28, ఏప్రిల్ 2011, గురువారం

100% Love పాట +-X=Infatuation


సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 100 % లవ్. ఆర్య-2 పాటలు ఎంత సూపర్ హిట్టో మనకు తెల్సిందే.  దానికి కూడా మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాదే. వీళ్ళిద్దరి కలయికలో  ఒస్తున్న ఈ సినిమా పాటలు హైప్ కి తగ్గట్టే బాగా అనిపించాయి. అందులో బాగా ఇంప్రెస్స్ చేసిన పాట Infatuation . చంద్ర బోస్ రాసిన ఈ పాట అద్నాన్ సామీ పాడారు. ఈ పాట కాలేజీ పిల్లలని అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అందులోనూ చిన్నప్పుడు తెలుగు మీడియం లో చదువుకున్ననాలాంటి వాళ్లకి మరీ మరీ నచ్చుతుంది. మీరేమీ "నువ్వేంటి ?కాలేజీ కుర్రాడితో కంపారిజన్ ఏంటి రా?", అని మనసులో అనుకో అక్కరలే. నేనూ ఒక సినిమా హీరో అయ్యుంటే బాలయ్య లాగ, వెంకి బాబు లాగ, నాగ బాబు లాగ పుస్తకం పట్టుకుని కాలేజీ కి వెళ్ళిన scenelo నటించే వాడిని,   మీరు కూడా వేరే దారిలేక సినిమా చూసేవారు.

సరే నా గురించి పక్కన పెట్టి పాట విషయానికొద్దాము. బహుసా ఈ పాట రాసిన చంద్ర బోస్, మ్యూజిక్ కొట్టిన దేవి శ్రీ, దర్శకుడు సుకుమార్ అందరూ ఇంజనీర్ లనుకుంట. ఈ సినిమా పాటలలో ఆ చాయలు కనిపిస్తాయి. కొత్త బంగారు లోకం స్కూల్(ఇంటర్ ఏమో)  ప్రేమ అయితే అందులో కళాశాలలో పాట ఎంత బావుందో దానికి ఒక మెట్టు ఎక్కువ ఇది. కాలేజీ ప్రేమ కాబట్టి ఈ పాటలో చంద్ర బోస్ లెవెల్  పెంచాడు.
ఇదిగో మీ కోసం కింద సాహిత్యం మరియు ఆ పాటకు లింకు.



Infatuation:

కళ్ళు కళ్ళు ప్లస్సు  వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటీ ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్‌ఫాచుయేషన్  |2|


ఎడమ బుజము కుడి బుజము కలిసి ఇక కుదిరె కొత్త త్రిబుజం  
పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం

సరళలేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతున్దోయ్ ఉష్ణం
                                                                       
                                         కళ్ళు కళ్ళు ప్లస్సు   ||


దూరాలకు మీటెర్ లంట భారాలకు కేజీ లంటా
కోరికలకి కొలమానం ఈ జంట

సెంటిగ్రేడ్ సరిపోదంట  farenheit  పనిచెయ్య దంట
వయసు వేడి కొలవాలంటే తంటా

లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్ధం కాదు ఏ సైన్సు కైనా

పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్ర్యావిటేషన్
పైన కింద తల కిందులవుతది ఇన్‌ఫాచుయేషన్

                                          కళ్ళు కళ్ళు ప్లస్సు  ||

సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోలు అమ్మాయంట రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట   రుణావేశం అమ్మాయంట   కలిస్తే కరంటే పుట్టే నంట
ప్రతీ స్పర్శ ప్రశ్నే నంట  మరో ప్రశ్న జవాబట ప్రాయానికే పరీక్షలంట  -ఓ

పుస్తకాల పురుగులు రెండంట ఈడు కొచ్చె నంట
అది అక్షరాల  చెక్కెర తింటూ మైమరచే నంట

                                          కళ్ళు కళ్ళు ప్లస్సు  ||
Song లింక్:

Song Source: http://www.raaga.com/
Special Thanks to SURI for telling me to listen to this movie songs.

27, ఏప్రిల్ 2011, బుధవారం

లాలీపాప్ దొంగతనం


నా కూతురిని ప్రతి సోమవారం కుమోన్ కి ఇంగ్లీష్ రీడింగ్ కి తీసుకెళ్తూ వుంటాను. అక్కడ దాని హోం వర్క్ అయ్యాక అక్కడున్న పెద్ద సీసాలోంచి లాలిపాప్ తీసుకుని బయటకు రావడం అందరు పిల్లల లాగే మా అమ్మాయికి అలవాటు. అయితే వాళ్ళ అమ్మ కోసం గడ్డి పూలు, నాన్న కోసం పూసలు లాంటివి దొరికితే తెచ్చి నీకోసం తెచ్చానని ఇవ్వడం నా కూతురికి అలవాటు. అలా అప్పుడప్పుడు ఒక లాలిపాప్ బదులు రెండు తీసుకుని ఒచ్చి"నాన్నా! నీ కోసం", అని నాకు ఇవ్వడం జరుగుతూంటుంది.

సాధారణంగా ఇంటి దగ్గర వుంటే కుమోన్ బాధ్యత నాదే. డే కేర్ నించి తీసుకొచ్చి కొంచెం తిండి పెట్టి కుమోన్ తీసుకెళ్ళడం, అది కూడా సోమ వారం కాబట్టి  కొంచెం హేక్టిక్.  ఆ హడావిడిలో నేను ఆ రోజు తినకుండా బయలుదేరాను. వెనక నించి మా ఆవిడ "నీకు ఆకలేస్తుంది కదా! డబ్బా కట్టివన్నా?" అంటుంటే ఆలస్యమైపోయిందని అలాగే బయలుదేరా. ఎప్పటి లాగే కుమోన్ ఐపోయాక నా కూతురు లాలిపాప్ కోసం సీసా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ కుమోన్ హెడ్, మిస్సెస్ పి (ఆవిడ పేరు పార్వతి) అక్కడే నిలబడి వుంది. నా కూతురు మిస్సెస్ పి ని గమనిస్తూ తన వైపు చూడట్లేదని నిర్ధారణ చేసుకుని రెండు లాలిపాప్ లు తీసింది. తీసాక చేతులు వెనక్కి పెట్టుకుని మిస్సెస్ పి ని దాటుకుని బయటకు ఒచ్చింది. ఇదంతా గమనిస్తున్న నేను నాకోచ్చే నవ్వుని ఆపుకుని "ఎందుకు నీ చేతులు వెనక్కి పెట్టుకుని ఒచ్చావు?" అని అడిగాను. "మిస్సెస్ పి చూస్తే ఒక్కటే తీసుకోవాలి అంటుంది డాడీ" అంది. "మరి ఒక్కటే తీసుకోవాలి కదా!" అన్నాను. "నీ కోసం డాడీ. నీకు ఆకలేస్తుందని", అని నా చేతిలో ఒక లాలిపాప్ పెట్టింది. అసలే ఆకలి మీదున్న నాకు దాని మాటతోటే సగం కడుపు నిండింది, నా కూతురు నాకోసం దొంగతనంగా తెచ్చిన లాలిపాప్ చప్పిరిస్తూంటే కడుపు మిగిలిన సగం నిండింది. కానీ మనసులో ఎక్కడో నేను బాధ్యత గల తండ్రిగా అలా చెయ్యకూడదని, క్లాసు పీకకుండా ఎందుకున్నానని ఆలోచించడం మొదలెట్టా.  



నిజానికి నేను చిన్నప్పుడు "సత్యమేవ జయతే", "ధర్మో రక్షతి రక్షితః","ఎల్లప్పుడూ సత్యమే పలుకవలెను", "దొంగ తనం మహా పాపం" లాంటి వన్నీ ఎంతో నిజాయితీగా పాటించేవాడిని. కానీ పెరిగే కొద్దీ అన్ని వేళల్లోనూ, అన్ని పరిస్థితుల లోను అల్లా వుంటే మనం బ్రతకలేము అని అర్ధం అయ్యింది.
చేసే పని సరయినది అయితే మార్గం ఎలా వున్నా పర్లేదు అనే మార్పు ఒచ్చింది. మంచి అనిపించింది (నా దృష్టిలో) చెయ్యాలంటే ఒక్కో సారి అబద్దమో, మోసమో చెయ్యక తప్పదు అనిపించేది. ముఖ్యంగా నా చుట్టూ ఉన్న కొంత మంది నిజాయితీ పరులు, సత్యవంతులు ఓడిపోతున్నప్పుడు వాళ్ళన్ని నిలబెట్టాలంటే ఏం చేసినా తప్పు లేదని నిర్ణయానికి ఒచ్చాను. పెళ్ళాం దగ్గర నిజాయితీ కోసం తల్లి తండ్రుల అవసరలాకి పనికి రాని కొడుకుల నిజాయితీ నాకు అక్కర్లేదని అనిపించింది. కొంచెం ఎక్కువ ఆలోచించినా నా కూతురుకి క్లాసు పీకకూడదని తీర్మానానికి ఒచ్చి, "నాన్న గురించి ఆలోచించినందుకు థాంక్స్, కానీ నువ్వు ఒక్కటే తీసుకో" అని మెత్తగా మందలించాను.

కానీ ఆలోచనలు అక్కడితో ఆగుతాయా.
"నాన్నా మా టీచర్ కళ్ళ జోడు విరిగిపోయిందట, కొని పెట్టు", అని వాల్మార్ట్ లో కళ్ళజోళ్ళ షాప్ చూపించి అడిగిన విషయం.
"మా టీచర్ దగ్గర డబ్బు లేవట, పిక్నిక్ అప్పుడు అందరి పిజ్జాలకి నువ్వు డబ్బులు కట్టు", అని డే కేర్ లో నా జేబులో చెయ్యి పెట్టిన విషయం....
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు "నీకోసం తెచ్చా", అని దాని బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టిన సందర్భాలు గుర్తుకొచ్చి...

మనసులో ఎక్కడో "మిస్సెస్ పి లాలిపాప్ దొంగిలించి నాన్నకు పంచినట్లు, రేపొద్దున్న ఆస్తులు దోచి అందరికీ పంచదు కదా? రాబిన్ హుడ్ సినిమాలోలా", అనిపించింది.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

నాన్న చెప్పని నిజాలు

నా చిట్టి తల్లికి..

      నీ చిన్నప్పుడు నీకు నాన్న చెప్పని కొన్ని నిజాలు.

  •  నాన్నసూపర్ మాన్ కాదు... నీకోసం అప్పుడప్పుడు అలా అయిపోతాడు (నొప్పులు లెక్క చెయ్యకుండా).
  • నాన్నకు మంత్రాలు తెలియవు... నోటితో చిత్ర విచిత్ర శబ్దాలు చేసింది నీకు దెబ్బ తగిలిందని నువ్వు మర్చిపోడానికి.. నాన్న మంత్రాలకు చింతకాయలు రాలవు... కానీ.. నీ మొహం మీద చిరునవ్వు తెప్పిస్తాయి...
  • నాన్న మంచి గుర్రం.. కానీ TILES మీద మోకాళ్ళ తో పరిగెత్తితే ఏ గుర్రానికైనా నొప్పులోస్తాయి
  • నాన్న ఓడిపోయే కుందేలు - నిన్ను నెగ్గించే తాబేలు (పాలు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు)  
  • నాన్న కధలన్నీ కట్టు కధలే.. నీకు చెప్పాలనుకున్నది జంతువుల కధలతో చెప్తాడు  
  • నాన్న చూసినవి అన్నీ నీకు తప్పు చెప్పేది (గుర్రాన్ని గాడిద అనీ, కుక్కని పండి అనీ) ఎందుకంటె, నువ్వు సరి చేసినప్పుడు నీకు తెలుసో లేదో తెలుసుకోడానికి.. తెలియకపోతే నేర్పడానికి..
  • నాన్నకి మేజిక్ రాదు.. ఏదీ మాయం చెయ్యలేదు.. అన్నీ నాన్న చేతిలోనో, చొక్కాలోనో వున్నాయి
  • నువ్వు సోఫా మీద గెంతేటప్పుడు చుట్టూ దిళ్ళు వెయ్యడం ఆట కాదు.. నువ్వు పడితే దెబ్బ తగలకూడదని.
  • నీ ఫ్రెండ్స్ అందరూ నాన్న ఫ్రెండ్స్.. అందుకనే నాన్న నిన్ను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి తీసుకెళతాడు..నీకు ఆడుకోడానికి కంపెనీ కోసం
  • నువ్వు క్రికెట్ ఆడితే నాన్న బౌలర్, base బాల్ ఆడితే pitcher , బాస్కెట్ బాల్ ఆడితే కోచ్, ఫుట్ బాల్ ఆడితే గోలీ....
  • నువ్వు నాన్న బుజాలు ఎక్కినప్పుడు, నీ వెనక నాన్న చేతులు నువ్వు పడిపోకుండా పట్టుకోవాలని.. నువ్వు ఒద్దన్నా సరే.. 
  • మన చేపలు వాల్మార్ట్ కి వెళ్ళలేదు... మన నత్త పారిపోలేదు... (అవన్నీ చచ్చిపోయాయి..)
  • నాన్నకి అందరిలాగే వుద్యోగం వుంది.. చాలా పని  వుంది, ఆఫీసు కష్టాలు వున్నాయి, బాధించే బాసులు వున్నారు ... అవన్నీ నీ కంటే ముఖ్యం కాదు.. అందుకే నాన్న ఆఫీసు లో లేడు.  నీతోనే వున్నాడు నీకు అవసరం ఐనప్పుడు...  
  •  నాన్నకి జడ వెయ్యడం రాదు, బెండకాయలు ఏరడం రాదు, పియానో వాయించడం తెలియదు.. కానీ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు.. నీకోసం నేర్చుకోడానికి.
  •  నాన్న ఎప్పుడూ పూరియే ఆర్డర్ ఇస్తాడు.. నువ్వు తింటే నాన్నకి కడుపు నిండుతుందని
  • నువ్వు తినకుండా మారాం చేసినప్పుడు, పప్పు అన్నం ముద్దలు జంతువుల SHAPE లో మారవు. అవి నీ నోటిలోంచి పొట్టలోకి వెళ్లి అక్కడ పార్టీ చేసుకోవు..
  •  నాన్న కింగ్ కాదు. నిన్ను PRINCESS చెయ్యాలని నాన్న కింగ్ అయ్యాడు.. కింగ్ లు నిన్ను నవ్వించడానికి పిచ్చి గెంతులు వెయ్యరు. నీతో కలిసి డాన్సు చెయ్యరు..
ఐదేళ్ళు నిండిన నువ్వు పదే పదే, "డాడీ! ఐ యాం బిగ్ గర్ల్ నౌ", "దట్ ఈస్ ఫర్ బేబీస్, నాట్ ఫర్ మీ" అని అంటుంటే.. ఇక నిన్ను ఇంతకు ముందులా మభ్య పెట్టలేనని....

5, ఏప్రిల్ 2011, మంగళవారం

మా అమ్మాయి కొట్టిన తీన్ మార్ మ్యూజిక్

మా అమ్మాయిని పియానో పాటాలకు పంపడం మొదలుపెట్టి ఇంచుమించు సంవత్సరం అవుతుంది. అయితే పేరుకు పియానో లెస్సన్ అయినా, దాని మనసు అంతా DRUMS మీదే. క్లాసు ఇంకా మొదలు పెట్టక ముందే అది దాని టీచర్ తో బేరం మొదలు పెడుతుంది, "నేను DRUMS వాయిస్తాను" అని.  చివ్వర్లో వాయిద్దువు గాని అని సర్ది చెప్పి వాళ్ళ టీచర్ పియానో పాటం మొదలు పెడుతుంది. అసలు అదేదో నేర్చుకున్నట్లుగా కాకుండా, నా కూతుర్ని ఆ టీచర్తో ఆడుకోడానికి తీసుకోచ్చినట్లుంది ఆ అరగంట మ్యూజిక్ క్లాస్. పైగా అరగంటకి పద్దెనిమిది డాలర్స్ తీసుకుంటుంది. అరగంట సేపు ఏదో పుస్తకంలో రాతలు గీతలు, కాసేపు మా అమ్మాయి యక్ష ప్రశ్నలు, ఇంకాస్సేపు మాట వినని నా కూతుర్ని బుజ్జగించడం. అప్పటికి ఒక ఇరవై నిమిషాలు అయిపోతాయి. చివరి పది నిమిషాలు ఏదో భంగిమ టైపు లో చేతులు ఏ పోసిషన్ లో పెట్టాలో (చేతుల్లో బుడగలు వున్నట్లు అవి పగలకుండా పటుకున్నట్లు),
 పియానో ముందు ఎలా కూర్చోవాలో లాంటి వాటితో మొదలెట్టి ఒక ఐదు నిముషాలు తూతూ మంత్రం కింద పియానో
టప టపా బాది, (నాకేమో క్షణం క్షణం లో సీన్ గుర్తొస్తూ వుంటుంది) ఐపోయిన్దనిపిస్తారు.  పోనీ నేనేమైనా ఆ టీచర్ ని కొంచెం గట్టిగా పియానో నేర్పించమని అడుగుదామంటే అసలే పెద్ద అంద గత్తె, మనకేమో ఆడపిల్లని చూస్తే మాట రాదు, అందులో అందమైన ఆడపిల్లలని అసలు ఏమి అనలేము. దానికి తోడు నేను కూడా ఈవిడ దగ్గర నాలుగైదు పియానో పాటాలు నేర్చుకున్నాను లెండి. నా కూతుర్ని ఇంటి దగ్గర ప్రాక్టీసు చేయించాలంటే మనకి సంగీతంలో ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా అని.
అలా క్లాసు ఐపోయే టైం కి నా కూతురు మోహంలో వెలుగు, ఇంక తీన్ మార్ డప్పు కొట్టొచ్చు అన్న ఆనందం. ఇదిగో ఈ కింద వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మా అమ్మాయి తీన్ మార్ టాలెంట్.