నాన్న చెప్పని నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాన్న చెప్పని నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2011, మంగళవారం

నాన్న చెప్పని నిజాలు

నా చిట్టి తల్లికి..

      నీ చిన్నప్పుడు నీకు నాన్న చెప్పని కొన్ని నిజాలు.

  •  నాన్నసూపర్ మాన్ కాదు... నీకోసం అప్పుడప్పుడు అలా అయిపోతాడు (నొప్పులు లెక్క చెయ్యకుండా).
  • నాన్నకు మంత్రాలు తెలియవు... నోటితో చిత్ర విచిత్ర శబ్దాలు చేసింది నీకు దెబ్బ తగిలిందని నువ్వు మర్చిపోడానికి.. నాన్న మంత్రాలకు చింతకాయలు రాలవు... కానీ.. నీ మొహం మీద చిరునవ్వు తెప్పిస్తాయి...
  • నాన్న మంచి గుర్రం.. కానీ TILES మీద మోకాళ్ళ తో పరిగెత్తితే ఏ గుర్రానికైనా నొప్పులోస్తాయి
  • నాన్న ఓడిపోయే కుందేలు - నిన్ను నెగ్గించే తాబేలు (పాలు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు)  
  • నాన్న కధలన్నీ కట్టు కధలే.. నీకు చెప్పాలనుకున్నది జంతువుల కధలతో చెప్తాడు  
  • నాన్న చూసినవి అన్నీ నీకు తప్పు చెప్పేది (గుర్రాన్ని గాడిద అనీ, కుక్కని పండి అనీ) ఎందుకంటె, నువ్వు సరి చేసినప్పుడు నీకు తెలుసో లేదో తెలుసుకోడానికి.. తెలియకపోతే నేర్పడానికి..
  • నాన్నకి మేజిక్ రాదు.. ఏదీ మాయం చెయ్యలేదు.. అన్నీ నాన్న చేతిలోనో, చొక్కాలోనో వున్నాయి
  • నువ్వు సోఫా మీద గెంతేటప్పుడు చుట్టూ దిళ్ళు వెయ్యడం ఆట కాదు.. నువ్వు పడితే దెబ్బ తగలకూడదని.
  • నీ ఫ్రెండ్స్ అందరూ నాన్న ఫ్రెండ్స్.. అందుకనే నాన్న నిన్ను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి తీసుకెళతాడు..నీకు ఆడుకోడానికి కంపెనీ కోసం
  • నువ్వు క్రికెట్ ఆడితే నాన్న బౌలర్, base బాల్ ఆడితే pitcher , బాస్కెట్ బాల్ ఆడితే కోచ్, ఫుట్ బాల్ ఆడితే గోలీ....
  • నువ్వు నాన్న బుజాలు ఎక్కినప్పుడు, నీ వెనక నాన్న చేతులు నువ్వు పడిపోకుండా పట్టుకోవాలని.. నువ్వు ఒద్దన్నా సరే.. 
  • మన చేపలు వాల్మార్ట్ కి వెళ్ళలేదు... మన నత్త పారిపోలేదు... (అవన్నీ చచ్చిపోయాయి..)
  • నాన్నకి అందరిలాగే వుద్యోగం వుంది.. చాలా పని  వుంది, ఆఫీసు కష్టాలు వున్నాయి, బాధించే బాసులు వున్నారు ... అవన్నీ నీ కంటే ముఖ్యం కాదు.. అందుకే నాన్న ఆఫీసు లో లేడు.  నీతోనే వున్నాడు నీకు అవసరం ఐనప్పుడు...  
  •  నాన్నకి జడ వెయ్యడం రాదు, బెండకాయలు ఏరడం రాదు, పియానో వాయించడం తెలియదు.. కానీ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు.. నీకోసం నేర్చుకోడానికి.
  •  నాన్న ఎప్పుడూ పూరియే ఆర్డర్ ఇస్తాడు.. నువ్వు తింటే నాన్నకి కడుపు నిండుతుందని
  • నువ్వు తినకుండా మారాం చేసినప్పుడు, పప్పు అన్నం ముద్దలు జంతువుల SHAPE లో మారవు. అవి నీ నోటిలోంచి పొట్టలోకి వెళ్లి అక్కడ పార్టీ చేసుకోవు..
  •  నాన్న కింగ్ కాదు. నిన్ను PRINCESS చెయ్యాలని నాన్న కింగ్ అయ్యాడు.. కింగ్ లు నిన్ను నవ్వించడానికి పిచ్చి గెంతులు వెయ్యరు. నీతో కలిసి డాన్సు చెయ్యరు..
ఐదేళ్ళు నిండిన నువ్వు పదే పదే, "డాడీ! ఐ యాం బిగ్ గర్ల్ నౌ", "దట్ ఈస్ ఫర్ బేబీస్, నాట్ ఫర్ మీ" అని అంటుంటే.. ఇక నిన్ను ఇంతకు ముందులా మభ్య పెట్టలేనని....