25, ఆగస్టు 2010, బుధవారం

ఆడపిల్ల మనసు

అమ్మ అనురాగాల గుడి నించి
నాన్న శాసనాల బడి నించి
అమ్మమ్మ అనురాగపు లోగిల్లో
తాతయ్య ఆప్యాయతల ముంగిట్లో 
ఆడుకుని పసి వయసు దాటి
ఆసక్తితో వీధిన బడితే
కోతి కొమ్మచ్చి , అట్లతద్దుల అల్లర్లలో 
బడి మాని సినిమా చూసిన జల్సాలలో
కొత్త పరికిణీ కట్టిన మురిపెంలో
కొంటె పనులు చేసిన తరుణంలో
పెనవేసుకున్న అనుబంధాలు
కల్మషం లేని ఆ స్నేహాలు
తనివి తీరా నేస్తాలతో ఆస్వాదించే లోపే
యవ్వనం ఒచ్చేసిందని
బుట్టలో పెట్టి వూరు దాటించారు


వందల్లో వందనాలు చేసి దీవెనలు తీసుకుని
వేలల్లో విస్తర్లు వేసి వడ్డన చేసి
లక్షల్లో కాసులు పోసి కట్నాలిచ్చి
కోటి ఆశలతో కన్నీటి వీడ్కోలుతో
అబ్బాయి బావున్నాడని అమ్మేసారు
ఒస్తూ ఒస్తూ
మనసు పొరల్లో
అందమైన అరల్లో
అవన్నీ పదిలంగా దాచుకున్నాను


ఆకర్షణలో రెండేళ్ళు
అర్ధం అవడంలో రెండేళ్ళు
పిల్లలని పెంచడంలో ఇంకొన్నేళ్ళు
అత్తా మామల ఆరళ్ళలో
మోజు తగ్గిన మొగుడి నిర్లక్షంలో
అమ్మ అనే అంతులేని భాద్యతల ఉద్యోగం లో
అప్పుడప్పుడు కన్నీటి పొరల్లోంచి
ఆ గుడి, బడి, లోగిలి, ముంగిలి
అస్పష్టం గా కనిపిస్తాయి


ఆశగా అక్కడికి వెళ్లినా
ఆ వీధుల్లో నేస్తాలు లేరు
అమ్మేశారని కోపంతో
అక్కడ కూడా అతిథి గానే ఉండి
అంతా బావుందని నమ్మించి
 నా కాపురమనే కారాగారానికి తిరిగోచ్చేస్తాను


అప్పుడప్పుడు ఈ కారాగారంలో
చెప్పుకోలేని బాధలలో
భరించలేని దుఖ్ఖంలో


పంచుకోలేని పరిస్థితులలో
మనసు పొరల్లో 
అందమైన అరల్లో
పదిలంగా దాచుకున్న
గాజు బొమ్మల లాంటి జ్ఞాపకాలు 
బయటకు తీసి
కన్నీటితో కడిగి
చూపులతో తడిమి
మనసు అరలో ఎవరూ చూడకుండా
మళ్ళీ దాచేస్తాను


ఎవరికీ అనుమానం లేకుండా
కాపురం అనే కారాగారశిక్షని
అనుబంధం అనే బంధనాలతో
బాధ్యతల బరువును మోస్తూ
నా పిల్లలికి ఇలా జరగదని ఆశతో
రోజులు దోర్లిస్తుంటాను


ఎప్పుడైనా ఆ నేస్తాలు
కనిపిస్తే, పలకరిస్తే
వార్డెన్ పర్యవేక్షణ మాటులో
పర్మిషన్ తీసుకుని
ఆ రోజులని గుర్తుచేస్కుంటాను

ముఖ్య గమనిక: నేను ఆడపిల్లను కాను.. కాని అమ్మ తోటో,అక్క తోటో, చెల్లి తోటో మాట్లాడుతుంటే అప్పుడప్పుడు అయ్యో వీళ్ళ జీవితం ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అలా ఒక సారి అనిపించినప్పుడు రాసినది మాత్రమే.

6 కామెంట్‌లు: