31, అక్టోబర్ 2010, ఆదివారం

యురేకా! అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ ఈ రోజుతో ముగిసింది

యురేకా!  అనుకోకుండా ఈ అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ పోటీ గురించి తెలిసింది. తెలిసాక సరదాగా ప్రయత్నిద్దామని అనుకున్నాను.నేను అసలు సిసలు ఆంధ్రుడ్ని కదా! అందుకని ఇది అయ్యే పని కాదులే అని నాకు నేను సరిపెట్టేసుకున్నాను. అదే నండీ మన ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నారు కదా - అందుకని అన్న మాట.  పైగా నా విషయంలో ఇది వున్న మాట, నలుగురి నోటిలో నేను విన్న మాట.  అలా మొదలయ్యింది ఈ టప-టప టపా రాయాల్సిన  అవసరం.
మన శ్రీ శ్రీ గారు చెప్పినట్లు: కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల - కావేవోయ్ కవిత కనర్హం అని. ఒక సారి నన్ను నేను వెన్ను తట్టుకుని, వేళ్ళు విరుచుకుని కంప్యూటర్ మీద, నా వేళ్ళతో అడ్డొచ్చిన టాపిక్ మీద ఇష్టం ఒచ్చిన పద్ధతిలో టపాలు వోదిలాను.
రోబో తో మొదలెట్టి, యానిమేషన్ తో పొడిగించి, ఆలోచనలకో తాడూ బొంగరం కలిపించి, రాజకీయం మీద కవిత కక్కి, లక్ష్మణుడి గీత ని, చిత్ర పటాలని, నా బ్లాగు పేరు వెనుక ఉద్దేశ్యాన్ని పరిచయం చేసాను.
ఆ తరవాత మా అమ్మాయి kaleidoscope లో నాకు కనిపించిన రంగులు, నిండుగా తిరిగొచ్చే మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకు చూపించే చుక్కలు, ఎంత సాగినా మారని ఆకతాయి బాండ్ లు, వలస వెళ్ళిన చేపలతో కొంచెం టపాలు రాయడానికి అలవాటుపడ్డాను.
అనంతరం రివ్యూ లలో లేని ఖలేజా ని, మా లాంటి వాళ్ళ వయసులో వృద్ధాప్యాన్ని, ఏకాకి జీవితాన్ని, నా జీవిత పల్లపు ఆలోచనలని కొంచం వివరించాను.
ఆ తరవాత అంతగా ఆకట్టుకోని చంటిపిల్లల అనారోగ్యం చార్టు, రేపటి స్వప్నాల పాట, బృందావనం రివ్యూ తో కొంత విసిగేత్తించాను.  ఆలోచించి తల గోక్కుని ఆధిపత్యాల పోరు కవితతో,  కుక్క పిల్ల మీద కట్టు కధతో, అలరించిన చందమామ పాటతో, పురి విప్పిన నెమలి ఆర్టుతో బానే బ్లాగులోకంలో రెక్కలు విచ్చుకున్నాను.
చివరలో బెండకాయ బాధితుల్ని, మా అమ్మాయి నా కళ్ళు తెరిపించిన కలని, విదేశాలలో స్వదేసీలతో పడే బాధలని, మా బ్లాకు పార్టీ ని పరిచయం చేసాను.
అంతటితో ఆగక, నా కిళ్ళీ కొట్టు అనుభవాలు, నోములు నోచే బార్యల భర్తలు పడే కష్టాలు, మా ఎదురింటి పరిచయాలు చెప్పి - కుక్క పిల్ల టపా కి అనర్హం కాదని మరో సారి గుర్తు చేస్తూ "బౌ బెల్లా -అనే కుక్క పిల్ల" టపా ప్రచురించాను.
         ఈ రోజుతో అక్టోబర్ ముగిసింది. ఈ పోటీ పరిచయం చేసిన sree కి నా కృతజ్ఞతలు. ఈ పోటీలో బహుమతి ఏమిటంటే, నాకు ఒచ్చిన కామెంట్లు, హిట్లు మరియు తిట్లు. సరదాకి మొదలు పెట్టినా, నేను ఈ నెల రోజులూ బాగా ఎంజాయ్ చేసాను. ఇన్నాళ్ళు నా బ్లాగులను చదివిన మీ కందరికీ నా కృతజ్ఞతలు. ఇక నించి రోజూ కాకపోయినా, అప్పుడప్పుడు బ్లాగుతూ వుంటాను.


ఈ పోటీ వివరాలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి.
http://www.nablowrimo.blogspot.com/

30, అక్టోబర్ 2010, శనివారం

బౌ బెల్లా - అనే కుక్కపిల్ల


"బౌ బెల్లా - అనే కుక్కపిల్ల" - బావుంది నాయనా నీ టైటిల్. తరవాత ఏమిటీ, అగ్గి పుల్లా- సబ్బు బిల్లా? అని మీరు ఎటకారం చేస్తే ఇక నేను కట్టు కధలు కట్టి పెట్టాలి నా టపాలో. నిన్న రాత్రి పడుకునే టప్పుడు పుస్తకం చదవమంది మా అమ్మాయి, రొటీన్ గా. దాని పుస్తకాలు చాలా బరువు ఎక్కువ, పడుక్కుని చదివితే పొట్ట మీద పెట్టుకుని పట్టుకోవాలి. అసలే నాకు భుక్తాయాసం. అదేదో ఒక కధ తో ఐపోతే పరవాలేదు, ఒకటి తరవాత ఒకటి చదువుతూనే వుండాలి. అందుకని ఈ సారి మనమే ఒక కధ చెప్తే పోలా అనిపించింది.

కధ- పైగా అదీ కట్టు కధ చెప్పాలంటే ఏదో ఒక సబ్జెక్టు వుండాలి కదా.  కొంచెం నా మొద్దు బుర్రకి పదును పెట్టి, ఒక ప్రశ్న సంధించా. నీకు ఏ జంతువు ఇష్టం అని అడిగాను, కుక్క పిల్ల అని చెప్పింది. కొంచెం ఆలోచించి ఈ మధ్య అది నాకు చెప్పిన విషయాల నెమరు వేసుకున్నా. 
రెండు రోజుల క్రితం కల ఒచ్చిందని ఒక కధ చెప్పింది. అందులో తను రాకుమారిట, దానిని ఎవరో రాకుమారుడు fight చేసి రక్షిస్తున్నాడట. (అది కధ చెప్పినప్పుడు నా గుండె కలుక్కు మంది. దీనికి ఇప్పుడే ఇంత ప్రిన్సు అండ్ ప్రిన్సెస్ పిచ్చి - మనం దీనికి సంబంధం వెతకాలంటే ఏ రేంజ్ లో వుండాలి అని). "కధ చెప్పు నాన్నా", అని పది సార్లు అడిగే లోపు ఆలోచిన్చేసా.

ఇక కధలోకి - అదేనండి కట్టు కధలోకి ఒస్తే. మనం సంపాదించిన సమాచారంతో అప్పటికప్పుడు ఒక కధ అల్లాను. అదే "బౌ బెల్లా" అన్న మాట.

అనగనగా ఒక చిన్న పిల్లవాడు, వాడి పేరు లిటిల్ పీట్. (ఇలా పేరు ముందు లిటిల్ అని పెడ్తే మనకి తరవాత నాన్నపేరు వేరే ఆలోచించక్కర్లా) వాడికి జంతువులంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న పేరు బిగ్ పీట్. లిటిల్ పీట్, బిగ్ పీట్ ని ఎప్పుడూ ఒక పెట్ కావాలని అడుగుతూ ఉంటాడు. వాడికి నాలుగేళ్ళు. రేపే వాడి ఐదో పుట్టినరోజు. రేపు వాడి పుట్టినరోజు అని చాలా సంతోషంగా ఉంటాడు. రేపు రాబోయే బహుమతుల గురించి, స్నేహితులతో చేయబోయే సందడి గురించి, తన కేకు గురించి, వాళ్ళ నాన్న తేబోయే గిఫ్ట్ గురించి ఊహిస్తూ పడుకుంటాడు. లిటిల్ పీట్ నిద్రపోయాక, బిగ్ పీట్ పెట్ స్టోర్ కి వెళ్తాడు. (అక్కడ కాసేపు మనకి తెలిసిన జంతువుల గురించి చెప్పి, అవి చేసే సౌండ్స్ గురించి వర్ణిస్తూ కావాలంటే కధ పోడిగించుకోడమే) అప్పుడు ఒక బోనులో ముద్దుగా, బుజ్జిగా, తెల్ల బొచ్చుతో, మెత్తటి తెల్లటి మబ్బులాంటి ఒక కుక్క పిల్ల చిన్నగా బౌ బౌ మంటుంది. దాని చెవులు కళ్ళను కప్పేస్తూ చాలా పొడుగ్గా వుంటాయి. చెవులు అడ్డు వున్నాయి కాబట్టి చూసేముందు అది తల అటూ ఇటూ విసుర్తుంటుంది. అలా విసురుతుంటే దాని మెడలో వున్న ఘంట 'డింగ్ డింగ్' మని మోగుతూ వుంటుంది. చీకట్లో దాని నీలి కళ్ళు మెరుస్తూ వుంటాయి. చీకట్లో దాని అరుపు విని, కళ్ళని ఫాలో అయ్యి బిగ్ పీట్ బోను దగ్గరికి వెళ్తాడు. బోనులో బిగ్ పీట్ వేలు పెడితే అది నాకుతుంది. అది బిగ్ పీట్ కి బాగా నచ్చి, దాన్ని కొంటాడు. అది బౌ బౌ మంటూ వుంటే చూసాడు కాబట్టి, దాని మెడలో ఘంట ఉంది కాబట్టి, దానికి "బౌ బెల్లా" అని పేరు పెడతాడు. ఇంటికి తీసుకొస్తాడు.

  లిటిల్ పీట్ తన ఐదో పుట్టినరోజు కోసం రాత్రంతా చాలా excite అయ్యి, ఎన్నో ఆలోచనలతో పడుక్కుంటాడు కాబట్టి, వాడికి ఒక కల ఒస్తుంది. (ఇక్కడ ప్రిన్సుస్స్ స్టొరీ మా అమ్మాయి చెప్పింది చొప్పించా) అందులో వాడే ప్రిన్సు. వాడికి ఒక కుక్క పిల్ల వుంటుంది. వాడు PRINCESS ని రక్షించడానికి ఒక CASTLE  కి వెళ్తాడు. ఆ CASTLE ని ఒక డ్రాగన్ కాపలా కాస్తూ వుంటుంది. (ఇది ష్రెక్ స్టొరీ కాపీ)  ఆ కలలో వాడు డ్రాగన్ని FIGHT చేసి CASTLE  పైనించి పడి పోతాడు. వాడి కుక్క బౌ బౌ మని డ్రాగన్ తో ఇంకా FIGHT చేస్తూ వుంటుంది.  కలలో పడిపోతే మెలకువ ఒస్తుంది కదా, లేచి చూస్తే వెలుతురు కనిపిస్తుంది. తెల్లరిపోయిన్దన్నమాట అనుకుంటాడు. మళ్ళీ బౌ బౌ అని సౌండ్ వినిపిస్తుంది. కల ఐపోయింది కదా ఇంకా కుక్క అరుపు వినపడుతోందేమిటి, అని గదంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ కుక్క బౌ బౌ మంటుంది. లేచి చూస్తే మంచ కింద నించి సౌండ్ వొస్తుంది. అది వాళ్ళ నాన్న బిగ్ పీట్ వాడికి తెచ్చిన SURPRISE అన్న మాట. 

కధ మాంచి కాపీ కధ అనిపించిందా? కాపీయే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మా అమ్మాయినించి ఒచ్చిన ఇన్పుట్ తో కధ అల్లినందుకు, దానికి చాలా ఆనందం అనిపించింది. నాకు కూడా ఏదో కష్టపడి కధ అల్లితే, తీరా నచ్చకపోతే నిరాశే కాబట్టి - ఈ కాన్సెప్ట్ ఇద్దరికీ వర్క్ అవుట్ అయ్యింది.  ఈ సారి మీ పిల్లలకు కధ చెప్పాలంటే ఇలా ట్రై చేసి చూడండి.

అయితే వీటిలో చిన్న రిస్క్ కూడా లేకపోలేదు. పై కధ చివ్వర్లో సమాప్తం చెపుతుండగా ,నాకెందుకో నేను నా గొయ్యి నేనే తవ్వుతున్నానా అనే అనుమానం కలిగింది. ఆరు నెలల్లో రాబోయే మా అమ్మాయి ఐదవ పుట్టిన రోజుకి కుక్క తెమ్మంటే - నా బతుకు కుక్క బతుకే కదా! కాబట్టి ఇలాంటి రిస్కులకు మీరే బాధ్యత వహించే పక్షంలో కట్టు కధలు కుమ్మేసుకోండి.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

మా ఎదురింటి గీతాంజలి యువ జంట

 మా ఎదురింటి యువ జంటని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. మరీ యువ జంట మీద కన్ను వేసి - వారిని చూసే వెదవ బుద్ది అని అనుకునేలోపే మీకు వాళ్ళ వయసు చెప్పాలి. అతని వయసు డెబ్భై పైన, ఆమె వయసు అరవై పైన. కాకపోతే మేము ఈ ఇంట్లో దిగిన రెండు సంవత్సరాలకు, వాళ్ళు కూడా ఎదురింట్లో దిగారు (అంటే ఎదురింటి పక్కిల్లు అనుకోండి). వయసుకి ముసలి వాళ్ళు ఐనా, జంట మాత్రం యువ జంటే. ఎందుకంటె ఇంట్లోకి దిగే ముందే పెళ్లి చేసుకున్నారు. అసలు దిగక ముందు ఇద్దరూ చెరొక కొత్త ఇల్లు కొనుకున్నారట. ఇంతలో ఇద్దరికీ ఏ చర్చి లోనో పరిచయం - తదుపరి ప్రణయం. ఆ రెండూ అమ్మేసి ఈ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు.
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి, పైగా ఇద్దరికీ మనుమలు, మనుమరాళ్ళు వున్నారు. కానీ ఇద్దరూ చాలా అన్యోనంగా వుంటారు. ఇద్దరి మనస్తత్వాలు చాలా తేడాగా వుంటాయి. అతని పేరు జిమ్ము, ఆమె పేరు రూతు. జిమ్ము చిన్న పిల్లాడిలా ఎప్పుడూ నవ్వుతో ఉంటాడు. చెయ్యత్తు మనిషి, భారీ ఖాయం. మాట్లాడితే మా ఆవిడ బోదర కప్ప గొంతు అంటుంది. కంచు కంటం. అందరినీ పలకరిస్తాడు, ఒక సారి మొదలు పెట్టడంటే ఆపడు. కలుపుగోలు మనిషి. ఇంటి దగ్గరే ఉంటాడు. మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ లకి పిలిస్తే ఒస్తాడు. అన్నీ కొంచెం కొంచెం తిని, నచ్చినవి బాగా గుర్తు పెట్టుకుంటాడు.
రూతు మరీ మిత భాషి. అంత తొందరగా కలిసే రకం కాదు. మా అమ్మాయి పుట్టిన రోజుకి పిలిచినా ఎప్పుడూ ఒచ్చిన గుర్తు లేదు. స్కూల్ లో ప్రిన్సిపాల్ గా ఇంకా వుద్యోగం చేస్తోంది. కొంచెం తెలియని వాటికి దూరంగా వుండే రకం అనిపిస్తుంది. కానీ పలకరిస్తే మాట్లాడుతుంది. వారాంతాలలో బయట తోట పని చేస్తూ కనిపిస్తుంది. 
 మొన్నామధ్య జిమ్ముకి బాగా అనారోగ్యం చేసింది, చాలా కంగారు పెట్టాడు. అప్పుడు వాళ్ళతో కొంత సమయం గడిపాను, అప్పుడు వాళ్ళ అనుబంధం చూస్తే ఆశ్చర్యమేసింది.  ఇంతకీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇలా వృద్ధాప్యంలో తోడు వెతుక్కోడం అనేది మన దేశంలో జరగదు. అసలు ఆ వయసులో వాళ్లకి తనతో పాటు ఇంట్లో ఇంకో మనిషి వుండడం, ఒకళ్ళ బాగోగులు ఇంకొల్లు చూసుకోడం వాళ్లకు చాలా అద్రుష్టం. దాని మూలంగా ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత తో కూడిన ప్రేమ వుంటుంది. ఈ వయసులో ఆకర్షణతో తీసుకునే నిర్ణయాలు ఎలాగో వుండవు. అంత వయసు ఒచ్చాక ఎవరిని నమ్మి, ఎవరి మీద ఆధారపడగలరు.  వీళ్ళని చూస్తే నాకు గీతాంజలి సినిమా ప్రేమ అనిపిస్తుంది. అందులో చివరకి చెప్పినట్లు "ఎంత కాలం బతుకుతారో తెలియదు, కానీ బతికినంత కాలం కలిసే బతుకుతారు"  
అదండీ మా ఎదురింటి గీతాంజలి యువ జంట కధ.

28, అక్టోబర్ 2010, గురువారం

వాయినాలతో వాచిపోతోంది

ఈ మధ్య పెళ్ళాం మాట బుద్ధిగా వినే- భార్యకి భక్తి డివిజన్ లో పూర్తి సహాయ సహకారాలు ఇచ్చే సంఘంలో కొందరు సభ్యులతో మాములుగా పెట్టుకున్న ముచ్చట్లలో తేలినది ఏమిటయ్య అంటే. దేశం కాని దేశం లో భక్తి ప్రపత్తుల్లతో సాంప్రదాయాన్ని గౌరవించి గృహిణులు నోచుకున్న నోములు అందరికీ ఆమోదయోగ్యంగా వున్నా, ఒకే కారుతో సంసారం నెట్టుకొస్తున్న భర్తలకు మటుకు ఇలా అనిపించింది. 
"వాయినాలతో వాచిపోతోంది
నోములతో నడుం పడిపోతోంది"

వాయినాల ఖర్చు విషయంలో ఒకింత ప్రాస కోసం అనుకుని సరి పెట్టుకున్నా,  నోములో భాగంగా వాటి పంపిణీకి పని రోజులలో అందరి ఇంటికీ భార్యని తిప్పాలంటే సదరు భర్తలకు నడుం పడిపోతున్నదన్న విషయము ఇక్కడ గమనార్హము.

కావునా, స్త్రీ మూర్తులు -  మీ కష్టంతో పాటు పాలు పంచుకున్న భర్తలపైన కొంచెం జాలి చూపండి. అదే నండి పంపకాలు అయ్యాక, "ఎంత మంచి భర్తో!, అందుకనే జన్మ జన్మలకి మీరే కావాలని ఈ నోము" టైపు వుబ్బేసే మాటలతో అన్నమాట.

27, అక్టోబర్ 2010, బుధవారం

మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు


  చిన్నప్పుడు పెద్ద వాళ్ళు తినే మిటాయి కిళ్ళీ అంటే చాలా మోజు వుంటుంది. ముఖ్యంగా అందులో వుండే తీపి  ITEMS మూలంగా. అప్పుడప్పుడు అమ్మ కోసం తెచ్చిన మిటాయి కిళ్ళీ అమ్మ వెంట పడి సతాయిస్తే అందులో చిన్న ముక్క కొరుక్కోనిచ్చేది. అలా మొదలయ్యింది నాకు మిటాయి కిళ్ళీ మోజు. అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న లేకపోతే - అక్కనో, అన్నయనో పట్టుకుని నీకు మీటా పాన్ చేస్తానని చెప్పి బతిమాలేవాడిని. వాళ్ళు ఒప్పుకుంటే, తమలపాకులు రెండు తీసుకుని వాటి మీద పేస్టు కొంచెం సున్నం లాగ అద్దేవాడిని. ఆ తర్వాత కిచెన్ లో వండే సామాన్ల లో నాకు నచ్చినవి అంటే కొంచెం కొబ్బరి, పంచదార పొడి, బెల్లం, యాలకులు లాంటివి వేసి, చివరలో వొక్కపొడి వేసి చుట్టి ఇచ్చేవాడిని. ఒక్కో సారి నచ్చేది, కానీ ప్రతీసారి "ఇందులో ఏమి వేసావు?" అనే ప్రశ్న ఒచ్చేది. ఏమి వేసామో చెప్తే వాళ్లకి తప్పకుండా నచ్చదు. ఇలా సాగేది నా కిళ్ళీ కట్టుడు అలవాటు. అయితే ఇక్కడితో అయిపోలేదు.
నేను ఇంటర్ చదివే రోజుల్లో, మా బావ వాళ్ళ ఇంట్లో వుండే వాడిని. కొన్ని అనుకోని పరిస్థుతులలో అక్కడ కిళ్ళీ కొట్టు ఒకటి వుండేది. మా బావ చేసేది వుద్యోగం, నేను చదివేది చదువు కాబట్టి. నేను సాయంత్రాలు కిళ్ళీ కొట్టు తెరిచే లా నాకు ఆర్డర్లు జారి అయ్యాయి. అది విజయవాడ లో సీతారాంపురం పెట్రోల్ బంక్ దగ్గర అన్న మాట. 
 నేను కాలేజీకి వెళ్ళే ముందు, కాలేజీ అయ్యాక కొట్టు తెరవాలి. అంటే ముందుగా చిన్న డబ్బా తాళం తీసి, ఆ డబ్బాలో దూరి రేకు కిటికీ తీసి, కొక్కేలు తగిలిస్తే మన బడ్డి కొట్టు ఓపెన్ అన్న మాట. అయితే వెంటనే బయట ఒక చాంతాడు వెలిగింఛి పక్కన వున్న పోలు కి కట్టాలి. ఆ తర్వాత పెద్ద జాడీలు తుడుచుకుని వాటిలో చిక్కీలు, మర మరాల ఉండలు, జన్తికీలు, చేగోడీలు, సోం పాపిడి, బిస్చ్కట్లు, చాక్లెట్లు,  ఇంకా మరేమో పిప్పెరమెంటు బిళ్ళలు లాంటివి అవసరాన్ని బట్టి నింపుకోవాలి. మర్చిపోయాను వుంటే అరటి గెల బయట కట్టేయ్యాలి. ఇంటి నించి తెచ్చుకున్న చిల్లర పోసుకోవాలి. ఆ తరవాత సిగేరెట్లు విడిగా పెట్టుకోవాలి. ఇంటి నించి తెచ్చుకున్న తమలపాకులు నీళ్ళల్లో వేసుకోవాలి. కొత్తల్లో పేపర్ కూడా అమ్మేవాడిని, అవి బయట జాడీల కింద వేళ్ళాడ దియ్యాలి.  ఇంకా ఏమైనా పీచు మిటాయి లాంటివి వుంటే పైనించి వేళ్ళాడుతున్న కొక్కేలకి తగిలించాలి. ఇంకా మన కిళ్ళీ బడ్డీ రెడీ.
ఆ తరవాత మనకి ఒచ్చే బేరాలు అయితే పొద్దున్న ఎక్కువగా పేపర్, మధ్యాన్నం నించీ కిళ్ళీలు ఎక్కువగా ఒస్తాయి. పాపం చిన్న పిల్లలు ఒక్కో సారి  జీడికని, పిప్పెర్మేంట్ కనీ ఒస్తే వాళ్ళ దగ్గర ఐదు పైసలు తక్కువ అయినా ఇచ్చేసేవాడిని. ఎందుకంటె కిళ్ళీ బడ్డి మనది కాదు, పైగా మనకి చినప్పుడు అనుభవాలు గుర్తుకొచ్చేవి. ఆశగా డబ్బులు పట్టుకుని వెళ్తే డబ్బులు తక్కువ అయ్యాయని  కొట్టు వాడు పొమ్మంటే చాలా కోపం ఒచ్చి అడ్డమైన తిట్లు తిట్టుకున్నాము కదా! అందుకని మనల్ని వాళ్ళు అలా తిట్టుకోకుండా ఇచ్చేసేవాడిని. ఇవన్నీ కాలేజీ కెళ్ళే కుర్రాడిని నేను చెయ్యడం నచ్చక పోయినా, ఎవడైనా కిళ్ళీ అడిగితే బలే హుషారుగా కట్టేవాడిని. అదే మిటాయి కిళ్ళీ అడిగితే ఇరగదీసి లావు కిళ్ళీ కట్టేవాడిని. సరుకులు ఐపోతే పెద్ద  బజార్ కి వెళ్లి ఆకులు, సిగరట్టు తేవాల్సి ఒచ్చేది. వాటితో పాటు  కిళ్ళీ సరుకులు అవసరం లేకపోయినా ఎక్కువ తేవడం లాంటివి చేసేవాడిని. ఎవడైనా మన బడ్డీ కొచ్చి "మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు", అంటే ఇప్పుడు టీవీ లో ఒచ్చే డయరీ మిల్క్ చాక్ యాడ్ లో లాగ "లడ్డూ కావాలా నాయనా?" అన్నట్లు వినిపించేది. ఇంక చూసుకోండి,  మన ప్రతాపం చూపించి (చిలకలు కట్టి నోట్లో పెట్టడం తప్ప) మాంచి కిళ్ళీ కట్టే వాడిని.
ఇప్పటికీ మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ చేస్తే చివర్లో అందరికీ మిటాయి కిళ్ళీ సప్లయ్ మస్ట్ అండ్ షుడ్డు అన్న మాట. నా కిళ్ళీ బడ్డీ అనుభవం చాలా మందికి తెలీదు గానీ లేకపోతే అందరూ "కొన్నారా? మీరే కట్టేరా?" అని అడిగేవాళ్ళు.

26, అక్టోబర్ 2010, మంగళవారం

మా కమ్యూనిటీ బ్లాక్ పార్టీ - 2010

ఏడాది కి ఒకసారి మా కమ్యూనిటీ లో బ్లాక్ పార్టీ చెయ్యడం రివాజు. ఈ సంవత్సరం కూడా చేసారు.   పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.
మూన్ బౌన్సు దగ్గర బారులు తీరిన పిల్లలు. దీనిలో పడి గెంతుతుంటే పిల్లలకి టైం తెలీదు - అలసట గుర్తుకు రాదు.

ఈ ఆటలో చివరికి మిగిలిన వాళ్ళు తప్పకుండా పొట్టి వాళ్ళు అయ్యుంటారు అని నా గట్టి నమ్మకం.
                                               పాట ఆగిందా, నీ ప్లేస్ గోవిందా. మన కుర్చీ ఆటలాంటిదే.
                                                డాన్సు టైం. మకరిన మరియు కొన్ని లేటెస్ట్ పాటలు.
                                                       మా అమ్మాయి రంగేసుకున్న పంప్ కిన్.
మొత్తానికి ఈ శనివారం ప్లాన్ చెయ్యకపోయినా, ఇలా ఎంజాయ్ చేసాము.

25, అక్టోబర్ 2010, సోమవారం

దేశీ గాడికి దేశీ గాడే శత్రువు

"దేశి గాడికి దేశి గాడే శత్రువు" అని అంటే నమ్మాలి మరి. ఉదాహరణకి మీరు అమెరికాలో ఇంటర్వ్యూ కి వెళ్లారు. తెల్ల వాళ్ళు అందరికీ మీరు నచ్చుతారు. ఒక నల్ల వాడు వున్నా, వాడికి కూడా నచ్చుతారు. కానీ అందులో ఒక దేశి - తమిళ్ గాని, తెలుగు గాని, నార్త్ ఇండియన్ గానీ ఉన్నాడంటే, వాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు ఏది రాదో నిరూపించాలని తెగ ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని ఎలాగైనా తిరస్కరించాలి. అదీ వాడి వుద్దేస్సం. ఎందుకంటె వాడికి అక్కడ వున్న వాళ్ళెవరూ పోటీ కాదు, మీకు వుద్యోగం ఒస్తే మీరు పోటీ అవుతారని వాడి భయ్యం. అందుకని మిమ్ములని వాడు మొదట్లోనే తున్చేయ్యాలి. ఇలా దేశి గాళ్ళు చేసే ఇంటర్వ్యూ అంతా నీకేమి ఒచ్చు, ఉద్యోగానికి సరిపోతావా అని చూడకుండా, నీకేమి రాదో కని పెట్టి -నువ్వు పనికి రావని చెప్పడానికి కారణాల కోసం జరుగుతుంది. ఈ జబ్బు మన వాళ్ళకే వుంటుంది.
దీనికి ముఖ్య కారణం అభద్రతా భావం. మనకి మనమే శత్రువులం. అలాగని అవతల మనల్ని ఇంటర్వ్యూ చేసే వాడు పెద్ద ప్రతిభావంతుడు, నిజాయితీ పరుడు అనుకుంటే పొరపాటే. వాడు దొంగ అనుభవాలతో, తక్కువ పరిజ్ఞానం తో ఉద్యోగంలో కొచ్చి - పగలూ రాత్రీ కష్టపడి పని చేసి ఒక రకంగా అక్కడ కొంత స్థిరపడి ఉంటాడు (అందరూ కాదనుకోండి). మీ రాక వాడి ఉనికికి ప్రమాదం, అందుకని వాడు మిమ్మల్ని అంతా త్వరగా రానివ్వడు.
   నేను ఒక్కోసారి గ్రూప్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాతో పాటు ప్రశ్నలు వేసే దేశీలని చూస్తుంటాను. వాళ్ళు ప్రశ్నించే పద్ధతి, నేను నీకంటే గొప్ప- నీకు, ఉద్యోగానికి మధ్య నేను అడ్డు, నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు అన్న తరహాలో వుంటాయి. ఒక సారి అయితే నేను చిర్రెత్తి, "చూడు బాబు. మనం ఇక్కడ జనాలని ఏడిపించి మన ఆధిపత్యం చూపించక్కర్లేదు. వుద్యోగం చెయ్యగలడా? కష్ట పడే మనిషా? అని చూస్తే చాలు" అని చెప్పాల్సొచ్చింది. 
 ఉద్యోగాలలో కూడా ఎక్కువ మంది దేశీలు వుంటే, అక్కడ రాజకీయాలు మొదలు. పక్కవాడి కంటే ముందే మనం పైకి వెళ్ళిపోవాలని ఉండటంలో తప్పులేదు, కానీ  అది దేశి గాడు అయితే అస్సలు తట్టుకోలేరు.
అసలు ఈ జబ్బు మన వాళ్ళలో చాలా ఎక్కువ. మిగిలిన వాళ్ళు అయితే ఒకళ్ళకి ఒకళ్ళు బాగా సాయం చేసుకుంటారు. నేను పని చేసిన కొన్ని కంపెనీ లలో అయితే ITALIANS , RUSSIANS , ఫిల్లిపిన్స్ బాగా వాళ్ళ మనుషులకి సాయం చేసుకుంటారు. పైకి వెళ్ళిన వాడు వాళ్ళ దేసస్తున్ని పైకి తీసుకొచ్చేవాళ్ళు. మన వాళ్ళు మటుకు ఒకడు పైకి వెళ్తుంటే, ఇంకోడు వాడిని కిందకి లాగే ప్రయత్నం చేస్తూంటారు. ఈ విషయంలో మనకన్నా CHINESE చాలా నయం.

మన వాళ్ళలో ఇంకో జబ్బు ఏమిటంటే, ఎవడికి వాడు "నేను ఒచ్చేవరకూ అంతా బానే వుంది, కానీ ఆ తరవాతే ఎవడు పడితే వాడు ఒచ్చేస్తున్నాడు" అనే ధోరణి. మళ్ళీ మనకి లేని గ్రీన్ కార్డు పక్క వాడికి వుంటే కడుపు మంట, మనకంటే ఎక్కువ ఎవడైనా సంపాదిస్తే "ఛాన్స్ కొట్టాడు". అదే మనమైతే మన ప్రతిభ అని, మనం స్పెషల్ అనీ ఫీలింగ్.
మళ్ళీ కులాలు, మతాలు, జిల్లాలు, వర్గాలు, పార్టీలు, ఫాన్స్ ఇవన్నీ మనిషికీ మనిషికీ అడ్డు.  
ఒక్కో సారి నేను అనుకుంటాను గ్లోబల్ డిమాండ్, టెక్నాలజీ బూం, ఔట్సౌర్సింగ్ ఇవన్నీ కలిసొచ్చి, చాలా మందికి నడి మంత్రపు సిరి ఒచ్చింది. అందుకేనేమో ఈ శత్రుత్వాలు. అదే మిగిలిన దేశాల వాళ్ళలాగా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని  శరణార్ధులుగా ఒస్తే కలిసి వుండే వాళ్ళమేమో.
నేను ఒచ్చిన కొత్తలో కొందరు RUSSIANS నా కలీగ్స్, మా ఇంటికి ఒచ్చి కుర్చీలు గట్రా సామాన్లు తెచ్చి పడేసేవాళ్ళు. వాళ్ళు అంతా శరణార్ధులుగా ఇక్కడికి ఒచ్చారు. వాళ్ళు నాకు అన్నీ తెచ్చి ఇస్తుంటే వొద్దని ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. ఒక రోజు అందరినీ కూర్చో బెట్టి, బాబూ నాకు కావాలంటే నేను అన్నీ కొనుక్కోగలను, మీరు ఇవన్నీ ఎవడైనా లేని వాడికి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి ఒచ్చినప్పుడు వాళ్లకి తిండి కూడా లేదుట, తోటి దేశస్తులు దయతో వాడుకున్నవి ఇస్తే వాటితో బతికే వాళ్ళట. ఏది కొనాలన్నా, వాడేసినవి అమ్మే త్రిఫ్ట్ షాప్ లో కొనుక్కునే వాళ్ళట.  నేను అలాగే అనుకుని, వాళ్ళతో కలిసిపోయనని నాకోసం అందరూ ఇలా తలోకటీ అనుకున్నారట. బాబూ! నాకు లేనిది కారు ఒక్కటే, అది కూడా నాలుగు నెలలు జీతం ఒస్తే కొనుకుంటాను, కాబట్టి మీరు నాకు పిక్ అప్, డ్రాప్ అఫ్ మాత్రమే సాయం చెయ్యండని చెప్పాను. పాపం నాకే కాదు, నా స్నేహితులని కూడా పిక్ చేసుకునే వారు. ఇది మన వాళ్ళలో చాలా అరుదుగా జరుగుతుంది అమెరికాలో.
నేనే కాదు, చాలా మందికి జరిగిన అనుభవాలతో అప్పుడప్పుడు అనుకుంటాను "అమెరికాలాంటి దేశాలలో, దేశీ గాడికి దేశీ గాడే శత్రువు - ముఖ్యంగా ఉద్యోగాలలో".  
గమనిక: ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. అందరూ ఇలా వుండరు. మీరు నా టపా చదువుతున్నారు కాబట్టి, మీరు ఆ కోవలోకి చెందరు- అమెరికాలో వున్న సరే.

24, అక్టోబర్ 2010, ఆదివారం

That's OK Daddy.. It's just a dream

ఈ రోజు పొద్దునే నా కూతురు నన్ను నిద్ర లేపి, "డాడీ. I had a bad Dream" అంది. మనం మామూలుగా అన్నీ వినేసి వోదిలేసే టైపు కాదు కదా? అందుకని నిద్ర మత్తులో మంచం దిగకుండానే, ఎప్పటి లాగే "Tell me what happened." అన్నాను. క్లుప్తంగా దాని కల, దాని బాషలో ఇలా.
"నువ్వు, నేను, అమ్మ ఎక్కడికో వెళుతున్నాము అంట. నువ్వేమో కార్ డ్రైవ్ చేస్తున్నావు. నేను అమ్మ కూర్చున్నాము. ఇంతలో ఒక అబ్బాయి ఒచ్చి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. నేను నీకు చెప్పినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు. అలా డ్రైవ్ చేస్తూనే వున్నావు. ఆ అబ్బాయి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. ఆ అబ్బాయి చాలా చెడ్డ అబ్బాయి."


నేనేదో దాన్ని ఊరుకోపెడుతున్నట్లు నిద్ర మత్తులో "పోన్లే తల్లి, నీకు ఇంకో లంచ్ బాక్స్ కొనిపెదతానులే" అన్నాను.
దానికి సమాధానం గా, "That's OK Daddy.. It's just a dream. I still have my lunch box. You don't have to buy me one."
మత్తు ఒదిలి మంచం మీద నించి లేచి కూర్చున్నా. పళ్ళు తోముకుంటూ ఆలోచిస్తు అనుకున్నాను,
 "దీనికి కలకి - వాస్తవానికీ తేడా తెలిసిపోయింది. నాకే ఎప్పుడు ఏ భరోసా ఇవ్వాలో తెలియదు".

23, అక్టోబర్ 2010, శనివారం

బెండకాయలేరే మొగాళ్ళు లోకువ

బెండకాయలేరే మొగాళ్ళు అంటే సాటి మగవాళ్ళకు లోకువ. ఆడవాళ్ళకు అయితే మరి ఇంక చెప్పకర్లేదు. ఆ ఏరేది మొగుడు అయితే కొంచెం రిలీఫ్ అని నేను అనుకుంటున్నాను. అసలు చాలా మంది ఆడవాళ్ళకు వంట వొచ్చిన మగ వాళ్ళతో పెద్ద తంటా. ఈ టాపిక్ మీద మనం మళ్ళీ మరో టపా వేసుకుందాము తరవాత. ఇంతకీ బెండకాయలేరే మొగాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
  అసలు గ్రోసరీ కి లిస్టు రాసుకుని, తీరిగ్గా కూరగాయల షాప్ కి వెళ్లే మగ వాళ్ళు అంటే కొంత మిగిలిన మొగవాళ్ళకు లోకువ. వంట ఆడవాళ్ళ పని అనే వాళ్ళ ఉద్దేశ్యం. నేను పెళ్ళికి ముందు కూడా తీరిగ్గా ఇండియన్ సబ్జీ మండి కి వెళ్లి అన్ని కూరగాయలు తెచ్చేవాడిని. అందులో బెండ కాయలు ఏరడం పెద్ద తంటా, దొండకాయలు తరగటం పెద్ద కడుపు మంట. మా రూమ్మేట్ దొండ కాయలు తరిగేటప్పుడు నన్ను తిట్టుకున్న సందర్భాలు కూడా చాలా వున్నాయి.  కూరల దుకాణంలో కేవలం బెండకాయల దగ్గరే ఎక్కువ రష్ వుంటుంది. ఎందుకంటె మిగిలినవి అన్నీ  గిచ్చో,రక్కో,నొక్కో లేదా రంగుతోనో, రూపంతోనో ఏరి పారేయ్యచ్చు. కానీ ఈ బెండకాయలు మటుకు తోక విరగ్గోట్టాలి. పోనీ పక్క వాడు ఆల్రెడీ విరిచేసిన బెండకాయ మనం యేరుకుంటామా అంటే అదీ కుదరదు. ఎందుకంటె మనం విరిచినప్పుడే టక్కు మనాలి. అదీ మరీ కొసలో, తోక చివరన అయితే ముదురుది ఐనా విరిగిపోతుంది. కాబట్టి ఈ బెండకాయల ఎంపికలో మా చెడ్డ చిక్కు ఉంది. పోనీ ఏదో ఒకటి అని చేతికందినవి తెచ్చి కూర చేసి పారేసామా, ముదురు బెండకాయలతో ఏమి చేసినా అస్సలు బావుండదు.
  అసలే నా కూతురు ఇష్టంగా తినేది ఈ కూర ఒక్కటే. ఇది తప్ప అన్నీ అమెరికన్ కూరగాయల షాప్ లో ఇంచుమించు దొరికేస్తాయి. కనీసం దానికి కూర చెయ్యడానికైనా సరిపడా తేవాలని కక్కుర్తి కొద్దీ దూరం డ్రైవ్ చేసుకుని వెళ్తానా, అక్కడ లేతవన్నీ జనాలు ఎరేసుకున్నాక అడుక్కి వున్నవి మన కంట పడ్డాయంటే - నరక యాతన. అక్కడ సముద్రంలో ముత్యాలు పట్టినట్లు పట్టాలి, పావు గంట తర్వాత చూసుకుంటే పది కూడా దొరకవు. వాటితో కూర చేస్తే నంచుకోడానికే సరిపోవు. పోనీ మన అదృష్టం బావుండీ వాడు కొత్త బాక్స్ తీసి కుమ్మరించాడో, వెంటనే ఒక పది మండి లేడీస్ ఇవి మా ఫింగర్స్ అని వాటి మీద చేతులేసి ఏరుతుంటారు. ముగ్గురు పట్టే ప్లేస్ లో ఆల్రెడీ పది మంది లేడీస్ లేడీ ఫింగెర్స్ ని విరగ్గోడుతుంటే, తోసుకుని నా లాంటి వాడు వెళ్లి, సరిగ్గా కనపడక ఏ లేడీ ఫింగరో పట్టుకుని తోక అనుకుని గోరు విరిచానో, నా పని "దుకాణంలో మద్దెల దరువు - ఇంటి దగ్గర (ఎగిరెగిరి) పసుపు దంపు". అసలే మనకి మొహమాటం, పైగా కొంత మంది ఏరే టప్పుడు "ఈ లెఫ్ట్ నా ఏరియా అక్కడ చెయ్యి పెట్టావో విరిగేది బెండకాయ కాదు" అన్న రేంజ్ లో ఒక లుక్ ఇస్తారు. అందుకని ఒక మూలగా ఎవరికీ తగలకుండా బురదలో మట్టి పిసుక్కునే వాడి లాగ కింద నించి పైకి చేసి కొన్ని లేత బెండకాయలు ఏరే ప్రయత్నం చేస్తానా, ఇంతలో తను యేరు తుంటే దొరకబోయిన వజ్రం మీద నేనేదో మట్టి కప్పేసినట్లు ఇంకొక లేడీ చూస్తుంది. మొగుడు తంతుంటే, తోటి కోడలు వీడియో తీసినట్లు ఎక్కడినించో ఒక మగాడు సెల్ ఫోన్ లో పెళ్ళాంతో మాట్లాడుతూ సంచీలో మూడు గుప్పిళ్ళు బెండకాయలు వేసుకుని ఒక సారి పైకి కిందకి ఊపి (తూకం - ఒక్క ఊపుతో, కంటి చూపుతో లెక్కేసే టైపు లో) "ఆ తీసేసుకున్నా. దొండ కాయలు కావాలా?" అని మాయమైపోతాడు. అప్పుడు పక్కన ఆడవాళ్ళు నాకేసి చూసే చూపుకి లేడీస్ బాత్రూం కెళ్ళిన జెంట్ లాగ వుంటుంది నా పరిస్థితి.
 ఇంతా ఏరి హీరో లా తెచ్చానని అనుకుని రిలీఫ్ గా పట్టి కెళ్ళి మా కార్ట్ లో వేస్తుంటే "అది దానికి ఒక్కదానికే సరిపోతాయి" అని మా ఆవిడ అంటుంటే పంపు దగ్గర నీళ్ళు పట్టే మొగాడికి పెళ్ళాం మీద వచ్చినంత కోపం వొస్తుంది. అదే ఏ మగ  ఫ్రెండ్ తోటో వెళ్తానా, నేను బెండకాయల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఇంక వీడు అరగంటైనా రాడు అని మెల్లిగా బయటకి జారుకుంటాడు.  ఒక పక్క ఏరుతూ, ఇంకో పక్క వాడిని ట్రాక్ చెయ్యడం కాన్ఫరెన్స్ మాట్లుడుతూ కోడింగ్ చేసినంత కష్టం.
అందుకనేనండి నేనంటున్నా "బెండకాయలేరే మొగాళ్ళు అందరికీ లోకువ". ఎవరేమనుకుంటే నాకేంటి, బెండ కాయ వేపుడు అన్నంలో నెయ్యతో కలిపి ముద్దలు పెడుతుంటే నా కూతురు తింటుంటే నాకనిపిస్తుంది, "దీని కోసం వెళ్లే దూరాలు, ఆడవాళ్ళ చూపుల ఘోరాలే కాదు - లేత బెండకాయ చోరీ లాంటి పేపర్లో పడ తగ్గ నేరాలైనా చేసెయ్యచ్చు" అని.  

22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆర్ట్ పీస్ బావుంది. ఎక్కడ కొన్నారు.ఆర్ట్ పీస్ బావుంది. ఎక్కడ కొన్నారు. ఈ మాట చాలా మంది అడిగారు. నిజానిని ఇది అసలు ఆర్ట్ పీసు కాదు. కేవలం ఒక గ్రీటింగ్ కార్డు కొంచెం ఆర్టిస్టిక్ గా తయారు చెయ్యబడ్డది. ఇలాంటివి ఒక పది కొని, వాటికి సరిపడా ఫ్రేం లని మా దగ్గర వున్న IKEA లో తెచ్చి, వాటిలో ఈ గ్రీటింగ్ కార్డు ఇరికించా. ఇప్పుడు డబ్బులకు డబ్బులు మిగులు, మన ఇంటికొచ్చిన జనాలకు మనమేదో ఆర్ట్ పీసు లతో అలంకరించిన గొప్పలు పోవచ్చు.
నా దగ్గర ఇలాంటి తొక్కలో ఐడియాలు చాలా వున్నాయని అప్పుడప్పుడు మా ఆవిడ నిజంగా బోలెడు డబ్బులెట్టి ఏదైనా కొన్నా సరే, నా మీద నమ్మకంతో అది తక్కువకే ఒచ్చిందని గాట్టిగా చెప్పేస్తుంది. ఒక సారి అలాంటి ముద్ర పడ్డాక మనం మటుకు ఎక్కువ పెట్టి ఎందుకు కొంటాం.
అన్నట్లు ఆభరణాల దగ్గర ఈ ఎత్తు  పని చెయ్యదన్దోయ్! కాసులు రాలాల్సిందే. అక్కడ ధగ ధగ, నిగ నిగ లతో పాటు కేరట్ మరియు కరెన్సీ తక్కువైతే ఆభరణానికి, అది తెచ్చిన వాళ్లకి అస్సలు విలువ వుండదు.
ఇది మా ఆర్ట్ పీసు కధ.

21, అక్టోబర్ 2010, గురువారం

మాంచి చందమామ పాట


పాట లింక్:
 ఈ మధ్య మా అమ్మాయికి పాడే చంద మామ పాట బోర్ కొట్టి, ఇంకా ఏమైనా మంచి జోల పాటలు దొరుకుతాయేమో అని వెదుకుతుంటే ఇది కనిపించింది. ఇది హిందీ కాబట్టి మా అమ్మాయికి పెద్దగా నచ్చదులే అని అనుకున్నా. ఇంతలో మా అమ్మాయి నాన్నా, నాకు అది పెట్టు అని కంప్యూటర్ మీద బొమ్మ చూసి అడిగింది. ఒకటి రెండు సార్లు చూసింది. ఇక దీనికి నచ్చింది కదా అని మెల్లిగా పాట అర్ధం చేసుకుని మనం జోల పాట పాడగలమా? అని ప్రయత్నం మొదలు పెట్టా. వినగా, వినగా పాట బావుంది.
ఇది పాత హిందీ సినిమా "వచన్" లోని పాట. ఆషా బొంస్లె పాడింది. మాంచి లాలి పాటగాను, తినిపించేటప్పుడు అలరించ డానికి కూడా ఉపయోగ పడుతుంది.
మీరు పాడుకోవడానికి వీలుగా కింద ఈ పాట లిరిక్స్ ఇస్తున్నాను.

(chandaamaamaa door ke, pue pakaaen boor ke)-2

(aap khaaen thaali men, munne ko den pyaali men)-2
chandaamaamaa door ke, pue pakaaen boor ke
(pyaali gai toot, munnaa gayaa rooth)-2
(laaenge nai pyaaliyaan,bajaa bajaa ke taaliyaan)-2
munne ko manaaenge,ham doodh malaai khaaenge,
chandaamaamaa door ke.....

(udanakhatole baith ke munnaa chandaa ke ghar jaaegaa)-2
taaron ke sang aankh michauli khel ke dil bahalaaegaa
khel kud se jab mere munne kaa dil bhar jaaegaa,
thumak thumak meraa munnaa, vaapas ghar ko aaegaa,
chandaamaamaa door ke.....

******************************************

(चंदामामा दूर के, पुए पकाएं बूर के)-२
(आप खाएं थाली में, मुनने को दें प्याली में)-२
चंदामामा दूर के, पुए पकाएं बूर के

(प्याली गई टूट, मुन्ना गया रूठ)-२
(लाएंगे नई प्यालियाँ,बजा बजा के तालियाँ)-२
मुन्ने को मनाएंगे,हम दूध मलाई खाएंगे,
चंदामामा दूर के.....

(उड़नखटोले बैठ के मुन्ना चंदा के घर जाएगा)-२
तारों के संग आँख मिचौली खेल के दिल बहलाएगा
खेल कूद से जब मेरे मुन्ने का दिल भर जाएगा,
ठुमक ठुमक मेरा मुन्ना, वापस घर को आएगा,
चंदामामा दूर के.....

 Lyrics Courtesy: http://www.lyricsmasti.com/
వీడియో Courtesy : http://www.youtube.com

20, అక్టోబర్ 2010, బుధవారం

కట్టు కధ - స్నానం చెయ్యని కుక్కపిల్ల నోబి

 ఈ మధ్య మా అమ్మాయిని పొద్దున్న నిద్ర లేపడం ఒక ప్రహసనం. అందులో కొన్ని అరుపులు, కేకలు, తన్నులు (మా అమ్మాయి కాలు విసిరితే) , ఏడుపులు లాంటివి సర్వ సాధారణం ఐపోయాయి. నేను కొంచెం పిల్లల పెంపకంలో అరుపులు సహించలేను - అవి నా అరుపులు కాకపోతే అస్సలు భరించలేను. ఆ టైం కి పరిస్థితిని బట్టి ప్రత్యక్షం అయ్యి, ఏదో ఒక లాగ మా అమ్మాయి దృష్టి ఏడుపు నించి తప్పించి ఒక సారి కళ్ళు తిడిచి మొహం కడిగేసి ఒంటి మీద నీళ్ళు పోస్తే ఇంకా మా అమ్మాయి స్వింగ్ లోకి ఒచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో ఇవ్వాళ్ళ మనం చేసిన రోబో వేషాలు చెల్లలేదు. అప్పటికీ వొస్తువులు పట్టి తెచ్చే రోబో, తేలు లాగ కుట్టే రోబో, పాట పాడుతూ డాన్సు చేసే రోబో లాంటి చిన్నెలు చూపించా. దాని ఏడుపు పెరిగింది గానీ తగ్గలేదు. రోబో దిక్కు తోచక బిక్కుమంది. ఇంతలో తట్టిన కట్టు కధే "కుక్క పిల్ల నోబి".
  ఒక ఇంట్లో పిల్లలకి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల దొరికింది. అది వాళ్ళ అమ్మ, నాన్న మాట వినకుండా దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోయింది, అందుకని తప్పి పోయింది. దానికి చాలా భయం వేసి, కూ కూ అని ఏడ్చుకుంటూ రోడ్డు మీద మెల్లగా వెళ్తోంది, వెతుక్కుంటూ. ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చి పిల్లలు ఆడుకుంటారు. అయితే ఇది ఎప్పుడు స్నానం చేయించాలన్నా అసలు చేయించ నివ్వదు. 'బౌ బౌ నో బాత్, బౌ బౌ నో బాత్" అని అరుస్తుంది. ఇక్కడ కొంచెం మిమిక్రీ అవసరం. కుక్క పిల్ల లా అరిస్తే పిల్లల ఏడుపు సగం తగ్గుతుంది, పైగా ఆసక్తి పెరుగుతుంది. అసలు ఇంట్రో లేకుండా కూడా ఈ అరుపుతో స్టొరీ మొదలు పెట్టాల్సిన అవసరం పడచ్చు. ఇంక కధలో కొస్తే, ఆ కుక్కపిల్ల పేరు నోబి, ఎందుకంటె అది "NO BATH BABY " కాబట్టి. (మీకు పేరు నచ్చకపోతే మార్చుకోండి, అంత కంటే బెటర్ పేరు ఆ ఫ్లో లో తట్టలేదు మరి).
ఇలా స్నానం చెయ్యని నోబి ని పిల్లలు పెట్ చెయ్యాలని వున్నా, అది కంపు కుక్క అని (స్టిన్కి), డర్టీ అని పిల్లలు పెట్ చెయ్యరు. ఇంక లాభం లేదని ఒక రోజు అందరూ బలవంతంగా నోబి ని పట్టుకుని స్నానం చేయించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొంచెం సబ్బు, నురుగ, నీళ్ళు మన టాలెంట్ ని సందర్భాన్ని పట్టి ఉపయోగించి నోబి మీద ఇలా పోశారు అని చెప్పి స్నానం చేయిన్చేయ్యాలి.
ఇంతేనా స్టొరీ అయిపోయిందా అని అనుకుంటున్నారా. లేదు, మా అమ్మాయి స్నానం ఐపోయింది. మళ్ళీ అవసరం అయ్యి, పనికి ఒస్తే కధ జరిగిన కధ చెప్పి మళ్ళీ కొనసాగించే అవకాశం రావొచ్చు.
అయినా ఇదేమన్న స్టొరీ సిట్టింగ్ అనుకున్నారా- కధ కంటిన్యూ చెయ్యడానికి. నా కసలే పొద్దున్న తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన   ఎనిమిదింటి ఆఫీసు కాన్ఫరెన్స్ కాల్ టైం అయ్యింది. అది లేక పోతే ఇలాంటి కట్టు కధలు లక్ష చెప్పినా నేను లేవను- మా అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. చిన్నప్పుడు మా నాన్న గారి దెబ్బల కి బయపడి లేచేవాడిని, లేక పోతీ మా నాన్న ఇల్లాంటి కధలు చెప్పలేక ఏం చేసేవారో? పిల్లలని భయపెట్టకుండా పెంచాలంటే కొంచెం కష్టమే మరి.
Image source: blogspot

19, అక్టోబర్ 2010, మంగళవారం

ఆధిపత్యపు పోరు - ఆడపిల్లల జోరు

అభ్యుదయం అని పేరు చెప్పి
అమ్మ నాన్నల కళ్ళు గప్పి

ప్రణయాల పేరు చెప్పి
కట్టుబాట్లని కప్పి పెట్టి

చదువుల పేరు చెప్పి
చాలా దూరం వెళ్లి

పరిణయమనే వల వేసి
పాశ్చాత్య దేశాల్లో పాగా వేసి

ఆడంబరాలకి పోయి
అపహాస్యం అయిపోయి

అహంకారానికి పోయి
అధిపత్యానికి పోరి

అబద్దాలతో నమ్మించి
అందరినీ వంచించి

కాపురాలు కూల్చుకుని
కన్నీరు మిగిల్చి

స్వేచ్చ నిచ్చిన కన్నవాళ్లకు
సంఘం లో పరువు దీసి

కలతల కాపురాల్లో
ఆధిపత్యపు పోరు
దిగిరాని జోరు
నెగ్గుతారు మీరు

జీవిత పయనంలో 
ఒంటరిగా మిగుల్తారు  

కన్న వాళ్ళ పెంపకంలో
ప్రేమ ఇచ్చిన స్వేచ్చ కన్నా
కట్టుబాట్ల నమ్మకంతో
సాంప్రదాయపు పెళ్లి మిన్న
అని నిరూపిస్తూ --
అంకితం: చదువుల పేరుతో ఇల్లు ఒదిలి ఒచ్చి. మనుగడ కోసం పెళ్ళిళ్ళు చేసుకుని, హక్కులే గాని బాధ్యత లెరుగక, అహంకారంతో కాపురాలు కూల్చుకుంటున్నఆడపిల్లలకి. ఆ విషయం తెలియక వెనకేసుకు ఒస్తున్నతల్లి తండ్రులకు.

18, అక్టోబర్ 2010, సోమవారం

కలల పొరలు - Inception

ఈ మధ్యనే Inception సినిమా చూసాను. కలల గురించి ఈ సినిమా చెప్పిన పద్ధతి నాకు చాలా నచ్చింది. అయితే మొదటి సారే అన్నీ ఈ సినిమాలో అర్ధం అవ్వవు. ముఖ్యంగా కలలు, ఆ కలలలో పొరలు మనకి ఎక్కడ ఉన్నామో అర్ధం కాని సందర్భాలు కొన్ని వుంటాయి. మనిషి కలలోకి వెళ్లి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆలోచన బీజం నాటడం అన్నది ఈ సినిమాలో కధాంశం. అయితే అలా నాటే వ్యక్తి తన గతంలో భార్యని కోల్పోయి, ఆ కలలలో బతికిన్చుకుని దానికి బానిస అయిపోతాడు. కధాంశం పక్కన పెడితే ఈ సినిమాలో కలల గురించి చెప్పిన కొన్ని విషయాలు నాకు నచ్చాయి.

 • కలలో వున్నప్పుడు మనకి కల నిజం గానే తోస్తుంది. మెలకువ ఒచ్చాక ఏదో తేడాగా అనిపిస్తుంది.
 • ఒక సందర్బంలో హీరో "ఏనుగుల గురించి ఆలోచించకు. ఇప్పుడేమి ఆలోచిస్తున్నావు" అని అడుగుతాడు. సమాధానం "ఏనుగుల గురించి".
 • కలలో మనిషిని చంపేస్తే అతనికి మెలకువ ఒచ్చేస్తుంది.
 • కల ఎలా మొదలయ్యిందో మనకి గుర్తుండదు. జరుగుతున్న సంఘటన మధ్యలో మనం వున్నట్లు మాత్రమే తెలుస్తుంది.
 • ఒక మనిషి కలల్లో  ఆలోచనలు Subconscious మెమరీ లో కారణంతో కాదు, emotion తో trigger అవుతాయి.
 • ప్రతీ పాజిటివ్ emotion యొక్క reaction negative emotion 
 • ఆలోచన అంటువ్యాధి. బాక్టేరియా, వైరస్, parasite కన్నా నిర్భేద్యమైనది. 
 • కలలలో నీ స్మ్రుతులలోనివి ప్రదేశాలు సృష్టించకు. అవి నిన్ను వెంటాడతాయి.
Image Source: http://www.filmofilia.com

17, అక్టోబర్ 2010, ఆదివారం

బృందావనం - average సినిమా

 రివ్యూ చదివి జనాలు బాగా మోసపోతున్నారు. అమెరికాలో న్యూస్ చానల్స్ లాగ మన దేశం లో సినిమాలని కూడా మనకి వాళ్ళు చెప్పారని చెప్పి చూసి ఇది మంచి సినిమా అనుకోవాలో ఏమిటో? ఇది వరసగా మూడో సినిమా. రోబో సూపర్ హిట్ అన్నారు. రజని ఫాన్స్ ని అడిగితే మాకు నచ్చలేదు అన్నారు. పోనీ సెంటిమెంట్ ఐనా పండిందా అంటే అదీ లేదు. అయినా నాలాంటి సినీ అభిమాని టెక్నికల్ విలువల కోసం, ఐష్ కోసం చూడచ్చు. అది అద్బుతమైన సినిమా అయితే కాదు. దీని ౩.75 /5  rating అనవసరం. ఖలేజా average అన్నారు, కానీ కామెడీ తో అసలు బోర్ కొట్టలేదు. దీనికి ౩/5 ఇచ్చారు. కానీ ఇది సూపర్ హిట్ కాకపోయినా కనీసం హిట్ సినిమా కోవలో వేసుకోవచ్చు. బృందావనం గుడ్ అన్నారు, దీనికి ౩.25 /5 ఇచ్చారు. నాకు మటుకు ఇది average సినిమా అనిపించింది. నిర్మాత గా దిల్ రాజు మీద నమ్మకం పూర్తిగా పోయింది. 
రోబో పాటలు వినగా వినగా నచ్చుతాయి, కొంచెం కొంచెం గా. ఖలేజా లో సదా శివ పాట హై లైట్. బృందావనం లో ఒక్క పాట కూడా బాలేదు. కొన్న CD ఒక సారి విన్న తర్వాత పక్కన పడేసాను. సినిమాలో కూడా కనీసం JR NTR ట్రేడ్ మార్క్ స్టెప్పులు లేవు. మొదటి పాట ఎందుకు ఒచ్చిందో, రెండో పాట ఎందుకు ఒచ్చిందో అసలు అర్ధం కాదు. మూడో పాట locations బావున్నా అసలు స్టెప్స్ లేవు. నాలుగో పాటలో వేయించిన స్టెప్ మొదటి సారి JR NTR ఈ స్టెప్ సరిగ్గా వెయ్యలేకపోయాడనిపించేలా ఉంది.  ఇక పోతే సినిమా మొదటి బాగం ఇంటర్వల్ ఒచ్చేస్తోంది అని కధని కంగారుగా పరిగెత్తించినట్లు వుంటుంది. హీరో మొదట్లో తన స్నేహితుడిని బైక్ మీద కూర్చో పెట్టుకునే స్టంట్ చూస్తూనే ఇంత అవసరమా అనిపిస్తుంది. అక్కడనించి fights ఈ రోజులలో రొటీన్ అనిపించాయి. SOUND లేకుండా కొట్టిన FIGHT అంత అవసరం ఏమిటో తెలియదు. చెట్టు లోకి కత్తి దూసి కోసేసి ఆ తరవాత కూల్చేయ్యడం మరీ అతి.
   డైరెక్టర్ కొన్ని basics ని సరిగా పట్టించుకోలేదని తెలిసిపోతుంది. తన ఇంట్లో ఇరవై మంది ఉంటారని కాజల్ చెప్తుంది, సినిమా అంతా చూసినా పని వాళ్ళతో కలుపుకుని ఇరవై మంది కారు. సమంతా సెకండ్ హాఫ్ లో ఒచ్చినప్పుడు కాజల్ కి చెల్లి అని తెలియకపోవడం చాలా హాస్యాస్పదం. అసలు ఆ అమ్మాయి ప్రస్తావన ఆ కుటుంబాలలో ఎక్కడా రాదు. ఏదో పక్క పక్క వూర్లు రెండు జిల్లాలు కాబట్టి తెలియ లేదని చాలా సింపుల్ గా చెప్తారు, మనం ఏదో రివ్యూ నమ్మి సినేమాకీ ఒచ్చాము కాబట్టి ఏం చెప్పిన చెల్లుతుందని అనుకుంటారో ఏమో. కాజల్ తో JR NTR ప్రేమ ఎలా కలిగిందో మనకి అంత కన్విన్సింగ్ అనిపించదు. అసలు ఒక డైలాగ్ తో ఇంటి అల్లుళ్ళు మారిపోయి, వాళ్ళ మూలంగా బ్రహ్మాజీ మారిపోవడం చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. తనికేళ్ళని, కోటాని సరిగా ఉపయోగించుకోలేదు. పల్లెటూరిలో ఇల్లు, దాని వెనక కొలనులో బాతులు కొంచెం అసహజంగా అనిపించాయి.
హీరో JR NTR కొంచెం జాగ్రత్త పడాలి, ఎందు కంటే ఈ సినిమా తో కొంచెం అతని సెలక్షన్ మీద నమ్మకం తగ్గుతుంది. ఏది బాలేకపోయినా పాటలు, స్టెప్పులు బావుంటే అదుర్స్ లా ఆడేస్తుంది. కామెడీ ఒక మోస్తరుగా ఉంది. ఈ సినిమా మటుకు దసరా హడావిడి మూలంగా ఆడాలి గానీ, నిజం చెప్పాలంటే సినిమా AVERAGE . JR NTR sincere గా నటించాడు, HEROIN లు అందంగా వున్నారు. సినిమా హాలుకి వెళ్లి డబ్బులు పెట్టి చూసే అంశం ఏమీలేదు ఈ సినిమాలో. రెండు నెలలు ఆగితే టీవీ లో చూడచ్చు అనిపించే సినిమా.

16, అక్టోబర్ 2010, శనివారం

రేపొక స్వప్నం- आने वाला कल इक सपना है

आने वाला कल इक सपना है
गुजरा हुआ कल बस अपना है
हम गुजरे कल में रहते है
यादों के सब जुगनू जंगल में रहेते है

వయసులో వున్నప్పుడు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎన్నో సార్లు పాడేవాడిని. ఎప్పుడూ ఈ పాటని హమ్ చేస్తూ వుండే వాడిని. ఒక రోజు కార్ లో పాట విందామని గ్లోవ్ బాక్స్ లో వెతుకుతుంటే పాత కాసేట్ బయట పడింది తవ్వకాలలో. మనం ఒక్కళ్ళమే వున్నాము కాబట్టి మనకి నచ్చిన పాట పెట్టుకునే అవకాశానికి ఆనందిస్తూ ప్లే చేసాను. పాట వింటూ ఆలోచించడం మొదలు పెట్టా. అసలు ఈ పాట నాకు ఎందుకు నచ్చింది అని.
  
ఇప్పుడు దీని అర్ధం తెలుగులో చూద్దాం.

రాబోయే రేపు ఒక స్వప్నం
గతించిన నిన్న నా సొంతం
నేను గడిచిపోయిన నిన్నలో బతుకుతాను
జ్ఞాపకాల మిణుగురులు అన్నీ అడవిలో నివసిస్తూ వుంటాయి

దీనిని కొంచెం ముందుకి వెళ్లి విశ్లేసిస్తే. నేను గతాన్ని పట్టుకుని వేళ్ళాడుతాను, ఎందుకంటే నాకు రేపు ఒక స్వప్నం కాబట్టి , నాకు అది తీరుతుందని నమ్మకం లేదు కాబట్టి అన్నట్లుంది.


వయసులో వున్నప్పుడు మన ఆలోచనలు కొంచెం ఇలా వుంటాయి. ఆ రోజులే బావున్నాయని అనిపిస్తుంది. కొందరికి అయితే బాధ లో వున్న డెప్త్ ఆనందం లో వుండదు. అందుకనే అప్పుడు మనకి నచ్చే స్లో సాంగ్స్ ఎంతో melancholy వున్నవి నచ్చుతాయి. కొంచెం ముందుకెళ్ళి మన తండ్రుల generation చూస్తే వాళ్ళంతా దేవదాసు ప్రేమకి నీరాజనాలు పట్టారు. బొచ్చు కుక్క, మందు బాటిల్ ట్రేడ్ మార్క్ తోటి ఖల్లు ఖల్లు మంటూ కుళ్లిపోతూ దగ్గిన దేవదాసు ప్రేమకి కన్నీళ్ళు పెట్టి కర్చీఫ్లు తడిపేసారు. ఇలాంటివి నచ్చుతాయి, ఇందులో ఒక రకమైన identity వుంటుంది.  నిజం చెప్పాలంటే బాధ, కష్టాలు అనే baggage మనం ఎక్కువ మోస్తాము. అలాంటి విషయంలో మనం ఓదార్పు ద్వారా గుర్తింపు అనో, లేదా ఓదార్పునో అంతర్లీనంగా కోరుకుంటూ ఉంటాము. మందు కొట్టే మగాళ్ళని చూడండి, కిక్కు ఎక్కిన తరవాత వాళ్ళ ప్రవర్తన చూడండి. ఆడవాళ్ళు అయితే ఏడుపుతో ఓదార్పు తెచ్చుకుంటారు.
నిన్నటి జ్ఞాపకాలు ఆనందకరమైనవి అయితే గొడవ లేదు. కానీ ఎలా అవుతాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, థ్రిల్ తీరిన తరవాత దాన్ని నిరంతరం మోసుకుంటూ ఆనందపడే లక్షణం ఉండాలిగా? అలా చెయ్యడంలో అపీల్ లేదు. ప్రేమ సినిమాలు ప్రతీ సంవత్సరం ఎన్నో వొస్తాయి, కానీ అందులో ఎన్ని క్లాసిక్ సినిమాలు అని జనం అనుకుంటారు. ఎన్ని సినిమాలు గుర్తు పెట్టుకుంటారు. అదే ఒక దేవదాసు, ఒక మరో చరిత్ర ఆ తరాలకి చెరగని ముద్ర వేసినా సినిమాలుగా నిలిచిపోయాయి.
అల్లాగే జీవితంలో మనకి నిన్న మిగిల్చినవి చెడు అనుభవాలు అయితే, జ్ఞాపకాల అడవిలో చీకటీ మనలని వెంటాడుతుంది కదూ. ఈ పాట లో ఒక సందేశం ఉంది. అదేంటంటే నిన్నని పట్టుకుని వేలాడే జీవితం, రేపటి స్వప్నాన్ని ఆశిస్తుందేమో కానీ నేటి కర్తవ్యాన్ని మర్చిపోయింది. అలా మర్చిపోయి నిన్నలో బతికే మనస్తత్వం వుందని మరీ మరీ చెప్తోంది. రేపటి స్వప్నం కోసం ప్రయత్నాన్ని పక్కన పడేసి, నిన్నని నెమరు వేస్తోంది.
యుక్త వయసులో ఆ ఆలోచనా విధానానికి అప్పుడు పాట నచ్చినా, ఇప్పుడు మటుకు పాట చెప్పే పాటం తెలిసింది.

15, అక్టోబర్ 2010, శుక్రవారం

చంటి పిల్లల అనారోగ్యం మిమ్ములని కాలు చెయ్యి ఆడనివ్వట్లేదా?

మా అమ్మాయికి చిన్న నలత చేసినా, నాకు కంటి మీద కునుకు వుండదు. అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తాను. డాక్టర్లను కాల్ చేసి, సంప్రదించి విసిగిస్తాను. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సంపాదించి.  మందుల షాప్ లో వున్న అన్ని మందులూ తెచ్చి. నా ఆప్త మిత్రులని - అందులో డాక్టర్ ఐన వాళ్ళని మరీ మరీ ఇబ్బంది పెట్టి- రక రకాల ప్రశ్నలతో వేదిస్తుంటాను. సరే, ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఏది చిన్న అనారోగ్యమో, ఏది కంగారు పడాల్సిన పరిస్థితో మనకి తెలియదు కదా. ఇలాంటి పరిస్థితులలో నేను డాక్టర్ కానందుకు చాలా చింతిస్తాను. నా జీవితంలో నేను ఏదైనా కాలేకపోయాను అనే బాధ ఆ ఒక్క విషయంలోనే అనిపిస్తుంది. మొదట్లో చాలా చిన్న విషయాలకే ఎక్కువ కంగారు పడ్డానని అర్ధం అయ్యింది. మెల్లగా ఒక్కొక్క విషయం గూగుల్ చేసి తెలుసుకుంటూ వున్నాను. అలా చేస్తుంటే ఈ కింద వెబ్ సైట్ కనిపించింది. ఇందులో వున్న చార్ట్ పిల్లల తల్లి తండ్రులకు బాగా ఉపయోగ పడుతుంది. ఇది మనం వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిన పరిస్థితో కాదో తెలుసుకోడానికి ఉపయోగిస్తుంది. కింద ఇవ్వ బడ్డ లింక్ క్లిక్ చేసి చూడండి.

http://familydoctor.org/online/famdocen/home/tools/symptom/504.html

Image source: http://www.picturesof.net/pages/090513-150628-973053.html

Down but not out...

I wrote this blog when I was away from blogging for a while in July'2010.
It's been a while I wrote my last blog. Some how felt afraid to write my thoughts during this long down time (without job for a while). Even though I was fine (it is not me but the people around me) for the first six months, lately it has been a pain to face people who think there is something wrong with me for being out of job for so long.

I keep on thinking about my days without job, they are to some extent unproductive (may be to large extent) to my IT Career, but they are very satisfying. Each day has given me a chance to connect to people that matter most to me. Bringing confidence in people to cope up with their problems and spend more time with my daughter. Started Kumon for my four year old, took her for swimming and piano classes. Had the luxury of waking up late and sending the little one after feeding her breakfast, cooking for her and bringing her back early and feeding her dinner. I know it is odd coming from a dad and my friends make fun of me calling me Mr Pellam. I enjoyed every minute of my down time, took my daughter to places every weekend and did not care if it is 100 or 600 miles. Have been to India, visited families around, watched favorite movies, went for skydiving, chatted long hours with best friends, parents and cousins. For all those that felt sorry I even told them that I am having a blast.

Of course on the flip side, some people whose relationship with me is partially dependent on me having a job and sound finances have changed their behavior. There are people who tried to stay away as they are afraid that if they come near me they might be obligated to help me. Apart from my parents who are always worried about me as all parenst do, the world started to appear differently. I have seen my value (which is not much without my job and financial situation). I tried my best to keep my spirits up as I am enjoying it by doing things like chasing the rainbow with my daughter, flying kite, feeding her, watching movies and reflecting on what's going in my life. In this down time though I was thousands of miles away, I grew closer to some of my friends and relatives, called my parents as often as I wanted to and was never guilty of not spending enough time with my daughter and taking care of family.

I have actually enjoyed my worth when I was down. I am happy when I was down, but I was never out.
Image Source: http://www.insidesocal.com/

14, అక్టోబర్ 2010, గురువారం

భవిష్యత్తులో జగమంత కుటుంబం - ఏకాకి జీవితం, అందరికీ గారంటీ

భవిష్యత్తులో జగమంత కుటుంబం - ఏకాకి జీవితం, అందరికీ గారంటీ. "ఏమిటి బాబు! ఈ పైత్యం. ఏదో సిరివెన్నెల గారు తన కవి హృదయం తో మంచి పాట రాసుకున్నారు అనుకో- దానిని ఇలా అందరికీ ఆపాదించి, వారి భవిష్యత్తు అని నిర్దారించడం ఏమిటి? హన్నా!" అని మీరు గదమాయించడం ఐపోతే, నా పాయింట్ చెపుతా.
జగమంత కుటుంబం - inetrnet లో, ఏకాకి జీవితం - ఇంట్లో. "అద్గదీ. అలా రా! దారికి." అని అనుకున్నారా? ఆలోచించండి, ఈ రోజులలో మనిషి మనిషిని కలిసే అవసరం తగ్గిపోయింది. అందరికీ వ్యక్తిగత స్వేచ్చ, పర్సనల్ స్పేస్ కావాలి. ఒక ఇంట్లో ఎంత మంది మనుషులు వుంటే అన్ని TV లు ఉంటున్నాయి. అంటే ఏ ఇద్దరూ కలిసి ఒకే ప్రోగ్రాం చూడరన్న మాట. ఎంత మంది మనుషులుంటే అన్ని సెల్ ఫోన్ లు ఉంటున్నాయి.  ఎంత మంది వుంటే అన్ని కంపూటర్లు. ఒకళ్ళ కంప్యూటర్ PASSWORD ఇంకోళ్ళకి చెప్పరు. విదేశాలలో అయితే పిల్లలకు కూడా ప్రత్యేక గదులు, వాళ్ళు అవి ఎవ్వరితోటీ షేర్ చేసుకోరు. ఇంటికి చుట్టం ఒస్తే పిల్లలని బతిమాలుకోవాలి, ఈ ఒక్క రోజు నువ్వు మా రూం లో పడుకుని ఒచ్చిన వాళ్లకి రూం ఇయ్యరా అని. అందరూ కలిసి సినిమా కి వెళ్ళే రోజులు పోయాయి. ఈ రోజులలో పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా కంప్యూటర్ మీద ఎక్కడో వున్నఇంకో ఆటగాడుతో ఆడుకుంటారు. అంటే ఆడుకోవడానికి కూడా మనం మనిషిని కలవక్కర్లేదు అన్న మాట. నాకైతే మూడు నెలలు నించి నేను ఇంటి నించి పని చేస్తున్నాను. అంటే వర్క్ ఫ్రం హోం కాంట్రాక్టు అన్నమాట. నాతో పని చేసే ఏ మనిషినీ నేను చూడలేదు, కనీసం ఎలా ఉంటారో కూడా తెలియదు - కానీ మేమంతా ఒకటే టీం మరియు కలిసి పనిచేస్తున్నాము. అంటే  నేను మనుషులతో తక్కువ ఇంటర్నెట్ లో ఎక్కువ గడుపుతున్నాను. ఇంటర్నెట్ లో కెళ్తే నాది జగమంత కుటుంబం. కానీ ఈ అలవాట్లు అన్నీ మనిషికి మనిషి అక్కర్లేదు అని నిరూపిస్తున్నాయి. స్వేచ్చ అలవాటు అయితే ఆ మనిషికి ఇంకో మనిషి పొడ గిట్టదు. ఈ కాలంలో ఇంటికి చుట్టాల్లు ఒస్తే మనకి ఇబ్బంది అనుకునే మనుషులే ఎక్కువ. అత్త  మామ ఇంటికి ఒస్తే తనకి ఇష్టం ఒచ్చిన డ్రెస్ లు వేసుకునే స్వేచ్చ లేదని వాపోయే కోడల్లే అన్ని చోట్లా. అమెరికా లో ఎవరి ఇంటికి మీరు ముందుగా కాల్ చెయ్యకుండా, వెళ్లి ఒక రోజంతా గడిపి రాగలరు చెప్పండి. సరిగ్గా వెదికితే ఒక్కడు వుంటే అదృష్టం. ఇలాంటి అలవాట్లతో జనాల జీవితాలు భవిష్యత్తులో ఏకాంతం అవ్వడం ఖాయం . అందుకనే అంటున్నాను  "భవిష్యత్తులో జగమంత కుటుంబం ఇంటర్నెట్ లో - ఏకాకి జీవితం ఇంట్లో, అందరికీ గారంటీ" అని.

13, అక్టోబర్ 2010, బుధవారం

కొంత మంది యువకులు వృత్తి వల్ల వృద్ధులు


హలో! మాస్టారు. ఎవడినో ఉద్దేశించి రాసానని తెగ కుతూహలంతోటి ఈ టైటిల్ చూసి రెండు నొక్కులు నొక్కారా? మీరు సాఫ్ట్ వేర్  రంగంలో పని చేసే నడి వయస్కులు అయితే, మీలాంటి వాళ్ళ గురించే నండీ ఈ టపా. సాఫ్ట్ వేర్ కాకపోయినా, ముఖ్యంగా మీ జీవన్ భ్రుతికి మీకు కంప్యూటర్ ముందు జీవితమే గతి అయితే మీ లాంటి వాళ్ళ గురించే. అంటే నేను కాదేమోనని అనుకునేరు. నేను కూడా ఒకడినే.
భారతీయులకు చాలా మందికి (ఇప్పటి నడి వయస్కులకు)స్కూల్ రోజులలో కంపూటర్లు లేవు. చాలా కాలేజీ లలో అయితే ఆ రోజులలో కంప్యూటర్ కూడా అందరు టైం పంచుకోవాలి- షేరింగ్ అన్న మాట. కాబట్టి అక్కడి దాక బానే ఉంది, ఆ తరవాత ఒచ్చింది తంటా. ఉద్యోగాలలో మొదట్లో బాగా కష్టపడి వుద్యోగం నిలబెట్టుకోడానికి కంప్యూటర్ ముందు గంటలు గంటలు పని చెయ్యడం మొదలు పెడతారు. ఆ రోజులలో మేము అంతా 14 గంటలు పని చేసేవాళ్ళం. ఇప్పటికీ కొత్త ఉద్యోగస్తులు 12 గంటలు పని చేస్తూ వుంటారు రోజుకి. అలా మొదలు అవుతుంది.

ప్రాజెక్ట్ డెడ్ లైన్ అనీ, ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ అనీ ఒక్కో సారి ఇల్లు కూడా చూడకుండా పని చెయ్యాలి. దీనికి తోడు పక్క వాడు పైకి వెళ్లి పోతున్నాడని- మనకి కడుపు మంట తోటో, బాధ తోటో, మనం కూడా పైకి వెళ్ళాలంటే వాడికంటే ఎక్కువ పని చేసి మన పై ఆఫీసర్ ని మస్కా కొట్టాలి.  ఆ తరవాత అందరూ విదేశాలకు వెళ్లారు మనకి మందలో పరువుపోతోందని అనిపించినందుకో, కొత్తగా కొన్న ఇంటికి అప్పు తీర్చాలని ఆన్-సైట్ లో అయితే నాలుగు రాళ్ళు వెనక వేసుకోవచ్చని, విదేశాలలో వుంటే కట్నం బాగా పలుకుతున్దనో ఎలాగోలా వేరే దేశం చేరతారు. అక్కడ నించి వుద్యోగం లేక పోతీ వేరే దేశం లో బతుకు కుక్క బతుకు అని అర్ధం అవుతుంది. ఇండియా లో ఐనా సాఫ్ట్ వేర్ బతుకులు అలాగే వున్నాయి అనుకోండి. ఆ దెబ్బ తోటి మళ్ళీ విపరీతం గా పని చెయ్యడం. మెల్లగా గూగుల్ కి, ఆన్ లైన్ చాట్ లకీ, వీడియో లకీ, సినిమాలకీ కంప్యూటర్ చూడడానికి అలవాటు పడతారు. తరవాత పెళ్లి జరుగుతుంది, కొత్త పెళ్ళాం మోజులో కొంచెం పని తగ్గించి పెళ్ళాన్ని నాలుగు  ఊరులూ తిప్పి- నాలుగు ప్రదేశాలు చూపించి- నలుగురికి పరిచయం చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేసేటప్పటికి ఒక పాపో బాబో రెడీ. డెలివరీ కోసం ఒచ్చిన అత్తా-మామనో, అమ్మ-నాన్ననో మొక్కుబడికి తిప్పేసి పిల్లాడో/పిల్లో పుట్టాక ఆరు నెలలు అయ్యాక పంపించేశాక వుంటుంది మజా.

అప్పటికి భార్యా భర్తల మధ్య మోజు తగ్గుతుంది. ఆఫీసు లో పని ఒత్తిడితో మొగుడు - ఇంట్లో పని ఒత్తిడితో పెళ్ళాం వుంటారు. ఇద్దరూ పని చేస్తే ఇంక గొడవే లేదు - నా ఉద్దేశ్యం ఇంక గొడవ తప్ప ఏమీ లేదు అని. ఎవరితో ఆడుకోవాలో తెలియక పిల్లలు అమ్మనీ నాన్ననీ వాళ్ళ విపరీతమైన energy (అసలే ఇండియన్ స్టోర్ లో  బూస్ట్, ఆర్గానిక్ పాలతో కలిపి పట్టే అలవాటు కదా మనకి)  తో వెంట పడుతూ వుంటారు. ఇద్దరికీ అపురూపం కాబట్టి పిల్లల మీద కోపాన్ని మోజు తీరిన పెళ్ళాం మీద, పని చెయ్యని మొగుడి మీద వెంటనే కత్తులు దూసి నువ్వంటే నువ్వని గొడవలు మొదలు.
  ఈ సమస్యకి కొంత కారణం చాలా మందికి తొందరగా వోచ్చేస్తున్న వృద్దాప్యం. నిజమే! ఈ రోజుల్లో నలభై కి దగ్గరలోకి రాకుండానే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి నడుం నొప్పి చాలా కామన్ ప్రాబ్లం. కొలస్ట్రాల్ ఎక్కువ వుండడం, diabetes , హై లేదా లో బీపీ మరియు మోకాళ్ళ నొప్పులు చాలా మందికి నలభై లోకి రాకుండానే ఎదురవ్వుతున్నసమస్యలు.  
ఇలాంటి సమస్యలతో పిల్లలతో పరిగెత్తే ఓపికే వుండదు. తీరిక లేకుండా పని చేయడం తో అలసట, ఎక్కువ పని చెయ్యడం తో అనారోగ్యం. ఒకళ్ళతో-ఒకళ్ళు సమయం గడపక పోవటం వల్ల అవగాహన లోపం. నిత్యం గొడవలతో, పని ఒత్తిడి తో మానసిక సమస్యలు. 
ఇవన్నీ కలిసి ఈ సాఫ్ట్ వేర్  వాళ్ళను నేను చెప్పినట్లు "కొంత మంది యువకులు వృత్తి వల్ల వృద్ధులు" అనిపించేలా చేస్తున్నాయి కదూ! ఆలోచించండి..
Image source: http://accomplishvirtualassistant.files.wordpress.com/2010/09/computer-problems.jpg

12, అక్టోబర్ 2010, మంగళవారం

మాకు నచ్చిన ఖలేజా

ఇంటర్నెట్ లో రివ్యూ లు చదివి సినిమాలను ఫాలో అయితే ఈనాడు పేపర్ చదివి "చంద్ర బాబు అంతటి వాడు లేడు"  అని, వార్తా పేపర్ చదివి "YSR దేవుడని" అనుకునే టైపు అన్న మాట మనం. జనాలు రాసినదానికి "పాపం ఖలేజా సినిమా" అనుకున్నాను. సరే అని నలుగురం కలిసి పిల్లలతో వెళ్తే  7 గంటల ఆట, 8  గంటల  ఆట హౌస్ ఫుల్ అన్నాడు. నాకు తెలిసి ఈ దేశం లో ఏ సినేమాకీ నేను హాలుకు వెళ్లి టికెట్ లేదని వెనక్కి రాలేదు. పైగా అప్పటికే సినిమా వొచ్చి మూడు రోజులు అయ్యింది. ఒక సారి సినేమాకీ కమిట్ అయితే నా మాట నేనే వినను, పైగా ఎంతో కొంత మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి మా ఆవిడ అసలు వినదు.  అందుకని కసిగా రాత్రి పదకొండింటికి టికెట్ వుంటే అది తీసుకుని ఎలాగోలా అప్పడి దాకా టైం పాస్ చేసాము. సినిమా మొదలెట్టాడు, చూస్తే ఈ ఆట కూడా ఫుల్ అయ్యింది.
ఇక సినిమా విషయానికి ఒస్తే, హీరో పరిచయం కొంచెం వీక్ గా ఉంది. పైగా ఆ టాక్సీ పాట అంత వర్క్ అవుట్ కాలేదు. కామెడీ మటుకు సినిమా అంతా ఆదరగొట్టింది. ముఖ్యం గా మహేష్ బాబు కామెడీ లో variation కూడా బాగా చూపించాడు. అనుష్క అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. అసల త్రివిక్రమ్ హీరోయిన్ లోని అందాలను ప్రొజెక్ట్ చెయ్యడం కంటే, వాళ్ళల్లో ఏదో ఒకటి పట్టి కామెడీ చేస్తాడు. అతడు లో త్రిషని, జల్సా లో ఇలియానాని మాదిరిగానే ఇందులో అనుష్క పిక్కలని పట్టి కామెడీ పండించాడు. ఈ సినిమా లో అనుష్క కి అసలు స్కోప్ ఎక్కువ లేదు. ముఖ్యం గా చెప్పుకోవాల్సింది సినిమాలో visuals. సినిమాటోగ్రఫీ అదిరింది. సినిమా అంతా అలా అద్భుతంగా తీయాలంటే చాలా creativity వుండాలి.
ఈ సినిమాలో ఇంకో హైలైట్ "సదాశివ" అనే పాట. Fights బానే వున్నాయి. నటనలో రావు రమేష్ టాలెంట్ చూపించాడు. ఈ సినిమాలో షఫీ కొంగ లాగ నిలబడి ఇంచు మించు మహేష్ ఉన్నంత సేపూ స్క్రీన్ మీద ఉంటాడు. చాల sincere గా నటించాడు. నాకు భలే నచ్చాడు.
ఈ సినిమా మొదటి సారు హైప్ మూలంగా, కొంచెం రివ్యూ లా మూలంగా నష్టపోతుంది. కానీ నేను, నాతోపాటు చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చింది. ఈ సినిమా డైలాగ్ లు జనాలకి చాలా ఏళ్ళు బాగా గుర్తుండిపోతాయి. ఒక విదంగా ఇది రోబో కన్నా బెటర్ సినిమా. కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. మహేష్ ఎప్పుడూ లేనంత అందంగా వున్నాడు.costumes అయితే చింపెసాడు. ఈ సినిమాని మళ్ళీ, మళ్ళీ చూడచ్చు.
అసలు జనాలు సినిమాని చూసే పద్ధతి మారిపోయింది. తను పెట్టే డబ్బులు గిట్టుబాటు అవుతాయా, లేదా అనే ఆలోచనతో ముందుగా reviews మీద ఆధార పడుతున్నారు. వీళ్ళని కొనేస్తే మనం సినిమా చూడాలా, వొద్దా అనే నిర్ణయం మనం వాళ్ళ చేతిలో పెట్టేసినట్లు. నాకు మటుకు డైరెక్టర్ మీద నాకున్న అభిప్రాయం తో, నాకున్న నమ్మకం మీద సినిమా చూడడం ఇష్టం. ఆ పైన కొంత మంది హీరో ల సెలక్షన్ ని బట్టి లేదా, మరీ ఎంచుకుని సినిమా తీసే నిర్మాతని బట్టి సినిమా చూస్తాను. ఇవి కాక జనాలు నచ్చిందని చెప్తే కొత్తవి ప్రయత్నిస్తా. ఇంగ్లీష్ మరియు హిందీ సినిమాలని పూర్తిగా జనాల రివ్యూ మీద, అది కూడా చెప్పేవాడు ఎలాంటి వాడు అన్న దాన్ని బట్టి చూస్తా. కులాన్ని బట్టి, హీరో మీద అభిమానాన్ని బట్టి రివ్యూ ఇచ్చే వాళ్ళు చెప్పినా అది నా రిస్క్ మీదే చూస్తా.
అసలు మన వినోదం ఏ సినిమా లో దొరుకుతుంది అన్న విషయం మీద మనకి అవగాహన వుండాలి- మనం సినిమాలని ఎంజాయ్ చేసే టైపు అయితే.  అలాగని అన్ని సినిమాలు వర్క్ అవుట్ అవ్వవు. డబ్బుకి అమ్ముడు పోయి రివ్యూ rating ల ద్వారా మనం చూడాల్సిన సినిమాలని కూడా మిస్ అవుతున్నామేమో అని నా అనుమానం. Idlbrain అనే వెబ్సైటు ఒకప్పుడు బానే వుండేది. కానీ కొన్నాళ్ళు అయ్యాక ఏ హీరో కి ఎలాంటి rating ఇస్తాడో అని అందరికీ అర్ధం ఐపోయింది. జనాలు నమ్మడం మానేశారు ఆ రివ్యూ లని. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే,  జనాలు మనలో నమ్ముకున్నది మనం అమ్ముకోకూడదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే మాకు నచ్చింది ఖలేజా. కొంత మంచి -ఎంతో హాస్యం. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుడివి అని ఊరంతా తన మీద పెట్టిన నమ్మకాన్ని, తను నమ్మకపోయినా వాళ్ళ మంచి కోసం ప్రయత్నించిన హీరో వాళ్ళ నమ్మకాన్ని  నిలబెట్టడం నచ్చింది. కుదిరితే మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

Image taken from: http://telugu-latestmovies.blogspot.com/

11, అక్టోబర్ 2010, సోమవారం

యువరాణి గారి ఏడు చేపలు ఏడుస్తుంటే WALMART కి పంపారు

మీరు చిన్నప్పుడు "అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. వాళ్ళు వేట కెళ్ళి ఏడు చేపలు తెచ్చారు." అన్న కధ విన్నారు కదా! ఇదీ అలాంటిదే, కాకపోతే ఇక్కడ రాజు గారికి ఒక కూతురు. ఆ తర్వాత కధ రాజు గారి చెప్పింది చదవండి.

మా అమ్మాయి నాకు పెంచుకోడానికి ఏదో ఒక పెట్ కావాలి, అని ఎప్పుడూ అడుగుతూ వుంటుంది. కుక్కనో, పిల్లినో పెంచే స్తోమత, ఓపిక మనకి లేవు. ఒక వేళ కూతురు మీద ప్రేమ కొద్దీ రెండూ తెచ్చుకుని కొన్నాసరే, మనం వూరు వదిలి వెళ్ళేటప్పుడు దాని బాధ్యత ఎవరో ఒకరికి అప్పచెప్పాలి.   మనం సెలవ దొరికితే రోడ్డెక్కి తిరిగే టైపు. ఇలా లాభం లేదని దీనికి ఈ సారి పుట్టిన రోజుకి ఏదో ఒకటి కొనాలి అని చెప్పి బాగా ఆలోచించి చేపల మీద డిసైడ్ అయ్యాను.
  ఇంతలో నా causin ఇంటి కొచ్చినప్పుడు, "అన్నయ్యా! దాని కోసం ఏదైనా కొంటాను. ఏం కొనాలో చెప్పు" అని అడుగుతుంటే ఒక ఆలోచన ఒచ్చింది. "నేను aquarium కొంటాను, నువ్వు చేపలు కొను" అని చెప్పాను. సరే అని ఇద్దరం నా కూతురు పడుకున్నాక WALMART కి బయలుదేరాం. అసలు చేపలు గురించి నాకు ఏమి తెలీదు, నాతో పాటూ వున్న causin కి నాకంటే తక్కువ తెలుసు. ఇంటి దగ్గర నేను కొంచం GOOGLE చేసి సమాచారం సంపాదించాను. ఈ విషయం వాడికి తెలియదు కాబట్టి నేను కొంచం కొంచం చెపుతుంటే వాడు నాకేసి గొప్పగా చూస్తున్నాడు. మనం కూడా "మరి చేపల పెంపకం అంటే మాటలా?" అని చేపల చెరువు మేనేజ్ చేసే వాడి రేంజ్ లో బిల్డ్ అప్ ఇచ్చాను.
   అక్కడకి వెళ్ళాక అర్ధం అయ్యింది, మనకి తెలిసుంది గోరంత -తెలియంది కొండంత అని. అక్కడ పని చేసే వాడి కోసం కబురెట్టి మరీ ఒకడిని పట్టుకున్నాము. వాడొక అయోమయం జగన్నాధం. వాడి అరా కొరా జ్ఞానం తో మా చేత ఒక AQUARIUM  తో పాటు వాడు ఏడు చేపలు, ఒక నత్త, దాని ఆహారం, ఒక వల గరిటె, కొన్ని రాళ్ళు కొనిపించాడు. రంగులు బావున్నై కదా అని ఏ చేప పడితే ఆ చేప తీసుకో కూడదండోయ్. చేపలలో కూడా కొన్ని గుంపులుగా మాత్రమే బతుకుతాయని, కొన్ని వేరే చేపలని తినేస్తాయని, కొన్ని నాచు తిని బతికేస్తాయని నాకు అప్పుడే తెలిసింది. పైగా చేప రకాన్ని బట్టి AQUARIUM ఉష్ణోగ్రత ఎంత ఉండాలో కూడా రాసారు. చేపలని ఒక ప్లాస్టిక్ కవర్ లో నీళ్లల్లో పెట్టి ఇచ్చి, ఇది ఎక్కువ సేపు ఇలా బతకదు అని చెప్పి మరీ కవర్ కి ముడేసాడు మా అయోమయం జగన్నాధం. చేపల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మా కళ్ళు పత్తి కాయల్లా పటేల్ మని విచ్చుకున్నై. అలా విచ్చుకున్న కళ్ళతో ఇంటికొచ్చి, రాత్రి పన్నెండు ఐనా నిద్ర ఆపుకుని, చేపలు చచ్చిపోతాయని టెన్షన్ తో అప్పటికప్పుడు ఫిక్స్ చేసాము.
 పొద్దున్న లేచి aquarium చూసిన యువరాణి (నా కూతురు) కళ్ళల్లో ఆనందము చూసి, కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది. One week ok, second week started trouble. ఆ చేపలలో ఒక చేప చచ్చిపోయింది. దాన్ని చూసి నా కూతురు ఎందుకు అలా ఐపోయింది అని అడగడం మొదలు పెట్టింది. దానికి తెలియకుండా ఒక రాత్రి చేపని తీసేసి, అప్పటికప్పుడు WALMART కి వెళ్లి ఇంకోటి పట్టుకొచ్చా. కొంచెం రంగు తేడా వున్నా, దానికి పెద్ద తెలియలేదు. తరవాత నాలుగు రోజులకి, రెండు చేపలు చచ్చిపోయాయి. ఈ సారి మళ్ళీ WALMART కెళ్తే ఆ చేపలు స్టాక్ లేవు. రెండు మూడు చోట్ల వెదికినా దొరకలేదు. అప్పటికి దానికి పూర్తిగా అంకెలు తెలీదు కాబట్టి లోపల దాక్కునాయని చెప్పి మేనేజ్ చేశా. ఇంతలో కొన్ని చిన్న చేపలు కనిపించాయి aquarium లో. అందంగా ముద్దుగా వున్న ఆ చేపలు చూసి మేము మురిసిపోతుంటే అవన్నీ రెండు రోజులకే మాయం ఐపోయాయి. ఒక్క చేప తప్ప మిగిలిన చేపలు వారానికి మించి బతకట్లేదు. రెండు మూడు సార్లు చేపలు WALMART నించి తెచ్చాక, ఇక లాభం లేదని చేపల జాతులు రాసుకొచ్చి గూగుల్ చేశా.  పరిశోధన చేసాక తెలిసింది మిగులుతున్న చేప అన్నిటినీ చంపేస్తోందని.

ఇలా చేస్తే చేపలకి నా pay చెక్ సరిపోదని అర్ధం అయ్యి ఒక ఐడియా వేసా. మరీ చిన్నపిల్లకి చేప చావు గురించి చెప్పడం ఎందుకని, మన చేపలు వాళ్ళ ఫ్యామిలీ మీద బెంగ పెట్టుకునాయని WALMART లో దిన్చేసానని చెప్పా. ఆ తర్వాత WALMART కి వెళ్ళిన ప్రతీ సారి దాని చేపలని పలకరిస్తుంది. అదండీ మా చేపల కధ. మీరు ఎప్పుడైనా WALMART కి వెళ్తే చూడండి మా ఏడు చేపలు ఇంకా అక్కడే వున్నాయి. నత్త మటుకు ఇంకా అలాగే ఉంది. Aquarium దాని కోసమే కొన్నట్లు.
రెండు వారాల తరవాత నా కూతురు ఇంటి కొచ్చి "నాన్న మా డే కేర్ లో చేప చచ్చిపోయింది ఇవ్వాళ" అని చెప్పింది. గతుక్కుమని నేను, "మరి మీరు ఏం చేసారు" అని అడిగాను. "గొయ్యి తవ్వి, పాతి పెట్టి, PRAY చేసాము" అని చెప్పింది. అప్పుడు మహారాణి వారు రాజు గారి కేసి చూసిన చూపులకి  అర్ధం వెతికితే -"ఈ మాత్రం దానికి ఇన్ని డబ్బులు దూల తీర్చాడు, ముందు వీడిని గొయ్యి తీసి పాతెయ్యాలి" అని బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ వినిపించింది.

10, అక్టోబర్ 2010, ఆదివారం

సిల్లీ బాండ్స్


ఈ మధ్య పిల్లలలో బాగా డిమాండ్ వున్న వొస్తువు. వీటి కోసం చాలా స్కూల్ లలో పిల్లల మధ్య గొడవలు అవుతున్నాయని చాలా చోట్ల చదివాను. వీటిని స్కూల్ లకి పిల్లలు తీసుకు రాకూడదని, వీటి పైన నిషేధం విధించిన స్కూల్స్ కూడా వున్నాయి. వీటి డిమాండ్ తట్టుకోలేనంత వుందని వార్తలు ఒచ్చాయి. నేనే స్వయంగా నా కూతురికి మూడు సార్లు కొనిపెట్టాను. మొదటి సారి అది అడిగినప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలీక చాలా చోట్ల అడిగాను. కొన్ని చోట్ల స్టాక్ లేదని చెప్పారు.
  వీటి ధర కొంచెం ఎక్కువే వుండేది మొదట్లో. నేను నాలుగున్నర డాలర్లు పెట్టి కొన్నట్లు గుర్తు. ఇప్పుడు రెండు డాలర్లకు కూడా దొరుకుతున్నాయి. మొదటి సారి పైన చూపించిన జంతువుల సిల్లీ బాండ్స్ కొనుక్కుంది. ఆ తరవాత princess సిల్లీ బాండ్స్ నాకు లేవు అని పట్టు పట్టి మరీ కొనుక్కుంది. ఇంకో సారి ఇలాగే కౌంటర్ లో డబ్బులు కడుతుంటే మధ్యలో ఈ ఐటెం కనిపించింది. ఇంక కౌంటర్ దగ్గర గొడవ ఎందుకని కొని పెట్టాను.
అప్పుడప్పుడు ఇలాంటి వొస్తువు ఒకటి కనిపెట్టి పిల్లల్లో బాగా CRAZE తీసుకొచ్చి అమ్ముకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటాను.
కాకపోతే కొనేటప్పుడు నాలాంటి ప్రతీ తండ్రీ పిల్లల మీద ప్రేమతో ఏమీ అనలేక కనిపెట్టిన వాడిన అడ్డమైన బూతులు తిడతారనుకోండి.

Picture taken from http://www.youthbeat.com/Portals/33268/images/silly%20bandz.jpg

9, అక్టోబర్ 2010, శనివారం

మా అమ్మాయి లంచ్ బాక్స్ సమస్య

మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకో పెద్ద సమస్యగా తయ్యారయ్యింది. రోజూ పట్టుకెల్లింది పట్టుకెల్లినట్లు వెనక్కి ఒచ్చేస్తుంది. ఒక్కో రోజు అది తినలేదని తెలిసినా మేము ఇంట్లో పెట్టినట్లుగా, వెనకబడి తినిపించమని అంటామేమో అన్న అనుమానంతో కాబోలు వాళ్ళు డబ్బా కడిగేసి పంపుతున్నారు.
పోనీ అది మామూలుగా ఇంటి దగ్గర తినే అన్నము, కూరలతోనో, పప్పుతోనో పెట్టి పంపిందామని అనుకుంటాము. రేపు నీకు నచ్చిన కూర పెట్టనా? అని దాన్ని అడిగితే ఆలోచించకుండానే ఒద్దంటుంది. ఇంతా చేస్తే దీని వయసు నాలుగున్నరే. నేను అయితే తొమ్మిదో తరగతిలో కూడా ఎండి పోయిన పప్పన్నం పెట్టినా సరే, మనసులో తిట్టుకుంటూ తినేసేవాడిని. ఒక్కో సారి అయితే మా అమ్మ తరవాణి అని చెప్పి రాత్రి అన్నంలో పాలు వేసి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి డబ్బాలో తోడు పెట్టి ఇస్తే, పక్కన ఆవకాయ నంచుకుని లంచ్ లో తినేసిన సందర్భాలు నా ఇంటర్మీడియట్ దాకా వున్నాయి. పోనీ నీకు నచ్చినవేంటి అని అడిగితే అది పెద్ద ఆరిందాలా "మీట్ బాల్స్ అనీ, హాట్ డాగ్ అనీ, చికెన్ అనీ" చెప్తూంటుంది. నేనేమో మాంసాహారం వీలైనంత మటుకూ తినకూదడనే నియమం వున్న వాడిని, దానికి అయితే కనీసం గుడ్డు కూడా పడదు. అప్పటికీ దానికోసం మంచురియా ని మీట్ బాల్స్ గానూ, మీల్ మేకర్ ని చికెన్ గానూ, మాంసం లేని హాట్ డాగ్ లనీ ట్రై చేసాము. అవేవీ దానికి రుచించలేదు.
 ఇదే విషయం చాలా మంది తల్లులు ప్రస్తావించడం పార్టీ లలో చూసాను.  భారత దేశం లో అయితే పరవాలేదు, కానీ విదేశాలలో అయితే, తోటి పిల్లలు వెక్కిరిస్తారని పిల్లలు లంచ్ లో అన్నం పెడితే తినకుండా తెచ్చేస్తారు. పిల్లల దాకా ఎందుకు, చాలా మంది పెద్ద వాళ్ళు వేడి చేసేటప్పుడు మైక్రో-వేవు దగ్గర, డబ్బా డెస్క్ దగ్గర తీసి తినేటప్పుడూ పక్క వాళ్ళు కంపు అంటారని మన కూరలు ఆఫీసు కి పట్టుకెల్లరు. ఎవడో నాలాంటి వాడు అయితే గానీ. నేను అయితే ఆఫీసు లో రెండు పచ్చడులు, రెండు పొడులు పెట్టుకుని మరీ లంచ్ లాగించేవాడిని. ఎవడైనా వెక్కిరిస్తే దీనికోసమేరా ఆ కొలంబస్ గాడు మీ దేశాన్ని కనిపెట్టాడు అని SPICE ల గురించి నైస్ గా క్లాసు పీకేస్తాను. అంత కంటే ఎక్కువ మాట్లాడితే నువ్వు తిన్న SALMON కంపు కన్నా ఇది బెటర్ అని కూడా అంటాను. వీడి నోట్లో నోరు ఎందుకు మనకసలే SPICY పడదు అని ఊరుకుంటారు.

నాకైతే ఒకటి అర్ధం అయ్యింది నా చిన్నప్పటి అలవాటుని బట్టి - ఏదైనా పొడిగా వున్న ఐటెం అయితే బావుంటుంది. మా అమ్మాయికి దోశ అంటే బాగా ఇష్టం- దాన్ని వారానికి రెండు సార్లు పెట్టచ్చు. దాని మధ్యలో ఒక సారి మకరోని పాస్తా (మకారోని) ఇంకోసారి సేమ్య ఉప్మా పెట్టి నడిపిస్తాము. శుక్ర వారం ఎలాగో వాళ్ళు పిజ్జా పెడతారు, మనం డబ్బులు కడితే.

ఇలాంటి సమస్య చాలా మందికి ఒచ్చి వుంటుంది కాబట్టి, మీకు తెలిసిన పొడి ఐటెం లంచ్ కి పంపగలిగేలా వున్నది సలహా ఇస్తే మీ బ్లాగ్గులో కామెంట్ కొట్టి ఋణం తీర్చుకుంటా. మా అమ్మాయి ఉప్మా,ఇడ్లి లు పెద్దగా తినదు. ముఖ్యంగా శాఖాహారం అయ్యుండాలి - లేకపోతే వాళ్ళ నాన్న ఒప్పుకోడు.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

క్లిక్ అవ్వని Kaleidoscope


ఎంతో కష్టపడి, విపరీతమైన Inquiry  చేసి మా అమ్మాయి నాలుగో పుట్టిన రోజు కోసం  Kaleidoscope అమజాన్ లో ఆర్డర్ ఇచ్చా. పైగా దానికి హైప్ సృష్టించి (మా అమ్మాయికి ఇంట్రెస్ట్ కలగడానికి) , అందమైన ప్యాకింగ్ చేయించి మరీ ఇంటికి తెప్పించాను. దీని కోసం నేను చిన్నప్పుడు ఎన్ని పాట్లు పడే  వాడినో!. అట్ట ముక్కలు కత్తిరించి, ఎక్కడినించో ఒక గొట్టం సంపాదించి, గాజు ముక్కలు, పూసలు లాంటివి అన్నీ ఏరుకొచ్చి, ఒక వైపు మైదాతో అతికించి.. చచ్చీ చెడీ తయారు చేసుకునేవాళ్ళం. దానిలోంచి ఒక కన్ను మూసి చూసుకుని మరీ మరీ మురిసిపోయి గడిపేసేవాళ్ళం . దానికి పైన అందంగా కనిపించడానికి రంగు రంగుల కాయితాలు అతికించి. దానిని ఒక నావికుడు telescope లాగ మోసుకుని తిరుగుతూ ఉండేవాడిని.
ఇంత కష్టపడి తెప్పించిన kaleidoscope మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకున్నాను. దాని చేతే గిఫ్ట్ wrap చింపించి, Kaleidoscope బయటకు తీయించాను. దానికి పెద్దగా అర్ధం కాలేదు. అందులో చూడమని చెప్పా, అది రెండో కన్ను కూడా తెరిచే చూసింది. ఇలా కాదు అని చెప్పి, ఒక కన్ను నా చేత్తో అడ్డు పెట్టి చూడమని చెప్పా. దానికి పెద్దగా నచ్చినట్లు లేదు. కాసేపు ఆడింది అంతే, ఆ తరవాత పక్కన పడేసింది. నా ప్రాణం ఉస్సూరు మంది. దానికి తోడు అందులో వున్న beads కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇంక ఇది పగలగోట్టేస్తుందని అర్ధమయ్యి, దాని చేతిలోంచి లాగేసుకుని నేను ఆడుకోడం మొదలెట్టా.
ఇదంతా చూసిన మా ఆవిడ "దాని పేరుతో నీ మోజు ఇలా తీర్చుకుంటూ వున్నావు కదూ? నిజం చెప్పు?" అని నిలదీసేటప్పటికి, ఏం చెప్పాలో తెలియని నా మొహం లో Kaleidoscope లో లేని రంగులు కనిపించాయి. ఏం చేస్తాము? ఎలాగో దొరికిపొయాము కదా అని ఒక కన్ను మూసుకుని Kaleidoscope లోకి చూస్తూ మైమరిచిపోయా. నిజం చెప్పద్దూ! పిల్లల ముచ్చట తీర్చే ప్రయత్నంలో అప్పుడప్పుడు మన మోజు కూడా తీరుతుంటే మనకీ బావుంటుంది.

 గిఫ్ట్ గా క్లిక్ అవ్వకపోతేనేం, kaleidoscope నాకు వర్క్ అవుట్ అయ్యింది.

7, అక్టోబర్ 2010, గురువారం

నేనింతే అంటే - అంత పొగరా?

నా బ్లాగ్గుకి ఈ టైటిల్ పెట్టాక, నన్ను రక రకాల ప్రశ్నలు వేసారు - టైటిల్ గురించి. అందులో కొన్ని
 1. పూరీ సినిమా టైటిల్ అని పెట్టావా? 
 2. నువ్వు రవి తేజ అని ఫీలింగా?
 3. నేనింతే ఏం పీక్కుంటారు అనా?
 4. పోకిరి టైపు "నేనింతే ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినననా?
 5. నా ఇష్టం అని చెప్పడానికా?
ఇలాంటి ప్రశ్నలు ఒచ్చాయి. కానీ ఈ టైటిల్ పెట్టినప్పుడు పైన చెప్పినవేవీ అనుకుని నేను పెట్టలేదు.
"నేనింతే" అని రక రకాల expression లతో చెప్పవచ్చు. నా ఉద్దేశం మటుకు నేను నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం లో రాసే ఆలోచనలు, కవితలు, అనుభవాలు అన్న మాట.

మనము పుట్టి, బుద్ధి ఎరిగాక మనకు ఎన్నో రకాల సందేహాలు వుంటాయి. చిన్నప్పుడు అన్నీ మనం అర్ధం చేసుకోకపోయినా అమ్మ చెప్పిందనో, నాన్న తిడతాడు అనో, టీచర్ కొడతాడు అనో చేస్తాము. కేవలం భయము, భక్తి లాంటి వాటి వల్ల అన్న మాట. కానీ మన మనసులో దేవుడి గురించి, దెయ్యం గురించి, పూజ గురించి, ఆచారాల గురించి, అలవాట్ల గురించి, సంప్రదాయం గురించీ, అంటరాని తనం గురించీ, చీకటీ గురించీ ఎన్నో అనుమానాలు- భయాలు వుంటాయి. ఆ తరవాత బడి లో చదువుల ప్రవాహం, స్నేహితుల ప్రభావం, పరీక్షలు - ఇవన్నీ పోటీ ప్రపంచంలో మనకి తెలియకుండా గడిచిపోతాయి. మనం ఏమి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అని ఆలోచించం. ఆలోచించినా ఎందుకు చెయ్యాలి అని ఎవ్వరినీ ప్రశ్నించం.   

తరవాత వయసు, శారీరక మార్పులు, ఆకర్షణలు, ప్రేమలు, అలవాట్లు, మత్తులు ఇలాంటి కొన్ని అనుభవాల తో యవ్వనం గట్తెకిస్తాము. మనం మనకి గీయబడిన హద్దుల గీతలని మన శక్తి, తెగింపు, అవకాశం బట్టి మనకొచ్చే థ్రిల్ కోసం దాటాలని ప్రయత్నిస్తాం. అప్పుడు మనకు కొన్ని చెడు అనుభవాలు, చెప్పుకోలేని చరిత్రలు, చెడు మిగిల్చిన జ్ఞాపకాలు కొన్ని తీపి గుర్తులతో పాటూ మనసులో ఉండిపోతాయి. తరవాత మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ నించీ అప్పటిదాకా ఇంటికి, బడికి పరిమితమైన ప్రపంచం ఒక్క సారిగా విస్తరిస్తుంది. ఇంక గుర్తింపు కోసం తపన నిరంతరంగా సాగుతూ వుంటుంది. ఉద్యోగాలు, ప్రమోషన్, పెళ్లి, ఇల్లు, పిల్లలు, కారు ఇవన్నీ కూడా మనం కోరుకునే వృత్తాలలో ( CIRCLES) ఒకడిగా గుర్తింప బడడానికి చేసే కృషే. 
ఆ విధంగా కొన్నేళ్ళు గడిచాక మెదడు తొలుస్తూ వుంటుంది. తిండికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, వుద్యోగం ఉంది, పెళ్ళాం పిల్లలు వున్నారు అయినా ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. మన చుట్టూ వున్న అన్నిట్లోనూ వెలితి అనిపిస్తుంది, అందర్లోనూ సమస్యలే కనిపిస్తాయి. సర్డుకుపోవాలని అర్ధం అవుతుంది. జీవితం ఇంతేనా! అని నిర్లిప్తత.

అలాంటప్పుడు కొంత మంది తనలో తాను చూసుకుంటారు. అసలు నేను ఏమిటి? అనే ప్రశ్న మొదలవుతుంది.  అప్పుడు తనని తాను నిజాయితీగా తెలుసుకోవాలి. అంటే తన బలాలు ఏమిటి? బలహీనతలు ఏమిటి? ఏది ముఖ్యం? ఏది ఆనందాన్నిస్తుంది? తన లక్షణాలు ఏమిటి? తను దేనినించి పారిపోతున్నాడు? ఇలా ఆలోచించి "నేనింతే!" అని సంతృప్తి పడాలి.
అంటే తనతో తాను నిజాయితీగా ఉండగలగడం. అలాంటి సంతృప్తి మనిషికి కలిగితే, మనం మనకి ముసుగు వేసుకోడం మానేస్తాము. అంటే మనం తప్పు చేస్తే సమర్ధించం (మన మనసులో) , లోకం కోసం ముసుగు వేసుకున్నా- మన నించి మనం తప్పించుకోము అన్న మాట. ఈ స్టేజి కి రాకపోతే కొంత అలవాట్లకు బానిస అవుతాము.

అల్లాంటి సంతృప్తి తో మొదలు పెట్టాను కాబట్టి "నేనింతే" అని టైటిల్ పెట్టుకున్నాను. మనం మనకి బాగా అర్ధం అయ్యాక, మనకి ప్రపంచం మీద కోపం తగ్గుతుంది. మనకి పక్క మనుషులు కూడా అర్ధం అవుతారు. అదన్న మాట "నేనింతే" అన్న టైటిల్ వెనక కధ.

6, అక్టోబర్ 2010, బుధవారం

నాకు బాగా నచ్చిన పటం

ఎలా ఉంది ఈ పటం. ఇది నేను ఒక సారి భుబనేశ్వర్ వెళ్లి నప్పుడు అక్కడ ఒక exhibition లో కొన్నాను. చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. ధర కూడా పెద్ద ఎక్కువ కాదు. ఐదు వందలకు మించి పెట్టినట్లు లేను. నేను సాధారణంగా వేలకు వేలు పెట్టి ఆర్ట్ పీసులు కొనే టైపు కాదు. అంటే నాకు కళల పట్ల అభిమానం లేదని కాదు, కొనే కెపాసిటీ లేదనుకోండి. కానీ ఏదైనా అందంగా అనిపించి అందుబాటు ధరలో వుంటే అందుకోడానికి ఆలోచించను. అప్పుడప్పుడు అలా కొన్నవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆర్ట్ పీసు అలాంటిదే. అందుకని నాకు చాలా ఇష్టం.

అనుకోకుండా నాకు అగుపించి - అందుబాటు ధరలో నాకు కొనాలనిపించి నేను కొన్న ఈ పటం బావుంది కదూ?

5, అక్టోబర్ 2010, మంగళవారం

సచ్చినోడు కొట్టకపోతే నేటి. మన నచ్చనా గాడు కంగారూలకి గిట్టెటేసాడు


ఓలమ్మో! ఓల్ నానో! ఏటైపోనాది - ఏటైపోనాది. సచ్చినోడు కంగారూలని ఇరగ బాదీసీగలడని బేగ ఎలిపోచ్చేసినాను. టీవీ పెట్టి చూయీసాను. సచ్చినోడు అంటే అబ్బోఓఒ ... ఒల్లమాలిన పేమ కదేటి మనకి. ఆ గుంటడు కర్రట్టుకు బాదేస్తుంటే, నాకేటి - దేసమే వూగిపోతాది కందా!.  మన కిర్కీట్లో సచ్చినోడు రేముడు లాటోడు, ఆడి కాడ ఎన్ని అస్త్రాలు ఉంటె ఏటి లాభం? కావోల్సినప్పుడు బాణం ఒమ్ముల పొదిలో ఇరికట్టీసినట్టు ఆడి అవుటయ్యిపోనాడు.  ఎన్ని సేపనార్ధాలు పెట్టి ఏటి నాభం -  ఆడు మటుకు ఏటి సేస్తడు.
 రేముడు సేయ్యలని పని  నచ్చనా గాడు  సేసినాడు గదేటి. ఏటంటే! నానేటి సెప్పేది. కర్రట్టుకుని నాను టెట్టు మాచీలో కోచ్చీనానంటే ఇజయం మనదే అని కంగారూలకి గిట్టెటేసాడు.   అప్పుడప్పుడు
సచ్చినోడు కొట్టకపోతే నేటి. మన నచ్చనా గాడు కంగారూలని మట్టీసినాడు కదేటి! మన నచ్చన గాడు ఒవులునుకున్తన్నారు - మనోడే. నా కాడనే గూటీ బిళ్ళ నేర్సుకున్నాడు. ఆడు ఆడీసినప్పుడు సూసినార, కిర్కీటు కూడా కర్ర-బిల్లా లాగుంతది కదేటి? మరి ఒంగుని కర్ర -బిల్లా ఆడుతుంటే నడాలు పట్టీవేటి? పట్టీసినాయని కూకున్నాడేటి, కర్ర-బిల్లా కుమ్మీసెనాడు. పాంటింగ్ గాడి ఏటి సేస్తాడు - జానాబెత్తుల కొలిసీస్స్తాడు.

Image taken from http://cricket.rediff.com/
Notice: Written just for fun after watching Laxman. When he gets going, he makes it look like he is playing gilli-danda..not cricket.

ఆంధ్రా అరాచకీయం

మనుగడ కోసం పోరాటంలో
మనీ కోసం ఆరాటంలో
విలువలకు వలువలు విప్పేసి
ఆంధ్ర మాతని అర్ధ నగ్నంగా నిలబెట్టేసారు

డబ్బు జబ్బు పట్టిన చీడ పురుగులు
దేశ ప్రగతిని కుంటు పరుస్తూంటే -

కొమ్ము కాసే రాజకీయ రాబందులు
దేశ సహజ సంపదల్ని పీక్కు తింటూ 
డొక్కల్లో నక్కి  బొక్కల దాకా తినేసే 
గుంట నక్కల బందువర్గాన్నికాంట్రాక్టు లతో  కాస్తున్నాయి 

అక్కడక్కడా ఎవడో ఈగ లాగా
సామాజిక న్యాయం అని చెవిలో హోరు  పెట్టి 
చీము-రక్తం కారుతున్న పుండు మీద పడి
చడీ చప్పుడూ లేకుండా చప్పరించి పోతాడు   
  
రక్తం జుర్రేసిన దోమ
రాబందుని చూపించి భయపెట్టి
నాకో అవకాశం ఇస్తే
రాబందు నించి రక్షిస్తానని
మన ముందు వాపోతుంటుంది

చిటికిన వేలు నేనని
బొటన వేలు నువ్వని
ఐదు వేళ్ళలో అన్యాయం
అనాదిగా నాకే జరుగుతోందని
ఉంగరం వేలుతో సహా
పీక్కు పోతానని బెదిరించి 
ఊదర గొట్టి ఉంగరం మీద 
ఒక్కో రాయినీ తీసుకుపోతాడొకడు 

నిజాల నిగ్గు తేలుస్తానని

కాగడాతో కళ్ళు తెరిపిస్తానని
చీకట్లోనైనా సరే చుక్కలు చూపిస్తానని
పగలంతా ప్రగల్బాలు పల్కి
పత్రికలు పెట్టి పతాక శీర్షికలు కొట్టి
ఛానల్ పెట్టి చడా-మడా తిట్టి
రాత్రిళ్ళు పక్కలేసి పడుపు వృత్తి చేసి
పొద్దున్నే తప్పుడు దారిలో
తీసుకెళ్ళి పోతాడు మరొకడు

గమనిక: ఇది ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు... ఒక సామాన్యుడి ఆవేదనకి అక్షర రూపం మాత్రమే...

4, అక్టోబర్ 2010, సోమవారం

తాడూ-బొంగరం లేదని ఎవడన్నాడు?

 చాలా మంది తాడూ-బొంగరం లేని ఎదవ అని వెక్కిరిస్తూ వుంటారు కదా! తాడూ-బొంగరం లేదని చాలా తక్కువగా కూడా చూస్తారు. కొంత మంది అయితే తాడూ-బొంగరం లేని వాడు కదా అని పిల్లని కూడా ఇవ్వట్లేదట. అలాంటి మనుషులకు అవకాశం ఇవ్వకూడదని ఈ తాడూ-బొంగరం ఒకటి మొన్న భారత దేశం నించి తెప్పించా.( అడగ్గానే ఈ బొంగరం పంపిన నా బాల్య మిత్రుడుకి ధన్యవాదాలు ఈ బ్లాగ్గు ద్వారా). నాకు పెళ్లి ఐపోయింది కాబట్టి అందరికీ అదే పనిగా నా దగ్గర తాడు-బొంగరం వుందని చెప్పట్లేదు అనుకోండి.


కామెడీ పాయింట్ పక్కన పెడితే, ఈ బొమ్మలో వున్న అందమైన బొంగరం- దానికి కట్టి వున్నతాడు ఎలా వున్నాయి? నేను చిన్నప్పుడు వీధుల్లో బొంగరాల ఆట ఆడేవాడిని. అదేమీ ఆషా-మాషీ ఎవ్వారం కాదు. ఆ బొంగరాలు దీనికంటే బరువు ఉండేవి, పైగా కొంచెం పెద్దగా ఉండేవి.  వాటికి ఇంచుమించు మేకు లాంటి AXIS వుండేది. ఆ బొంగరానికి తాడు చుట్టడంలో చాలా జాగ్రత్త వహించాలి. AXIS పైన భాగం దగ్గర తాడు ఒక కొసతో మొదలు పెట్టి పై వరకూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిగుతుగా కట్టి, చిటికిన వేలు మరియు ఉంగరం వేలు మధ్యలో రెండో కొస పట్టుకుని వదలాలి. వదిలే టప్పుడు చాలా ఒడుపుగా దాని AXIS కింద వైపు పడేలా తాడుని విసిరి లాగేసినట్టు ఒదలాలి. అప్పుడు బొంగరం గిర్రు- గిర్రున తిరుగుతూ వుంటుంది చాలా సేపు.
 అలా తిరిగే బొంగరాన్ని ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ప్రదేశాన్ని ఎంచుకుని తిప్పుతూ ఆనందించవచ్చు. మన దర్శకుడు రాఘవేంద్ర రావు గారు అయితే సినిమా హీరోయిన్ బొడ్డు మీద, పిల్లలు అయితే  పుస్తకాల మీద, అర చేతిలోనూ - వాళ్ళ ఇష్టం అన్న మాట.  
మనిషి కనిపెట్టిన ఆట వొస్తువులలో అతి పురాతనమైన ఆట వొస్తువుగా ఈ బొంగరాన్ని గుర్తించారు.  మీ పిల్లలని ఇలాంటి వాటితో ఆడించాలంటే మీరే ఒకటి తయారు చేసుకోవొచ్చు. మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. మన ఇన్జక్షన్  సీసా రబ్బర్ మూత వుంటుంది కదా, అది ఒకటి వుంటే చాలు. దానికి మధ్యలో ఒక సన్న మేకు తోటి గుచ్చి కన్నం పెట్టి అందులోంచి ఒక అగ్గిపుల్ల దూరిస్తే చాలు. ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు బొంగరం తయారు చేసారన్నమాట. మీకు రాఘవేంద్ర రావు టైపు కోరికలు వుంటే ఒక అందమైన అమ్మాయిని అడిగి ఒప్పుకుంటే బొడ్డు మీద తిప్పి ఫోటో తీసి నాకు పంపండి. గూబ పగిలితే నాకు చెప్పకండి, కానీ మీరు రాఘవేంద్ర రావు అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలంటే ఇలాంటివి తప్పవని adjust అయిపోయి, ఇంకొకళ్ళని వెతుక్కోండి.
అన్నట్లు చెప్పండం మరిచా, ఈ బొంగరం పిచ్చి చాలా చోట్లే ఉంది ప్రపంచంలో. ఇలాంటి వాటికి పోటీలు కూడా జరుగుతూ వుంటాయి. బొంగరాన్ని హిందీ లో లట్టు, స్పానిష్ లో త్రోమ్పో, లాటిన్ లో turbo , ఇటాలియన్ లో trottola , ఫ్రెంచ్ లో la toupie , జర్మన్ లో kriesel , గ్రీక్ లో strombos మరియు ఇంగ్లీష్ లో టాప్ అని అంటారు.
ఇంత చెప్పాక, ఫోటో తీసి బ్లాగ్గు రాసి మరీ జత చేసాక, నన్ను "తాడు-బొంగరం లేని ఎదవ." అనే దమ్ము ఎవరికుంటుంది చెప్పండి. ఒక వేళ అన్నా, మీరు మటుకు ఎందుకు నమ్ముతారు.  ఇంకా కాదంటే మనం ఊరుకుంటామా? అన్న వాళ్ళ బొడ్డు మీద బొంగరం తిప్పెయ్యమూ?  

గమనిక: కామెడీ కోసం మాత్రమే రాసాను. నేనేమీ రాఘవేంద్ర రావు టైపు కలలు కనలేదు, ఎవ్వరిని అడగలేదు, నన్నెవ్వరూ  గూబ పగలకొట్టలేదు.  ఏదో నా బొంగరం నేను తిప్పుకున్నానంతే.