ramblings లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ramblings లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...



వారం అంతా ఎక్కడో పని చేసి, వీకెండ్ ఇంటికి ఒచ్చి నా కూతురు చెప్పిన కబుర్లు వింటూ భోజనం చేసి టీవీ ఆన్ చేసాను. నాతో పాటు TV చూస్తున్న నా కూతురు "మా" టీవీ లొ ఒస్తున్న సినేమా "రోబో" లొ యుగళ గీతం చూసి నన్ను ఒక డౌట్ అడిగింది. "డాడీ! WHY BOYS ALWAYS FALL IN LOVE WITH GIRLS ?" అని. కళ్ళు తిరిగి కింద పడినంత పని అయ్యింది. ఎందుకంటె నా కూతురు వయసు ఇంకా నాలుగే. నిజానికి నా ముద్దుల తల్లి అడిగే ప్రశ్నలకి నేను అలవాటు అయ్యి అంతగా ఆశ్చర్యపోను. మొదట్లో అదేదో సినిమాలో గిరిబాబులా ఆకాశం కేసి చూసి "దేవుడా! ఎందుకు నాకు కూతుర్నిమ్మంటే క్వొశ్చన్  బ్యాంకు నిచ్చావు" అని ప్రశ్నించేవాడిని. తరవాత మెల్లిగా ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇది ఎంసెట్ లొ అవుట్ అఫ్ సిలబస్ క్వొశ్చన్, అదీ యం పీ సి  వాడికి బోటనీ క్వొశ్చన్ లాంటిది. ఈ ప్రశ్న దాని మనసులోకి ఎలా ఒచ్చిందంటే, అది చూసే అరా-కొరా తెలుగు సినిమాలలో ఎప్పుడూ హీరొయిన్ వెంట హీరో పడడం, చివరికి ROBO సినిమాలో ROBO కూడా హీరొయిన్ వెంట పడుతుంటే దానికి ఇలాంటి సందేహం ఒచ్చింది. నేను వెంటనే ఆపుకోలేని నవ్వుని, నా ముఖ కవలికలని కవర్ చేసుకుని "ఎక్కడ నేర్చుకున్నావు ఇది?' అని అడిగా లేని కోపం చూపించే ప్రయత్నం చేస్తూ. "నో వేర్" అని చెప్పి మాట మార్చేయడం నా కూతురికి అలవాటు.




నా కూతురు తెలివి గురించి చెప్పాలంటే- నేను మా ఆవిడ ఎప్పుడైనా ఘర్షణ పడితే ఇది నేను ఏమి చెయ్యలేదు, నేను గుడ్ గర్ల్ అంటుంది. మీ ఇద్దరూ కోపం నా మీద చూపించకండి ఇందులో నా తప్పేమీ లేదని అందులో అర్ధం. ఎప్పుడైనా వాళ్ళ అమ్మను కార్ లోంచి డ్రాప్ చేసి "మీ అమ్మ ని ఓదిలేసాను, ఇంక నువ్వు డాడీ దగ్గరే వుండాలి" అని ఏడిపిస్తే, "చిన్న పిల్లలు మమ్మీ లేకుండా ఉండలేరు.", అని సెంటిమెంట్ తో కొట్టి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నేను కంగారుగా ఓదార్చే స్టేజి కి తీసుకొస్తుంది. పైన రెండు సందర్భాలలో అది ప్రదర్శించే తెలివి నన్ను కొంచెం పుస్తకాలూ అవీ చదివి, దాని వయసుని బట్టి ఆలోచనలు పసిగట్టే ప్రయత్నం చేసేలా చేసాయి. అయినా సరే నా కూతురు వయసుకి మించిన పరిణతి తో నా ప్రిపరేషన్ సరిపోవట్లా. 

నా కూతురు నాకు ఇలాంటి షాక్ లు చిన్నప్పటి నించీ ఇస్తోంది. రెండేళ్లప్పుడు అనుకుంటా ఒక సారి ఇంటికి ఒచ్చి "నిక్ గాడికి నేను నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటాడట" అన్నప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.


మూడేల్లప్పుడు ఒక సారి ఇంటికి ఒచ్చి "నాన్న, నేను ఎందుకు బ్రౌన్ గా వున్నాను. తెల్లగా ఎందుకు లేను?" అంది. అప్పుడేదో ఇంద్ర ధనుసులో రంగుల్లా అన్ని రంగులలో మనుషులు వుంటే లోకం అందంగా వుంటుంది అని చెప్పి సర్దేసా. ఏం చేస్తాము నా వన్నీ నీ పోలికలు అని చెప్తే, తెల్లగా వున్న అమ్మ పక్షం చేరుతుందని, లేదా మరిన్ని ప్రశ్నలు సందిస్తుందని. అప్పటినించీ దీనికి నలుపు, బ్రౌన్ రంగుల గురించి ఏది చెప్పాలన్నానేను బాగా ఆలోచించి మరీ చెప్తా.


ఒక రోజు ఇంటికి ఒచ్చాక "నాన్నా! నాకు డే కేర్ లొ ఒక ట్విన్ సిస్టర్ ఉంది" అంది. ఈ మధ్య డే కేర్ లొ కొత్తగా చేరిన జయ (నల్ల అమ్మాయి) రంగూ, నా రంగూ ఒకటే కాబట్టి అది నా ట్విన్ సిస్టర్ అని వాదిస్తూ కూర్చుంది. దీని చేత అది కాదు అని ఒప్పించే టప్పటికి నా తల ప్రాణం తోకలో కొచ్చింది. మీరు మరీ ఎక్కువ ఊహించకండి- నాకు తోక లేదు. ఏదో సామెత అంతే.  హమ్మయ్య దీన్ని కన్విన్సు చేసానని సంబరపడుతుంటే నిన్న "నాన్నా నేను నువ్వు ఒకే రంగులో, బుగ్గ సోట్టల్తో ఒకేలా  ఉంటాము. నువ్వు నేను ట్విన్స్" అనడం మొదలెట్టింది.
ఈ మధ్యనే TANGLED సినిమాకి వెళ్తే నా కూతురు అడిగిన ప్రశ్నలకు నా వెనక కూర్చున్న ముసలామె సినేమా అయ్యాక నన్ను తట్టి మరీ నా కూతురు వయసెంత అని అడిగింది. నాలుగు అని చెప్తే ఆవిడ సమాధానం "మీ అమ్మాయి ప్రశ్నలు వింటే ఏడో ఎనిమిదో అనుకున్నా, ఎత్తు చూస్తే తక్కువ అనిపించి అలా అడిగాను. నాలుగేళ్ళకే ఇన్ని ఇలాంటి ప్రశ్నలా?" అంది.



ఇలా వుంటుంది నా కూతురితో.  దీనికి తోడు మా ఆవిడ లేని పోని చిన్ని కృష్ణుడు కధలు చెప్పి, కృష్ణుడు  ఒస్తాడని కాకమ్మ కబుర్లు చెప్తే, "కృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు? ఎలా ఒస్తాడు? ఎప్పుడు ఒస్తాడు?" అని ఒక రోజంతా పదే పదే విసిగించింది.


పోనిలే అవసరానికో అబద్ధం అని చెప్పి మా అమ్మాయి ప్రశ్నల నించి తప్పించుకోడం చాలా కష్టం. ఎప్పుడైనా మనం వేరే సమాధానం చెప్తే "మరి నా మూడేల్లప్పుడు నాకు అలా చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్పావు" అని నిలదీస్తుంది. ఒక సారి మా అమ్మాయికి DRY COUGH ఒస్తే, "తల్లి! కొంచెం మంచినీళ్ళు తాగు. నీకు DRY COUGH ఒచ్చింది" అన్నాను. "DRY అంటే తెలుగులో ఏంటి?" అని అడిగింది. పొడి- అని చెప్పాను. వెంటనే "డాడీ! పొడి అంటే నాయనమ్మ నాకు దోశ లలోకి నంచుకోడానికి పంపించేది, కదా!" అని నిలదీసింది. అది పుట్నాల పొడి, ఇది పొడి దగ్గు అని చెప్తే ఊరుకోలేదు. అదే పొడి ఇది కాదు అంటుంది.  
ఈ సారికి ఎలాగోలా దాటేసినా "అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...?" అనే ప్రశ్నకు దాని వయసుకు తగ్గ సమాధానం చెప్పడానికి నేను విపరీతమైన research చెయ్యాలి. ఈ టపా చదివే మీరు సరైన సమాధానం తెలిసీ చెప్పక పోయారో  ప్రశ్నా పత్రం లాంటి నా కూతురు లాంటి పిల్లలు మీ ఇంట కూడా పుట్టి ప్రశ్నలతో మిమ్ములను వేధించు గాక! తెలిస్తే కామెంటి నా కష్టం తీర్చండి.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

అబే ఓ ఇంగ్లిష్ మీడియం

నిన్న నా తమ్ముడు కాని తమ్ముడు (వీడు మన జూనియర్ ఎన్ టి ఆర్ ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు "ఒక తల్లి కి పుట్టక పోయినా, తమ్ముడే టైపు అనుబంధం అన్నమాట)  గాడితో మాట్లాడుతూ "అయితే నువ్వొక పాతిక వేలు పెట్టి కొను" అని ఏదో సందర్భంలో సలహా పారేసాను. వాడు వెంటనే "అన్నయ్యా! పాతిక అంటే ఎంత?" అని ఒక దిక్కుమాలిన ప్రశ్నవేసాడు. వెంటనే నా నోట్లోంచి "అబే ఓ ఇంగ్లిష్ మీడియం" అనే డైలాగ్ ముందు ఒచ్చి, ఆ తరవాత ఇండియా లో పుట్టి అమెరికా కి ఉద్యోగానికి ఒచ్చిన వీడి పరిస్థితి ఇలా వుంటే ఇంక నా కూతురి తెలుగు పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆలోచించేలా చేసి నన్ను బ్లాగ్గేలా చేసింది.

ఏడిసావులే, ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత బాధపడతావు, అడప్పా పావి అని మా ఆవిడ టైపు లో మీరు నన్ను తిట్టకుండా వుండాలంటే, నేను మీకు ఎన్ టి ఆర్ వారసుల సినిమాలలో డప్పు కొట్టినట్లు మా వంశం డప్పు కొట్టాలి. తప్పదు మరి. మరీ మీరు అనుకున్నట్లు ఏ "నేను కొడితే చస్తూ బతుకుతావు, మా నాన్నని తలుచుకుని కొడితే చస్తావు, మా తాతని తలుచుంటే కొట్టకముందే  చస్తావు" అన్న టైపు లో లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తా.

మా అమ్మ - ఒక తెలుగు టీచర్. ఏ సబ్జెక్టు లో ఫెయిల్ అయినా క్షమించేస్తుంది కానీ, ఒక వేళ మనకి తెలుగు లో క్లాసు ఫస్ట్ రాంకు రాలేదో మన పని అయిపోయేది ఇంట్లో. దీనికి తోడు నా క్లాసు కి మా అమ్మ తెలుగు టీచర్ అయితే మన పేపర్ లో చిన్న తప్పులకి పెద్ద శిక్ష వేసి నట్లుగా ఎక్కువ మార్కులు తీసేసి నన్ను ఎలాగైనా టాప్ చెయ్యనీకుండా విశ్వ ప్రయత్నం చేసేది.
మా తాత - అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఈయనో తెలుగు పండిట్, తెలుగు వ్యాకరణం లో ఈయన పుస్తకాలు రాసారు. పదమూడేళ్ళకే   మా అమ్మని తెలుగు టీచర్ చేసిన ఘనత ఈయనది. ఆ లెవెల్ లో నూరి పోశారు తెలుగు.
మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేయడానికి కారణం మా నాన్నది కవుల వంశం అని మా అమ్మమ్మ చెప్తూ వుండేది. మా ముత్తాత ఆ రోజుల్లో ఒక పెద్ద కవి. ఆహా! ఇంతకు మించి వివరాలు ఎందుకు లెండి. కవుల వంశంలో మన అమ్మాయిని ఇస్తున్నామని సంబరం తో మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేసేసారట. ఈ కవిత్వం తరవాతి తరాలలో కొంచెం కొంచెం గా తరిగిపోయి, ఇప్పుడు పూర్తిగా ఇగిరిపోతోంది.  అయితే ఈ తరంలో నాలాంటి వాళ్ళు తుంటరి సమాధానం చెప్తే పెద్ద వాళ్ళు కవిత్వాలు పోయాయి ఈ కపిత్వాలు మిగిలాయి అని మా వంశం వాళ్ళని దేప్పిపొడవడం ఎక్కువగా జరుగుతుంటూంది నలుగురూ కలిసినప్పుడు.

సరే ఈ బాధ అంతా ఎందుకంటే, నేనో అయోమయం ఆంధ్రుడు (Confused దేశి లాగ), నా కూతురు అయితే పుట్టిన తరవాత భారత దేశానికి మూడు సార్లు చుట్టపు చూపుగా ఒచ్చింది(దాని వయసు నాలుగు). దేశం లో వుంటే ముక్కలు విరగ కొట్టినట్లు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంది.  దేశంలో వున్నప్పుడు ముద్దుగా తెలుగు మాట్లాడినా, ఇక్కడకి ఒచ్చాక మళ్ళీ ఎంగిలిపీచే.  కానీ దానికి మన భాష ఎలా నేర్పాలో అన్నది నాకు ఒక చిక్కు ప్రశ్నే? అప్పటికీ కుదిరినప్పుడల్లా దీనిని తెలుగులో ఏమంటారు అని అడగడం అలవాటు చేసి పక్షులు, చెట్లు, ఏనుగు లాంటి తేలికైనవి చెప్పేసి మురిసిపోయేలోపు మా గడుగ్గాయి "కారు అంటే తెలుగు లో ఏమిటి" లాంటి ప్రశ్నలు విసిరేసి నాన్నని ఇరుకు లో పెడుతుంది. దీనికి ఇప్పుడు తెలుగు లో ఇలాంటివి ఎలా చెప్పాలి అని సమాధానం కోసం తడుముకునే లోపు పక్కన నా ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం కిసుక్కున నవ్వుతుంది. "మొగుడు కొట్టిన మంట కాదు, తోటికోడలు నవ్విందన్నబాధలా"  కడుపు మండి, దానికి కౌంటర్ మా ఆవిడ రాసిన కూరగాయల లిస్టు లో "కొత మీర, పోటా కాయ" లను మా ఆవిడకి గుర్తు చేసి నీకన్న నేనే బెటర్ అని మొగుడు జులుం (ఇది అందరు మొగుళ్ళకి పెళ్ళయిన తరవాత ఒచ్చే జులుం) చూపిస్తాను.  దానికి నేర్పించే తీరిక నాకు లేదు, మా ఆవిడకి రాదు. పోనీ విడిగా ఎక్కడైనా క్లాసు పెట్టించాలంటే ఇంగ్లీష్, లెక్కలు, ఈత, సంగీతం మరియు ఆటలు ఇవన్నీ వారంలో ఐదు రోజులు సరిపోతే, వారాంతాలు తిరుగుడుతో గడిపాక ఇంక చదివించే సమయం ఎక్కడది, నా కూతురికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఏది?

  నా కూతురు నా ముత్తాత టైపు లో కంద పద్యం రాయడం కల్ల, కనీసం నాలా సీస పద్యం రాయాలనే కల కనడం కూడా కష్టమే, పోనీ  నా భార్యామణి రేంజ్ లో "కొత మీర, పోటా కాయ" లిస్టు లెవెల్ కి ఎదిగినా సరిపెట్టుకుంటా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది తెలుగులో మాట్లాడితే చాలు అని అనిపిస్తోంది.   ఇంక నన్ను, మా వంశం ప్రతిష్టను, నా తెలుగు ఆత్మాభి మానాన్ని పరదేశం లో నిలబెట్టే ప్రయత్నాలని ఆ తెలుగు తల్లే కాపాడాలి. గట్టిగా అంటే నీ సాహిత్యంతో నువ్వు ఏం పీకావు అంటారు. అదే కదా! మన బాధ, మనకు తెలిసేటప్పటికి వయసు ఐపోయింది, పైగా మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతున్నామా అనే ఆలోచన.
 
అమెరికా కూతురు, ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం తో పరదేశం లో ఈ తెలుగోడి గోడు ఎవడు పట్టించుకుంటాడు లెండి!!!.