అయితే ఈశూ విషయాన్ని అక్కడితో ఒదల్లేదు. పెళ్లి రోజు దగ్గర పడిపోతోంది, తను రాసుకున్న లిస్టు లో ముఖ్యమైన ఐటెం గా పెట్టుకున్నాడో ఏమో, నాకు మళ్ళీ ఒకటి రెండు సార్లు ఆఫీసు టైం లో కాల్ చేసాడు..
"సర్! మనం పాట ఎలాగైనా పూర్తి చెయ్యాలి", అంటూ. నేను కొంచెం బిజీ గా వుండి, తనకీ పెళ్లి పనులతో తీరిక లేక..చిన్న చిన్న ఫోన్ డిస్కషన్స్ జరిగాయి తప్ప పాట రాయడం అనే పని ముందుకు సాగలేదు..
ఆ మాటల్లో నీ పాట సాహిత్యం బానే వుంది కానీ అందులో ఫీల్ లేదు, నేను కొన్ని పాటలు చెప్తాను అవి విని ఎలా వున్నాయో చెప్పు అని కొన్ని పాటలు చెప్పాను..
మన వాడికి కొన్ని సిరి వెన్నెల రొమాంటిక్ సాంగ్స్ "నిలువద్దం నిను ఎపుడైనా", "ఎక్కడ వున్నా పక్కన నువ్వే " లాంటివి వినమని సజెస్ట్ చేసాను.
వీటన్నిటితో పాటూ అడక్కుండా ఒకటి రెండు సలహాలు కూడా పారేసాను... పెళ్ళికి ముందు చాలా మంది ఇలాగే అనుకుంటారని, కానీ మొదట్లో వున్నజోరు చాలా మందికి చివర దాకా ఉండదని. పైగా నీ ఉద్దేశ్యం బావుంది కానీ పాట అయ్యేంత వరకు ఎక్కువ ఆశలు పెట్టుకోకని. మనోడు యేమని అనుకున్నాడో ఏమో?
"సర్! నేను వెళ్ళడానికి ఇంకా వారం రోజులే టైం వుంది. మనం పాట రాసి పంపితే ట్యూన్ కట్టి రికార్డు చెయ్యడానికి కనీసం మూడు రోజులు పడుతుంది", అన్నాడు ఒక రోజు కంగారుగా ఫోన్ చేసి....
"ఇలా కాదు గానీ నువ్వు రాత్రి మా ఇంటికి ఒచ్చెయి.., ఎంత లేట్ అయినా సరే" , అన్నాను..
"మీరసలే ఫ్యామిలీ, ఇంట్లో ఇద్దరు పిల్లలు..ఇబ్బందేమో?", అన్నాడు నసుగుతూ...
"ఏం పర్లేదు... వాళ్ళని పడుకోపెట్టిన తర్వాత కావాలంటే రాత్రంతా కూర్చుని కంప్లీట్ చేద్దాము", అని భరోసా ఇచ్చా..
నిజం చెప్పాలంటే, మనోడు ఆ పాట విషయంలో ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం నాకు బాగా నచ్చింది. మనోడికి నా వొంతు సాయం చెయ్యడానికి నేను కూడా కంకణం కట్టేసా..
మనవాడు రాత్రి ఇంటికొస్తే ఒక పక్క చంక దిగని చంటింది, మరో పక్క ప్రశ్నలతో వేదించే పెద్దది. వీళ్ళిద్దరినీ మా ఆవిడకి అప్ప చెప్పి రూం లో గడీ వేసి మొదలెట్టామో లేదో, మనోడికి ఇండియా నించి కాల్.. పెళ్ళికి ముందు వేక్ అప్ కాలు, కాఫీ కప్పు కాలు, గుడ్ నైట్ కాలు, మిడ్ నైట్ కాలు ఇలా వుంటాయి కదా. అదయ్యాక రూమ్లో తాగి కొట్టుకుంటున్న కుర్రాళ్ళ కాల్. వీటన్నిటి మధ్య మనోడు ప్రేమలో వున్నాడు కదా! తన లోకంలో తానున్నాడు..
"సర్! ఇలాగ టైం వేస్ట్ అయిపోతుంది.. మీరు చెప్పిన పాటలు, వాటితో పాటు ఇంకొన్ని ప్రేమ పాటలు విన్నాకా, మంచి ఫీల్ వున్న పాటే రాయాలని డిసైడ్ అయ్యా.. ఇదివరకు ఈ పాటలు అంతగా ఎక్కలేదు కానీ, ఇప్పుడు వినే కొద్దీ బావున్నాయి, ఇంకా వినాలని అనిపిస్తూ వున్నాయి", అన్నాడు.
"అవే ఫీల్ వున్న పాటలంటే... అయితే ఇప్పుడు నువ్వు వున్న పరిస్థితి వివరించేలా ఒక పాట రాస్తే బావుంటుంది".
అన్నాను.. అసలు మొదలే పెట్టలేదు ఎప్పుడో ముగిస్తామో అన్న వర్రీలో..
"అయితే మీరే చెప్పండి ఎలా మొదలెట్టాలో", అన్నాడు..
"
పగలో రేయో తెలియని హాయా .....
కలయో నిజమో వైష్ణవి మాయా .. ఎలా వుంది ఈ పల్లవి", అని నేను చెప్పింది పల్లవో-చరణమో నాకే తెలియక పోయినా, మన వాడికి అస్సలు తెలీదన్న నమ్మకంతో. అమ్మాయి పేరు తో బాగా కనెక్ట్ అవుతాడని..వైష్ణవ మాయని వైష్ణవి మాయ చేసి... ఆ తరవాత కావాలంటే మిగిలిన పాటకి ఇంకేదన్నా మాయ చేద్దామని అనుకుంటూ..
"బావుంది సర్! కానీ మనకి పల్లవేదో, చరణమేదో తెలియదు కదా?", అన్నాడు..తన గురించి అనుకున్నట్టుగా..
మనక్కూడా సరిగ్గా తెలీదని మనసులో అనుకుని, పైకి మాత్రం కాంఫిదేంట్ గా...
"పల్లవి అంటే మొదలు-చివర ఒచ్చేది, మధ్యలో మనం రెండు చరణాలు రాసేస్తే పాట అయిపోతుంది", అన్నా సింపుల్ గా.
అది విస్కీ, ఇది సోడా .. రెండు కలిపి రెండు రౌండ్లు కొడితే... చేస్తుంది మనకు తేడా... అన్నంత ఈజీ గా..
"అయితే ఇంకేం.. ఇలా మిగిలినవి కూడా రాసేస్తే పోలా", అన్నాడు...
"నలుగురిలో వున్నా నీ ఊహల్లో ఉన్నా.. నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ", అని ఇంకో లైన్ లాగేసా...
"ఇది కరెక్ట్ గా నా స్టేట్ అఫ్ మైండ్ ని ఉన్నదున్నట్లు చెప్తోంది", అన్నాడు ఉత్సాహంగా...
హమ్మయ్యా! మనోడు బానే ఇంప్రెస్స్ అయ్యాడని.. అలాంటివి మనోడి కవితలని కలిపేసి ఏదో రెండు చరణాలు నింపేసి, పాట సాహిత్యం రెడీ అనిపించాము ఆ రోజుకి ... అప్పటికే పగలు అయ్యిందని తెలుసుకుని...
నెక్స్ట్ డే మనోడు మళ్ళీ కాల్ చేశాడు..
"సర్! సాహిత్యం సరే.. కానీ దీనికి ట్యూన్ ఎలా కడతారో వాళ్లు... మనం ఏదైనా ఒక ట్యూన్ అనుకుని శాంపిల్ గా పాడి పంపిస్తే?", అని...
"అయితే ఒక పని చేద్దాం, ఇండియా నా ఫ్రెండ్ విశాల్ అని ఒక మ్యూజిక్ టీచర్ వున్నాడు.. అతనికి కాల్ చేసి ఒక సారి పల్లవి వినిపించి, రెండు మూడు ట్యూన్స్ కట్టమని చెప్దాము.. ఏది నచ్చితే, అది పాడించి రికార్డు చేసి పంపిద్దాం". అని విశాల్ కి కాల్ కనెక్ట్ చేసా ...
విశాల్ అంటే నా ఇంటర్ క్లాసు మేట్.. మాంచి గాయకుడు.. మ్యూజిక్ టీచర్.. రేపటి కల్లా రెండు మూడు ట్యూన్స్ కట్టమని పల్లవి చెప్పాను...
నెక్స్ట్ డే మన వాడు పంపిన ట్యూన్స్ విని ఇద్దరం చాలా క్లాసిక్ గా ఉన్నాయి ... అని అనుకున్నాము.. అవును మరి మనవాడు మంగళంపల్లి బాల మురళి కృష్ణ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకున్న ఫోటో కూడా పంపాడు స్కాన్ చేసి ట్యూన్ తో పాటు.. మనకి ఆ రాగాలు తెలియవు కానీ, మనకిది చాలా ఎక్కువ అనిపించింది.. పైగా అంత క్లాసిక్ అయితే మన కుర్రోడు రేపు పాడుకోవాలంటే మరీ కష్టం ...
ఇద్దరం కలిసి ఎలాగైనా విశాల్ కి ఈ విషయం మెత్తగా నొచ్చుకోకుండా చెప్పాలని అనుకున్నాము..
విశాల్ - ఈశూ కన్నా సున్నితం, పైగా చాలా తొందరపాటు మనిషి . .. మన మాట వినడు..విన్నా పూర్తిగా వినడు.. ఏదైనా చెపితే నొచ్చుకుంటా డని నేను చాలా విషయాలు చెప్పను. ఈ విషయంలో కూడా ట్యూన్ కట్టమని .. ఆ తర్వాత అవసరం అయితే నెక్స్ట్ స్టెప్ రికార్డు చెయ్యాలని చూచాయగా చెపితే.. మనోడు వుద్యోగం సెలవపెట్టి పాట రికార్డు చెయ్యడానికి హైదరాబాద్ బస్సుకి రెడీ అయిపోతున్నాడు...
ఇక్కడ చూస్తే ఈశూ ట్యూన్ మాత్రమే విశాల్ తో కట్టించి , సాహిత్యం తో సహా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కి ఇద్దామని అనుకుంటున్నాడు.. అక్కడ చూస్తే విశాల్ ఇంకా ఈశూ కి నచ్చక పోయినా రికార్డింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.. రికార్డింగ్ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు... అమ్మో! ఈ సున్నిత మనస్కులకి మనం ఎలా నొప్పించకుండా అర్ధం చేయించాలో తెలియక జుట్టు పీక్కున్నా..
ఎలాగోలా ఇద్దరికీ సర్ది చెప్పి.. ట్యూన్ నచ్చితే తక్కువ ఖర్చులో విశాల్ ద్వారా రికార్డింగ్ చేసేలా.. ఒక ఒప్పందం కుదిరించి.... ఒకటి రెండు డిస్క షన్స్ లో ట్యూన్ పూర్తి చేసాం.... అయితే ఈ సారి పల్లవి మాత్రం మొదట అనుకున్నది కాకుండా... చరణం లో వున్న
"నలుగురిలో వున్నా నీ ఊహల్లో ఉన్నా.. నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ", కి ఫిక్స్ అయ్యాం...
అప్పుడు మనవాడు మళ్ళీ సాహిత్యం లో చిన్న మార్పులు అంటే, అర్ధ రాత్రి పిల్లల్ని పడుకోపెట్టి ... షాపింగ్ చేస్తూ మన వాడికి కాల్ చేసి ... ఆ పాటలో చిన్న మార్పులు చేసి, పనిలో పని గా మన వాడి వై వై వై... పాట కూడా రాసేసాము... అసలే మన వాడు మొదలెట్టిందేమో?, పూర్తి చేస్తే కానీ మన వాడికి మనసోప్పేలా లేదని, ఆ రాత్రి కూని రాగాలు తీస్తూ పెద్దగా మాట్లాడుతూ షాపింగ్ చేస్తున్న నన్ను వాల్మార్ట్ లో ఒకరిద్దరు వింతగా చూస్తున్నా అస్సలు పట్టించుకోకుండా రెండోది కూడా పూర్తి చేసాము..
ఇప్పుడు రెండు పాటలు సాహిత్యం మరియు ట్యూన్ తో రెడీ.. ఇక మిగిలిందల్లా పాటలు రికార్డింగ్ మాత్రమే...
ఆ పాటల సాహిత్యం .....
మొదటి పాట ......
నలుగురిలో ఉన్నా నీ ఊహల్లొ ఉన్నా..
నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ...
ఎవరికి ఎవరెవరూ ఎపుడో రాసున్నా...
ఇన్నాళ్ళూ తెలుసున్నా..ఈనాడే కనుగొన్నా.. బంగారమా ...
తలగడపై తల ఉన్నా...నీ తలపులు తడుతుంటే ...
నా రెప్పలు మూసున్నా నే నిద్దుర పొగలనా
నా కలలో నువ్వొచ్చి నను కలవర పెడుతుంటే
ఆ వేకువ తడుతుంటే నే ముసుగులో దాగున్నా
పని పని పని అంటూ నే పరుగులు పెడుతుంటే
నా అడుగులో అడుగేసి నువు నను పడ దోసావే
తికమక పడిపోతూ నే దిక్కులు చూస్తుంటే
చిలిపిగ నను చూసి నువు పక పక నవ్వావే
గిలి గిలి పెడుతున్నా నీ కమ్మని కబురులకి
నా ఊహలు వేడెక్కి మబ్బుల చాటున చేరానే
చక్కని నన్నొదిలి చుక్కల మధ్యన ఏమిటని
నా మాటే వినకుండా నువ్వు నాపై అలిగావే
నలుగురిలో వున్నా ॥
రెండవ పాట:
వై వై వై వై వై వై నువ్వే నాలో సగమై..
వై వై వై వై వై వై
మనసే తాకే స్వర్గమై ...
వై వై వై వై వై వై నువ్వే ఇంతగా చేరువై...
వై వై వై వై వై వై
నాకై అందిన వరమై...
వైష్ణవీ వైజాగు అమ్మా
యివైష్ణవీ చిలుకూరి గడుగ్గాయి
వైష్ణవీ నా గుండెలో లడాయీ వైష్ణవీ
వై వై వై వై | |
పిల్ల పేరు బంగారు తీరు చూస్తీ కంగారు
నవ్వారో అమ్మాయిగారు రత్నాలే రాలుస్తారు
ఎత్తు చూస్తే చార్మినారు పిల్ల ముందు బలాదూరు
లంచ్ కి మస్ట్ కోడి గుడ్డు అందుకే బుడ్డీ వెరీ గుడ్డూ
వై వై వై వై | |
దొరికారు బావగారు నెమ్మదైన పని తీరు
మేడ్ ఇన్ గుంటూరు నీ రాక తో అంతా తారుమారు
వైష్ణవీ నా కంటి పాపాయీ వైష్ణవీ నా ప్రేమ పావురాయీ
వైష్ణవీ చలో మోగిద్ధాం సన్నాయి
వై వై వై వై | |