వీకెండ్ ఇంటికొచ్చిన నాకు మా అమ్మాయి ఒక SURPRISE అని చెప్పి, పైన చూపించిన పుస్తకం లాంటిది చేతిలో పెట్టింది. అప్పటికి FATHER 's డే ఇంకా ఒక రోజు వున్నా, నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని ఆత్రం కొద్దీ నన్ను చూసిన వెంటనే వాళ్ళ అమ్మ వెంట పడింది. నాకు ఇప్పుడు అర్జెంటు గా నేను ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ దాచావో వెతికివ్వు అని పీడించి మరీ వెతికిచ్చే దాకా ఊరుకోలేదు. ఆ తరవాత ప్రతి పది నిమిషాలకి నాకు ఒక ముద్దు పెట్టి, విష్ చెయ్యడం మొదలు పెట్టింది.
అప్పుడు నేను కూడా మర్చిపోకుండా నాన్నకి విషెస్ చెప్పాలని అనుకున్నాను. చూసారా మనకి పిల్లలు పుట్టాకే మన అమ్మ నాన్నలు విలువ ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు తండ్రుల రోజు గురించిన ఆలోచనలో పడ్డాను. ఇంతకు ముందు తరంలో ఇలా తండ్రుల రోజు లాంటి ఆచారాలు లేవు. అసలు పిల్లల పెంపకంలో తండ్రులు అంత పెద్ద పాత్ర పోషించే వాళ్ళు కాదు. నాకు తెలిసి తండ్రి అంటే భయమే వుండేది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ మా తరం వాళ్లకి తండ్రులంటే సిగ్గుతో కూడిన భయంలాంటి గౌరవం అనుకోండి అతడు సినిమాలో చెప్పినట్లు.
అలాంటి తండ్రుల నించి ఈ తరం తండ్రులని చూస్తే చాల ఆశర్యం వేస్తుంది. చాల మంది మగాళ్ళు ఇంటి పనులు చేస్తారు ఈ రోజుల్లో, దానితో పాటు ఇంచుమించు తల్లి చేసే పనులన్నే చేస్తారు. ఈ రోజుల్లో తండ్రులు తల్లులు అంత కాకపోయినా, చాలా బాధ్యత తీసుకుంటున్నారు. నేనైతే అలాంటి తండ్రులను చాలా మందిని చూస్తున్నాను. ఇలాంటి తండ్రులందరికీ ఈ FATHER 's DAY సందర్భంగా విషెస్ చెప్తున్నాను.
ముఖ్యంగా.
- పిల్లల diaper మార్చే తండ్రులు
- అన్నం తినిపించే తండ్రులు
- హోం వర్క్ చేయించే తండ్రులు
- స్నానం చేయించే తండ్రులు
- ఒంట్లో బాలేకపోతే సెలవో, వర్క్ ఫ్రం హోం అనో పక్కునుండే తండ్రులు
- సినిమా మధ్యలో బాత్రూం కి తీసుకెళ్ళే తండ్రులు (అది కూడా ఆడ పిల్లలని)
- సైకిల్ తొక్కుతుంటే వెనక పట్టుకుని పరిగెత్తే తండ్రులు
- చొక్కాకి ముక్కు చీమిడి తుడిచేసే తండ్రులు
- ఉప్పు మూట ఎక్కించుకుని షాపింగ్ మాల్ లో తిప్పే తండ్రులు
మారుతున్న కాలంతో పాటుగా, పెరుగుతున్న బాధ్యతలను భుజాన వేసుకుని, "మా నాన్న నాకు ఇలా చెయ్యలేదు కదా?" అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా చేసుకుపోయే...
నేటి నాన్నలూ - మీకు నా జోహార్లు..
ఇలాంటి చిన్న చిన్న గిఫ్టులు ఒచ్చినా రాకపోయినా, ఆఫీసు నించి అలసిపోయిన మీకు అందిన చిన్న చిన్న ముద్దులు, ఎదురు పడగానే వెదజల్లే చిరునవ్వుల సిరులు మీ కష్టాలకు ప్రతిఫలాలు.
మీరంతా ఆకాశమంత లో ప్రకాష్ రాజులు, గులాబిలో చంద్ర మోహన్లు.