30, నవంబర్ 2012, శుక్రవారం

కృష్ణం వందే జగద్గురుం - భాగవతం రెండు గంటల్లో

మా పెద్ద అమ్మాయి సిరికి రోజూ రాత్రి పడుక్కునే ముందు కధ చెప్పాలి. మన సంస్కృతీ సాంప్రదాయాలకి దూరంగా వున్నాము, దీనికి అవి చెప్పే అవకాసం ఇదేనేమో అని నేను ఏ భారతమో చెపుదామని అనుకుంటే, అది
  "Too many introductions..." అని అసలు కధలో కి వెళ్ళనివ్వదు. సరే ఈజీ కదా అని రామాయణం చెపుతామంటే, సింపుల్ గా రామున్ని పక్కన పెట్టి హనుమంతుడి గురించి చెప్పమంటుంది. చివరకి అది రామాయణం మొదలెడితే సుందర కాండ అయ్యి కూర్చుంటుంది. భాగవతం చెప్పాలని ఎంతో ట్రై చేస్తాను. కాని మన కధ చెప్పే పద్ధతో, మనకి భాగవతం పైన లోతైన అవగాహన లేకనో, చివరకి అది " లిటిల్ కృష్ణా" ఎపిసోడ్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భాగవతం చివరకి మనకే అసంతృప్తిగా అనిపిస్తుంది. టైం చాల్లేదనో, చెప్పాల్సిన చోట సరిగ్గా చెప్పలేకపోయాననో, ఏదో తెలియని వెలితి మిగిలిపోతుంది. ఇంకా ఏదో చెప్పాలి అని, ఎలా చెప్పొచ్చా అని నేను ఆలోచించే లోపు నా కూతురి గురక నా ఆలోచనని ఆపేస్తుంది. బహుశా రామాయణ, మహా భారతాలు మనకి ఎవరో చెప్తున్నట్లుగా వున్నందుకు వాటి గురించి మనకి కొంచెం బెటర్ అవగాహన ఉందేమో?

అదే భాగవతాన్ని నేటి కధగా రెండు గంటల్లో చెప్పాలంటే, ఆ పైన అందులో మాస్ మసాలా పాటలు జొప్పించి, సెన్సార్ బోర్డు ని మెప్పించి, ఇంతలోనే ముగింపు చూపాలంటే?  అదే క్రిష్ చేసిన ప్రయత్నం.

సినిమా ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన కధనం
ట్విస్టుల తో బాగా అల్లిన కధ
దేవుడంటే సాయం అని ఒక మంచి సోషల్ మెసేజ్ నాటకాలతో చెప్పే ప్రయత్నం 
పదునైన డైలాగ్ లు.. కధ వేగంలో చాలామంది గమనించక పోవచ్చు
దగ్గుబాటి రాణా జనాలకి హీరో అని అనిపిస్తాడు ఈ సినిమాతో
ప్రతీ పాత్రకి విలువ వుంటుంది -- అతి చిన్న పాత్రకి కూడా కనీసం ఒక విలువైన డైలాగ్ వుంటుంది

మైనస్ పాయింట్లు;
అతి వేగంగా పరిగెత్తే కధ - ఎడిటింగ్ వల్ల అనుకుంటా
సినిమాటోగ్రఫీ - క్రిష్ ఎందుకో గమ్యం అంత బాగా ఆ తర్వాత ఏ సినిమాలో లేదు
నాటక రంగం ఈ తరానికి తెలియదు కాబట్టి రిలేట్ చేసుకోలేరు
పాటలు తక్కువైనా, బావున్నా - కధ వేగానికి అడ్డు వేసినట్లున్నాయి
ముఖ్యంగా ప్రేక్షకుడు అంత వేగంగా కధతో పరిగెత్తలేడు

నా లాంటి వాళ్లకు ఎంత నచ్చినా, ఈ చిత్రం మాస్ ని పాటలకోసం, ఫైట్ ల కోసం సినిమాకి మళ్ళీ మళ్ళీ రప్పించ లేకపోతే, హిట్ అవ్వడం చాలా కష్టం. నాకెందుకో ఇది నేను నా కూతురికి చెప్పాలనుకునే భాగవతం లా మొదలై - దగ్గుబాటి రాణా లిటిల్ కృష్ణా గా ముగిసిందని అనిపించింది. ఎడిటింగ్ ఈ సినిమా విలువని కొంత మరుగున పడేసింది. ఈ సినిమా ఎందుకో జనాలు టీవీ లో ఒచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది.

గమనిక: ఈ సినిమా ఒక సారి తప్పక చూడండి.. వేరే వాళ్ళ అభిప్రాయం తో పని లేకుండా... 

28, నవంబర్ 2012, బుధవారం

పిక్సీ డస్ట్ - పుట్నాల పొడి

మీరు గనక డిస్నీ వాళ్ళ సినిమాలు, కార్టూన్లు చూస్తే అందులో టింకర్ బెల్ అని ఒక చిన్న ఫెయిరీ వుంటుంది.

ఒరేయ్ ఇంగ్లీష్ మీడియం అసలు ఫెయిరీ అంటే ఏమిటి రా వెధవా, తెలుగులో తగలడు,  అని  అంటారా? అదేనండీ మన పాత కధల్లో యక్షినో,  మొహినో అని చెపుతూ వుంటారు కదా! అలాంటి క్యారెక్టర్ అన్నమాట. కాకపోతే పిక్సీ లు చాల చిన్నగా, ఇంచుమించు మన వేలు సైజు లో వుంటారు.

ఈ ఫెయిరీ తను కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కధా నాయకుడికో, కధా నాయకి కో అవసరం ఒచ్చినప్పుడు పిక్సీ డస్ట్ అనబడే ఒక పొడిని జల్లి అప్పటికి ఆ గండాన్ని గట్టెక్కేలా చేస్తుంది. పీటర్ పేన్ కధలో పిల్లలు ఎగరడానికి ఈ పిక్సీ డస్ట్ ఉపయోగిస్తుంది. ఇదీ పిక్సీ డస్ట్ అంటే...

మరి పిక్సీ డస్ట్ ఇంద్రజాలం పుట్నాల పొడి ఎలా చేస్తుందని అని మీకు అనుమానం రావొచ్చు.

మా పెద్దమ్మాయి తిండి విషయంలో మహా మొండి.. మా చిన్నమ్మాయి ఇంకా పాలూ, పండ్లూ, సీరియల్ పిండులూ
కాబట్టి ఇంకా మాకు పెద్ద కష్టం తెలియదు కానీ, పెద్దమ్మాయికి బెండ కాయ కూర  తప్ప ఏది పెట్టినా ఒక  పట్టాన అస్సలు నచ్చదు.  దీనికి తోడు నోట్లో ముద్ద పెట్టిన వెంటనే  "హాట్", అని ఉమ్మేస్తుంది. చిన్నప్పటినించీ కారం అలవాటు చెయ్యలేదేమో, అందుకు మాకు శిక్ష అన్న మాట. దానికి నచ్చక పోతే పంచదార కూడా హాటే.  దానికి తిండి పెట్టేటప్పుడు మా ఆవిడ వేసే చిందులకి, ముద్ద ముద్దకీ మా ఆవిడ పిచ్ పెంచి పిచ్చ కేకలు వేస్తుంటే, చూస్తున్న నాకు బీపీ పెరిగి పోతుంది.  దీనికి పరిష్కారం ఏమిటి దేవుడా! అని తల పట్టుకుని కూర్చున్న తరుణంలో మాకు దొరికిన దివ్య ఔషధం ఈ పుట్నాల పొడి. మా అమ్మాయికి తెలుగు పెద్దగా రాదు కాబట్టి, ఇది నాయనమ్మ చేసిన పొడి కాబట్టి దీనికి "నాయనమ్మ పొడి" అని పేరు పెట్టింది.

దీనికి ఇంచుమించు పిక్సీ డస్ట్ కున్నంత  మహిమ వుంది. అసలు డిస్నీ వాడు అందరినీ అబ్బుర పరిచే ఇంద్ర జాలం ఈ పిక్సీ డస్ట్ తో ఎలా చేస్తాడో, పుట్నాల పొడి మా ఇంట్లో అంత మహిమ చూపిస్తుంది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే.........

పిక్సీ డస్ట్ జల్లితే  వస్తువులు గాల్లో తేలిపోతాయి, అదే పుట్నాల పొడి జల్లితే మా అమ్మాయికి నచ్చని ప్లేట్ లో ఐటమ్స్ తేలిగ్గా నోట్లో కి వెళ్లిపోతాయి.. అక్కడ నించి నోట్లో ఎక్కువ నానకుండా పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇష్టం లేకపోతే బుగ్గల్లో పెట్టుకుని ఎంతకీ మింగరుగా మన గడుగ్గాయిలు.

ఫైరీస్ కి చేతిలో వున్న వస్తువు రూపం మార్చాలంటే  పిక్సీ డస్ట్ అవసరం, అలాగే మా అమ్మాయికి నచ్చని పప్పో-కూరో ఏమార్చాలంటే మాకు ఈ పుట్నాల పొడి చాలా అవసరం.. పైన ఒక పొర పొడి జల్లితే సరి.

తిండి పెట్టే  సమయంలో మా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం చల్లారి ప్రశాంతం గా ఉండాలంటే , ఇంట్లో వుండే పిక్సీ డస్ట్ పదార్ధాల మీద జల్లాల్సిందే.

అదేమీ మహిమో మా అమ్మ చేసిన్దయితేనే దానికి నచ్చుతుంది..  అది ఐపోయాక వాళ్ళ అమ్మ అలాగే ట్రై చేసినా సరే - రంగో, రుచో, వాసనో బాలేవని కనిపెట్టి ఇక  తినడం  మానేస్తుంది. ఫైరీ లకి  పిక్సీ డస్ట్ రేషన్ లో ఒక ఫైరీ కి ఒక టీ కప్పు ఇస్తారట, అలాగే మా అమ్మ చేసిన పొడి కూడా ఒక డబ్బాయే వుంది. ఇండియా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద డబ్బాడు చేసి పెట్టింది .. రోజుకో కప్పు చొప్పున నేనో ఇంద్రజాలం చేసే యక్షినిలా ఇడ్లీలో, దోసల్లో, అన్నంలో, పప్పులో, కూరల్లో మరియు పెరుగులో జల్లు తుంటా. అది రోజూ కరిగిపోతుంటే నా గుండె తరుక్కు పోతుంది.. ఇది లేక పోతే దీనితో తిండి తినిపించడం ఎల్లారా దేవుడా అని.

ఆ డబ్బాలో పుట్నాల పొడి అడుగంటుతోంది, మీరు ఎవరైనా ఇండియా వెళుతుంటే, "బాబ్బాబు మాకు కొంచెం తిరిగి ఒచ్చేటప్పుడు మా అమ్మ గారింటి నించి కొంచెం పిక్సీ డస్ట్ ప్యాకెట్ ... అదే పుట్నాల పొడి తెచ్చి పెట్టరూ?"15, నవంబర్ 2012, గురువారం

నీకు తెలుసా ప్రేమంటే?

ప్రేమంటే ఏంటో నాకు తెలియదన్నావు...
అసలు నాకు ప్రేమించడం చేతకాదన్నావు

నీకు తెలుసా ప్రేమంటే ఏమిటో..?
ఇన్నాళ్ళ మన సాన్నిహిత్యంలో

నీకేం కావాలో ఎప్పుడూ అడిగే నువ్వు
నన్ను ఎప్పుడైనా ఏం కావాలో అడిగావా?

నీ ఇష్టాల గురించి నాకెప్పుడూ గుర్తు చేస్తూ
నాకూ ఇష్టం ఉంటుందని తెలుసుకో  లేక పోయావు

నీ చేరువలో నేనున్నప్పుడు
నేను  నీకిచ్చిన స్వేచ్ఛ
నీకు దూరంగా వున్నా సరే
నాకు లేకుండా చేస్తున్నావు

నావన్నీ నీవేనని లాక్కునే నువ్వు
నీవన్నీ రహస్యంగా దాచుకున్నావు

నీ ప్రపంచాన్ని నా మీద రుద్దే నువ్వు
నా ప్రపంచాన్నించి నన్ను దూరం చేస్తున్నావు

నా చుట్టూ వుంటే నీకు సంతోషం అంటూ
నా చెంతకొచ్చి నీ విషాదాన్ని చల్లుతావు

నీ  చుట్టూ ఈ వెలుగెక్కడిదని
నా ఏకాంతాన్ని భగ్నం చేసి

నా చిరునవ్వుల దీపాలని ఆర్పేసి
చీకట్లో నన్నొదిలి నీ దారినపోతావు

అవసరాలకోసం అనుబంధాలని  ఆశ్రయించే నువ్వు
నిజాలని భరించలేక నింద లని సంధిస్తావు

నీ బాధ్యతా రాహిత్యానికి, నిర్లక్ష్యానికి
నన్ను బలిపశువుని చేస్తుంటావు

నా నిస్వార్ధంలో కూడా నీ స్వార్ధమే వెతుక్కునే  నువ్వు
నా ప్రేమ విలువ ఎప్పటికీ తెలుసుకోలేవు

నీలా నేను నిన్ను నిలదియ్యకున్నా
నీ పై జాలిపడే నా మనసు  అడుగుతోంది

అసలు .......

నీకు తెలుసా ప్రేమంటే?

26, అక్టోబర్ 2012, శుక్రవారం

పీడ కల

పచ్చటి తివాచి పరిచినట్లున్న
మెత్తటి నేలపైన నేనున్నాను

నాలోకి నేను ముడుచుకి పోయి
మూడంకె వేసి పడుకున్నాను

వెచ్చటి కిరణాలు నన్ను స్పర్శించి
మొగ్గలా  ముడుచుకున్న నన్ను
ఒళ్ళు విరుచుకుని బద్ధకం తీరి
రెక్కలు విచ్చుకునేలా చేసాయి

అడుగులో అడుగు వేసుకుంటూ
నడక మొదలెట్టిన నేను
ఉత్సాహం ఉరకలు వేస్తుంటే
నడకలో వేగం పెంచాను

పరుగులో గుండె లయ పెరిగి
ఊపిరి వేడెక్కి రక్తం ఉరకలేస్తుంటే
ఎదురుగా ఎత్తైన శిఖరం ఆహ్వానిస్తుంటే
అటు వైపు దూసుకుపోయాను

శిఖరం అంచుకు చేరుకుంటున్న నేను
నేలపై నా కాలు బలంగా తన్ని
తల పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ
నా శక్తీ కొద్దీ పైకేగిరాను

కొద్ది సేపట్లో కుప్ప కూలుతాననుకున్న నేను
ఆశ్చర్యంగా గాలిలో తేలుతున్నాను
నా ఒంటి బరువు నాకు తెలియట్లేదు
రెండు చేతులూ ఆడించి చూస్తే 
వినీలాకశంలో విహంగంలా
విశాలమైన రెక్కలు విచ్చుకుని
మబ్బుల్లో విహరిస్తున్నాను

అందంగా నా కింద ప్రపంచం
నా చుట్టూ సూర్య కిరణాలు
 మెరుగులు దిద్దినట్లనిపించే
వెండి రంగుల వెలుగుల
దూది పింజల్లాంటి మేఘాలు
అప్పుడప్పుడు గుంపుగా
నన్ను దాటే అందమైన పక్షులు
పలకరిస్తున్నట్లు అనిపించే
సంగీతం లాంటి వాటి కిలకిలలు 

ఎదురుగా ఆహ్వానిస్తూ ఇంద్రదనుసు
ఎంత అద్భుతం ఈ క్షణం అనిపించి
గుండె నిండా ఊపిరి పీల్చుకుని
ఈ అనుభవాన్ని అందమైన జ్ఞాపకంగా
మెదడు అరల్లో ముద్రించుకునే ప్రయత్నంలో
ఒక్క క్షణం రెప్ప వేసి తెరిచిన  వెంటనే

ఇంతలో ఏమైందో ....
అకస్మాత్తుగా .........
నలువైపులా నా చుట్టూ నిబిదాంధకారం
నేను నాకే బరువయ్యి నా వేగం తగ్గింది
ఎగురుదామని ఎంత ప్రయత్నించినా
నా చేతులలో కదలిక లేదు
నిస్సహాయతలో అరుద్దామంటే
నా గొంతులోంచి మాట రావట్లేదు
నింగిలో నిలిచిపోయిన నేను
వున్నపాటున నేల రాలిపోతున్నాను
సర్వ శక్తులూ కూడ గట్టుకున్నా
ఏం చెయ్యలేని స్థితిలో
నేలను తాకే క్షణాలను ఊహించుకుంటూ
గుండె ఆగే పరిస్తుతుల్లో
లేచి చూద్దునుగా

ఇది ఒక పీడ కల ......
నన్ను నిరంతరం వెంటాడుతోంది.......

14, ఆగస్టు 2012, మంగళవారం

వీరుని మరణం


తమ  అవసరాల కోసమో
లేక  ఆత్మ రక్షణ కోసమో

నీ అభిమానాన్ని పణంగా పెట్టే

అభినవ  అభిమన్యుల ఆర్తనాదాలు విని
కురుక్షేత్రం లో అడుగిడిన వీరుడిని

శస్త్ర  చికిశ్త   చేసే నెపంతో
నీచే అస్త్ర సన్యాసం చేయిస్తే

కదన రంగంలో కాలు మోపిన పిదప
 వెన్ను చూపే విద్య తెలియని నీకు

నీ సైన్యం  కన్నాశత్రువే మిన్న గా కనిపించి

రక్త సిక్త  మైన  కాయం కన్నా
 అశ్రుపూరిత  నయనాలే

అత్యంత వేదన కలిగించి
శత్రువు శరములు నిన్ను

నిలువునా కూల్చి  నేల  రాల్చినప్పుడు

నమ్మించి వంచిచే నేస్తాల కన్న
సాటి వీరుడి పోరాటానికి
శత్రువు అర్పించే జొహారే  మిన్న అనిపించి

తనది కాని కురుక్షేత్రంలో
సుయోధనుదనుకొని సిఖండుల కోసం
యుద్ధం చేసి నేల రాలిన కర్ణుడి కధనం   

ఈ వీరుని మరణం 

 అంకితం : అభాగ్యులకోసం అలుపెరగక పోరాడి మోసపోయిన యోదులందరికీ

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

దుమ్ము రేపిన దమ్ము...మీరు జూనియర్ NTR ఫాన్స్ అయితే

మాస్ మసాల సినిమా డైరెక్టర్ బోయపాటి శీను, మాస్ లో మంచి ఫాలోయింగ్  వున్న జూనియర్ NTR తో తీసిన సినిమా దమ్ము. అసలు సినిమా మొదలు ఒక తల నరకడం తో స్టార్ట్ అవుతుంది.. అక్కడి నించీ చివర వరకు ఇంక చూసుకోండి కొడితే కనీసం ఒ పది అడుగులు ఎత్తు యెగిరి నేల మీద పడి బంతిలా పైకి ఎగిరే ఫైట్స్. అక్కడక్కడా విరివిగా రక్తపు జల్లులు, నరికితే చెట్లతో పాటు యెగిరి పడే తలలు, ఇంట్లో పిల్లలు విసిరేసినట్లు విసిరేయబడ్డ కార్లు. కావలసినన్ని మాస్ డయలాగులు, తొడ కొట్టడాలు, అక్కడక్కడా మనం ఊహించే ట్విస్టులు. ఇవి కాక ద్వంద అర్దాల మాటల హీరోయిన్లు, కాలేజీ లో కుర్రాళ్ళ బూతులకు కొంచెం డోసు తక్కువ ఐన పాటలు.  వెరసి జూనియర్ NTR ఫాన్స్ కి  అన్నీ సమ పాళ్ళలో వున్న సినిమా. ఇలాంటి సినిమా స్టొరీ గురించి పెద్దగా మనం చెప్పుకో నక్కర్లేదు, ఎందుకంటె ఇలాంటి పగ ప్రతీకారం సినిమాలు తెలుగు లో ఎన్నో వున్నాయి.. ఇంకా చెప్పాలంటే ఈ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాల లాంటిదే ఇది. కాబట్టి సినిమాలో హై లైట్స్ - డ్రా బాక్స్ చెప్తాను..
హై లైట్స్:
  • ఫోటోగ్రఫి 
  • మాస్  డయలాగులు
  • మాస్ పాటలు 
  • స్క్రీన్ ప్లే
  •  ఎఫ్ఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ 
  • అందాలు విచ్చల విడిగా ఆరబోసిన హీరోఇన్లు
డ్రా బాక్స్:
  • హీరో పక్కన సూట్ అవ్వని హీరొయిన్ లు 
  • మోతాదు ఎక్కువైన హింస 
  • సెన్సార్ అయ్యిన చాలా  డయలాగులు
  • పిల్లలతో సహా చూడలేకపోవడం 
సినిమాలో  జూనియర్ NTR రాజకీయాలలోకి ఒచ్చే ఉద్దేశ్యం వున్నట్లు ఇంట్రో సీన్ లో ఒక డైలాగ్. దానికి తోడు కాంగ్రెస్ మీద కొన్ని పంచులు. ఇలాంటివి కొన్ని అందరికీ రుచించక పోవచ్చు.. త్రిషా వయసు బాగా క్లోజ్ షాట్ లో కనిపిస్తోంది. కార్తిక అంత పెద్ద గ్లామర్ గా అనిపించదు,  పైగా బాగా పొడుగు కాబట్టి హీరో పక్కన కొంచెం ఎబ్బెట్టుగా వుంది. ఆద్యంతం కట్టి పడేసిన స్క్రీన్ ప్లే తో అక్కడక్కడా కామెడీ కలిసి, మాస్ డయలాగులు మరియు ఫైట్ ల తో సినిమా బానే అనిపిస్తుంది. 

చివరగా ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ NTR ఫాన్స్ కి సరిపడా మాస్ సినిమా. 
దమ్ము- మీరు జూనియర్ NTR ఫాన్స్ అయితే దుమ్ము రేపుతుంది.

11, ఏప్రిల్ 2012, బుధవారం

నాన్న ఉత్తరం

మై డార్లింగ్ సిరి,

                     
  ఇప్పుడు నీకు ఆరేళ్ళు. మొదటి ఐదేళ్ళు కంటే చాలా డిఫరెంట్ గా ఈ ఇయర్ అనిపించావు. దానికి ఒక కారణం చెల్లెలు సాహితి అయితే, ఇంకో కారణం నువ్వు బడికి వెళ్ళడం. నువ్వు పెద్ద అయ్యాక ఎప్పుడైనా చిన్నప్పటి విషయాలు అడిగితే అన్నీ నాకు గుర్తులేకపోవచ్చునని  నీకు ఇలా నాన్న ఉత్తరం రాస్తున్నాడు.

ఈ సంవత్సరం నేను దూరంగా పని చెయ్యడం వల్ల నేను ఆఫీసు కి వెళ్ళే ప్రతీ మంగళ వారం నువ్వు వుండిపో మని అడుగుతుంటే నిన్ను బుజ్జగించి ఆఫీసు కెళ్ళడం నాకు కష్టంగా వుండేది. నీకు కావలసినవి అన్నీ కొని పెట్టడానికి డబ్బులు కావాలని నేను దూరంగా పని చేస్తున్నానని చెప్పినప్పుడు మనం కూడా ఐస్ క్రీం షాప్ పెడితే అందరూ మనకి బోలెడు డబ్బులు ఇస్తారని నువ్వు చెప్పినప్పుడు నవ్వు ఒచ్చింది. "నాన్నా! నా దగ్గర డబ్బులు వున్నాయని", నువ్వు పిగ్గీ బ్యాంకు లో డాలర్స్ తీసి నా పర్సు లో  పెట్టి.. 'నువ్వింక ఆఫీసు కి వెళ్ళకర్లేదు" అని చెప్పినప్పుడల్లా ఎంతో ముద్దొచ్చావు.  

నీతో కలిసి చేసిన కాగితపు పడవలు, ఎగరెయ్యలేక పోయిన గాలి పటాలు, ఇంటి నిండా మనం గాల్లోకి విసిరేస్తే కింద పడిన కాగితపు ఏరో ప్లేనులు, వీటన్నిటికి మధ్యలో కాయితాలు తగలేస్తున్నామని మీ అమ్మ కేకలు నాకు చిన్నతనం మళ్ళీ ఒచ్చినట్లు అనిపించాయి.

రాత్రి  పడుకున్నే ముందు నువ్వు అడిగే త్రిమూర్తుల కధలు, ముఖ్యంగా పదే పదే చెప్పమనే  దశావతారాలు నీ పక్కనే పెట్టుకునే "The Little Book of Hindu Deities" పుస్తకం నాకు కూడా హిందూ దేవతలు గురించి తెలుసుకునే అవకాసం కలిపించింది.

నాన్నలాగా నేను కూడా మేజిక్ చేస్తానని చెప్పి ENO టాబ్లెట్ ని గాల్లో అడ్డంగా, నిలువుగా ఊపి, చెయ్యి రౌండ్ తిప్పి, నేల మీద కొట్టి, ఉస్సు.. బుస్సు.. అని శబ్దాలు చేసి, అబ్రకదబ్ర అని మంత్రాలు చదివి గ్లాసు నీళ్ళలో టాబ్లెట్  వేసి పొంగే తెల్లటి బుడగలని చూసి గంతులేసి నాకు కూడా మేజిక్ ఒచ్చిందని అమాయకం గా ఆనందించే నిన్ను చూసి ఎంత మురిసిపోయానో..

మొదటి రోజు స్కూల్ కోసం నువ్వు పడిన ఉత్సాహం ... మొదటి సారి స్కూల్ కెళ్ళి నప్పుడు నీ మొహంలో సంతోషం.. నువ్వు స్కూల్ లో ఎలా అడ్జుస్ట్ అవుతావో అనే నా భయ్యాన్ని మాయం చేసేసాయి.


పడుక్కునే ముందు దుప్పటి రెండు చేతులతో పట్టుకుని మంచం మీద  దూకి పడిపోయాక కప్పేసుకోడం,  కత్తెర తో కాయితాలని పోగులు పోగులుగా కట్ చెయ్యడం, గోడల మీదా రంగు పెన్సిళ్ళతో గీతలు గీయడం, ప్లేట్ చేత్తో పట్టుకుని గరిట తో బాదుతూ మ్యూజిక్ అని చెప్పడం, తెలుగు పాటలు ముద్దు ముద్దు గా పాడడం.. అల్లరి చేస్తున్నావని కోపగించుకుంటే భయం నటించి కళ్ళు ఆర్పి కోపం కరిగేలా చెయ్యడం.

అన్నిటికన్నా ముఖ్యంగా చెల్లిని నువ్వు జాగ్రత్త గా చూసుకునే పద్ధతి (కింద పడుతుందని నిలబడ్డ చోట చుట్టు పక్కల  దిండ్లు పరచడం, నోట్లో ఏది పెట్టుకున్న తీసెయ్యడం, పక్క మీంచి పడిపోకుండా నువ్వు అడ్డుగా వుండడం,  చెల్లిని నవ్వించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు చూసి నువ్వు ఎంత పెద్ద పిల్ల ఐపోయావో అని ఆశ్చర్యపోతుంటాను.


అమ్మా నాన్నకి సాయం చేస్తానని ఉల్లి పాయలు వొలవడం, అంట్లు తోముతానని సింక్ లో సబ్బు నీళ్ళ ఆట ఆడుకోవడం,  ఇంటి కొచ్చిన ప్యాకెట్ లని ఓపెన్ చేస్తానని కత్తి పట్టుకుని తిరగడం, మనమంతా ఒక టీం అని గెలుస్తున్నప్పుడు పదే పదే గుర్తు చెయ్యడం నాకు ఎంత సరదా అనిపిస్తాయో..


నీతో కలిసి చూసిన RIO , KUNG FU PANDA , CARS 2 ఎప్పటికీ నాకు గుర్తుంటాయి..


MANY HAPPY RETURNS OF THE DAY ...........
సిరి నవ్వు తో కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవిస్తూ...


నీ నాన్న...

3, ఏప్రిల్ 2012, మంగళవారం

నన్ను వెంటాడుతున్న మా అమ్మాయి పీడ కల

మనకేమైనా పీడ కల ఒస్తే... మెలకువ తెచ్చుకునే అవకాసం వుంది.. ఆ మెలకువలో కలని మర్చిపోయే ప్రయత్నం చెయ్యచ్చు. ఒక వేళ మళ్ళీ నిద్రలో అదే కల కంటిన్యూ అయితే ఆ రాత్రికి నిద్ర మానేసి మన కలని మర్చిపోవచ్చు.. అదే మనల్ని వెంటాడే పీడ కల మనది కాకపోతే......?

   అందరు సగటు సుబ్బారావు ల లాగానే నేను కూడా ఆఫీసు లో బాస్ నన్ను ఫుట్ బాల్, క్రికెట్ లాంటివి ఆడుకుంటే.. అక్కడ బాస్ ముందు భయం నటించి, మౌనం పాటించి, తడపడుతూ పొరపడినట్లు, కరునించమని దీనం గా వేడుకునే భక్తుడిలా అప్పటికా గండం గట్టెక్కి.. ఆఫీసు బయట పడుతూనే పీక తాడు ఒదులు చేసి అది బాసు గాడి పీక  కేసేంత ఆవేశంగా బార్ వైపు అడుగులు వేసి.. గరళ కంటుడిలా ఓ రెండు పెగ్గులు వ్హిస్కీ (సోడా లేక పోతే మనకి తేడా చేస్తుందని తెలిసున్నాసరే) గొంతులో పోస్కుని.. పక్కన వున్న మన సాటి సురులు.. (అదే నండీ బార్ లో మనతో పాటు సురాపానం  గావించే వాళ్ళు)  ఓదారుస్తుంటే బాసుని బండ బూతులు తిట్టి... ఇంక బూతులు రాక ఇంటి కెళ్ళి పెళ్ళాం మీద విరుచుకు పడాలని అనుకుంటాను........

"ఏడిసావు వెదవ... నీకంత లెంతు లేదు", అని నా గురించి తెలిసున్నోల్లు ఈ పాటికి అనేసుకుని ఉంటారు.. ఒక వేళ అలా జరిగితే నెక్స్ట్ డే మా బాసు జాలి పడి నాకు రెండు వారాలు సిక్ లీవు .. అది కూడా పెళ్ళాం చేతిలో అన్ని తన్నులు తిని బతికి బట్ట కట్టి నందుకు మానవతా దృక్పదం కోణం లో ఆలోచించి ... కంపెనీ పాలసీ లని కాదని మరీ ఇచ్చినట్టుగా... మా ఆవిడ గురించి తెలుసున్నోలు ఊహించేసుకుని వుంటారు.. మరి ఏమిటి సమస్య అనుకుంటున్నారా...  
  నిజానికి ఆఫీసు లో గొడవ అయితే పెద్ద నష్టం లేదు... వాడి మొహాన్న రెండు తిట్టేసో.. రాజీనామా పారేసో ఇంటికోస్తాము... అక్కడే మనకి పెద్ద సమస్య.. ఇక్కడ బాసు తోటే మనకి రిస్కు ఎక్కువ.. అక్కడ పని తోటే తంటా... ఇక్కడ పని చేస్తే ఒక తంటా.. చెయ్యకపోతే మరో తంటా.... ఒక్కో సారి ఏమి చేసినా అర్ధం కాని (మనకి), అర్ధం చేసుకోలేని... కడుపు మంట (ఇది మనకి కాదు లెండి)..  అలాంటి ఒకానొక ఆవేశ కావేశాల హోరులో.. రక్తం సల సల మరిగి.. ఆ కోపం లో నా పెద్ద కూతురు మీద గట్టిగా అరిచాను...   అది బిక్క మొకం వేసుకుని ఏడుపు లంకించుకుంది.. మా చిన్న అమ్మాయికి నేనేదో తమాషా చేస్తున్నానని అనిపించి ముందు నవ్వినా.. ఆ తరవాత కేకలకి అది కూడా ఏడవడం మొదలెట్టింది... 

  ఇంత జరిగినా మళ్ళీ సాయంత్రానికి మనది సంసారి బతుకే.. అదే ఏ ఇండియా లోనో అయితే సన్యాసి కొంప చూసుకుని.. సురాపానం లో మునిగి తేలే అవకాసం వుంది.. ఇలాంటప్పుడే నాకు అమెరికా అంటే విపరీతమైన విరక్తి కలుగుతుంది.. పెళ్ళాం మీద కోపం ఒచ్చినా ఎక్కడికీ వెళ్ళలేము... సాయంత్రానికి మా పెద్ద అమ్మాయికి రెండు మూడు సార్లు సారీ చెప్పి.. అమ్మా-నాన్నల మధ్య ఇలాంటివి జరుగుతాయని ఎలా చెప్పాలో తెలియక.. నా కూతురు మళ్ళీ నా దగ్గరకి ఒచ్చి " ఐ లవ్ యు.. డాడీ" అనేన్తవరకూ ఎన్నో  బుజ్జగింపు ప్రయత్నాలు..
  మొత్తానికి గట్టేక్కానని అనుకుంటే రాత్రి నిద్ర పోయే ముందు కధ చెప్పమని... అది కూడా "అమ్మా-నాన్నకి కోపం ఒస్తే ఏడుపొచ్చిన అమ్మాయి కధ"... అని అడిగితే.. ఎలాగోలా దాటేసి.. వేరే కధ చెప్పి నిద్ర పుచ్చాను.. నిద్రలో ఒకటి రెండు సార్లు మెలకువ ఒచ్చి "డాడీ.. ఐ లవ్ యు.. డాడీ ఐ యాం సారి" అని ముద్దు పెట్టి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది... 
  పొద్దునే లేచి నాకు దాని కలలోని కబుర్లు చెప్పడం రొటీన్.. అది చెప్పిన పీడ కల నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది..
మా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, దాని ఫ్రెండ్ పరిగేడుతున్నారట.. వాళ్ళని ఒక బిగ్ బాడ్ వోల్ఫ్ (తోడేలు) వెంటాడుతూ ఉందిట.. దాని నించి తప్పించుకుని వెళ్లి వాళ్ళు ఒక్కో ఇల్లు కట్టుకున్నారట.. మా చిన్న అమ్మాయి గడ్డి ఇల్లు కడితే, వాళ్ళ  ఫ్రెండ్ కర్రల ఇల్లు కట్టిందిట, మా అమ్మాయి ఇటికల ఇల్లు కట్టిందట. ఆ తోడేలు అరుస్తూ వాళ్ళని వెంటాడుతుంటే వాళ్ళు ముందు గడ్డి ఇంట్లో దాక్కుంటే, తోడేలు ఆ ఇంటిని ఊది పారేసిందట.. అప్పుడు వాళ్ళు కర్రల ఇంట్లో దాక్కుంటే తోడేలు ఆ ఇల్లు కూడా వూదేసిందట.. అప్పుడు వాళ్ళు ఇటికల ఇంట్లో దాక్కున్నారట.. ఇది "త్రీ లిటిల్ పిగ్స్" కధ అని నాకు అర్ధం అయ్యింది. కానీ ఆ కధలో నేను ఊహించని మలుపు ఏమిటంటే ఆ తోడేలు నేనే అని.
  ఇప్పటికీ  ఆ పీడకల నన్ను వెంటాడుతుంది.. నిజానికి నా కోపంలో ఎప్పటికీ వెంటాడుతుందని నా అనుమానం.... అద్దంలో నా ప్రతిబింబం తోడేలు లా అప్పుడప్పుడు నాకు...

1, ఏప్రిల్ 2012, ఆదివారం

నేను నీకు నచ్చలేదు కదూ?


నన్ను సరిగ్గా చూడు  
నేను నీకు నచ్చలేదు కదూ?..

మరెందుకు నువ్వు నా వెంటే వున్నావు 
మరొక్క సారి ఆలోచించు 

నన్నొదిలే అవకాసం నీకెప్పుడూ నేనిచ్చా 
మరెందుకిలా నిత్యం నా వెంటే?

నీకు నచ్చినట్లు నేను లేనని 
నిరంతరం నన్ను నిలదీస్తావు 

నాకు నచ్చినట్లు నువ్వు లేవని 
నేనెప్పుడైనా నిన్ను నిందిచానా?

నీకు నచ్చేటట్లు నేను మారితే 
నాకు నేనే నచ్చను..

అప్పుడు నేను కూడా నీలాగే 
నిరంతరం నిట్టూరుస్తూ
నిప్పులు చెరుగుతూ వుంటాను 

అందుకే నేను నాలానే వుంటాను 
అప్పుడప్పుడు నీకు నచ్చకున్నా
నాకు నేను ఎప్పుడూ నచ్చుతాను ...

నీకోసం నువ్వు చెప్పినట్లు మారలేను 
నీకు అప్పుడప్పుడు నువ్వు నచ్చకపోయినా
నేను నాకు ఎప్పుడూ నచ్చుతాను

నాతో అప్పుడప్పుడు వుండే నీకోసం
నాతో ఎప్పుడూ వుండే నేను మారలేను

నేను నీకు నచ్చలేదు కదూ?
నిజానికి అది నా సమస్య కాదు..
నీదే?...ముమ్మాటికి... నీదే?......

29, మార్చి 2012, గురువారం

నత్త పారిపోయి నాలుగు నెలలు అయ్యింది


మీరు పైన చూసే చిత్రం, మా నత్తది. మా Aquarium లో ఏడు చేపలు కధ మీరు చదివే వుంటారు. చదవకపోతే ఇక్కడ చదవండి. అందులో మిగిలిన బాలన్సు జీవి ఈ నత్త. అసలు ఎవడైనా నత్తని పెంచుకుంటాడా? అని చెత్త ప్రశ్న చాలా మందికి ఉద్భవిస్తుంది. అది సహజం. విధి ఆడిన వింత నాటకంలో- చేపలు పెంచే ప్రయత్నంలో - విశాలమైన AQUARIUM లో ఒంటరిగా మిగిలిన ఈ నత్త మా అమ్మాయి ఏకైక పెట్ అయ్యింది. మరి ఇంక ఏం చేస్తాము. ఎప్పుడో పెట్టి పుట్టింది కాబట్టి ఇప్పుడు ఇదో ఏకైక పెట్ అయ్యి మా AQUARIUM లో రాజ భోగాలు అనుభవిస్తోంది.
అసలు దీనిని ఎందుకు పెట్టుకుంటారంటే, పేరుకు పోయినా నాచు గట్రా తింటుందని.
చేపలు పోయాక .. అదే వాల్మార్ట్ కి వెళ్లి పోయాక ఇది మాత్రమే మిగిలిందని మా అమ్మాయి దీనికి GARY అని పేరు పెట్టింది. మా అమ్మాయి చూసే SPONGEBOB SQUARE PANTS లో SPONGEBOB పెట్ నత్త, దాని పేరు దీనికి పెట్టింది. దీన్ని రోజూ పలకిరించేది. దానికి  ఎక్కువ ఫుడ్ వేసేది, దాని AQUARIUM క్లీన్ చెయ్యమని నాకు పదే పదే గుర్తు చేసేది.  అది ఒక్కతే వుంది అని, ఇంకా కొన్ని కొని AQUARIUM లో చేపలూ,నత్తలు వెయ్యమని అడుగుతూ వుండేది.  మేము ఎక్కడికైనా బయటకు వెళితే అది ఒక్కత్తే ఇంట్లో వుందని మధ్యలో దానిని గుర్తు చేసుకునేది..

  ఒక రోజూ నేను చూస్తే AQUARIUM బాగా ఆకు పచ్చగా కనిపించింది. అప్పటికి నా కూతురు చాలా సార్లు నన్ను క్లీన్ చెయ్యమని చెప్పినా, నేను చెయ్యలేదని నాకు బాగా గుర్తు చేసేది.. నేను ఎక్కడో దూరంగా వుద్యోగం చెయ్యడం మూలంగా,  ఇంటి దగ్గర వుండేది మూడు రోజులే. ఆ మూడు రోజుల్లో అన్ని పనుల హడావిడిలో దాని సంగతి పట్టించుకునే తీరిక లేదు. ఒక రోజు నా కూతురు బడి కెళ్ళి ఒచ్చే లోపు AQUARIUM క్లీన్ చేస్తూ నత్తను బయటకు తీస్తే దానిలో చలనం లేదు. దాని గుల్లలో లొల్లి పెట్టకుండా పడుకుందేమో అని తట్టి చూసాను.. అసలు నత్త ఉంటేగా.. ఆ చెత్త మధ్యలో చూసుకోలేదు గానీ, నత్త ఎప్పుడో చచ్చి పోయింది. డొల్లగా వున్న గుల్ల మాత్రమే మిగిలింది. ఇంక మళ్ళీ చచ్చి పోయిన చేపలను తిరిగి తీసుకు ఒచ్చినట్లు నత్తలను తేవడానికి నేను రోజూ ఇంట్లో ఉండను కదా?  అందుకని ఈ నత్త మా డ్రైవ్ వే లో తిరుగుతూ వుంటే అప్పుడు ఒక ఐడియా తట్టి ఈ ఫోటో తీసాను.


 ఆ నత్త మా అమ్మాయికి గుర్తుకు ఒచ్చినప్పుడు ఈ ఫోటో చూపించి నీ నత్త పారిపోయింది అని చెప్తాను. అప్పటి నించి,  మా ఖాళీ AQUARIUM చూసి ఎవరు అడిగినా, "మా చేపలు వాల్మార్ట్ కి వెళ్ళాయి, మా నత్త పారిపోయింది", అని చెప్పడం అలవాటు అయ్యింది. కావాలంటే మా అమ్మాయిని అడగండి.. ఇది నిజం మా నత్త పారిపోయి నాలుగు నెలలు అయ్యింది.