3, ఫిబ్రవరి 2011, గురువారం

టాం అండ్ జెర్రీ - మాం అండ్ సిరి



ఈ మధ్య మా ఇంట్లో కొత్తగా టాం అండ్ జెర్రీ ఎపిసోడ్ లు ఎక్కువ ప్లే అవుతున్నాయి. ఇన్నాళ్ళు చిన్న పిల్లలు టాం అండ్ జెర్రీ చూసి చిన్న తనంలో వెకిలి చేష్టలు.. అంటే చూపుడు వేళ్ళతో నోరు చెరో వైపు లాగి కళ్ళు పెద్దవి చెయ్యడం  నాలిక బయటకి పెట్టి ఆడించడం.. నోట్లోంచి తుస్సు మని గాలి తెచ్చి . అందినవి విసిరేసి.. ఆకలేస్తే నోరు పెద్దగా తెరిచి రెండు వేళ్ళు నోటి లోకి పాయింట్ చేసి చూపించడం.. సోఫాలు లాంటి వాటి మీద నించి ఎక్కి దూకేయ్యడం.. నేల మీద పడి దొర్లుతూ నవ్వడం.. ఎవరైనా పడిపోతే కిత కితలు పెట్టి నవ్వడం.. పాత్ర లు అవ్వీ గాట్టి శబ్దం ఒచ్చేల విసిరెయ్యడం... ఇవి మచ్చుకు కొన్ని అన్న మాట. ఇలాంటివి చాలా పిల్లలు చేస్తారని కొందరు చెప్పగా విని ఇన్నాళ్ళూ నా కూతురికి టాం అండ్ జెర్రీ ఎపిసోడ్లు కంట పడకుండా జాగ్రత్త పడ్డాము. ఎప్పుడైనా పొరపాటన ఏదైనా ఛానల్ లొ ఒస్తే వెంటనే ఛానల్ మార్చేసి, ఎవరిన్టికైనా వెళ్ళినప్పుడు ఆ ఛానల్ పెట్ట వద్దని  ముందుగానే చెప్పి గడిపేసాము. ఈ మధ్య నా కూతురు సెల్ ఫోన్ తీసుకుని తనే గేమ్స్ ఆడుకోవడం, కంప్యూటర్ లొ గేమ్స్ మరియు వీడియో లు చూడడం అలవాటు చేసుకుంది. ఎలా నేర్చుకుందో నా సెల్ ఫోన్ లొ కూడా యు ట్యూబ్ లొ వీడియో లు ప్లే చెయ్యడం నేర్చుకుంది. నేనెప్పుడో దాని కోసం పెట్టిన లిస్టు లొ వీడియో లు ప్లే చేసి, ఆ తర్వాత  వాడు చూపించే వీడియో లు కూడా చూడడం మొదలెట్టింది. అలా ఎప్పుడో టాం అండ్ జెర్రీ చూసి నచ్చేసిన నా కూతురు, అప్పటినించి టీ వీ పెట్టు అన్న మాట వొదిలి టాం అండ్ జెర్రీ పెట్టు అనే మాట  పట్టుకుంది.
ఒకటి రెండు ఎపిసోడ్ లు టీ వీ లొ చూసాక, సరే నాన్న ఇంట్లో లేని టైం లొ తల్లీ కూతురు  ఇద్దరూ  నవ్వు కుంటూ చూస్తున్నారు కదా అని నేను టాం అండ్ జెర్రీ ఎపిసోడ్ లను రికార్డు చెయ్యడం మొదలెట్టా. అక్కడే ఒచ్చింది తంటా. ఎక్కువ చూసేస్తోంది అని వాళ్ళ అమ్మ, నేను చూస్తే కానీ ముద్ద తినను అని కూతురు తరచుగా యుద్ధాలు మొదలెట్టారు. దానికి తోడు అందులో చూపించిన చేష్టలన్నీ అనుకరిస్తోందని మా ఆవిడ ఒకటే గోల. పోనీ ఇంకేదన్నా చూపించమంటే టాం అండ్ జెర్రీ తప్పు ఇంకేదీ చూడనని నా కూతురు పంతం పట్టింది. నేను ఆఫీసు లొ ఏదో పనిలో వుంటే నాకు ఇంటి నించి ఫోను "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు"  అని కూతురు ఏడుపు. టాం అండ్ జెర్రీ మధ్యలో ఒచ్చిన మూడో జంతువుకి అటూ ఇటూ కూడా దెబ్బలు పడే ఎపిసోడ్ ఆఫీసు లొ వున్న నాకు. వీకెండ్ ఇంటి కెళ్తే  "నీ కూతురు ఇలా దూకింది, అలా కరిచింది, గట్టిగా అరిచింది, జబ్బ చరిచింది,  వెక్కిరించింది" లాంటి పెద్ద లిస్టు మనకోసం సిద్దం. అప్పటికీ మా నాయనమ్మ గుర్తుకొచ్చి, నేనొక చండ శాసన మున్దావాడినని ఇలాంటివి సహించేది లేదు అని ఇద్దరికీ టైం అవుట్ అని చీకటి గదిలో పెడితో, అక్కడ ఇద్దరూ ఇక-ఇకలు పక-పకలు. పోనే విభజించి పాలించాలని వేరే వేరేగా పెడితే రెండు నిమిషాలలో "మేము తప్పు తెలుసుకున్నాం . ఇక మళ్ళీ చెయ్యం." అని హామీ  ఇచ్చేస్తారు. మళ్ళీ రిపీట్ చెయ్యద్దని చెప్పి  టాం అండ్ జెర్రీ  లేకుండా వారాంతం గడిచిపోతుంది.
మళ్ళీ సోమవారం ఆఫీసు పనిలో వుండగా ఫోన్ రింగవుతుంది. ఇంటి నించి ఫోను అని ఎత్తితే "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు"  అని కూతురు ఏడుపు. 
ఇంట్లో టాం అండ్ జెర్రీ - ఫోన్ లొ మాం అండ్ సిరి ఎపిసోడ్లు. ఈ రెంటి మధ్యలో నా బాధలు యేమని చెప్పను. 


1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...



వారం అంతా ఎక్కడో పని చేసి, వీకెండ్ ఇంటికి ఒచ్చి నా కూతురు చెప్పిన కబుర్లు వింటూ భోజనం చేసి టీవీ ఆన్ చేసాను. నాతో పాటు TV చూస్తున్న నా కూతురు "మా" టీవీ లొ ఒస్తున్న సినేమా "రోబో" లొ యుగళ గీతం చూసి నన్ను ఒక డౌట్ అడిగింది. "డాడీ! WHY BOYS ALWAYS FALL IN LOVE WITH GIRLS ?" అని. కళ్ళు తిరిగి కింద పడినంత పని అయ్యింది. ఎందుకంటె నా కూతురు వయసు ఇంకా నాలుగే. నిజానికి నా ముద్దుల తల్లి అడిగే ప్రశ్నలకి నేను అలవాటు అయ్యి అంతగా ఆశ్చర్యపోను. మొదట్లో అదేదో సినిమాలో గిరిబాబులా ఆకాశం కేసి చూసి "దేవుడా! ఎందుకు నాకు కూతుర్నిమ్మంటే క్వొశ్చన్  బ్యాంకు నిచ్చావు" అని ప్రశ్నించేవాడిని. తరవాత మెల్లిగా ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇది ఎంసెట్ లొ అవుట్ అఫ్ సిలబస్ క్వొశ్చన్, అదీ యం పీ సి  వాడికి బోటనీ క్వొశ్చన్ లాంటిది. ఈ ప్రశ్న దాని మనసులోకి ఎలా ఒచ్చిందంటే, అది చూసే అరా-కొరా తెలుగు సినిమాలలో ఎప్పుడూ హీరొయిన్ వెంట హీరో పడడం, చివరికి ROBO సినిమాలో ROBO కూడా హీరొయిన్ వెంట పడుతుంటే దానికి ఇలాంటి సందేహం ఒచ్చింది. నేను వెంటనే ఆపుకోలేని నవ్వుని, నా ముఖ కవలికలని కవర్ చేసుకుని "ఎక్కడ నేర్చుకున్నావు ఇది?' అని అడిగా లేని కోపం చూపించే ప్రయత్నం చేస్తూ. "నో వేర్" అని చెప్పి మాట మార్చేయడం నా కూతురికి అలవాటు.




నా కూతురు తెలివి గురించి చెప్పాలంటే- నేను మా ఆవిడ ఎప్పుడైనా ఘర్షణ పడితే ఇది నేను ఏమి చెయ్యలేదు, నేను గుడ్ గర్ల్ అంటుంది. మీ ఇద్దరూ కోపం నా మీద చూపించకండి ఇందులో నా తప్పేమీ లేదని అందులో అర్ధం. ఎప్పుడైనా వాళ్ళ అమ్మను కార్ లోంచి డ్రాప్ చేసి "మీ అమ్మ ని ఓదిలేసాను, ఇంక నువ్వు డాడీ దగ్గరే వుండాలి" అని ఏడిపిస్తే, "చిన్న పిల్లలు మమ్మీ లేకుండా ఉండలేరు.", అని సెంటిమెంట్ తో కొట్టి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నేను కంగారుగా ఓదార్చే స్టేజి కి తీసుకొస్తుంది. పైన రెండు సందర్భాలలో అది ప్రదర్శించే తెలివి నన్ను కొంచెం పుస్తకాలూ అవీ చదివి, దాని వయసుని బట్టి ఆలోచనలు పసిగట్టే ప్రయత్నం చేసేలా చేసాయి. అయినా సరే నా కూతురు వయసుకి మించిన పరిణతి తో నా ప్రిపరేషన్ సరిపోవట్లా. 

నా కూతురు నాకు ఇలాంటి షాక్ లు చిన్నప్పటి నించీ ఇస్తోంది. రెండేళ్లప్పుడు అనుకుంటా ఒక సారి ఇంటికి ఒచ్చి "నిక్ గాడికి నేను నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటాడట" అన్నప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.


మూడేల్లప్పుడు ఒక సారి ఇంటికి ఒచ్చి "నాన్న, నేను ఎందుకు బ్రౌన్ గా వున్నాను. తెల్లగా ఎందుకు లేను?" అంది. అప్పుడేదో ఇంద్ర ధనుసులో రంగుల్లా అన్ని రంగులలో మనుషులు వుంటే లోకం అందంగా వుంటుంది అని చెప్పి సర్దేసా. ఏం చేస్తాము నా వన్నీ నీ పోలికలు అని చెప్తే, తెల్లగా వున్న అమ్మ పక్షం చేరుతుందని, లేదా మరిన్ని ప్రశ్నలు సందిస్తుందని. అప్పటినించీ దీనికి నలుపు, బ్రౌన్ రంగుల గురించి ఏది చెప్పాలన్నానేను బాగా ఆలోచించి మరీ చెప్తా.


ఒక రోజు ఇంటికి ఒచ్చాక "నాన్నా! నాకు డే కేర్ లొ ఒక ట్విన్ సిస్టర్ ఉంది" అంది. ఈ మధ్య డే కేర్ లొ కొత్తగా చేరిన జయ (నల్ల అమ్మాయి) రంగూ, నా రంగూ ఒకటే కాబట్టి అది నా ట్విన్ సిస్టర్ అని వాదిస్తూ కూర్చుంది. దీని చేత అది కాదు అని ఒప్పించే టప్పటికి నా తల ప్రాణం తోకలో కొచ్చింది. మీరు మరీ ఎక్కువ ఊహించకండి- నాకు తోక లేదు. ఏదో సామెత అంతే.  హమ్మయ్య దీన్ని కన్విన్సు చేసానని సంబరపడుతుంటే నిన్న "నాన్నా నేను నువ్వు ఒకే రంగులో, బుగ్గ సోట్టల్తో ఒకేలా  ఉంటాము. నువ్వు నేను ట్విన్స్" అనడం మొదలెట్టింది.
ఈ మధ్యనే TANGLED సినిమాకి వెళ్తే నా కూతురు అడిగిన ప్రశ్నలకు నా వెనక కూర్చున్న ముసలామె సినేమా అయ్యాక నన్ను తట్టి మరీ నా కూతురు వయసెంత అని అడిగింది. నాలుగు అని చెప్తే ఆవిడ సమాధానం "మీ అమ్మాయి ప్రశ్నలు వింటే ఏడో ఎనిమిదో అనుకున్నా, ఎత్తు చూస్తే తక్కువ అనిపించి అలా అడిగాను. నాలుగేళ్ళకే ఇన్ని ఇలాంటి ప్రశ్నలా?" అంది.



ఇలా వుంటుంది నా కూతురితో.  దీనికి తోడు మా ఆవిడ లేని పోని చిన్ని కృష్ణుడు కధలు చెప్పి, కృష్ణుడు  ఒస్తాడని కాకమ్మ కబుర్లు చెప్తే, "కృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు? ఎలా ఒస్తాడు? ఎప్పుడు ఒస్తాడు?" అని ఒక రోజంతా పదే పదే విసిగించింది.


పోనిలే అవసరానికో అబద్ధం అని చెప్పి మా అమ్మాయి ప్రశ్నల నించి తప్పించుకోడం చాలా కష్టం. ఎప్పుడైనా మనం వేరే సమాధానం చెప్తే "మరి నా మూడేల్లప్పుడు నాకు అలా చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్పావు" అని నిలదీస్తుంది. ఒక సారి మా అమ్మాయికి DRY COUGH ఒస్తే, "తల్లి! కొంచెం మంచినీళ్ళు తాగు. నీకు DRY COUGH ఒచ్చింది" అన్నాను. "DRY అంటే తెలుగులో ఏంటి?" అని అడిగింది. పొడి- అని చెప్పాను. వెంటనే "డాడీ! పొడి అంటే నాయనమ్మ నాకు దోశ లలోకి నంచుకోడానికి పంపించేది, కదా!" అని నిలదీసింది. అది పుట్నాల పొడి, ఇది పొడి దగ్గు అని చెప్తే ఊరుకోలేదు. అదే పొడి ఇది కాదు అంటుంది.  
ఈ సారికి ఎలాగోలా దాటేసినా "అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...?" అనే ప్రశ్నకు దాని వయసుకు తగ్గ సమాధానం చెప్పడానికి నేను విపరీతమైన research చెయ్యాలి. ఈ టపా చదివే మీరు సరైన సమాధానం తెలిసీ చెప్పక పోయారో  ప్రశ్నా పత్రం లాంటి నా కూతురు లాంటి పిల్లలు మీ ఇంట కూడా పుట్టి ప్రశ్నలతో మిమ్ములను వేధించు గాక! తెలిస్తే కామెంటి నా కష్టం తీర్చండి.

మకర జ్యోతి మనిషి వెలిగించిందే...నమ్మకంతో నడిపించడానికి


మనిషిని మంచి మార్గంలో నడిపించేది
మూఢ నమ్మకమైతేనేమి

మనిషి మనసుని మంచి పనిలో
లగ్నం చేసేది ఎలాటి భక్తి అయితే నేమి

మనిషి మనిషికి  సాయపడేలా చేసేది
ఎలాంటి మతం అయితే నేమి

మనిషిని మనిషిగా బ్రతకనిచ్చేది
ఏ నాగరికత అయితే నేమి

మనసు లోతుల్ని తట్టేది
ఏ  సంబంధం అయితే నేమి

మమతతో మనసుని కట్టి పడేసేది
ఏ అనుభందం అయితే నేమి

మకర జ్యోతి మనిషి వెలిగించిందే
నమ్మకంతో నడిపించడానికి

చుట్టూ వున్న చీకటిని లెక్క చెయ్యకుండా
మనిషి ముందడుగు వెయ్యడానికి

మనమందరం వెలిగించాలి
మన చేత్తో మకర జ్యోతులని

మన మీద వున్న నమ్మకంతో
ముందడుగు వేసే మనుషుల కోసం

వెలిగించే మనిషిని దేవుడే పంపాడు
మనందరినీ వెలుగుతో పంపినట్లే 

కానీ
నడిపించే నమ్మకాన్ని పెంచలేకపోతున్నాము
వెలుగుని మన స్వార్ధం కోసం దాచుకుని  

వెలుగు కొండేక్కే వృద్ధాప్యంలో నైనా తెలుస్తుందా
స్వార్ధం తో మనం పంచని ఆ వెలుగు
మంటలా మనల్ని దహించేసిందని




గమనిక: మకరజ్యోతి మానవ సృష్టే  అని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడి చేసిన సాక్షి లొవార్త కి స్పందిస్తూ ..