టైటిల్ చూసిన వెంటనే వీడెవడురా సిగరెట్టూ,మర్యాద అంటూ ఏ మాత్రం మర్యాద లేకుండా పాడు అలవాటును సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నారా. ఇంకా ముందుకెళ్ళి కొంత మంది "అమర్యాద చంద్రన్న" అని ముద్ర వెయ్యక ముందే, వస్తున్నా వస్తున్నా .. అసలు సబ్జెక్టు లోకి. పైన డైలాగ్ "ప్రస్థానం" సినిమాలోది. ఈ మధ్య కాలంలో నాతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళు ఈ పాటికి తల పట్టుకుని మళ్ళీ "ప్రస్థానం" మొదలెట్టడురా వీడు అని తిట్టుకుంటూ వుంటారు అని తెలుసు, కాని ఏం చెయ్యను మనకి అలా ఎక్కేసింది మరి ఈ సినిమా. టైటిల్ కొంచెం తేడాగా వున్నా నేను చెప్పాలనుకున్నది అంత బాడ్ సబ్జెక్టు కాదులెండి (ఆ అందరు bloggerlu ఇలాగే చెప్తారు అనుకుంటున్నారు కదూ).
చిన్నప్పుడు చాలా మంది అబ్బాయిలకు (కనీసం నా తరం, అంటే నాది ఈ తరం కాదని ఈ పాటికి గ్రహించే వుంటారు చదువరులు), తండ్రి అంటే భయం వుంటుంది, అమ్మ దగ్గర మనకి ఎంత చనువు వున్నా, నాన్న అంటే ఇంట్లో పులి అన్న మాట. నాన్నకి కోపం వొచ్చే పనులు ఏది చేసినా అమ్మ చాటున దొంగతనంగా నక్కి అమ్మ మేనేజ్ చేసేవరకు నాన్న కంట పడకుండా వుండడం, అమ్మ ఇచ్చిన డబ్బులు సరిపోకపోతే పుస్తకాలనో, ప్రాజెక్ట్ వర్క్ అనో లేని కారణం చెప్పి అమ్మ ద్వారా నాన్నకి రికమండేషను చేయించి డబ్బులు కొట్టేయడం లాంటివి చేస్తూ వుంటారు. బయట ఫ్రెండ్స్ కి మటుకు "నాన్న అంటే భయం కాదు రెస్పెక్ట్" అని బిల్డప్ ఇస్తారు. ఆ తరవాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లి చేసుకుని పిల్లలని కన్నా కూడా అదే రెస్పెక్ట్ అల్లా కంటిన్యూ అయిపోతుంది. నిజానికి అప్పుడే తండ్రికి-కొడుకుకి అవసరమైన స్నేహబంధం కరువైపోతుంది.
ఇంటికి వొచ్చి "నాన్నా ఎలా వున్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? నీకేదైనా కావాలా?" అని అడిగే చనువు కొడుకుకి వుండదు, "అమ్మ కోసమైనా నాలుగు రోజులు వొచ్చి పోరా. మనవరాలిని పండక్కి తీసుకురా" అని కొడుక్కి గట్టిగా చెప్పే చనువు తండ్రి తీసుకోలేడు. ముసలి వయసులో తండ్రి అవసరాలు, ఇబ్బందులు కొడుక్కి తెలిసే అవకాశం లేదు. కొడుకు ఆలోచనా విధానాన్ని, పరిస్థితులని కొడుకుతో మాట్లాడి నేరుగా తెలుసుకునే స్నేహం ఇద్దరి మధ్యా లేదు. ఈ రోజులలో ముసలివాళ్ళు, పలకరించే మనుషులు లేని స్థితిలో ఆశగా మనుషులకోసం ఎదురు చూస్తున్నారు. వూరిలో వున్న వాడికేమో పలకరించే ఖాళీ లేదు, విదేశాలనించి వొచ్చిన వాడికేమో schedule tite. పైగా నాలుగు రోజులు ఉండరా అని అడగాలంటే- పుట్టింటికి వాడిని లాక్కు పోయే పెళ్ళాంతో మన కళ్ళ ముందు వాడు గొడవ పడితే మనకు బాధ.
అలా అనిపించి నప్పుడు ఒక సందర్భంలో ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది.
ప్రస్థానం లో హీరో తన తండ్రి ముందు సిగరెట్టు తాగుతుంటే:
తండ్రి: పబ్లిక్ లో మర్యాదకోసమైనా నా ముందు సిగరెట్టు కట్టేయచ్చు కదరా?
కొడుకు: సిగరెట్టుకీ మర్యాదకీ సైంటిఫిక్ గా లింక్ లేదట నాన్నా. చిన్నప్పటి నుంచి నువ్వు నా ముందు తాగబట్టే ఇలా తయారయ్యాను. పైగా హీరోఇజం పండుద్ది.
ఆడపిల్లలకి ఈ సమస్యలేదు. నాన్న గారాబం, అమ్మ స్నేహం తో ఎదిగిన అమ్మాయిలు తండ్రిని కావాలంటే ప్రేమతో కట్టి పడేయ్యగలరు, ఇంకా అవసరం అయితే రెండు చుక్కలు కంటి కొళాయి తిప్పితే చాలు. బంధం పేరుతో కట్టేయ్యలేకపోతే బాధ్యత పేరుతో కట్టి పారేయచ్చు. (మా అక్క ఈ కాన్సెప్ట్ బాగా వాడుతుంది మా నాన్నతో)
ఇంతకీ ఇదంతా ఎందుకంటే వుద్యోగం వొచ్చి కాళ్ళ మీద నిలబడ్డ తరవాత తండ్రికీ తనకీ మధ్య వున్న వున్న ఈ గ్యాప్ తగ్గించే ప్రయత్నం కొడుకులే చెయ్యాలి. అసలే ఈ తరం ఉన్నత విద్యలకి, ఉద్యోగ అవకాశాలకి వూరు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న రోజులు. తన దగ్గర పెట్టుకుని పిల్లలు ఎలాగో చూసుకోరని తండ్రులకు తెలుసు, కానీ రోజూ కాకపోయినా కనీసం వారానికి ఒక సారి తండ్రితో క్రికెట్ గురించో, సినిమా గురించో, రాజకీయాల గురించో రెండు నిమిషాలు మాట్లాడి, మెల్లిగా ఆరోగ్యం గురించి, ఆర్ధిక పరిస్థితి గురించీ అడిగే చనువు లేని దుస్థితిలో చాలా మంది కొడుకులు వున్నారు. ఇందుకు అవసరం అయితే చనువు పెంచుకోడానికి తండ్రితో ఒక రౌండ్ మందు వేసి, అవసరం అయితే ఒక సిగరెట్టు దమ్ము లాగి తండ్రిని స్నేహితుడుగా కొత్త పరిచయం చేసుకునే ప్రయత్నం చేయడంలో తప్పులేదు.
అందుకనే నేనంటున్నా కొడుకులు తండ్రితో కలిసి మందు కొట్టినా, దమ్ము లాగినా "హీరోఇజం పండుతుంది.. పైగా సిగరెట్టుకి మర్యాదకి లింక్ లేదట".
ముఖ్య గమనిక: ఇది మీ పిల్లలు చూడకుండా కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ నాన్నఅంటే నీకు చిన్నప్పుడు భయం వుండేది, కానీ నీ పిల్లలకి నువ్వంటే భయం అస్సలు లేదుగా.. నీ లక్ బావుంటే పెద్దయ్యాక వాడికి గౌరవం ఉండొచ్చు.. అంత శీను లేదురా చందుగా అని అనుకుంటున్నారు కదూ. అవును మరి మన సంగతి మనకి బాగా తెలుసు.
కాబట్టి కనీసం నాన్నతో దమ్ము లాగించి హీరోఇజం పండించుకోండి. సిగరెట్ట్-మర్యాద సైంటిఫిక్ లింక్ పక్కన పెట్టి, కనీసం తండ్రీ-కొడుకు లింక్ నిలబెట్టండి. దీనికి సైంటిఫిక్ గా నేనేమి నిరూపించలేను కానీ, చుట్టూ బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి - సరిగ్గా చూస్తే.