8, సెప్టెంబర్ 2010, బుధవారం

అబే ఓ ఇంగ్లిష్ మీడియం

నిన్న నా తమ్ముడు కాని తమ్ముడు (వీడు మన జూనియర్ ఎన్ టి ఆర్ ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు "ఒక తల్లి కి పుట్టక పోయినా, తమ్ముడే టైపు అనుబంధం అన్నమాట)  గాడితో మాట్లాడుతూ "అయితే నువ్వొక పాతిక వేలు పెట్టి కొను" అని ఏదో సందర్భంలో సలహా పారేసాను. వాడు వెంటనే "అన్నయ్యా! పాతిక అంటే ఎంత?" అని ఒక దిక్కుమాలిన ప్రశ్నవేసాడు. వెంటనే నా నోట్లోంచి "అబే ఓ ఇంగ్లిష్ మీడియం" అనే డైలాగ్ ముందు ఒచ్చి, ఆ తరవాత ఇండియా లో పుట్టి అమెరికా కి ఉద్యోగానికి ఒచ్చిన వీడి పరిస్థితి ఇలా వుంటే ఇంక నా కూతురి తెలుగు పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆలోచించేలా చేసి నన్ను బ్లాగ్గేలా చేసింది.

ఏడిసావులే, ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత బాధపడతావు, అడప్పా పావి అని మా ఆవిడ టైపు లో మీరు నన్ను తిట్టకుండా వుండాలంటే, నేను మీకు ఎన్ టి ఆర్ వారసుల సినిమాలలో డప్పు కొట్టినట్లు మా వంశం డప్పు కొట్టాలి. తప్పదు మరి. మరీ మీరు అనుకున్నట్లు ఏ "నేను కొడితే చస్తూ బతుకుతావు, మా నాన్నని తలుచుకుని కొడితే చస్తావు, మా తాతని తలుచుంటే కొట్టకముందే  చస్తావు" అన్న టైపు లో లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తా.

మా అమ్మ - ఒక తెలుగు టీచర్. ఏ సబ్జెక్టు లో ఫెయిల్ అయినా క్షమించేస్తుంది కానీ, ఒక వేళ మనకి తెలుగు లో క్లాసు ఫస్ట్ రాంకు రాలేదో మన పని అయిపోయేది ఇంట్లో. దీనికి తోడు నా క్లాసు కి మా అమ్మ తెలుగు టీచర్ అయితే మన పేపర్ లో చిన్న తప్పులకి పెద్ద శిక్ష వేసి నట్లుగా ఎక్కువ మార్కులు తీసేసి నన్ను ఎలాగైనా టాప్ చెయ్యనీకుండా విశ్వ ప్రయత్నం చేసేది.
మా తాత - అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఈయనో తెలుగు పండిట్, తెలుగు వ్యాకరణం లో ఈయన పుస్తకాలు రాసారు. పదమూడేళ్ళకే   మా అమ్మని తెలుగు టీచర్ చేసిన ఘనత ఈయనది. ఆ లెవెల్ లో నూరి పోశారు తెలుగు.
మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేయడానికి కారణం మా నాన్నది కవుల వంశం అని మా అమ్మమ్మ చెప్తూ వుండేది. మా ముత్తాత ఆ రోజుల్లో ఒక పెద్ద కవి. ఆహా! ఇంతకు మించి వివరాలు ఎందుకు లెండి. కవుల వంశంలో మన అమ్మాయిని ఇస్తున్నామని సంబరం తో మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేసేసారట. ఈ కవిత్వం తరవాతి తరాలలో కొంచెం కొంచెం గా తరిగిపోయి, ఇప్పుడు పూర్తిగా ఇగిరిపోతోంది.  అయితే ఈ తరంలో నాలాంటి వాళ్ళు తుంటరి సమాధానం చెప్తే పెద్ద వాళ్ళు కవిత్వాలు పోయాయి ఈ కపిత్వాలు మిగిలాయి అని మా వంశం వాళ్ళని దేప్పిపొడవడం ఎక్కువగా జరుగుతుంటూంది నలుగురూ కలిసినప్పుడు.

సరే ఈ బాధ అంతా ఎందుకంటే, నేనో అయోమయం ఆంధ్రుడు (Confused దేశి లాగ), నా కూతురు అయితే పుట్టిన తరవాత భారత దేశానికి మూడు సార్లు చుట్టపు చూపుగా ఒచ్చింది(దాని వయసు నాలుగు). దేశం లో వుంటే ముక్కలు విరగ కొట్టినట్లు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంది.  దేశంలో వున్నప్పుడు ముద్దుగా తెలుగు మాట్లాడినా, ఇక్కడకి ఒచ్చాక మళ్ళీ ఎంగిలిపీచే.  కానీ దానికి మన భాష ఎలా నేర్పాలో అన్నది నాకు ఒక చిక్కు ప్రశ్నే? అప్పటికీ కుదిరినప్పుడల్లా దీనిని తెలుగులో ఏమంటారు అని అడగడం అలవాటు చేసి పక్షులు, చెట్లు, ఏనుగు లాంటి తేలికైనవి చెప్పేసి మురిసిపోయేలోపు మా గడుగ్గాయి "కారు అంటే తెలుగు లో ఏమిటి" లాంటి ప్రశ్నలు విసిరేసి నాన్నని ఇరుకు లో పెడుతుంది. దీనికి ఇప్పుడు తెలుగు లో ఇలాంటివి ఎలా చెప్పాలి అని సమాధానం కోసం తడుముకునే లోపు పక్కన నా ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం కిసుక్కున నవ్వుతుంది. "మొగుడు కొట్టిన మంట కాదు, తోటికోడలు నవ్విందన్నబాధలా"  కడుపు మండి, దానికి కౌంటర్ మా ఆవిడ రాసిన కూరగాయల లిస్టు లో "కొత మీర, పోటా కాయ" లను మా ఆవిడకి గుర్తు చేసి నీకన్న నేనే బెటర్ అని మొగుడు జులుం (ఇది అందరు మొగుళ్ళకి పెళ్ళయిన తరవాత ఒచ్చే జులుం) చూపిస్తాను.  దానికి నేర్పించే తీరిక నాకు లేదు, మా ఆవిడకి రాదు. పోనీ విడిగా ఎక్కడైనా క్లాసు పెట్టించాలంటే ఇంగ్లీష్, లెక్కలు, ఈత, సంగీతం మరియు ఆటలు ఇవన్నీ వారంలో ఐదు రోజులు సరిపోతే, వారాంతాలు తిరుగుడుతో గడిపాక ఇంక చదివించే సమయం ఎక్కడది, నా కూతురికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఏది?

  నా కూతురు నా ముత్తాత టైపు లో కంద పద్యం రాయడం కల్ల, కనీసం నాలా సీస పద్యం రాయాలనే కల కనడం కూడా కష్టమే, పోనీ  నా భార్యామణి రేంజ్ లో "కొత మీర, పోటా కాయ" లిస్టు లెవెల్ కి ఎదిగినా సరిపెట్టుకుంటా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది తెలుగులో మాట్లాడితే చాలు అని అనిపిస్తోంది.   ఇంక నన్ను, మా వంశం ప్రతిష్టను, నా తెలుగు ఆత్మాభి మానాన్ని పరదేశం లో నిలబెట్టే ప్రయత్నాలని ఆ తెలుగు తల్లే కాపాడాలి. గట్టిగా అంటే నీ సాహిత్యంతో నువ్వు ఏం పీకావు అంటారు. అదే కదా! మన బాధ, మనకు తెలిసేటప్పటికి వయసు ఐపోయింది, పైగా మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతున్నామా అనే ఆలోచన.
 
అమెరికా కూతురు, ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం తో పరదేశం లో ఈ తెలుగోడి గోడు ఎవడు పట్టించుకుంటాడు లెండి!!!.

14 వ్యాఖ్యలు:

 1. చందమామ ఇప్పుడు ఆన్లైన్‌లో దొరుకుతుందిగా...అవి చూపించండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. telugu rhymes cds, bala siksha cds dorukutay kadandi meeru teppinchukondi Chandu or else youtube downloads undane unnay kada... interest vacchelaga unnay animation toti... make it a point to talk to her in Telugu.. but the way go to read post.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాగార్జున గారు: దొరికింది. మీరు చెప్పాక తెలిసింది. థాంక్స్.
  Sree Garu: చిన్నప్పుడు బానే చూసేది (అంటే రెండేళ్ల వరకు చిన్నారి చిట్టి గీతాలు). ఇప్పుడే మానేసింది. ఐనా రుద్దే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. థాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ ఆవేదన సబబైనదే. నాకు, మీ అంత కోరిక (పిల్లలు సీస పద్యాలు రాసేంత ప్రావీణ్యం) లేకపోయినా కనీసం తెలుగు పుస్తకాలు చదవగలిగితే చాలు అనుకుంటాను. BTW, మీ ఊర్లో సిలికానాంధ్రా వాళ్ళ మనబడి లాంటిది లేదా? మీలాగే, మా అబ్బాయిల తెలుగు మీద ఒక టపా వ్రాసాను చూడండి (http://srisugandh.blogspot.com/2010/07/blog-post.html)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కేకే గారు.
  అదే సమస్య. రోజూ మాట్లాడుతూ, అప్పుడప్పుడు చదువుతూ, రాస్తూ ఉంటే తెలుగు అబ్బుతుందేమో కానీ లేకపోతే కష్టమే. ఇంకా మీ పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారు, నయ్యమ్. నాకు తెలిసిన వాళ్ళు అంతా మన తెలుగు ప్రశ్నలకు వాళ్ళ ఇంగ్లీష్ సమాధానాలు అన్నట్టు ఉంటారు.మా వైపు ఇంకా మన బడి ఒచ్చినట్లు లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నిజంగా మీ మాతృభాషాభిమానం అభినందనీయం

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇప్ప్పుడు పెద్ద వాళ్ళ పరిస్తితే అలా తయారయ్యింది...పాపం చిన్నపిల్ల ఆ మాత్రం నేర్చుకోవడం అభినందనీయం.....మా స్నేహితులు కొంతమంది హైదరాబాదు లొ పుట్టి పెరిగి అక్కడే చదువుకుని,అమెరికా వచ్చి ఇక్కడ తెలుగు పుస్తకాలు,తెలుగు బ్లాగు చదువుతున్న నన్ను చూసి నవ్వారు...ఎందుకు అంటే....వాళ్ళకి తెలుగు మాట్లాడటం మాత్రమే వచ్చట,,..చదవడం,వ్రాయడం రావట...కనీసం తెలుగు బ్లాగు చూడాలన్న చిరాకట..అది పనిలేని వాళ్ళు చేసె పనులు అట.నాకు వొళ్ళు మండిపొయింది....ఇలాంటివాళ్ళవల్లె తెలుగు కి తెగులు పడుతోంది అనిపించింది.....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇందు గారు,
  అవునండీ, నిజమే. తెలుగు మాట్లాడటం చిన్నతనం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీ అమ్మాయి గురించి మీరు రాసిన పోస్టులన్నీ చదువుతున్నాను.
  తెలుగు కష్టాలు తెలుగువీ, తల్లి దండ్రుల కష్టాలు తల్లిదండ్రులవీ.
  మీరు జంతువుల యానిమేషన్లు కొన్ని చూపించారు.
  ఎంత బాగున్నాయో.
  మరి తెలుగులో అలా మనం (ఎవరైతే సీడీలు గట్రా తయారు చేస్తారో) ఎందుకు చెయ్య దల్చుకోము?
  తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ అవే రైమ్‌సూ, వాటికి ఒకే లాంటి సంగీతం.
  విచిత్రమైన గొంతులు, వింతైన భాష, అంతకన్నా వింతైన పస లేని కథలతో సీడీలు.
  అవీ ఇష్టంగానే చూస్తారు పిల్లలు. అది ఇంకో సమస్య:)
  (నా దృష్టిలో మాత్రమే)
  పిల్లలతో సరాదాగా ఆంగ్లంలో చెయ్యగలిగినంత కాల్క్షేపం తెలుగులోనూ చెయ్య గలిగే రోజులు రావాలి.
  మా పిల్లలకి "భాష" పునాదులు ఆంగ్లంలోనే పడడానికి కారణం వాళ్ళకు ఆరోగ్యకరమైన, ఆకర్షణీయమైన వినోదం ఆంగ్లంలోనే అందుబాటులో ఉండడం.
  ఐతే, చుట్టు పక్కల చాలా మంది పిల్లలు తెలుగులో మాట్లాడడం వింటున్నాను.
  బలే ముచ్చటేస్తుంది.
  పద్యాలు రాయడం సరే, పద్యాలు అర్థం చేసుకుని ఆనందించగలగాలి, కనీసం, అని నా ఆశ.
  ఐతే, నాలుగేళ్ళకే ఇవన్నీ సాధ్యం కావు.
  మూడూ భాషలు వచ్చి, సంస్కృతం కలుపుకుని నాలుగు భాషలు అని గర్వంగా చెప్పుకుంటాను, మా పిల్లలను ప్రోత్సహించడానికి. కానీ ఎంతో కొంత ప్రావీణ్యం రావడానికి పదిహేనేళ్ళు పట్టింది (స్కూలూ, కాలేజీ కలుపుకుని).
  అందునా, పుస్తకాలూ, పాఠాలూ, సినిమాలూ, పాటలూ అన్నీ ఆ యా భాషలలో ప్రతి నిత్యం అందుబాటులో ఉన్న వాతావరణం. అది గుర్తు చేసుకుని ప్రయత్నం ఆగకుండా కొనసాగిస్తున్నాను. చూడాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. lalithag,
  నా పోస్టులు చదువుతున్నందుకు థాంక్స్. యానిమేషన్లు కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంత క్రియేటివిటీ ఉన్నా సరే, దీనికి సరి పడే సాఫ్ట్‌వేర్ అదీ ఉండాలి. తెలుగులో ముందు ముందు వొస్తాయని ఆశిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. chandu gaaru, ma neighbor vaalla daughter ni " mana badi " ane daaniki pamputundi.. memu vundedi bay area lo ... check ehyandi.. aa paapa india lo vunna kids kante kudaa manchi gaa telugu maataladutundi.. dnt neglect.. nenu ekkado chadivaa, kids can learn 2 languages simultaneously antaa

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Chandu Gaaru,
  Meeru cheppaka choosaanu. Maaku 2 gantala dooramlo ledu. East coast lo New jersey lo maathrame vunnatlundi. Thanks for the information.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇది నన్ను ఇబ్బంది పెట్టింది.
  "యానిమేషన్లు కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంత క్రియేటివిటీ ఉన్నా సరే, దీనికి సరి పడే సాఫ్ట్‌వేర్ అదీ ఉండాలి. "
  లాభమొచ్చినా, ఘోరంగా నష్టపోయినా అదో రకమైన జూదం లాగా సినిమాల మీద సినిమాల తియ్యడానికి వెనకాడని వాళ్ళు పిల్లల కోసం ఆరోగ్యకరమైన వినోదం తయారు ఖర్చు గురించి ఆలోచించి పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడానికి మాత్రం వెనకాడాలా అనిపించింది. సరే.
  "తెలుగులో ముందు ముందు వొస్తాయని ఆశిద్దాం." "Amen!" to that.
  ప్రస్తుతానికి మీకు ఆసక్తి ఉన్నట్లుంది కనుక ఇవి పరిచయం చేద్దామని అనుకున్నాను:
  http://www.bookbox.com/index.php?pid=129
  ఇక్కడ First Well పూర్తిగా ఉచితంగా దొరుకుతుంది.
  ఆంగ్లంలో కూడా చాలా బావుంటాయి ఈ కథలు. మా పిల్లలకి పరిచయమయ్యి నాలుగేళ్ళనుకుంటా అయ్యింది. ఇప్పటికీ అదే ఆసక్తితో చూస్తున్నారు. అంతే కాక ఆంగ్లంలో Legendary Lives పేరుతో అబ్దుల్ కలాం, కిరణ్ బేడీల జీవితంలో స్ఫూర్తినిచ్చే కథలు కూడా animated మరియు పుస్తక రూపంలో దొరుకుతున్నాయి. ఖరీదు మరీ ఎక్కువ కాదనే నా ఉద్దేశం. మా పిల్లల కోసం ఒకటొకటే కొంటున్నాను. Spanish నేర్చుకోవడానికి కూడా బాగుండచ్చు అనిపిస్తోంది. కొని చూడాలి.
  మీరు తెలుగు4కిడ్స్ చూశారో లేదో. అది నా స్వంత ప్రయత్నం. అక్కడ కథలు, సామెత కథలు చూసి మీ అభిప్రాయం చెప్పగలరు. అలాగే ఇక్కడ (http://balasahityam.wordpress.com/)ఆడియో కథలు కూడా విని మీ అభిప్రాయం, సూచనలూ, సలహాలూ అందించ గలరు.
  తెలుగు4కిడ్స్ Links4kids లో ఇంకా కొన్ని ఆసక్తి కరమైన లంకెలు ఉంటాయి చూడ గలరు.

  ప్రత్యుత్తరంతొలగించు