30, నవంబర్ 2012, శుక్రవారం

కృష్ణం వందే జగద్గురుం - భాగవతం రెండు గంటల్లో

మా పెద్ద అమ్మాయి సిరికి రోజూ రాత్రి పడుక్కునే ముందు కధ చెప్పాలి. మన సంస్కృతీ సాంప్రదాయాలకి దూరంగా వున్నాము, దీనికి అవి చెప్పే అవకాసం ఇదేనేమో అని నేను ఏ భారతమో చెపుదామని అనుకుంటే, అది
  "Too many introductions..." అని అసలు కధలో కి వెళ్ళనివ్వదు. సరే ఈజీ కదా అని రామాయణం చెపుతామంటే, సింపుల్ గా రామున్ని పక్కన పెట్టి హనుమంతుడి గురించి చెప్పమంటుంది. చివరకి అది రామాయణం మొదలెడితే సుందర కాండ అయ్యి కూర్చుంటుంది. భాగవతం చెప్పాలని ఎంతో ట్రై చేస్తాను. కాని మన కధ చెప్పే పద్ధతో, మనకి భాగవతం పైన లోతైన అవగాహన లేకనో, చివరకి అది " లిటిల్ కృష్ణా" ఎపిసోడ్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భాగవతం చివరకి మనకే అసంతృప్తిగా అనిపిస్తుంది. టైం చాల్లేదనో, చెప్పాల్సిన చోట సరిగ్గా చెప్పలేకపోయాననో, ఏదో తెలియని వెలితి మిగిలిపోతుంది. ఇంకా ఏదో చెప్పాలి అని, ఎలా చెప్పొచ్చా అని నేను ఆలోచించే లోపు నా కూతురి గురక నా ఆలోచనని ఆపేస్తుంది. బహుశా రామాయణ, మహా భారతాలు మనకి ఎవరో చెప్తున్నట్లుగా వున్నందుకు వాటి గురించి మనకి కొంచెం బెటర్ అవగాహన ఉందేమో?

అదే భాగవతాన్ని నేటి కధగా రెండు గంటల్లో చెప్పాలంటే, ఆ పైన అందులో మాస్ మసాలా పాటలు జొప్పించి, సెన్సార్ బోర్డు ని మెప్పించి, ఇంతలోనే ముగింపు చూపాలంటే?  అదే క్రిష్ చేసిన ప్రయత్నం.

సినిమా ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన కధనం
ట్విస్టుల తో బాగా అల్లిన కధ
దేవుడంటే సాయం అని ఒక మంచి సోషల్ మెసేజ్ నాటకాలతో చెప్పే ప్రయత్నం 
పదునైన డైలాగ్ లు.. కధ వేగంలో చాలామంది గమనించక పోవచ్చు
దగ్గుబాటి రాణా జనాలకి హీరో అని అనిపిస్తాడు ఈ సినిమాతో
ప్రతీ పాత్రకి విలువ వుంటుంది -- అతి చిన్న పాత్రకి కూడా కనీసం ఒక విలువైన డైలాగ్ వుంటుంది

మైనస్ పాయింట్లు;
అతి వేగంగా పరిగెత్తే కధ - ఎడిటింగ్ వల్ల అనుకుంటా
సినిమాటోగ్రఫీ - క్రిష్ ఎందుకో గమ్యం అంత బాగా ఆ తర్వాత ఏ సినిమాలో లేదు
నాటక రంగం ఈ తరానికి తెలియదు కాబట్టి రిలేట్ చేసుకోలేరు
పాటలు తక్కువైనా, బావున్నా - కధ వేగానికి అడ్డు వేసినట్లున్నాయి
ముఖ్యంగా ప్రేక్షకుడు అంత వేగంగా కధతో పరిగెత్తలేడు

నా లాంటి వాళ్లకు ఎంత నచ్చినా, ఈ చిత్రం మాస్ ని పాటలకోసం, ఫైట్ ల కోసం సినిమాకి మళ్ళీ మళ్ళీ రప్పించ లేకపోతే, హిట్ అవ్వడం చాలా కష్టం. నాకెందుకో ఇది నేను నా కూతురికి చెప్పాలనుకునే భాగవతం లా మొదలై - దగ్గుబాటి రాణా లిటిల్ కృష్ణా గా ముగిసిందని అనిపించింది. ఎడిటింగ్ ఈ సినిమా విలువని కొంత మరుగున పడేసింది. ఈ సినిమా ఎందుకో జనాలు టీవీ లో ఒచ్చినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది.

గమనిక: ఈ సినిమా ఒక సారి తప్పక చూడండి.. వేరే వాళ్ళ అభిప్రాయం తో పని లేకుండా... 

5 కామెంట్‌లు: