15, డిసెంబర్ 2010, బుధవారం

కూతురి చావుని కోరుకున్న మా అమ్మమ్మ - ఒక గుజారిష్ తల్లి

చాలా మందికి గుజారిష్ నచ్చలేదు అని రాశారు. ఎన్నో రివ్యూ లు చదివి, అందులో చాలా మంది చూడక్కర్లేదు అని రాసినా, డబ్బులు వేస్ట్ అని చెప్పినా, ఇంటర్ర్నేట్ లో ఈ సినిమా వుందని లింకులు పంపినా నేను ఆగలేదు. అంతకు ముందు సంజయ్ సినిమాలు కొంచెం నన్ను నిరుత్సాహ పరిచాయి, ఐనా సరే ఈ సినిమాకి వెళ్ళాను. చూసినప్పటి నించీ దీని గురించి రివ్యూ రాద్దామని ప్రయత్నం. ఈ సినిమా నన్ను చాలా బాధ పెట్టింది. అంటే చూడలేనంత చెత్త సినిమా అని కాదు. మరో విధంగా ఆలోచనల్లో వెంటాడి.  ఈ సినిమాలో హ్రితిక్ తల్లిని కోర్ట్ లో ఒక ప్రశ్న వేస్తారు, "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అని. ఈ ప్రశ్న నన్ను అప్పటినించి వెంటాడుతూ ఉంది. చచ్చిపోయిన మా అమ్మమ్మ లాగ హ్రితిక్ తల్లి "అవును" అంటుంది. ఎంత నిర్దాక్షిణ్యం, ఒక తల్లి ఇలా అనచ్చా? అనిపిస్తుంది.  కానీ ఇలా అనే తల్లులు వున్నారు. ఆ తల్లి బాధ మనకి అర్ధం కాదు.   
చిన్నప్పుడు నాకూ అర్ధం కాలేదు, ఎలా అంటే నాకో అమ్మమ్మ వుండేది. ఎంతటి సహనశీలి అంటే నాకు తెలిసి ఆవిడ ఎవ్వరినీ తిట్టి ఎరగదు, ఈవిడకి కోపం ఒస్తే ఎప్పుడైనా చూడాలని అనుకునేవాడిని. ఎంత ట్రై చేసి కోపం తెప్పించినా కేవలం "కక్క గట్ట" అన్న తిట్టుతో సరిపెట్టేసేది. నేను, మా ఆన్నయ్య అమ్మ ఇంట్లో లేని టైములో ఇల్లు కిష్కింద చేసి, రక్తాలు ఒచ్చేల కొట్టుకున్నా కూడా ఏమీ అనేది కాదు. గయ్యాళి గంపల్లాంటి కోడళ్ళు, పెళ్ళాల నోరుకి జడిసి బతికే కొడుకులు, ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేయకుండా పోయిన భర్త, భర్త పోయే నాటికి బడికెళ్లే చిన్న కొడుకు, ఉద్యమాలలో జైలుకెళ్ళిన పెద్ద కొడుకు, చిల్లి గవ్వ లేని ఆస్తి. ఇవన్నీ కూడా నెట్టుకుని ఎవ్వరినీ నొప్పించకుండా చివరి దాకా బతుకు లాగించిన మా అమ్మమ్మకి మిగిలిన బెంగ ఏమిటయ్యా? అంటే అది తన పెద్ద కూతురి చావు.  బతికినంత కాలం ఎవరి మీద ఒక్క పితూరీ చెప్పడం గానీ, తిట్టు గానీ తిట్టి ఎరగదు. మాటకి ముందు ఒక "అయ్యో పాపం" అని చేర్చి మాట్లాడేది.  అంతటి సహనశీలి ఒక విషయంలో నాకు నచ్చేది కాదు. అదేమిటంటే తన పెద్ద కూతురు తనకంటే ముందే చచ్చిపోవాలని భగవంతుని కోరేది. అలా అన్నప్పుడల్లా నేను "అదేంటి అమ్మమ్మ? ఏ తల్లైనా అలా కోరుకుంటుందా? తప్పు కదా!" అని అనేవాడిని. నేనే కాదు, అమ్మ, అక్క అందరూ ఇలాగే అనేవాళ్ళం. "మీకు తెలీదర్రా? దాని అమాయకత్వానికి, పరాధీన బతుక్కి. నేను ఉండగానే నా కళ్ళ ముందు పోతే నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను" అనేది. మానసికంగా ఎదగని పెద్ద కూతురు తన కంటే ముందే పోవాలని ఎంతగానో ప్రార్ధించిన అమ్మమ్మ ముందే చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పెద్ద కూతురి కష్టాలు చూస్తుంటే నాకు అమ్మమ్మ లోని అమ్మ మనసు అర్ధం అవుతుంది. "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అన్న సినిమాలో ప్రశ్నకి, శాంత మూర్తి ఐన మా అమ్మమ్మ "అవును..అవును...ను...ను....ను.... " అని అరిచి బిగ్గరగా సమాధానం చెప్పినట్లు వుంటుంది - ఆ సమాధానం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ.
 నిజానికి ఈ సినిమా చాలా బాగా తీసాడు.  అయితే ఇది సగటు ప్రేక్షకుడికి అస్సలు నచ్చదు. చాల మంది హ్రితిక్ నో, ఐస్ నో చూసి డాన్సుల కోసం సినిమా కెళ్తే చాలా నిరుత్సాహ పడతారు. అలాగే చాలా మంది రివ్యూ లలో రాసినట్టు సంజయ్ లీల బన్సాలి కధలు ఇంగ్లీషు సినిమాలు చూసి చాలా మటుకు కాపీ కొట్టినవే. నేను ఈ సబ్జెక్టు మీద ఒచ్చిన "ది సీ ఇన్ సైడ్" లాంటివి చూడలేదు. అదీ గాక కొంచెం సినిమా విషయంలో కొందరు బావుందని అన్నారు. EUTHENASIA లేదా MERCY KILLING లాంటి టాపిక్ మన జనాలకు ఎక్కదు. ముఖ్యంగా మన దేశంలో జనాలకి సినిమా అంటే ఒక ENTERTAINMENT , డబ్బులు పెట్టి ఏడిపిస్తే ఒప్పుకునేది లేదు అంటారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమా ఎలా చూసినా జనాలకి నచ్చదు. అంత మాత్రాన నాలాంటి సినిమా పిచ్చోడు ఒదిలేస్తాడా? సినిమా బాలేక పోతే, బన్సాలి అంతటి ఘనుడు ఎక్కడ పప్పులో కాలేసాడో మనం చూసి, ఎవడూ అడగకపోయినా మన అభిప్రాయాన్ని చెప్పెయ్యమూ? అదే మరి సినిమా  పిచ్చి అంటే .....

ఇక సినిమాలో కొస్తే, చాలా POSITIVES వున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హ్రితిక్ రోషన్.  ఆ తరవాత సినిమాటోగ్రఫీ. ముఖ్యంగా అన్ని పాత్రలూ పరిమితికి మించకుండా చేసారు. మేజిక్ అయితే హ్రితిక్ చాలా అద్భుతంగా ఒక డాన్సు చేసినట్టు, భలే పండించాడు. ఈ పాత్రకి హ్రితిక్ తప్ప ఇంకొకళ్ళు న్యాయం చెయ్యలేరు అన్న విధంగా నటించాడు.  ఐసు పరవాలేదు అనిపించింది, నాకైతే కొంచెం వయసు ముదిరిన ఛాయలు కనిపించాయి. ఆ పాత్ర ఐసు మాత్రమే చెయ్యగలదు అనిపించే పాత్ర కాదు. సినిమాలో కొన్ని సీన్లు గుండెలు పిండేస్తాయి. పెద్ద హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన పాట "WHAT A WONDREFUL WORLD " సినిమాలో వాళ్ళ అమ్మ దహన కాండ దగ్గర హ్రితిక్ పాడతాడు. ఈ పాట నేను అంతకు ముందు చాలా సార్లు విన్నాను. దీనిని LOUIS ARMSTRONG చివరి దశలో రాసిన పాట. మడగాస్కార్ అనే యానిమేషన్ సినిమాలో కూడా ఈ పాట చిన్న బిట్టు ఒస్తుంది. ఇది చాలా అద్భుతమైన పాట. ఈ పాట 1969 లోది అయినా, ఆ తరవాత ఎంతో మంది ఆర్టిస్టులు ఈ పాటని మళ్ళీ మళ్ళీ చాలా చోట్ల వాడారు. ఈ సినిమాలో ఆ సందర్భానికి ఈ పాట మనకి కన్నీళ్ళు తెప్పిస్తుంది. తన మొదటి మేజిక్ ట్రిక్ గురించి  హ్రితిక్ చెప్తుంటే  అతని శిష్యుడు "అయితే కురిసే నాణెములు అన్న మాట మీ మొదటి ట్రిక్" అని అంటే......  "కాదు, అమ్మ చిరునవ్వు" అన్న సెంటిమెంటు బాగా పండింది.
చివర్లో హ్రితిక్ స్పీచ్ ఒక అద్బుతం, మిగిలిన పాత్రలను గురించి హ్రితిక్  చెప్పినదానికి తన కవిత్వం జోడించి దీన్ని అమోఘంగా తెలుగులో రాసిన నరేష్ నున్నాగారి  నవతరంగం బ్లాగు పోస్ట్  చదవండి.
అయితే సినిమా లో స్టొరీ చెప్పిన పద్ధతి కొంచెం మారిస్తే ఇంకా క్లిక్ అయ్యేదేమో. సినిమాలో హ్రితిక్ బాధ మనకి అర్ధం అయ్యేటప్పటికి మనకి సినిమా మూడు ఒంతులు అయిపోయినట్లు వుంటుంది. సినిమాలో ఒకటి రెండు పాత్రలు తొందరగా హ్రితిక్   నిర్ణయంతో ఏకీభవిస్తాయి, కానీ మిగిలిన పాత్రల లాగ మనము కూడా తేల్చుకోలేకపోతాము. అయితే మొదటి నించీ మనకి హ్రితిక్ తరపునుంచి సినిమాని చూపిస్తే, చివరకి మనమే పాపం చచ్చిపోనివ్వచ్చు కదా! అనుకుంటాము. పక్క వాడు పడిపోతే నవ్విన వాళ్లకి వాళ్ళు పడిపోయాక గానీ తెలియదు ఆ బాధ ఎలా వుంటుందో.  ఇలా బాధ పడే వాళ్ళు మనకి ఒకళ్ళు కూడా తారసపడక పోతే మనకి ఇది అర్ధం అవ్వడం కష్టం. ఇందులో హ్రితిక్ కి శరీరం మెదడు మినహా చచ్చుబడి పోతుంది, కిడ్నీలు చెడిపోయి, గుండె బలహీనమై, ఊపిరి తిత్తులు క్షీణించి ఏనాటికైనా నయం అవచ్చు అన్న ఆశ చచ్చిపోతుంది. అలాంటి మనిషి చచ్చిపోవాలని అర్జీ పెట్టుకుంటాడు. వృద్ధాప్యంలో అనారోగ్యాలు వున్నా,  కొంచెం కాళ్ళూ చేతులూ ఆడుతూ, ఆర్ధికంగా పిల్లల మీద ఆధారపడే పరిస్థితుల్లో , వాళ్ళు సరిగ్గా పట్టించుకోక, పలకరించే దిక్కులేక ఎప్పుడు చస్తానురా అని ఎదురు చూసే మనుషులు మన చుట్టూ వున్నారు. వాళ్ళని మనం పలకరించి చూస్తే తెలుస్తుంది. విదేశాలకి వెళ్లి పది ఏళ్ళు ఐనా ఒక్క సారి ఇండియా ఒచ్చి తల్లి తండ్రులని చూడని  పిల్లలు, ఒకే ఊరులో వున్నా పట్టించుకోని పిల్లలు, పెళ్లి అయ్యాక పెళ్ళాం బెల్లం అయ్యి - తల్లి తండ్రులు శత్రువులు అనుకుని పలకరించని పట్టించుకోని పిల్లలు వాళ్ళ అమ్మ-నాన్నల  మనసుల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది... మనకి విలువ లేని మన మనుషులే మనల్ని పట్టించుకోని వాళ్ళు ఒక్క సారైనా అలా ఆలోచిస్తారని. 

  ఒక మనిషి చావుని కోరుకోడం మనం సమర్ధించం. ఎందుకో మనకి పూర్తి అవగాహన లేకపోయినా, అది అంతే అనుకుంటాము. చాల మంది దృష్టిలో అది భగవంతుడి పని. కానీ ఒక మనిషి జీవితానికి ఒక్కో సారి బతుకే శిక్ష అయితే? నేను ఈ సినిమా ఒక పదిహేను , ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే నేను కూడా తప్పు అనుకునేవాడినేమో. కానీ కొన్ని జీవితాలు చూసాక ఒక్కో సారి నాకు కొందరి విషయంలో అది తప్పు కాదేమో అనే ఆలోచన ఒస్త్తుంది. ముఖ్యంగా మా పెద్దమ్మ జీవితం చూసి. బతికినంత కాలం తన రెక్కల మాటున మానసికంగా యదగని కూతుర్ని లోకులనించి, మాటలతో తూట్లు పొడిచే రాబందుల్లాంటి తన కోడల్లనించి అరవై ఏళ్ళు రక్షించిన మా అమ్మమ్మ తల్లి మనసు  తొమ్మిదేళ్ళ క్రితం తన ప్రాణం పోయేటప్పుడు దీని గతి ఏంటా? అని ఆలోచిస్తూ ఎంత వేదనకి గురి అయ్యుంటుందో! తమ అధీనంలో వున్న మా పెద్దమ్మని హీనంగా చూస్తూ చెల్లెళ్ళ ఇంటికి కూడా పంపకుండా చూసే  మా అత్తల రాక్షసత్వాలు అర్ధం కాని ఆరేళ్ళ పసి మనసుతో అరవై తొమ్మిదేళ్ళ  మా పెద్దమ్మ పెట్టే కన్నీటి జీవితానికి మృత్యువు ముగింపు కోసం మా అమ్మమ్మ ఆత్మ ఈ లోకంలోనే ఎదురుచూస్తోందేమో?

14 కామెంట్‌లు:

  1. అబ్బా!ఏం వ్రాసారండీ...చాలా బాధేసింది మీ పోస్ట్ చదివాక!నాకు ఇలాంటి ఒక జీవితం తెలుసు.ఒక అమ్మయి పుట్టినప్పుడే ఆక్సిజన్ సరిగా అందక...మతిస్థిమితంతో పాటు అంగవైకల్యం కూడా కలిగింది.ఆమెని ఆమె అమ్మ..నాన్నా..అన్నయ్య ప్రాణం లా చూసుకునేవాళ్ళు...నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మాయి దగ్గర కూర్చుని ఎవో కబుర్లు చెప్పేదాన్ని...నన్ను చూస్తే చాలు కిలకిలా నవ్వేది.కానీ కొద్దిరొజులయ్యకా అమ్మె అమ్మ-నన్నా మరణించారు.చెల్లెలికొసం వేరే ఊళ్ళో మంచి మంచి ఉద్యొగాలు తిరస్కరించి గుంటూరులోనే ఉండిపొయిన అన్నయ్య..పెళ్ళయ్యాక మారిపోయాడు..కనీసం స్నానం కూడా చేయించకుండా ఆ అమ్మయిని..చిత్రహింసలు పెడుతున్నారు...పాపం అనిపిస్తోంది తన జీవితం.ఇంత నరకం పెట్టేకంటే....మెర్సీ కిల్లింగ్ చేయించవచ్చు కదా!

    రిప్లయితొలగించండి
  2. ఇందు,
    అయ్యో పాపం. మనము జాలి పడడం తప్ప ఏమీ చెయ్యలేము. GOD BLESS HER.

    రిప్లయితొలగించండి
  3. ప్రతి క్షణం జీవితంతో పోరాడే కన్నీటి కధలు ఇవి.ఆరంభమే తప్ప అంతం లేని వ్యధ ఇది.
    ఆ స్థితి లొని యే తల్లి ఐనా అదే కోరుకుంటుంది ఏమో
    చాలా బాగా రాశారు

    రిప్లయితొలగించండి
  4. chandu garu..i have no words...guzarish chusaka adi cinema kadu, oka manishi vedana, nenu hrithik lo chelli ni chuskunna...20 ellake blood cancer tho one week bed meeda unnappudu, nenu devudini korukunna tananu teeskellipo ani..endukante chudalekapoyanu, takkukolekapoyanu tananu sudultho podustunte,bone marrow biopsy ani adi ani idani...torture...plus aa age lo bed meeda kadalakunda anagane tanu tattukoleka tana kallalo kanipinchina nairasyammmmmmmmmmmmmmmmmmmmmm...one week tarvata chanipoyindi..okosari anipistundi, nenu devudini adiganu kabatte teeskellipoyademo, kadalakunda unna, kaneesam batiki undedi, matladedi kada ani....chala baga rasaru...nijamga aa paristitini artham cheskunevallake artham ayye cinema adi...

    రిప్లయితొలగించండి
  5. Jyothi Nayak,
    Mee chelli gurinchi thelisaaka baadha anipinchindi. Andulo mee thappemi ledu.. Naakoo alaa anipinche ee post raasanu..
    Chinnappudu naaku oka causin vundevaadu.. vaadu padellu bathikaadu.. yeppudoo manchammeede vundevaadu... kaanee anukshanam narakayaathana anubhavinchevaadu... Appudu chinnathanam koddee anthagaa ardham ayyedi kaadu.. ipaatikee appudappudu vaadi gurinchi aalochisthe yentha baadha padi vuntaado anipisthundi..

    రిప్లయితొలగించండి
  6. chandu gaaru,
    naaku chinnappudu iddaru telusu... oka ammayi talli- tandrulu chanipoyaka satya sai daggara aasramamlo cherindani vinnanu.. nenu, ma chelli velli kaburlu cheppevaallam tanato.. inkoka ammayi yela untundo yevvarikee teliyadu.. vaalla amma garu yevvarinee lopaliki raniyyaru tanani bayatiki teesukuraaru..appudappudu arupulu vinipinchevi intlonchi..anthey .tanani tondaraga teesukopommani poojalu avee chesevaaru aavida..appudappudu ammato maatladevaaru goda payinunchi anthey..yekkadikee vellevaaru kuda kaadu...taluchu kunte yedupostundi....
    thanks andee oka gnapakaani techchinanduku-annee manchi vishayale taluchukovaalani manam anukunna, konni ilantivi kuda taluchukunte appudappudu manam enta adrushta vantulam, devudiki 'kritajnatalu' ani cheppalanipistundi....ikkada government sahayamto wheel chairs avee provide chestaaru lanti vaalla kosam..yekkuva depend avakunda training avee kuda istaaruta....appatlo akkada kuda unte yenta baagundedo ani prati saaree anukuntaanu..

    రిప్లయితొలగించండి
  7. Chandu, liked the way you reviewed the Movie with respect to real-life incidents...

    రిప్లయితొలగించండి
  8. సర్, ఇది చాలా పాట పోస్తే అవ్వచ్చు కాని, ఏంటో చదివిన తరువాత చెప్పకుండా ఉండలేకపోతున్నాను.నిజంగా చదువుతుంటే ఎవరో గుండెని పిన్దేస్తున్నట్టు అనిపిస్తుంది. వయసు పెరిగిన మనసు పెరగని ఆ పసి వాళ్ళతో అంత కర్కశంగా ఎలా ఉంటారు జనం. పెళ్ళైన వాళ్లకి, బాధ్యతలు పెరిగిన వాళ్లకి గుండె రాయి అయిపోతుందా ? ఇది ఎవరిని ఉద్దేసించి అడగడం లేదు. కాని ఏంటో నా మీద నాకు కూడా అనుమానం వచ్చేస్తుంది. ఒకవేళ నేను కూడా భవిష్యత్తు లో కర్కశంగా మరిపోతనేమో.
    అల తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏమైనా మీ పెద్దమ్మకి మంచి జరగాలని కోరుకుంటాను ఆ దేవుడి దయవలన. అంత కన్నా నేను ఎం చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  9. సన్నాయి రాగాలు,
    చాలా థాంక్స్ ఆండీ..

    రిప్లయితొలగించండి