11, అక్టోబర్ 2011, మంగళవారం

ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి

కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, బృందావనం లో క్లాసు క్యారెక్టర్ తో పరవాలేదు అనిపించి తర్వాత శక్తీ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చి.. మళ్ళీ వెరైటీ రోల్ తో ఊసరవెల్లి సినిమా లో కనిపించిన జూనియర్ N T R  హీరో గా, దేవి శ్రీ హిట్ మ్యూజిక్ కాంబినేషన్ చిత్రం ఊసరవెల్లి.  రిలీజ్ కి ముందర దూకుడు కి కళ్ళెం వేసి, దాని కలక్షన్ లకి గొళ్ళెం పెట్టే చిత్రంగా చెప్పబడింది. అబ్బో ఇంకేముంది ఇరగదీస్తుంది అని చొక్కా చించుకుని మా దగ్గరలో ఉన్న ధియేటర్ కి మొదటి ఆటకి వెళ్ళాను. నేను పని చేసేది మేరీ ల్యాండ్ లో. సాధారణంగా తెలుగు సినిమా అంటే వర్జీనియా వెళ్లి చూడాలి. ఈ మధ్య మేరీ ల్యాండ్ లో కూడా సినిమా వేస్తున్నారని వెళ్తే, సినిమా మొదలయ్యే టైం కి పది మంది కూడా లేరు హాల్లో. పద్దెనిమిది వందలు దియటర్ లలో సినిమా రిలీజ్ చేస్తే ధియేటర్ కి పదిమంది చొప్పున అసలు సినిమా ఎలా వర్క్ అవుట్ అవుతుందో నని బుర్ర గోక్కుంటూ, జుట్టు పీక్కుంటూ చేతిలోకోచ్చిన నాలుగు వెంట్రుకలూ చూసుకుని- నాలిక కరుచుకుని మళ్ళీ జుట్టులో దోపే ప్రయత్నం చేసి సినిమా టైటిల్ పడుతుంటే ఆసక్తిగా సీటు లో ముందుకు జరిగి మరీ చూసాను. 

ఎర్రటి అడ్డ గీతలు, నిలువు గీతలు అటూ ఇటూ కోణాలు కొంచెం మార్చి టైటిల్స్ వేసేసాడు. సరేలే టైటిల్స్ కే అంత ATTENTION  ఎందుకని సీట్ లోకి వెనక్కి జరుగుతుంటే ఇంతలో హీరో ని వాడెవడో అర్ధం కాని రీతిలో, "వీడు ఎవడికీ అర్ధం కాడని", అర్ధం పర్ధం లేకుండా వ్యర్ధం గా పరిచయం చేస్తుంటే పెద్ద సౌండ్ తో బాంబు పేలి, మిలిటంట్లు అదీ అని హడావిడి మొదలయ్యింది. కొంచెం సద్దు మునిగేలోపు ఒక ముద్దు సీన్ తో మొదటి పాటలోకి వెళ్ళిపోయారు మన దేవి శ్రీ ప్రసాద్ అండ్ తమన్నా. అదేమిటి దేవి శ్రీ మ్యూజిక్ అనుకున్నానే, ఇచ్చిన డబ్బులకి డప్పు కొట్టి, పాట పాడి పైగా పండగ ఆఫర్ అని చెప్పి పాటలో నటించేసాదేమో, డైరెక్టర్ ఎంత ఒద్దన్నా.. వినకుండా అని మళ్ళీ బుర్ర గోక్కోబోయి, ఎదర అర ఎకరం మీద నించి నాలుగు వెళ్ళు వెనక్కి పోనిస్తూ అంతకు ముందర ఊడిన వెంట్రుకలు గుర్తుకొచ్చి ఆగిపోయా. మళ్ళీ పరీక్షగా చూస్తే మన జూనియర్ NTR - అదేంటి ఇలా ఐపోయాడని అనుకుని, ఇది ఊసరవెల్లి ఒక రంగు మాత్రమే అని సరిపెట్టుకుని ఈ ఉబ్బిన ఊసరవెల్లి మిగిలిన రంగులెలా ఉంటాయో అని చూడడం మొదలెట్టా.  ముద్దు పెట్టిన హీరొయిన్ ని ప్రేమ కోసం ముష్టి ఎత్తుకుంటూ హీరో.. ఆ హీరో చేతిలో తన్నులు తింటూ ఒక కామెడీ గాంగు... మధ్యలో ఒకటి రెండు పాటలు అలా నడిచిపోతుంది సినిమా మొదటి సగం.. 
    ఇంక రెండో సగం లో ఒకటే ట్విస్టులు.. ఊసరవెల్లి రంగులు మారుతూ.. అయితే, ఇక్కడే మనం చూస్తున్న కత్తి లాంటి హీరొయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ వుందని. అదంతా మరిచిపోయి ఆవిడ కాట్రవల్లి (అదే నండీ కిక్ సినిమాలో అలీ క్యారెక్టర్) అయ్యిందని మనకి డైరెక్టర్ గారు కొంచెం సాగ దీసి మరీ అతలా కుతలంగా చూపిస్తారు. హీరొయిన్ అన్నయ్యకి జరిగిన అన్యాయం, ఫ్యామిలీ కి జరిగిన దారుణం చూపిస్తూ.. ఇంతలో హీరోకి తండ్రి ద్వారా నా వేస్ట్ లైఫ్ లో ఒక్క మచి పని కూడా చెయ్యలేదు కాబట్టి ఘోస్టులా నీ వెంట ఉంటా.. నువ్వు నాలాగా కాకుండా లైఫ్ లో ఒక మంచి పని చెయ్యమని చెప్పి చచ్చి ఘోస్ట్ అయిపోతాడు. బుర్రల్లో బుల్లెట్ వున్న హీరొయిన్.. బుర్ర బరువు పెరిగిందని జుట్టు కత్తిరించుకుని, వర్షం లో తడుస్తూ చీకట్లో హనుమంతుని విగ్రహం దగ్గర దేవుణ్ణి తనకు జరిగిన అన్యాయానికి నిలదీస్తుంది. అక్కడే విగ్రహం పైనించి చుక్క పడి, పక్క నించి డప్పులు మీద దరువు పడి, ఆ పైన వంద మందిని చితక బాదే హీరో కనపడి,  ప్రతీకారం తీర్చుకునే దారి కనపడి, తన పగ హీరో కిచ్చి తను మర్చిపోతుంది. అప్పటి నించీ కాట్రవల్లి లా నటిస్తుంది. ఒకడి తరవాత ఒకడిని వరసగా విల్లన్ గాంగు ని మన హీరో ఎందుకు బాబూ మమ్మల్ని ఇలా వేయించుకు తింటున్నావు అంటే  చెప్పకుండా వాళ్ళని విసిగించి చంపేస్తుంటాడు. సుత్తి కొట్టి ఇంకా చావని వాళ్ళని పొడుగాటి సుత్తితో కొట్టి చంపేస్తాడు.  మధ్యలో మాస్ కోసం అన్నట్లు పెద్దగా సంబంధం లేకపోయినా ఒక సాంగు సింగుతారు. ఇంతలో పెద్ద విల్లన్ ప్రకాష్ రాజ్ ఒస్తాడు. మరిన్ని మలుపులతో మన హీరో చేతి అందిన కర్రని,కొక్కాన్ని, సుత్తినీ వాడి ఒక్కొక్కళ్ళని చంపిన తరవాత అన్ని ఒస్తువులూ ఐపోయాయి అని మనం చంకలు గుద్దుకుంటే... CLIMAX లో పెద్ద విల్లన్, హీరో చేతికి అందిన ఒస్తువుతో చంపేస్తాడని అవన్నీ దూరంగా పెట్టి..కుర్చీకి బాగా టేప్ తో కట్టేసాక, ఇంకేమి చేస్తాడులే  అని డైలాగ్ చెప్తుంటే .. మన హీరో కుర్చీ లో కట్లతో పాటూ యెగిరి అందరి మీదా పడి చంపేస్తాడు. నాకు అప్పుడే కొంచెం కదిలితే నా కుర్చీ కూడా ఎగురుతుందేమో నని అనుమానం ఒచ్చి కాళ్ళు నేలకు తన్ని కుర్చీ హ్యాండ్ రెస్ట్ గట్టిగా పట్టునేటప్పటికి సినిమా ఐపోయింది..
  ఈ ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి నాకు మాత్రమే ఇలా అనిపించిందా.. లేక అందరికీ ఇలాగే అనిపించి ఉంటుందా అని ఆలోచించుకుంటూ మెల్లిగా హాలులోంచి బయటకు ఒస్తుంటే... నా ముందు ఒక ఏడుగురు సినిమా గురించి చర్చించుకుంటూ పార్కింగ్ లాట్  లోకి వెళ్తున్నారు. వీళ్ళు సినిమా మొదలయ్యాక ఒచ్చి వుండాలి ఎందుకంటె మనకి లోపలి వెళ్ళినప్పుడు కనపడలేదు కదా అని వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఒక చెవి అటు పడేసా.. అందులో ఒక వ్యక్తిని మిగిలిన వాళ్ళు తిడుతున్నారు ఈ సినిమాకి తీస్కోచ్చినందుకు.. ఇప్పుడు మాకు అర్జెంటు గా రెండు పెగ్గులు మందు పోయిస్తే గాని నిన్ను క్షమించేది లేదని చుట్టు ముట్టారు... సందిట్లో సడేమియా అని వాళ్ళతో చర్చ పెట్టాక తెలిసింది.. వాళ్ళు కూడా నాలాగే చొక్కా చించుకుని ఒచ్చినందుకు బాగా డిసప్పాయింట్ అయ్యారని..
 మీకు గనక సినిమా నచ్చుంటే నన్ను తిట్టుకోకండి.. ఎందుకంటె అంత హైపు ఇస్తే సినిమా అంచనాలు అందుకోవడం  కష్టం. పైగా ఇది జూనియర్ NTR ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు. కధ బానే వున్నా.. కధనం లో ఎక్కడో లోపం. మొదటి సగం పరవాలేదు అనిపించినా... రెండో సగం మెప్పించలేదు.. సినిమాటోగ్రఫీ చాలా బావుంది.. కత్తి లాంటి తమన్నా .. కాట్రవల్లి గా కూడా మెప్పించింది.. హీరో మేకప్పు చాలా అధ్వాన్నం గా వుంది, పైగా రంగుల దుస్తులు మన ఊసరవెల్లి కి నప్పలేదు.. ఏదో గొప్పగా ఊహించుకుంటే CLIMAX కుర్చీ తో కొంచెం వెటకారం అనిపించింది. డాన్సులు గానీ, ఫైటులు గానీ హీరో రేంజ్ లో లేవు. పాటలు బావున్నాయి.  ఎంతైనా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే హీరో కనీసం ఫాన్సు ని మెప్పించచ్చు.. మళ్ళీ మళ్ళీ హాలుకి రప్పించావుచ్చు. ఇలాంటి సినిమాలు ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాలి.. ఇలాంటి రివ్యూ చదివాక సినిమా చూస్తే పరవాలేదు అనిపిస్తుంది.. కానీ నాలా పద్దెనిమిది ఒందల ప్రింటులని, ఇరగదీస్తుందని... చొక్కా చించుకుని వెళ్తే... మీ అంచనాలకు తగ్గట్లు ఉండదు.

8 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హా! చందుగారూ....ఆ టైటిల్ ఏంటండీ బాబూ...సూపరు :)))

    చొక్కా నిజంగానే చించేసుకున్నారా ఏమిటి చెప్మా? బాగా హర్ట్ అయ్యినట్టు ఉన్నారు ;)

    మీ రివ్యూ భలే ఫన్నీగా ఉందండీ :) ఇంతకీ దూకుడు మీద రివ్యూ రాసారా లేదా??

    రిప్లయితొలగించండి
  2. >>కానీ నాలా పద్దెనిమిది ఒందల ప్రింటులని, ఇరగదీస్తుందని... చొక్కా చించుకుని వెళ్తే... మీ అంచనాలకు తగ్గట్లు ఉండదు.<<

    there you go ..

    రైట్ ఎక్సపేటెషన్స్ లో వెళ్లకపోవడం మీ తప్పు

    ఎన్.టి.ఆర్ గెటప్ తప్ప రోటీన్ గా వున్న బృందావనం కూడా, రొటీన్ గా వుందని మీకు నచ్చలేదన్నట్టుగా నాకు గుర్తు.

    రిప్లయితొలగించండి
  3. Nenu dada choosi dada tecchukunna rojune decide chesukunnaa chandu meeru review edaina raaste adi baagoledu ani chepte choodakoodadu ani :)... Oosarvelli maa dabba poornimaki vacchedaaka nenu choodanu kaaka choodanu :).

    రిప్లయితొలగించండి
  4. ఇందు,
    నిజంగానే ఫీల్ అయ్యాను. కిక్ సినేమా చూశాక, పాటలు విన్నాక, సినేమా రిలీస్ ముందు జూనియర్ మాటలు విన్నాక తిరుగు లేదని అనుకున్నా. పైగా అమెరికాలో అన్ని థియేటర్ లలో అంటే అబ్బో అని ట్ర్యాఫిక్ లో అక్కినేని పాత సినెమాలో స్టియరింగ్ తిప్పినట్లు తిప్పి మరీ సినేమాకి వెళ్ళ.

    రిప్లయితొలగించండి
  5. a2zdreams,
    నిజమే.. అందుకనే అంత హైప్ చెయ్యకూడదు. నిజానికి బృందావనం లో బావున్నాడు. ఈ సినేమా హైప్ లేకుండా చూస్తే పరవాలేదు.

    రిప్లయితొలగించండి
  6. హ హ హ. రివ్యూ ఇరగదీసారు. కొంచం అలస్యంగా చూసాను ఈ పొస్ట్ ని.
    నేనూ ఆ అరుండల్ మిల్స్ మాల్ దగ్గరలొనే వుంటా, రాక రాక, మొదటిసారి రెండు తెలుగు సైన్మా లు ఒకే సారి వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక దీనికి కూడా వెళ్ళి తల భీకరంగా బొప్పి కట్టించుకున్నా. అసలు ధియెటర్లో ఒక్కడినే కూర్చుని అసలు అది కరక్ట్ రూమా కాదా అని ఒకటే డౌటు కొట్టింది. నాకు మాత్రం J.NTR నవ్వినప్పుడల్లా పరమ చిరాకుపుట్టింది.

    రిప్లయితొలగించండి
  7. చాతకం,
    థ్యాంక్ యూ.ఈ మధ్య ఏ సినేమాకి రెండో రోజు వెళ్ళినా జనాలు కనిపించట్లేదు. హిట్టయిన ఒకటి అరా సినెమాలు తప్ప. పాపం సినేమా ఆడించే వాళ్ళ పరిస్థితీ తలుచుకుంటే భయం వేస్తుంది

    రిప్లయితొలగించండి