నిన్న నా తమ్ముడు కాని తమ్ముడు (వీడు మన జూనియర్ ఎన్ టి ఆర్ ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు "ఒక తల్లి కి పుట్టక పోయినా, తమ్ముడే టైపు అనుబంధం అన్నమాట) గాడితో మాట్లాడుతూ "అయితే నువ్వొక పాతిక వేలు పెట్టి కొను" అని ఏదో సందర్భంలో సలహా పారేసాను. వాడు వెంటనే "అన్నయ్యా! పాతిక అంటే ఎంత?" అని ఒక దిక్కుమాలిన ప్రశ్నవేసాడు. వెంటనే నా నోట్లోంచి "అబే ఓ ఇంగ్లిష్ మీడియం" అనే డైలాగ్ ముందు ఒచ్చి, ఆ తరవాత ఇండియా లో పుట్టి అమెరికా కి ఉద్యోగానికి ఒచ్చిన వీడి పరిస్థితి ఇలా వుంటే ఇంక నా కూతురి తెలుగు పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆలోచించేలా చేసి నన్ను బ్లాగ్గేలా చేసింది.
ఏడిసావులే, ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత బాధపడతావు, అడప్పా పావి అని మా ఆవిడ టైపు లో మీరు నన్ను తిట్టకుండా వుండాలంటే, నేను మీకు ఎన్ టి ఆర్ వారసుల సినిమాలలో డప్పు కొట్టినట్లు మా వంశం డప్పు కొట్టాలి. తప్పదు మరి. మరీ మీరు అనుకున్నట్లు ఏ "నేను కొడితే చస్తూ బతుకుతావు, మా నాన్నని తలుచుకుని కొడితే చస్తావు, మా తాతని తలుచుంటే కొట్టకముందే చస్తావు" అన్న టైపు లో లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తా.
మా అమ్మ - ఒక తెలుగు టీచర్. ఏ సబ్జెక్టు లో ఫెయిల్ అయినా క్షమించేస్తుంది కానీ, ఒక వేళ మనకి తెలుగు లో క్లాసు ఫస్ట్ రాంకు రాలేదో మన పని అయిపోయేది ఇంట్లో. దీనికి తోడు నా క్లాసు కి మా అమ్మ తెలుగు టీచర్ అయితే మన పేపర్ లో చిన్న తప్పులకి పెద్ద శిక్ష వేసి నట్లుగా ఎక్కువ మార్కులు తీసేసి నన్ను ఎలాగైనా టాప్ చెయ్యనీకుండా విశ్వ ప్రయత్నం చేసేది.
మా తాత - అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఈయనో తెలుగు పండిట్, తెలుగు వ్యాకరణం లో ఈయన పుస్తకాలు రాసారు. పదమూడేళ్ళకే మా అమ్మని తెలుగు టీచర్ చేసిన ఘనత ఈయనది. ఆ లెవెల్ లో నూరి పోశారు తెలుగు.
మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేయడానికి కారణం మా నాన్నది కవుల వంశం అని మా అమ్మమ్మ చెప్తూ వుండేది. మా ముత్తాత ఆ రోజుల్లో ఒక పెద్ద కవి. ఆహా! ఇంతకు మించి వివరాలు ఎందుకు లెండి. కవుల వంశంలో మన అమ్మాయిని ఇస్తున్నామని సంబరం తో మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేసేసారట. ఈ కవిత్వం తరవాతి తరాలలో కొంచెం కొంచెం గా తరిగిపోయి, ఇప్పుడు పూర్తిగా ఇగిరిపోతోంది. అయితే ఈ తరంలో నాలాంటి వాళ్ళు తుంటరి సమాధానం చెప్తే పెద్ద వాళ్ళు కవిత్వాలు పోయాయి ఈ కపిత్వాలు మిగిలాయి అని మా వంశం వాళ్ళని దేప్పిపొడవడం ఎక్కువగా జరుగుతుంటూంది నలుగురూ కలిసినప్పుడు.
సరే ఈ బాధ అంతా ఎందుకంటే, నేనో అయోమయం ఆంధ్రుడు (Confused దేశి లాగ), నా కూతురు అయితే పుట్టిన తరవాత భారత దేశానికి మూడు సార్లు చుట్టపు చూపుగా ఒచ్చింది(దాని వయసు నాలుగు). దేశం లో వుంటే ముక్కలు విరగ కొట్టినట్లు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంది. దేశంలో వున్నప్పుడు ముద్దుగా తెలుగు మాట్లాడినా, ఇక్కడకి ఒచ్చాక మళ్ళీ ఎంగిలిపీచే. కానీ దానికి మన భాష ఎలా నేర్పాలో అన్నది నాకు ఒక చిక్కు ప్రశ్నే? అప్పటికీ కుదిరినప్పుడల్లా దీనిని తెలుగులో ఏమంటారు అని అడగడం అలవాటు చేసి పక్షులు, చెట్లు, ఏనుగు లాంటి తేలికైనవి చెప్పేసి మురిసిపోయేలోపు మా గడుగ్గాయి "కారు అంటే తెలుగు లో ఏమిటి" లాంటి ప్రశ్నలు విసిరేసి నాన్నని ఇరుకు లో పెడుతుంది. దీనికి ఇప్పుడు తెలుగు లో ఇలాంటివి ఎలా చెప్పాలి అని సమాధానం కోసం తడుముకునే లోపు పక్కన నా ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం కిసుక్కున నవ్వుతుంది. "మొగుడు కొట్టిన మంట కాదు, తోటికోడలు నవ్విందన్నబాధలా" కడుపు మండి, దానికి కౌంటర్ మా ఆవిడ రాసిన కూరగాయల లిస్టు లో "కొత మీర, పోటా కాయ" లను మా ఆవిడకి గుర్తు చేసి నీకన్న నేనే బెటర్ అని మొగుడు జులుం (ఇది అందరు మొగుళ్ళకి పెళ్ళయిన తరవాత ఒచ్చే జులుం) చూపిస్తాను. దానికి నేర్పించే తీరిక నాకు లేదు, మా ఆవిడకి రాదు. పోనీ విడిగా ఎక్కడైనా క్లాసు పెట్టించాలంటే ఇంగ్లీష్, లెక్కలు, ఈత, సంగీతం మరియు ఆటలు ఇవన్నీ వారంలో ఐదు రోజులు సరిపోతే, వారాంతాలు తిరుగుడుతో గడిపాక ఇంక చదివించే సమయం ఎక్కడది, నా కూతురికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఏది?
నా కూతురు నా ముత్తాత టైపు లో కంద పద్యం రాయడం కల్ల, కనీసం నాలా సీస పద్యం రాయాలనే కల కనడం కూడా కష్టమే, పోనీ నా భార్యామణి రేంజ్ లో "కొత మీర, పోటా కాయ" లిస్టు లెవెల్ కి ఎదిగినా సరిపెట్టుకుంటా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది తెలుగులో మాట్లాడితే చాలు అని అనిపిస్తోంది. ఇంక నన్ను, మా వంశం ప్రతిష్టను, నా తెలుగు ఆత్మాభి మానాన్ని పరదేశం లో నిలబెట్టే ప్రయత్నాలని ఆ తెలుగు తల్లే కాపాడాలి. గట్టిగా అంటే నీ సాహిత్యంతో నువ్వు ఏం పీకావు అంటారు. అదే కదా! మన బాధ, మనకు తెలిసేటప్పటికి వయసు ఐపోయింది, పైగా మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతున్నామా అనే ఆలోచన.
అమెరికా కూతురు, ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం తో పరదేశం లో ఈ తెలుగోడి గోడు ఎవడు పట్టించుకుంటాడు లెండి!!!.