baalyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
baalyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, సెప్టెంబర్ 2010, గురువారం

నీతోపాటు మరో బాల్యం

నా చిన్నారి తల్లికి,
    నీతోపాటు మరో బాల్యం గడిపే అవకాశం కల్పించినందుకు ఆ దేవుడికి ఎన్నోకృతజ్ఞతలు. నిజానికి నిన్ను మోసింది తొమ్మిది నెలల పాటు మీ అమ్మే ఐనా, మరి మీ అమ్మని మోస్తూ (అంటే భరిస్తూ, మరి భరించేవాడే భర్త అని అన్నారు కదా? అందుకే అలా రాసేసానన్న మాట) వున్నది నేను కాబట్టి పరోక్షంగా నేను కూడా నిన్ను మోసినట్టే. నీ కోసం ఆసుపత్రిలో మీ అమ్మ డెలివరీ కి నేను షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేసే extra ప్లేయర్ అంత ఉత్సాహంగా ఎదురు చూసాను. మీ అమ్మకి ధైర్యం చెప్తూ మా అమ్మ వొచ్చిన దేవుడి శ్లోకాలన్నీ చదివేస్తూ వుంటే,  అయోమయంగా నేను చూస్తుంటే, నరసమ్మ (మంత్రసాని అంటే అమెరికాలో తంతారేమో) నిన్ను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టింది. అక్కడినించి గేమ్ స్టార్ట్.
 నిన్ను చూసిన వాళ్ళు అందరూ నా పోలిక అని చెప్తుంటే, విపరీతంగా కుళ్లుకునే మీ అమ్మని చూసి-- నా విజయదరహాసాన్ని ఆపుకోలేక చాలాసార్లు మీ అమ్మకి దొరికి పోయి దెబ్బలు తినేసాను. అప్పట్నుంచి మొదలు నా కష్టాలు, నిన్ను ఎలా పెంచాలో అని కంగారు. నిన్ను ఎవరి చేతిలో పెట్టినా, ఎక్కడ వాళ్ళు సరిగ్గా పట్టుకోలేదో అని వాళ్ళ చేతులకిందే చేతులు పెడితే.. "పోవయ్యా బడాయి.. ఇంతోటి గొప్పలు" అని తిడుతున్నట్టు వాళ్ళు చూసే చూపులకి అప్పుడప్పుడు నాకే ఎక్కువ చేస్తున్నానా అని అనిపించేది. నువ్వు ఇంటికి వొచ్చిన మొదటి రోజు మేడమీదకి నిన్ను కార్ సీట్ లోనే తీసుకెళ్తానని అమ్మకి చెప్తుంటే.. అమ్మ ఒకటే నవ్వడం.  తాతకి దగ్గులు నేర్పించినట్లు, పెళ్లి కూతురికి సిగ్గులు నేర్పించినట్లు, నీ కూతురు పుణ్యమా అని నేను ఇప్పుడు నీ దగ్గర పిల్లల్ని ఎత్తుకోడం నేర్చుకోవాలా?  అని అమ్మ విసుక్కోడం. 

 నువ్వు తుమ్మినా, దగ్గినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం. అక్కడేమో నన్నూ, నా కంగారుని చూసి డాక్టర్లు కోపం వొచ్చినా, co pay వొస్తోంది కదా అని భరించడం. ఇంకా నువ్వు దూకేటప్పుడు కింద పడేలోపు నేను దిండ్లు వేసే ప్రహసనం చూసి మీ అమ్మ నన్ను వుడికించడం. నువ్వు పాకడం మొదలు పెట్టాక ఇంట్లో అన్నీ అటక ఎక్కించడం. నడక ఒచ్చాక అన్నింటికీ తాళాలు వెయ్యడం. నీతో పాటు Curious George, చిన్నారి చిట్టి గీతాలు, DORA లు చూడడం. నువ్వెక్కడ నోట్లో పెట్టుకుంటావో అని కార్పెట్ మీద పాకుతూ అన్నీ ఏరడం. నీ కోసం లాలి పాటలు, జోల పాటలు నేర్చుకోవడం.

అసలు ఎలా గడిచిపోయిందో కాలం.. నీకిప్పుడు నాలుగేళ్ళు అంటే నాకే ఆశ్చర్యంగా వుంటుంది. ఈ నాలుగేళ్ళలో నీతో పాటు నేను అమెరికాలో బాల్యాన్ని చూసాను. చిన్నప్పుడు నాకసలు బొమ్మలు వున్నట్లు గుర్తు లేవు, కానీ ఇప్పుడు మనకి ఎన్ని బొమ్మలో.  నా మొదటి బాల్యం నాకు అస్సలు గుర్తు లేదు, నా ఈ రెండో బాల్యం లో మీ అమ్మకి నీ మీద వున్న ప్రేమ, మా అమ్మకి  నా మీద వున్న ప్రేమ (అదే నీ మీద ప్రేమ చూపించినప్పుడు) రెండూ కళ్ళారా చూసి ఎంత పొంగిపోయానో.    

అమెరికాలో నీతో పాటు మరో బాల్యం ఎంత బాగుందో.