నీ చేరువలో నేను వున్నప్పుడు
అడుగడుగునా నన్ను నిలదీస్తావు
అనుమానంతో కడిగేస్తావు
నిన్ను కాపాడుతుంటే కస్సుమంటావు
ఓదారుస్తుంటే అక్కర్లేదంటావు
తప్పు దిద్దుతుంటే తూర్పార బడతావు
సాయం చెయ్యబోతే కసురుకుంటావు
నిన్ను పల్లకి ఎక్కించాలనుకునే నా బలగాలని
నీ పదునైన పలుకులతో పొడి చేస్తావు
నా వెనక గోతులు తవ్వి
నావన్నీ శ్రీరంగ నీతులని చాటేస్తావు
నేను నీకు పట్టం కట్టిన మన సామ్రాజ్యంలో
నీ అసూయ తో ఆరని చిచ్చు పెడుతుంటావు
నీ నిందలు నిజాలు కావని నీకు తెలుసు
నీ మాటలు నిజాలు కావని నాకు తెలుసు
మన అనుబంధం నా ప్రేమకి ప్రతిబింబం
నీకే అర్ధం గాని నువ్వు నాకు అర్ధమవుతావు
చేరువలో మనమున్నా మన మధ్య వున్న
ఈ దూరం చెరిపేదేలా?
అంకితం: అనుబంధాలని నమ్మకం పునాదుల మీద నిర్మించలేని మనుషులని సహనంతో భరిస్తున్న అందరికీ
Image taken from: http://www.freakingnews.com/