగా".
  నువ్వే నువ్వే సినిమాలో వున్న ఈ పాట మా గురువు గారు (సిరివెన్నెల గారిని నేను అభిమానంగా అలా సంభోదిస్తాను) రాసినది. దానికి తోడు చిత్ర గొంతులో అమృతధారలా అనిపిస్తుంది ఈ పాట నా చెవులకి. అలాంటి ఫీలింగ్స్ పాటలలో కురిపించడంలో నెంబర్ 1 ఆయన. పల్లవిలో "ఏ చోట వున్నా నీ వెంట లేనా" అని తన పరిస్థితిని చెప్తూ, చరణంలో తన తండ్రిని తనకు స్వతంత్రంగా ఎంచుకునే హక్కునిమ్మని ఒక అమ్మాయి తన తండ్రిని  అర్ధిస్తున్నట్లుగా వుంటుంది.

ఏ చోట వున్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి ఆలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతీక్షణం నా మౌనం
ఏ చోట వున్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి ఆలలౌతుంటే

ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

నేల వైపు చూసే నేరం చేశావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్లే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైన చాలించమ్మ వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా

నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం ||
వేలు పట్టి  నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాపం కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు
నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతీక్షణం నా మౌనం

ఏ చోట వున్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి ఆలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే



25, ఆగస్టు 2010, బుధవారం

ఆడపిల్ల మనసు

అమ్మ అనురాగాల గుడి నించి
నాన్న శాసనాల బడి నించి
అమ్మమ్మ అనురాగపు లోగిల్లో
తాతయ్య ఆప్యాయతల ముంగిట్లో 
ఆడుకుని పసి వయసు దాటి
ఆసక్తితో వీధిన బడితే
కోతి కొమ్మచ్చి , అట్లతద్దుల అల్లర్లలో 
బడి మాని సినిమా చూసిన జల్సాలలో
కొత్త పరికిణీ కట్టిన మురిపెంలో
కొంటె పనులు చేసిన తరుణంలో
పెనవేసుకున్న అనుబంధాలు
కల్మషం లేని ఆ స్నేహాలు
తనివి తీరా నేస్తాలతో ఆస్వాదించే లోపే
యవ్వనం ఒచ్చేసిందని
బుట్టలో పెట్టి వూరు దాటించారు


వందల్లో వందనాలు చేసి దీవెనలు తీసుకుని
వేలల్లో విస్తర్లు వేసి వడ్డన చేసి
లక్షల్లో కాసులు పోసి కట్నాలిచ్చి
కోటి ఆశలతో కన్నీటి వీడ్కోలుతో
అబ్బాయి బావున్నాడని అమ్మేసారు
ఒస్తూ ఒస్తూ
మనసు పొరల్లో
అందమైన అరల్లో
అవన్నీ పదిలంగా దాచుకున్నాను


ఆకర్షణలో రెండేళ్ళు
అర్ధం అవడంలో రెండేళ్ళు
పిల్లలని పెంచడంలో ఇంకొన్నేళ్ళు
అత్తా మామల ఆరళ్ళలో
మోజు తగ్గిన మొగుడి నిర్లక్షంలో
అమ్మ అనే అంతులేని భాద్యతల ఉద్యోగం లో
అప్పుడప్పుడు కన్నీటి పొరల్లోంచి
ఆ గుడి, బడి, లోగిలి, ముంగిలి
అస్పష్టం గా కనిపిస్తాయి


ఆశగా అక్కడికి వెళ్లినా
ఆ వీధుల్లో నేస్తాలు లేరు
అమ్మేశారని కోపంతో
అక్కడ కూడా అతిథి గానే ఉండి
అంతా బావుందని నమ్మించి
 నా కాపురమనే కారాగారానికి తిరిగోచ్చేస్తాను


అప్పుడప్పుడు ఈ కారాగారంలో
చెప్పుకోలేని బాధలలో
భరించలేని దుఖ్ఖంలో


పంచుకోలేని పరిస్థితులలో
మనసు పొరల్లో 
అందమైన అరల్లో
పదిలంగా దాచుకున్న
గాజు బొమ్మల లాంటి జ్ఞాపకాలు 
బయటకు తీసి
కన్నీటితో కడిగి
చూపులతో తడిమి
మనసు అరలో ఎవరూ చూడకుండా
మళ్ళీ దాచేస్తాను


ఎవరికీ అనుమానం లేకుండా
కాపురం అనే కారాగారశిక్షని
అనుబంధం అనే బంధనాలతో
బాధ్యతల బరువును మోస్తూ
నా పిల్లలికి ఇలా జరగదని ఆశతో
రోజులు దోర్లిస్తుంటాను


ఎప్పుడైనా ఆ నేస్తాలు
కనిపిస్తే, పలకరిస్తే
వార్డెన్ పర్యవేక్షణ మాటులో
పర్మిషన్ తీసుకుని
ఆ రోజులని గుర్తుచేస్కుంటాను

ముఖ్య గమనిక: నేను ఆడపిల్లను కాను.. కాని అమ్మ తోటో,అక్క తోటో, చెల్లి తోటో మాట్లాడుతుంటే అప్పుడప్పుడు అయ్యో వీళ్ళ జీవితం ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అలా ఒక సారి అనిపించినప్పుడు రాసినది మాత్రమే.

24, ఆగస్టు 2010, మంగళవారం

ప్రస్థానం

పుస్తకాలే కాదు సినిమాలు కూడా మనలని చాల ప్రభావితం చేస్తాయి. చిన్నప్పుడు చూసిన జగన్మోహిని, మాయ బజార్, సూపర్ మాన్. వయసులో వున్నప్పుడు చూసిన గీతాంజలి, శివ, గులాబీ, ఆకలి రాజ్యం, నాయకుడు.. ఈ మధ్య కాలంలో ఒస్తున్న గమ్యం, వేదం ఇవన్నీ నన్ను కొంత ప్రభావితం చేస్తాయి. అదే ముప్పయిలలో పడిపోతే మనకి ప్రేమ సినిమాల కంటే అందులో సందేశం చూపించే సినిమాలే నచ్చుతాయి. ఇందులో ముఖ్యం గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం కొంత వీటితో పాటు ఎదుగుతూ వుంటాం, కొన్ని మనకు నచ్చిన అంశాలను మనకు అన్వయించుకుని. కాని కొన్ని సినిమాలు మటుకు మనము ఎంతోకాలంగా వెదికే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నట్లుగా అనిపిస్తాయి,  మనం జీవితాన్ని చూసే దృక్పధాన్ని మార్చేస్తాయి, దానికి మన జీవితంలో జరిగే కొన్ని సంఘంటనలు తోడైతే అవి మనకి చీకటిలో చిరుదివ్వెల్లలా దారిచూపిస్తాయి.

 సమాధానం తెలియని సమస్యలని లోతుగా పరిశీలించే ప్రయత్నంలో, ఎదగని నా ఆలోచన విధానం కొన్ని ప్రశ్నలని అర్ధంగా మిగిల్చేసిన తరుణంలో, ఒక సినిమా నా ఆలోచనలని ఆగిపోయిన చోట నుంచి సాగేలా చేసిందంటే దానికి కారణం కింద dialogues. అలాంటి సినిమా ఈ ప్రస్థానం. ఇటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు దేవే కట్టా గారికి అభినందనలు.


  • స్వార్ధమే మనిషి అసలు లక్షణం నిస్వార్ధం దాన్ని కాచే కవచం.  

  • ఒక సారి ఆ పురాణాలు దాటి వొచ్చి చూడు, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో.  

  • ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తులా కరిగిపోతాయి.  

  • మనిషి ఏడవాల్సింది పోటీలో ఓడినప్పుడు కాదు, మనిషిగా ఓడినప్పుడు.  

  • చీకట్లో ఆకాశాన్ని చూస్తే భయమేస్తోంది తాతా. ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఆ చీకటే గెలిచిపోతుంది.  

  • చీకటీ ఆరిపోయిన నిప్పే బాబయ్యా. మనిషి  కూడా నేల మీద రాలిన దగ్గరనించి సచ్చేదాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో - ఈర్షతో మండుతూనే వెలుగుతాడు. ఆ మంటల్లో కొందరు ముట్టుకున్న వస్తువునల్లా  తగలపెడుతూ మండే సుడిగుండాల్ల ఎదుగుతారు. ఇంకొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారి చూపే దీపాల్లా ఎదుగుతారు.

23, ఆగస్టు 2010, సోమవారం

అన్నయ్య ఆలోచనలు

రాఖి పండుగ సందర్భంగా అన్నయ్య ఆలోచనలు :
నాకు మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య గురించి చెప్పినప్పుడల్లా మా మామయ్య (పెద్ద మామయ్య) చాల హీరోల అనిపించేవాడు. తండ్రి లేని తనకి అన్నీ చూసి పెళ్లి చేసిన మామయ్య గురించి మా అమ్మ ఎప్పుడూ గొప్పగా చెపుతూ వుంటే మనకి కూడా ఒక చెల్లెలు ఉంటె మనం ఇలాగే (కాదు కాదు ఇంత కంటే బాగా- ఎలాగో మనకు ఆ వయసులో తెలియక పోయినా) చూసుకోవాలని అనుకునేవాడిని. ఆ తరవాత మన అభిమాన హీరో కృష్ణ గారి సినిమాలో "నెంబర్ 1 బిరుదు కాదు బాధ్యత" అన్న డైలాగ్ దగ్గరనించి కృష్ణ గారు చేసే ప్రతీ పనికీ అన్నయ్య అంటే ఇలాగే వుండాలని డిసైడ్ అయిపోయి ఆ రోజు నించి ఇక చందన్నయ్య అని ఎవరైనా అంటే మనం నట శేఖర లెవెల్ ఫీలింగ్. నిజానికి అన్నయ్య ఆలోచనలు చిన్నప్పుడు అలా వున్నా, ఎదిగిన తరవాత చాల మారిపోతాయి. ఈ రోజులలో అన్నయ్య ఇంటికి చనువుగా వెళ్లి నాలుగు రోజులు ఆనందం గా గడిపే అదృష్టం చాల మంది చెల్లెళ్ళకు లేదు అనిపిస్తుంది. ఈ రాఖి పండుగ సందర్భంగా ఈ అన్నయ్య aalochanalu

మన అనుబంధం విలువ తెలిసిన నాటి నించి


చిన్నప్పటి చెల్లిని బొమ్మలా చూసుకోవాలని అనుకున్నాను

ఎదుగుతున్న చెల్లికి జాగ్రత్తలు చెప్పాలని అనుకున్నాను

వూరు దాటి వెళ్తుంటే తోడు వెళ్ళాలని అనుకున్నాను

పెళ్లైనప్పుడు నా చేతులతో పందిరి వెయ్యాలనుకున్నాను

అత్తారింటికి వెళ్లే టప్పుడు పుట్టింటి పరువు నిలబెట్టే పద్ధతి చూపాలనుకున్నాను

పిల్లలకు తల్లివైనప్పుడు అమ్మలోని ఓ ర్పు నీకున్నదని గుర్తు చెయ్యాలనుకున్నాను

నీ ప్రతీ అడుగుకి ముందు నేనుండీ నీకు బాట చేద్దామని అనుకున్నాను

నీ కష్టాలకి అడ్డుపడి నీ కన్నీటిని ఆపేద్దామని   అనుకున్నాను

కానీ ఇప్పటికి తెలుసుకున్నాను

నీకు ఇవేవీ అక్కరలేదని

నీకు నేను ఉన్నాననే ఒక్క మాట చాలని

ఆ మాట నీకు ఇచ్చే అదృష్టానికి ప్రతిఫలంగా

ఇంత అభిమానాన్ని మూట గట్టుకుంటానని