అవును.. ఏదో ఒక నాడు నాన్న కూడా చచ్చిపోతాడు...
కానీ...
నలువైపులా నువ్వు చిందే నవ్వులలో
తడిసిన చిరు జల్లుల్లా అందరికీ కనిపిస్తా
ఎంచుకున్న గమ్యం వైపు సాగే నీ బాట లో
తడబాటు లేని అడుగుల జాడలలో కనిపిస్తా
నలుగురికీ నువ్వు పంచె ఆనందాల ప్రతిబింబాలలో
నీ ఆలోచనలకు మెరుగులు దిద్దిన ఇసుకు కాగితం అవుతా
నలుగురికి చేయందించిన నీ సాయం లో
నిస్వార్ధం నేర్పిన ఉనికి ని నేనౌతా
నీ పిల్లలని నువ్వు నిద్రపుచ్చే వేళ
నువ్వు పాడే జోల పాటలో వినిపిస్తా
నిరాశలో నువ్వు నింగి కేసి చూస్తే
నీ కోసం నేనున్నానని
ఏ కష్టాన్ని నువ్వు లెక్క చెయ్యద్దని
నీలో ధైర్యం నిండేలా
చల్లని వెన్నెల నీ పై కురిపించే
చక్కని చందమామ నౌతా
అవును.. ఏదో ఒక నాడు నాన్న కూడా చచ్చిపోతాడు...
కానీ కడవరకూ నీతో జ్ఞాపకంగా మిగిలిపోతాడు ....
("నాన్నా, నువ్వు కూడా చచ్చిపోతావా?", అని అడిగిన నా కూతురి ప్రశ్న కి సమాధానంగా)
Image taken from http://www.rgbstock.com
Thanks to Mihalis Travlos for the image.