14, సెప్టెంబర్ 2011, బుధవారం

సమర సింహా రెడ్డి మీరు సల్లంగుండాలే

మొన్న ఆ మధ్య ఒక పోస్ట్ లో తెలుగు సినిమాలలో మంచి పాటలు ఈ మధ్య రావట్లేదు అని రాసినప్పుడు, నాకు విజయ క్రాంతి గారు "నగరం నిద్ర పోతున్న వేళ" పాటలు వినమని సలహా ఇచ్చారు. ఒక రోజు డ్రైవ్ లో వుండగా వింటుంటే ఆ సినిమాలోని గోరటి వెంకన్న గారు రాసి, పాడిన ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది. ఈ సినిమా నేను చూడలేదు కానీ అసలు బాలేదని విన్నాను. ఈ పాటకి సినిమాలో సందర్భం ఏమిటో అని కుతూహలంతో కొంచెం చూస్తే.. ఇది కేవలం టైటిల్స్ అప్పుడు గోరటి వెంకన్న కోసం ఒక సీన్ పెట్టి నట్లు అనిపించింది. ఈ పాట ఆ సినిమాలో పెట్టి వేస్ట్ చేసారనిపించింది. సినిమాలో కొంచెం సాహిత్యం కూడా మార్చారు.. ఎందుకంటె పాటలలో రెడ్డి అని వుండటం వల్ల అనుకుంట. ఈ పాట సాహిత్యం ఫాక్షనిజం మూలంగా- ఫాక్షనిస్ట్ల అనుచరుల జీవితం ఎలా వుంటుందో కొత్త కోణంలో చెపుతుంది..
ఈ పాటని కేవలం సాహిత్యం, ఫీలింగ్ పరంగా వినండి.. చాలా బావుంటుంది. పాటలో కులం పట్టించుకోకుండా...

పాటకి లింకు:

సమర సింహా రెడ్డి మీరు సల్లంగుండాలే మీరు హాయిగుండాలే
భరత సింహా రెడ్డి మీరు బాంబు లియ్యాలే  మా వోళ్ళు బాట పట్టాలే
అరె చెన్నా కేశవ రెడ్డి .. భళా చెన్నా కేశవ రెడ్డి
మీరు చిటికలెయ్యాలే  మేమంత  చిందు తొక్కాలే  

మీ నెత్తి మీది గొడుగులం
మీ కాలి కింద చెప్పులం 
మీ చేతిలోని కత్తులం 
మీరు వుసుకో వుసుకో వుసుకో అంటే ఉరికె  వేట కుక్కలం 
మీరు కచ్చ కడితే.. మీరు కచ్చ గడితే
సొంత అన్ననైన కతం చేసే కొడుకులం
మీరు చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే..
మీ ఆఖరి బాబుకు అమెరికా వీస దొరకాలే
ఆడ సుక్కలు కొండాలే
మీ పెదబాబు ఎస్పీ అయ్యి లాటీ బట్టాలే
ఏ కేసులు లేకుండా మిమ్ము చూసుకోవాలే
కలకటేరు మీ అల్లులోలె  కాలు మోపాలే
అధికారమంతా మీ కావలి కుక్క లవ్వాలె
మా గొడ్లా గాసే కొడుకు. మా గొడ్లా గాసే కొడుకు 
మీ గొడ్డలందుకోవాలే
మీరెన్ని మెతుకులేస్తే మీరెన్ని మెతుకులేస్తే
వాడన్ని తలలు నరకాలే

చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే.. 
మీరు చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే..

ఐదొందలిస్తే చెయ్యి చాపి అందుకోవాలే
ఐదేళ్ళు నరికి అప్పుడే  మీ చేతికియ్యలె
వెయ్యి నోట్ల కట్ట ఇస్తే కళ్ళ కద్దు కోవాలె
మా ఇంటి దీప మల్లె  మిమ్ము కోలుసుకోవాలే
మా చంటి పిల్ల చలి జ్వరముతో ఒనికిపోతున్నా
మీ కాపలంటే వేట కొడవలందుకోవాలే
పెళ్ళైన నెలకు ఆలి ఇంట్లో ఒంటి గుంటున్నా
మీ గడియ చుట్టూ రాత్రి పగలు గస్తీ కాయాలే  
మీరు బామ్బులిస్తే బంతులోలె ఇసురుకోవాలే
మీ మేలు కోరి మా నెత్తిన ఏసుకోవాలే

మీరు సభలు పెడితే లారిలేక్కి జైలు కొట్టాలె
పులిహోర పోట్లాలకై పోట్లాడుకోవాలే  
మీరు తెన్దారేస్తే పనికి మీరు తెన్దారేస్తే పని జరిగితే  మురిసి పోవాలె
పని జరగపోతే మా పానము పనము పెట్టాలె
రిగ్గింగ్ మేము వేస్తే మీరు గద్దేనేక్కలే
మీరు పదవులుంటే మేము మీ పంచనుండాలే

తన్నారీ తానీ ..అయ్యలో... ఓహ్ బాబులో.. పెద్ద దొరలో
అధికారము మీరే మా సాములు ....

హీరో లు మీ వేషమేసి హిట్టు కొట్టాలె
ఆ సినిమా సూసి మా వొళ్ళంతా సీటీ కొట్టలే
ఆ దేశనేతలై కీర్తి మీరు బొందాలే
కిరాయినంత బురదనింత మేము మొయ్యాలే
ఆ గాంధి నెహ్రు పక్కన మీ బొమ్మలుండాలే
పోలీసు స్టేసన్ల మా ఫోటోలుండాలే

బాబూ సల్లంగుండాలే బాబూ హాయిగుండాలే
మీరు సల్లంగుండాలే మీరు హాయిగుండాలే

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నువ్వొక జవాబు - నేనొక ప్రశ్న



నీ జీవిత పయనానికి గమ్యం నిర్దుష్టం
నాకు పయనమే జీవితమవ్వడం నా అదృష్టం

హద్దులలో సంచరించడం నీ గొప్పతనం
హద్దులు అధిగమించడమే నా అభిమతం

ఒడ్డించిన విస్తరి లాంటిది నీ జీవితం
విడదీయలేని చిక్కుముడి నా జీవితం

జీవితమనే ప్రశ్నకు నువ్వు జవాబైతే
జీవితానికే నేనొక ప్రశ్నను..