LUNCH లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
LUNCH లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2010, శనివారం

మా అమ్మాయి లంచ్ బాక్స్ సమస్య

మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకో పెద్ద సమస్యగా తయ్యారయ్యింది. రోజూ పట్టుకెల్లింది పట్టుకెల్లినట్లు వెనక్కి ఒచ్చేస్తుంది. ఒక్కో రోజు అది తినలేదని తెలిసినా మేము ఇంట్లో పెట్టినట్లుగా, వెనకబడి తినిపించమని అంటామేమో అన్న అనుమానంతో కాబోలు వాళ్ళు డబ్బా కడిగేసి పంపుతున్నారు.
పోనీ అది మామూలుగా ఇంటి దగ్గర తినే అన్నము, కూరలతోనో, పప్పుతోనో పెట్టి పంపిందామని అనుకుంటాము. రేపు నీకు నచ్చిన కూర పెట్టనా? అని దాన్ని అడిగితే ఆలోచించకుండానే ఒద్దంటుంది. ఇంతా చేస్తే దీని వయసు నాలుగున్నరే. నేను అయితే తొమ్మిదో తరగతిలో కూడా ఎండి పోయిన పప్పన్నం పెట్టినా సరే, మనసులో తిట్టుకుంటూ తినేసేవాడిని. ఒక్కో సారి అయితే మా అమ్మ తరవాణి అని చెప్పి రాత్రి అన్నంలో పాలు వేసి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి డబ్బాలో తోడు పెట్టి ఇస్తే, పక్కన ఆవకాయ నంచుకుని లంచ్ లో తినేసిన సందర్భాలు నా ఇంటర్మీడియట్ దాకా వున్నాయి. పోనీ నీకు నచ్చినవేంటి అని అడిగితే అది పెద్ద ఆరిందాలా "మీట్ బాల్స్ అనీ, హాట్ డాగ్ అనీ, చికెన్ అనీ" చెప్తూంటుంది. నేనేమో మాంసాహారం వీలైనంత మటుకూ తినకూదడనే నియమం వున్న వాడిని, దానికి అయితే కనీసం గుడ్డు కూడా పడదు. అప్పటికీ దానికోసం మంచురియా ని మీట్ బాల్స్ గానూ, మీల్ మేకర్ ని చికెన్ గానూ, మాంసం లేని హాట్ డాగ్ లనీ ట్రై చేసాము. అవేవీ దానికి రుచించలేదు.
 ఇదే విషయం చాలా మంది తల్లులు ప్రస్తావించడం పార్టీ లలో చూసాను.  భారత దేశం లో అయితే పరవాలేదు, కానీ విదేశాలలో అయితే, తోటి పిల్లలు వెక్కిరిస్తారని పిల్లలు లంచ్ లో అన్నం పెడితే తినకుండా తెచ్చేస్తారు. పిల్లల దాకా ఎందుకు, చాలా మంది పెద్ద వాళ్ళు వేడి చేసేటప్పుడు మైక్రో-వేవు దగ్గర, డబ్బా డెస్క్ దగ్గర తీసి తినేటప్పుడూ పక్క వాళ్ళు కంపు అంటారని మన కూరలు ఆఫీసు కి పట్టుకెల్లరు. ఎవడో నాలాంటి వాడు అయితే గానీ. నేను అయితే ఆఫీసు లో రెండు పచ్చడులు, రెండు పొడులు పెట్టుకుని మరీ లంచ్ లాగించేవాడిని. ఎవడైనా వెక్కిరిస్తే దీనికోసమేరా ఆ కొలంబస్ గాడు మీ దేశాన్ని కనిపెట్టాడు అని SPICE ల గురించి నైస్ గా క్లాసు పీకేస్తాను. అంత కంటే ఎక్కువ మాట్లాడితే నువ్వు తిన్న SALMON కంపు కన్నా ఇది బెటర్ అని కూడా అంటాను. వీడి నోట్లో నోరు ఎందుకు మనకసలే SPICY పడదు అని ఊరుకుంటారు.

నాకైతే ఒకటి అర్ధం అయ్యింది నా చిన్నప్పటి అలవాటుని బట్టి - ఏదైనా పొడిగా వున్న ఐటెం అయితే బావుంటుంది. మా అమ్మాయికి దోశ అంటే బాగా ఇష్టం- దాన్ని వారానికి రెండు సార్లు పెట్టచ్చు. దాని మధ్యలో ఒక సారి మకరోని పాస్తా (మకారోని) ఇంకోసారి సేమ్య ఉప్మా పెట్టి నడిపిస్తాము. శుక్ర వారం ఎలాగో వాళ్ళు పిజ్జా పెడతారు, మనం డబ్బులు కడితే.

ఇలాంటి సమస్య చాలా మందికి ఒచ్చి వుంటుంది కాబట్టి, మీకు తెలిసిన పొడి ఐటెం లంచ్ కి పంపగలిగేలా వున్నది సలహా ఇస్తే మీ బ్లాగ్గులో కామెంట్ కొట్టి ఋణం తీర్చుకుంటా. మా అమ్మాయి ఉప్మా,ఇడ్లి లు పెద్దగా తినదు. ముఖ్యంగా శాఖాహారం అయ్యుండాలి - లేకపోతే వాళ్ళ నాన్న ఒప్పుకోడు.