15, నవంబర్ 2010, సోమవారం

అదే మా రోజుల్లో ఐతేనా .. కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో

అసలు మా రోజుల్లో దీపావళి తో పోలిస్తే ఈ రోజుల్లో దీపావళి  ఎందుకూ పనికిరాదు. అదే మా రోజుల్లో ఐతేనా..... వయసయిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటున్నారు కదూ? కాదండీ బాబూ. ఇది నిజ్జంగా నిజం. మారిన కాలంతో పాటూ మారిపోతున్న అలవాట్లు, మనుషులకి పండగ అంటే అందులో వుండే అసలు మజా రోజు రోజుకీ తగ్గిపోయి - ఒక సెలవు అనో .. లేదా సినిమా అనో.. లేదా నాలుగు దీపాలు పెడితే, నలభై - టపాకాయలు కాలిస్తే  దీపావళి అనో అనిపించేలా చేస్తోంది. అసలు పండగ అంటే నా దృష్టిలో సందడి. మళ్ళీ మా రోజుల్లోకి వెళ్ళిపోతే...


అసలు దీపావళి ఒస్తుందంటే ఎంత ముందుగా సిద్ధం కావాలి. ఇంట్లో చిన్నపిల్లల లెక్క పెట్టుకుని, ఎంత మంది వుంటే అంత ఎక్కువగా మతాబులు, చిచ్చుబుడ్డ్లు చేసుకోవాలి. వీటి తయ్యారీకి మందు పొడి తయ్యారు చేసుకుని ఎండ బెట్టాలి. బయట దొరికే మట్టి బుడ్లు కొనుక్కుని, న్యూస్ పేపర్ కాయితాలతో మైదా చేసుకుని అంటించి మతాబుల గొట్టాలు రెడీ చేసుకోవాలి . ఓపిగ్గా మందు వాటిలో దట్టించి కూరుకోవాలి. ఇంట్లో పెద్ద అన్నయ్యలో. మామయ్యలో, బాబాయిలో వుంటే పేకముక్కలతో తారాజువ్వలు చెయ్యడం  పెద్ద గొప్ప. మనకి అవి చూసే అవకాశమే ఇస్తారు, కొంచెం బతిమాలితే-  కాయితాలు చిన్నగా కట్ చేసుకుని సిసీన్ద్రీలు తయారు చేసుకోడం లో మనం హెల్ప్ చెయ్యచ్చు. అల్లా చెయ్యకపోతే మనల్ని అసలు కాల్చనివ్వరని మనకి ఒకటే వర్రీ.  అబ్బో అవన్నీ ఎండబెడుతూ వుంటే ఎప్పుడు కాలుస్తామా అని ఎంత ఆత్రంగా ఉండేదో. ఇంక పండగ దగ్గరికి ఒచ్చినా ఇంట్లో ఇంకా కాకర పువ్వోత్తులు, బాంబులు కొనట్లేదని ఒకటే టెన్షన్. అమ్మ దగ్గిర రోజూ బోలెడంత గొడవ చేసి, పదో-పావలనో తీసుకుని బయటకు వెళ్లి చిన్న చిన్న టేపులు (అవే తుపాకీలలో పెట్టుకుని కాల్చేవి) లాంటివి తెచ్చుకుని, నేల మీద పరిచి రాయితో కొట్టి పేల్చడం. అలా కాలుస్తే కాసేపు ఆనందం. మన అదృష్టం బావుంటే ఇంటి కొచ్చిన యే చుట్టమో ఐదు రూపాయలిస్తే అది అమ్మ దాచేస్తే, అవి నా డబ్బులు అని డిమాండ్ చేసి తుపాకీ కొనుక్కోడం. పండగ ముందు స్కూల్ లోను, ప్రైవేటు లోనూ ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారు, కొనుక్కోబోతున్నారు అని ఒకటే గుసగుసలు. అసలు పాటం పట్టించుకునే వాడు ఒక్కడూ లేడు.
ఇంక ఇంట్లో సామాన్లు తెచ్చాక వాటి చుట్టూ  మూగడం. ఆ తర్వాత ఆస్తి పంపకాలని మించిన గొడవలు సామాను పంపకాల దగ్గర. అందరికీ లక్ష్మి బాంబులు, పురుకోసా బాంబులు, ఏరోప్లైన్లు, వంకాయ బాంబులు కావాలి. కాకర పువ్వోత్తులు, పెన్సిళ్ళు చాలలేదని పెద్ద పద్దు చెప్పి ఒకటే గొడవ. ఎవరి వాటా వాళ్ళు సెపరేట్ పళ్ళేలలో ఎండ బెట్టుకోవటం- పైగా వాటికి కుక్కలా కాపలా ఒకటి. ఎవరు ముందుగా శాంపిల్ కని ఏదైనా కాలిస్తే, అది మన వాటాలోంచి కొట్టేసారేమోనని అన్నీ ఒక సారి లెక్కపెట్టుకోవడం. ఈ హడావిడిలో పండగ ఒచ్చేస్తుంది.


ఇంక పండగ ముందర బట్టల దగ్గర అయితే ఈ సారి నాకు నిక్కరు ఒద్దు, పాంటు కావాలని బిక్క మొహం వేసి సతాయించడం. ఐనా సరే మనకి పండగలు ఎన్ని వెళ్లినా నిక్కర్లు పోడుగయ్యేవి కాదు, పైగా అమ్మ చేసే పువ్వుల చొక్కా సెలక్షన్ నచ్చలేదని ఎప్పుడూ ఏడుపే. అమ్మేమో ఒచ్చే పండగ అని హై కోర్ట్ వాయిదా టైపు లో మళ్ళీ వాయిదా. పొద్దున్నే తలంటుకుని, సాయంత్రం దాకా ఆగలేక ఒకటి రెండు శాంపిల్ పేరుతో బాంబులు కాల్చేయ్యడం. అక్కడినించి ఎప్పుడు చీకటి పడుతుందా అని ఒకటే వెయిటింగ్. అమ్మ చేసిన పులిహార, పాయసం ప్రతి దీపావలికీ స్టాండర్డ్ మెను.. కన్సోలేశున్ గా ఆవడో, చంద్రకాంతమో చేస్తే వాటితో సరిపెట్టుకుని, మనలాంటి ఒకళ్ళిద్దరు గొట్టంగాల్లని వేసుకుని ఊర్లో అందరి టపాకాయల inventory ని సర్వే చెయ్యడం. ఎవడైనా దారిలో భారీగా కాలుస్తుంటే అక్కడ నిలబడి ఇంతిత కల్లేసుకుని దేబిరించుకుంటూ చూడడం. ఐపోయాక ఒక సారి షాప్ కి వెళ్లి thousandwaala , పారాచూట్, ఫ్లవర్ రాకెట్ లాంటివి దగ్గరగా చూసి, అవి కొనుక్కుని వెళ్లే వాడి కేసి ఆశగా చూసి.. ఇంకా సిగ్గు విడిచి యే టైం కి కాలుస్తారో అని కనుక్కోడం (వాళ్ళు మన ఇంటి దగ్గర వుంటే మనం కాల్చకపోయిన చూద్దామని, చూసి అందరికీ గొప్పలు చెప్దామని). ఈ హడావిడిలో అమ్మో చీకటిపడిపోతుంది అని పరిగెడుతూ ఇల్లు చేరడం. అప్పటికి అమ్మ పూజ చేసి,మనం పూజకి లేనందుకు రెండు అక్షింతలు వేసి (పూజ టైం కి ఇంట్లో లేనందుకు), బొట్టు పెట్టి, బట్టలు మార్పించి.. అన్ని జాగ్రత్తలతో గోంగూర కాడలతో ఒత్తులు వెలిగించిన దివిటీలతో పాట పాడించి నేలకేసి కొట్టాక ఇంక మొదలు మన దీపావళి ధమాకా...


 ముందుగా కాకర పువ్వోత్తులతో మొదలు పెట్టి, ఒకటి రెండు మతాబులు, చిచ్చుబుడ్లు, పెన్సిళ్ళు కాల్చి.. ఆ తర్వాత భూ చక్రాలు, విష్ణు చక్రాలు.. ఇంకా ముందుకెళ్ళి ఏరోప్లానులు.. ముందు కొంచెం దూరంగా బెట్టి కాల్చి.. ఆ తరవాత ఉత్సాహం పెరిగి, చేతితోనే డైరెక్ట్ గా కాల్చేస్తూ.. మధ్యలో ఆరిపోతున్న దీపాలని వెలిగిస్తూ అమ్మ. చెప్పులు వేసుకోండి, దూరంగా కాల్చండి అని తిట్లు తిట్టే నాయనమ్మ. చివ్వర్లో కొంచం శబ్దాలు సద్దు మణిగాక, మన బాంబులు బయటకు తీసి కాల్చి. బాగా లేటుగా తారా జువ్వలు.. అన్నీ ఐపోయాక రోడ్ల మీద పడి సిసింద్రీలు కాల్చుకోవడం. ఎవడైనా పారచూటు వున్న రాకెట్ కాలిస్తే ఆకాశంలోకి ఆశగా చూడడం, కింద పడ్డ పారచూటు ఏరుకోడం. కాల్చిన కాకర పువ్వోత్తులని జాగ్రత్తగా ఒక పక్కకే పడెయ్యడం. ఒకటో రెండో చోట్ల ఒళ్ళు కాలినా- ఆ సందడిలో మనకి అవేమీ పట్టేవి కాదు.     


పండగ అయిపోయిన తర్వాత రొజూ మామూలుగా పొద్దున్న లేవని మనం - ఆ రోజు కోడి కూయకుండానే లేచి, బయటకి ఒచ్చి మున్సిపాలిటీ వాళ్ళు రాకముందే పక్క ఇంటి ముందు, తర్వాత మన ఇంటి ముందు పేలని బాంబుల కోసం చెత్తలో వెతకడము. సగం కాలిన, ఒత్తులు వెలిగి పేలనివి బాంబులు గట్రా లాంటివి అన్నీ ఏరుకుని రావడం. అందులో పేల్చగలిగినవి మళ్ళీ పేల్చడం. మిగిలినవి అన్నీ కలిపి చింపి, వాటిలో మందు బయటకు తీసి ఒక పేపర్ లో వేసి అగ్గి పుల్లతో తగల పెట్టడం. అదో తుత్తి. మళ్ళీ రాత్రికి పాములు, మిగిలిన సామగ్రి నాగుల చవితి దాకా రాత్రి పూట కాల్చుకోవడం. ఇంక పగలంతా కాలిపోయిన కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని కడిగి, ఎండ బెట్టుకుని.. వాటి చివరలని గొడుగు ఆకారంలో ఒంచి, అక్కవో-అమ్మవో గుప్పెడు రబ్బరు బాండ్లు దొబ్బేసి జేబిలో పెట్టుకుని బయట పడడం.. ఆ రబ్బరు బాండు రెండు వేళ్ళ మధ్య సాగ దీసి,  కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని ముందు భాగానికి తగిలించి, రబ్బరు బాండు వెనక్కి లాగి.. దానితో కుక్కల్ని, పందుల్ని, ఇంటి పై కప్పులని, వెళ్లే వాహనాలని గురి పెట్టి కొట్టుకుంటూ ఊర్లో షికార్లు చెయ్యడం.  ఏరుకున్న పారచూటు ఒక చిన్న రాయికి కట్టి జాగ్రత్తగా చుట్టి గాల్లోకి వేసి, అది విచ్చుకుని కిందకు మెల్లిగా దిగుతుంటే క్యాచ్ పట్టుకుని.. అది డబ్బులు పెట్టి కొని కాల్చిన వాడికంటే పది రెట్లు పొంగిపోవడం. మన టైం బాలేక ఒక్క పారచూటు కూడా దొరకకపోతే, ఒక జేబురుమాలుకి నాలుగు కొసల్లో నాలుగు దారాలు కట్టి, అవన్నీ ఒక రాయికి కట్టి .. అదే మన పారచూటు అని గాలిలోకి విసరడం.


చూసారా పండగ ముందు, పండగ రోజు.. చివరకి పండగ అయిపోయిన తర్వాత కూడా ఎంత ఎంజాయ్మేంటో. అందుకనే అంటున్నాను మళ్ళీ .. అదే మా రోజుల్లో ఐతేనా .......కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో ఫుల్ ఎంజాయ్...

12 కామెంట్‌లు:

  1. nijamenandi,,memu chesevallam maatabulu,tataaku tapakayalu,chicchubuddilu,etc.andaru tala oka cheyyi vesi chesevallam,,saradaga undedi...okka tapakaya peltutnte adoka vijaya garvam ga undedi...500 pettina boledu ravatamledu...sagam pelavu..dabbu dandagale..machi post raasaru..

    రిప్లయితొలగించండి
  2. అలా ఒకసారి నన్ను నా చిన్నతనంలోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఆ రోజుల్లో సరదాలే వేరండి, ఒక విధంగా చెప్పాలంటే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో.

    రిప్లయితొలగించండి
  3. స్ధితప్రజ్ఞ ,
    నిజమేనండి.నచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  4. నిజంగానే బాల్యంలోకి తీసుకెళ్ళారు. Nice post. Very well written.

    రిప్లయితొలగించండి
  5. అయ్యబాబొయ్ భీభత్సం చేసారుగా! మేము ఎప్పుడూ బాంబుల్లు,మతాబులు తయారు చెయలెదు.అన్నీ కొనుక్కోవడమే.శివకాసీ లో ఇవి తయారుచేస్తారు అని తెలుసుగానీ ఇలా ఇంట్లో చేసుకుంటారు అని తెలియదు.భలె భలె ఉన్నాయ్ మీ దీపావళి ముచ్చట్లు :)

    రిప్లయితొలగించండి
  6. ఇందు,
    నచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  7. చెప్పు దెబ్బలు-పూలదండలు,
    Thank you..

    రిప్లయితొలగించండి
  8. really good one...chinnappudu nenu ivemi tayaru cheyyaledu.. kaani..my parents keep on saying that they did all these...kaani oka common point enti ante "sandadi"...that is missing these days anipistundi...

    రిప్లయితొలగించండి