28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సిరివెన్నెల సాహిత్యం

సినేమా పాటలు బాత్‌రూమ్ లో పాడుకుని, బయటకు ఒచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ దీని అర్ధం ఏమిటో అని ఆలోచించే పద్నాలుగేళ్ల వయసులో, అన్నీ చెత్త పాటల మధ్యలో ఒక సారి నా నోట్లో నానిన బాత్‌రూమ్ పాట సిరివెన్నెల సినెమాలో "విధాత తలపున" అనే అద్భుతమైన పాట. ఆ పాటలో పదాలకి అర్ధం అడిగి మా తెలుగు తల్లి మెత్తటి తిట్లు (మా అమ్మ తెలుగు టీచర్) తిని, ఆ తరవాత ఆవిడ వేసిన అట్లు తిని, ఆవిడ సలహాతో బయటకి వెళ్ళి శబ్ధరత్నాకరం కొని తెచ్చుకుని మరీ ఆ పాటకి అర్ధం వెతుక్కున్నాను.
అప్పటి నించీ వినే ప్రతీ పాటలో సాహిత్యాన్ని వెదకడం, సాహిత్యం బావున్న పాటలకి అర్ధాలు వెతకడం. అడిగినవాడికీ- అడగనివాడికీ సిరివెన్నెల సాహిత్యం వినిపించి విసిగించే జబ్బు పట్టుకుంది. నా సిరివెన్నెల సాహిత్యం బాద తట్టుకోలేక, నన్ను చూస్తే జనాలు పారిపోయే పరిస్థితుల్లో నాకు పెళ్లి అయ్యింది. పెళ్ళైన కొత్తలో నేను చెప్పే సాహిత్యం కబుర్లు శ్రధ్ధగా వింటున్న మా ఆవిడని చూసి, నా అదృష్టానికి మురిసిపోయి ఒక రోజు గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ట్ లా "అరె హో సాంభా! రాసుకో", అని మా ఆవిడకి ఒక కవిత చెప్తే. తెల్ల కాయితం మీద రాయడం మానేసి తెల్ల మొహం వేసుకుని నాకేసి చూస్తోంది. ఆవేశం లో స్పీడుగా చెప్పానేమో, రాయలేక ఇబ్బంది పడి వుంటుందని, ఆలోచించి మళ్ళీ మెల్లగా చెప్పాను. కలం కదలట్లేదని, నాలో కవి ఆవేశపడి.. "ఏం? నిన్నే రాయమంటే, రాయిలా పలకవేం?" అని గదమాయించాను. ఆ దెబ్బకి మా గుంటూరి గుండమ్మ (మా ఆవిడే లెండి), "కొత్త మొగుడు కదా అని మోజులో నీ చెత్త వాగుడు భరిస్తే, అక్కడితో ఆగక.. వినే ప్రతీ పాటకీ సాహిత్యం వెతికి, నాకు దాని అర్ధం చెప్పి, నన్ను హింసించి.. అక్కడితో ఆగకుండా, నన్ను కాథలిక్ స్కూల్ లో చదువుకున్న కాన్వెంట్ పోరిని పట్టుకుని.. నీ దిక్కుమాలిన కవిత రాయమంటావా?.. నీ మమ్మీ.." అని తిట్టి, నా మొహమ్మీదే తెల్ల కాయితం చింపి, పెన్ను బల్లకి గుచ్చి వెళ్ళిపోయింది. చిరిగిపోయిన కాయితం, విరిగిపోయిన పాళీ చూసి.. అమ్మో ఇంకా ఎక్కువ ఆవేశ పడి పవర్ స్టార్ట్ లా పేట్రేగి పోతే మన బతుకు కాయితమో, పాళీనో అయ్యేదని.. బతుకు జీవుడా అని, ఆ రోజు నించీ మా ఆవిడకి తెలుగు రాయమని ఎప్పుడూ చెప్పలేదు.

మా పెద్ద అమ్మాయికి ఏం పేరు పెడదామని ఆలోచించే రోజుల్లో, ఒక సారి సిరి అనే పేరు ప్రస్తావించి.. ఆ తర్వాత మనం ఏ పేరు చెప్తే, అదే పెట్టదేమోనని ఊరుకున్నాను. అప్పుడు మా టీవీ లో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమా చూసి, అందులో హీరోయిన్ పేరు నచ్చి, మా ఆవిడ సిరి అని ఫిక్స్ అయిపోయింది. ఆ తరవాత మా ఆవిడని పెద్ద అమ్మాయి పేరు నువ్వే పెట్టావని మెప్పించి, రెండో అమ్మాయి పేరు సాహితీ అని పెట్టేలా ఒప్పించాను. అప్పటికే నా ప్రాణ మిత్రుడు వెన్నెల అని వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టడంతో, మా అమ్మాయికి వెన్నెల అని పెట్టడం ఇష్టం లేక. మా ఇంట్లో ఎక్కువగా వినిపించే పేర్లు సిరి మరియు సాహితి. ఎందుకంటే అవి మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి పేర్లు కాబట్టి. ఆ తరవాత ఎక్కువగా మా సిరి జపం చేసే దాని స్నేహితురాలి పేరు వెన్నెల.  సిరివెన్నెల సాహిత్యం పై నాకున్న అభిమానానికి, ఈ పేర్లతో నాకున్న ఆనుభందానికి ఒక బ్లాగు మొదలెట్టాలని ఎప్పటినించో అనుకుంటున్నా.

ఇదిగో ఇప్పుడు ఇలా కుదిరింది..

ఇందులో అన్నీ సిరివెన్నెల పాటలే వుంటాయి...  (ఇక్కడ క్లిక్ చెయ్యండి)

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

రాంగ్ వాలెంటైన్....


ఈ రోజు వాలెంటైన్ డే అని నాకు తెలుసు....
ఈ రోజు నేను నీకు ఏ గిఫ్టూ ఇవ్వకుండా,
నిన్ను నిరాశ పరిచానని నాకు తెలుసు...
అందుకు నీ కొచ్చిన కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను...
నేనెందుకు నీకు విషెస్ చెప్పలేకపోయానో,
పూలు తేలేక పోయానో, గిఫ్ట్ కొనలేక పోయానో,
నీకు మరో సారి చెప్పే ఓపిక లేదు,
నిన్ను ఎదురుకునే ధైర్యమూ లేదు.
నువ్వు అనుకున్నట్లు నేను ఏ అమ్మాయితోనో గడపలేదు.
వాలెంటైన్ డే నాడు నాతో వున్నఆ  ఇద్దరు మనుషులూ
నన్ను కన్న మా అమ్మా, కష్టపడి పెంచిన మా నాన్నా.

నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాన్నకి నోరు లేదు,
నేను ప్రేమిస్తున్నానని చెప్పినా అమ్మకు వినపడదు.
అందుకేనేమో నాకు ప్రేమ గురించి నీ అంత బాగా తెలియదు.
నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి నా వెంట పడి,
నా చేత బలవంతంగా నీ మీద  ప్రేమని ఒప్పించుకున్నావు.
ఇప్పుడు అడుగడుగునా నా నుంచి ప్రేమని ఆశిస్తున్నావు.

నీకు తెలిసిన ప్రేమ-
    రోజుకు పది పొగడ్తలు,వారానికి ఏడు పూలు, నెలకు నాలుగు గిఫ్ట్‌లు.
అదే నీకు తెలిసిన ప్రేమ ప్రపంచం. నీతో బతకాలంటే,  ీ ప్రపంచంలో నీ సంతోషం కోసం, నేను ఎలా ఉండాలో అని నువ్వు చెప్పే కండిషన్ లు అన్నీ పాటించాలి. అవసరం లేని పొగడ్తలు, జీవం లేని నవ్వులు, వాసన లేని  పువ్వులు, అడుగడుగునా నటనలు, అందరిపై నిందలు, కంపు కొట్టే వ్యక్తిత్వానికి ఖరీదైన బహుమతులు . ఇది అంతా నీ సంతోషం కోసం నేను చెయ్యాల్సిన పనులు. దీనికి నా సంతోషం తో పని వుండదు. నాతో నీకున్న అవసరాన్ని బట్టే ఇవన్నీ చెయ్యల్సుంటుంది.  ఇంతా కష్టపడి  నీ ప్రపంచం లో ఇమడటానికి,  ఇవి అన్నీ నీకు ఇచ్చినా, ఏదో ఒక రోజు నేను నువ్వు అనుకున్నట్లు లేనని నన్ను ఒదిలేసి వెళ్ళిపోతావు. నీ కోసం నేను నా డబ్బు, సమయం, ప్రేమ అన్నీ కురిపించి... చివరికి నువ్వు నన్ను కాదన్న కసితో పిచ్చి లోనో- కచ్చిలొనొ ఏదైనా చేసినా, చేసుకున్నా ...  చివరికి నా ప్రపంచం అంతం అయిపోతుంది. అసలు ఎవరో నన్ను ప్రేమించాలని అనుకోడానికి నా చుట్టూ ప్రేమకి కరువులెదు. నన్ను ఎవరో ప్రేమించాలి అని ఆశ పడుతూ కలలు కంటూ గడపడానికి, నాకు నీ అంత ఖాళీ లేదు.

నువ్వు ఊహించే ప్రేమ నువ్వు చూసే సినేమాలలోంచి, చదివే పుస్తకాలలోంచి, మాట్లాడే మనుషులనుంచి
పుట్టినది. దానికి నిన్నటి మన గతంతో  సంబంధం  లేదు, రేపు మనం విడిపోయినా దానికి బాధ్యత  కూడా ఉండదు.. ఈ రోజు నీకు నాకూ కుదిరిన కెమిస్ట్రీ తప్ప.

ేను నన్ను నమ్ముకున్నవాళ్ళకి ప్రేమని పంచుతూ ఇలా బతికేయ్యాలని ఆశిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాని నమ్మిస్తూ జీవితాంతం నటిస్తూ బతకాలని అనుకోవట్లేదు. నిన్ను ప్రేమిస్తున్నాని నాకు వాళ్ళు ఏనాడు చెప్పలేదు. మాకు నీ ప్రేమ అవసరం అని నన్ను ఏనాడు అర్ధించలేదు. నీతో గడిపిన ఇన్ని సంవత్సరాలలో, వాళ్ళని ఒక్క సారి కూడా కలవలెదు. అయినా జీవితపు ఆఖరి అంచులలో చూడడానికి ఒచ్చిన కొడుకు మీద చూపించిన ప్రేమలో స్వచ్చత, నాకు నా జీవితం విలువ తెలిసేలా చేసింది. నిజమైన ప్రేమ విలువ నేను ఈ రోజు తెలుసుకున్నాను.

ఈ వాలెంటైన్ డే నీకు నేను ఇచ్చే బహుమతి ఏమిటంటే ... నీకు నేను ఇచ్చే స్వేచ్చ.  అవును, నువ్వు ఆశించే విధంగా నిన్ను ప్రేమించే మనిషిని నువ్వు వెతుక్కునే స్వేచ్చ.
అప్పుడెప్పుడో నేను నీకొక చిన్న గిఫ్ట్ ఇచ్చాను, నీకు గుర్తు వుందో? లేదో?
నా మనసులో మాట చెప్పలేక, నువ్వు అడిగితే నీకు యెమివ్వలొ తెలియక ఇచ్చిన గిఫ్ట్.
నువ్వు ప్రేమించిన వాటిని స్వేచ్ఛగా  వొదిలెయ్యి ....
నీ వద్దకి అది తిరిగి ఒస్తే అది నీదే ...
ఒక వేళ అది తిరిగి రాకపోతే ...
అది నీది ఎప్పటికీ కానే కాదు..

నీ కోరికలు తీర్చే వాలెంటైన్ నీకు దొరకాలని ఆశిస్తూ...
నీ నుంచి సెలవు తీసుకుంటున్న
నీ
రాంగ్ వాలెంటైన్....