మా చిన్న అమ్మాయికీ నాకూ మధ్య చాలా కమ్యూనికేషన్ గాప్ వుంది. "నాకు ఆకలేస్తుంది", అని అది చెపితే అర్ధం చేసుకునే సీను మనకి లేదు. "నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు", అని నా కూతురు నాకు చెప్తున్నా దాని ఫీలింగ్ ఇది అని నేను గ్రహించట్లేదు. ఇలాంటి కమ్యూనికేషన్ గాప్ లని అధిగమించడానికి కలిసి కొంత టైం స్పెండ్ చెయ్యడం ద్వారా, మరియు చర్చల ద్వారా సాధ్యం అని చాలా మంది దగ్గర విన్నాను. టైం స్పెండ్ చెయ్యడానికి మనం వేరే వూరిలో వుద్యోగం వెలగబెడుతున్నాం. వీకెండ్ ఇంటికొస్తే ఒక పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, బండెడు చాకిరి.. కాబట్టి టైం ఎక్కువ కేటాయిన్చలేము. పోనీ చర్చల ద్వారా పరిష్కరించుదామంటే మా ఇద్దరికీ మధ్య ఒకళ్ళ గొడవ ఇంకొకళ్ళకు అర్ధం కాని పరిస్థితి.. అసలు కమ్యూనికేషన్ అన్నదే సరిగ్గా లేదు..
అలాంటప్పుడే నేను నా చుట్టూ వున్న ప్రపంచంలో ఇలాంటి సమస్య ఎవరెవరికి వుంది అని ఆలోచిస్తుంటాను. మా అన్నయ్యకీ - నాన్నకీ మధ్య వుంది. నా చిన్నప్పుడు బాగా గుర్తు.. మా అన్నయ్య చాలా కష్టపడి చదివే వాడు. వాడి భవిష్యత్తు గురించి మా నాన్నకి చాలా స్కీములు ఉండేవి. ఆ రేంజ్ లోనే వాడి డిమాండ్స్ ఉండేవి. కొత్త కామెల్ GEOMETRY బాక్స్, కొత్త బుక్స్, కొత్త సైకిల్, కొత్త మోపెడ్ అన్నీ కొత్తవే.. మనకేమో అన్నీవాడు వాడి వోదిలేసినవి. ఎంత అరిచి గీ పెట్టి అన్నాహజారే లా అన్నయ్య తో సమాన హక్కుల కోసం నిరాహార దీక్ష చేసినా జీవితంలో ఒక నటరాజ్ GEOMETRY బాక్స్ తప్ప ఇంకేమి సాధించుకోలేదు. అలాంటి తండ్రీ కొడుకుల మధ్య పెద్దగా మాటలు వుండవు. ఎప్పుడో ఒకటో రెండో మాటలు అవసరం వుంటే మాత్రమే మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్. తండ్రి ఆరోగ్యం గురించి కొడుకు ఆరా అడగలేనంత - కొడుకు ఆర్ధిక పరిస్థితి గురించి తండ్రి వివరాలు అడగలేనంత కమ్యూనికేషన్ గాప్.
ఇలాంటి తండ్రీ కొడుకులు మన చుట్టు పక్కల చాలా మంది వుంటారు.
- పించను లేని తండ్రి నెలకి కనీస అవసరాలు ఖర్చు ఎంతో అడిగి, అది పెళ్ళానికి తెలియకుండా తండ్రికి ఇవ్వలేనని చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్.
- "ఆపరేషన్ చేయించుకో నేను దగ్గరుండి చూసుకుంటా", అని అనారోగ్యంతో వున్న తండ్రికి కొడుకు ధైర్యం చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్.
- "అమ్మ కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను కానీ నీ అవమానాలు భరించలేను", అని నిత్యం అవమానించే ఆస్తి వున్న తండ్రికి, అంతస్తు లేని కొడుకు చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్.
- "నా ఆస్తి నీకే ఇస్తాను. కానీ నన్ను, నా భార్యని వృద్ధాప్యంలో సరిగా చూసుకో", అని ఆస్తి వుండి, కొడుకు ప్రేమ సంపాదించని తండ్రి .. తన కొడుక్కి చెప్పలేని.. కమ్యూనికేషన్ గ్యాప్.
- "పిల్లలని నాలుగు రోజులు మీ దగ్గర ఉంచడానికి నా భార్యని ఒప్పించలేను", అని విదేశాల నించి ఒచ్చిన కొడుకు, తల్లి తండ్రులకి చెప్పలేని కమ్యూనికేషన్ గాప్.
- "నా కోసం కాకపోయినా ఆస్తి కోసమైనా నా దగ్గరికి మీరు ఒస్తారు, అందుకని ఆస్తి పంచట్లేదు", అని డబ్బున్న తండ్రి వాటా కోసం ఇంటి కొచ్చి డిమాండ్ చేసే పిల్లలకు చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్.
ఇవన్నీ కేవలం తండ్రీ కొడుకుల మధ్యన నాకు తెలిసిన ప్రపంచంలోని ఉదాహరణలు మాత్రమే. "నీకోసం గుండె కోసిస్తానమ్మా", అని కబుర్లు చెప్పి .. అనారోగ్యంతో ఉన్న తల్లిని తన ఓదార్పు కోసం మాత్రమే కాల్ చేసి.. తల్లి కోసం కాకుండా పెళ్లి కోసం ఇండియా వెళ్ళే కొడుకులు. ఇలాంటి కధలు ఎన్నో.. ఎన్నెన్నో...
అయితే నాకూ నా చిన్న కూతురికీ మధ్య వున్న కమ్యూనికేషన్ గ్యాప్ వీటంత సీరియస్ కాదని, ఇవన్నీ ఆలోచించాక నాకు అనిపించింది. దాని వయసు రెండు నెలలు.. కొంచెం వీకెండ్ సిరి (మా పెద్ద అమ్మాయి), నేను కలిసి కాస్త ట్రై చేస్తే సాహితి (మా చిన్నమ్మాయి) భాష కూడా (అదే ఏడుపుని బట్టి విషయం కనిపెట్టడం) అర్ధం అవుతుంది. ఆల్రెడీ సిరి కొంచెం దాని ఏడుపుని DECODE చేసే ప్రయత్నం చేస్తోంది. సాహితి ఎడ్చినప్పుడల్లా "MAY BE WE NEED TO CHANGE HER DIAPER ".. అని. DIAPER మార్చిన తరవాత ఏడుపు తగ్గకపోతే "SHE NEEDS మిల్క్" అనీ హడావిడి చేస్తూ వుంటుంది. సిరి సహాయంతో నాకూ-సాహితీకి వున్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోవచ్చు అనిపిస్తోంది. కానీ నా చుట్టూ వుండే మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా పూడ్చాలి అన్నదే పెద్ద సమస్య.
వృద్ధాప్యం లో అవసరమైన ఆసరా కోసం- పిల్లలని నిలదీస్తే పెద్దరికం కాపాడుకోలేమని తండ్రులు ముందడుగు వెయ్యలేకపోయినా.. పిల్లలు ఒక అడుగు ముందుకేసి.. వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుందేమో.. కానీ మనం చెప్తే విన్టారంటారా????