ఆకుండి వారి ఆణిముత్యం నేల రాలిందంట ..
ఎవరండీ ఆ మాట అంట ....
ఇక ఈ లోకంలో బాధ్యతలన్నీ తీరి పోయాయని
ఇహ లోకం విడిచి ఇలా రావోయ్ అని
పర లోకం లో వున్న పరమేశ్వరుడి పిలిస్తే
పలకరించ డానికి కైలాసానికి వెళ్లారు ..
కైలాసంలో..
ఏవయ్యా! కోటి సంవత్సరాల తపస్సు చేస్తే కానీ
నన్ను కరుణించని పరమ శివుడు
నిండు నూరేళ్ళు పూర్తిగా పూజించని నిన్ను
ఇలా రప్పించుకోడం లో సూక్ష్మం ఏంటి?
అని ఆరా తీస్తున్నాడట నంది ....
ధర్ముడి వంశం నీదని
ధర్మానికి అంశే తనదని
శిలాదుని కి రుద్రుడు ప్రసాదించిన మృత్యుంజయుడు నువ్వైతే
రుద్రుడే మెచ్చిన వీర భద్రుడు (మంచి వాడు/సుభద్రుని భ్రాత) ఇతడని
తండ్రి తపోబలం తో అయోనిజుడు నువ్వైతే
తండ్రి మాటకు కట్టు బడిన మహా ఘనుడు ఇతడని
నారదుడు నంది కి సర్ది చెప్పాడట..
పరధ్యానం గా వున్న పార్వతీ దేవి
కంగారు గా లేచి చూసిందట
కైలాసం లో ఏమిటీ ఎప్పుడూ లేని కోలాహలం
పరమ శివుడి ధ్యానానికి భగ్నం కలగదుగా! అని ...
అక్కడ చూస్తే ....
హరుడు-నరహరుడు (నరులలో శ్రేష్టుడు) కలిసి
మద్యపానం చేస్తూ .. పిచ్చాపాటి మాట్లాడుకున్టున్నారట ..
పార్వతి దగ్గరికి వెళ్లి విన్నదట కుతూహలంగా ..
ఇన్ని యుగాలు ఎందుకు జాగు చేసావు
అదేదో క్షీర సాగర మదనానికి ముందు ఒస్తే
నీ సాంగత్యంలో గరళాన్ని కూడా
సరళంగా (సులువు గా) హరించే వాడిని గా అని..
(విస్కీ - బీర్ కలిపిన మధు పాత్రలలో సుధని
తనివి తీరా తొలి సారిగా ఆస్వాదిస్తూ )
చీర్స్ చెప్పి అక్కున చేర్చుకున్నాడట శివుడు
మన ఆకుండి వారి ఆణి ముత్యాన్ని ..
ఇప్పుడు మీకు చెప్పారనుకోండి ఎవరైనా
ఆకుండి వారి ఆణిముత్యం.. నేల రాలిందని
మీరు వాళ్లకు చెప్పండి .. కాదయ్యా బాబూ
ఆకుండి వారి ఆణిముత్యం... కైలాసం చేరిందని
(నంది:శిలాదుని కొడుకు. శివుని వాహనము అయిన వృషభము. ఇతఁడు కోటిసంవత్సరములు అతినిష్ఠురమైన తపముసలిపి శివుఁడు ప్రత్యక్షముకాఁగా, మరల రెండుకోట్ల సంవత్సరములు తపము ఆచరించునట్లు వరముపొంది శివుని అనుగ్రహము పడసి పార్వతికి పుత్రభావము పొందెను. ఇతనిని నందికేశ్వరుఁడు అనియు అందురు. [ధర్మునికి యామియందు పుట్టిన దుర్గభూమ్యధిష్ఠానదేవత యొక్క రెండవ కొడుకు అని శ్రీమద్భాగవతమునందు చెప్పి ఉన్నది.]
(శిలాదుఁడు: నందీశ్వరుని తండ్రి. జపేశ్వరమున ఇతఁడు రుద్రుని గూర్చి తపము ఆచరించి అయోనిజుఁడును మృత్యుంజయుఁడును అగు నందిని పుత్రుఁడుగా పడసెను.)
(ఆకుండి నరసింహమూర్తి కి అంకితం)