నా కూతురిని ప్రతి సోమవారం కుమోన్ కి ఇంగ్లీష్ రీడింగ్ కి తీసుకెళ్తూ వుంటాను. అక్కడ దాని హోం వర్క్ అయ్యాక అక్కడున్న పెద్ద సీసాలోంచి లాలిపాప్ తీసుకుని బయటకు రావడం అందరు పిల్లల లాగే మా అమ్మాయికి అలవాటు. అయితే వాళ్ళ అమ్మ కోసం గడ్డి పూలు, నాన్న కోసం పూసలు లాంటివి దొరికితే తెచ్చి నీకోసం తెచ్చానని ఇవ్వడం నా కూతురికి అలవాటు. అలా అప్పుడప్పుడు ఒక లాలిపాప్ బదులు రెండు తీసుకుని ఒచ్చి"నాన్నా! నీ కోసం", అని నాకు ఇవ్వడం జరుగుతూంటుంది.
సాధారణంగా ఇంటి దగ్గర వుంటే కుమోన్ బాధ్యత నాదే. డే కేర్ నించి తీసుకొచ్చి కొంచెం తిండి పెట్టి కుమోన్ తీసుకెళ్ళడం, అది కూడా సోమ వారం కాబట్టి కొంచెం హేక్టిక్. ఆ హడావిడిలో నేను ఆ రోజు తినకుండా బయలుదేరాను. వెనక నించి మా ఆవిడ "నీకు ఆకలేస్తుంది కదా! డబ్బా కట్టివన్నా?" అంటుంటే ఆలస్యమైపోయిందని అలాగే బయలుదేరా. ఎప్పటి లాగే కుమోన్ ఐపోయాక నా కూతురు లాలిపాప్ కోసం సీసా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ కుమోన్ హెడ్, మిస్సెస్ పి (ఆవిడ పేరు పార్వతి) అక్కడే నిలబడి వుంది. నా కూతురు మిస్సెస్ పి ని గమనిస్తూ తన వైపు చూడట్లేదని నిర్ధారణ చేసుకుని రెండు లాలిపాప్ లు తీసింది. తీసాక చేతులు వెనక్కి పెట్టుకుని మిస్సెస్ పి ని దాటుకుని బయటకు ఒచ్చింది. ఇదంతా గమనిస్తున్న నేను నాకోచ్చే నవ్వుని ఆపుకుని "ఎందుకు నీ చేతులు వెనక్కి పెట్టుకుని ఒచ్చావు?" అని అడిగాను. "మిస్సెస్ పి చూస్తే ఒక్కటే తీసుకోవాలి అంటుంది డాడీ" అంది. "మరి ఒక్కటే తీసుకోవాలి కదా!" అన్నాను. "నీ కోసం డాడీ. నీకు ఆకలేస్తుందని", అని నా చేతిలో ఒక లాలిపాప్ పెట్టింది. అసలే ఆకలి మీదున్న నాకు దాని మాటతోటే సగం కడుపు నిండింది, నా కూతురు నాకోసం దొంగతనంగా తెచ్చిన లాలిపాప్ చప్పిరిస్తూంటే కడుపు మిగిలిన సగం నిండింది. కానీ మనసులో ఎక్కడో నేను బాధ్యత గల తండ్రిగా అలా చెయ్యకూడదని, క్లాసు పీకకుండా ఎందుకున్నానని ఆలోచించడం మొదలెట్టా.
నిజానికి నేను చిన్నప్పుడు "సత్యమేవ జయతే", "ధర్మో రక్షతి రక్షితః","ఎల్లప్పుడూ సత్యమే పలుకవలెను", "దొంగ తనం మహా పాపం" లాంటి వన్నీ ఎంతో నిజాయితీగా పాటించేవాడిని. కానీ పెరిగే కొద్దీ అన్ని వేళల్లోనూ, అన్ని పరిస్థితుల లోను అల్లా వుంటే మనం బ్రతకలేము అని అర్ధం అయ్యింది.
చేసే పని సరయినది అయితే మార్గం ఎలా వున్నా పర్లేదు అనే మార్పు ఒచ్చింది. మంచి అనిపించింది (నా దృష్టిలో) చెయ్యాలంటే ఒక్కో సారి అబద్దమో, మోసమో చెయ్యక తప్పదు అనిపించేది. ముఖ్యంగా నా చుట్టూ ఉన్న కొంత మంది నిజాయితీ పరులు, సత్యవంతులు ఓడిపోతున్నప్పుడు వాళ్ళన్ని నిలబెట్టాలంటే ఏం చేసినా తప్పు లేదని నిర్ణయానికి ఒచ్చాను. పెళ్ళాం దగ్గర నిజాయితీ కోసం తల్లి తండ్రుల అవసరలాకి పనికి రాని కొడుకుల నిజాయితీ నాకు అక్కర్లేదని అనిపించింది. కొంచెం ఎక్కువ ఆలోచించినా నా కూతురుకి క్లాసు పీకకూడదని తీర్మానానికి ఒచ్చి, "నాన్న గురించి ఆలోచించినందుకు థాంక్స్, కానీ నువ్వు ఒక్కటే తీసుకో" అని మెత్తగా మందలించాను.
కానీ ఆలోచనలు అక్కడితో ఆగుతాయా.
"నాన్నా మా టీచర్ కళ్ళ జోడు విరిగిపోయిందట, కొని పెట్టు", అని వాల్మార్ట్ లో కళ్ళజోళ్ళ షాప్ చూపించి అడిగిన విషయం.
"మా టీచర్ దగ్గర డబ్బు లేవట, పిక్నిక్ అప్పుడు అందరి పిజ్జాలకి నువ్వు డబ్బులు కట్టు", అని డే కేర్ లో నా జేబులో చెయ్యి పెట్టిన విషయం....
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు "నీకోసం తెచ్చా", అని దాని బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టిన సందర్భాలు గుర్తుకొచ్చి...
మనసులో ఎక్కడో "మిస్సెస్ పి లాలిపాప్ దొంగిలించి నాన్నకు పంచినట్లు, రేపొద్దున్న ఆస్తులు దోచి అందరికీ పంచదు కదా? రాబిన్ హుడ్ సినిమాలోలా", అనిపించింది.