11, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మ గుండె - 2

(నేను ఈ సంవత్సరం మొదట్లో ప్రారంబించిన ఈ కధ మొదటి భాగం  పోస్ట్ చేసి తొమ్మిది నెలలు అయ్యింది..రెండో భాగం అప్పుడే పూర్తి చెయ్యాలని అనుకున్నాను. ఎందుకో రెండో భాగం రాయడానికి అస్సలు వీలు  కుదరలేదు.. టైం దొరికితే రాసే మూడు వుండేది కాదు..  మా అత్తయ్య పోయినప్పుడు కధ మొదలు పెట్టాను..ఆ అత్తయ్యః గురించి మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక సందర్భంలో మా పెద్దమ్మ కొడుకు తో చర్చిస్తుంటే  ఈ కధ పూర్తి చెయ్యాలనిపించింది.. జన్మనిచ్చిన తల్లిని చివరి దశలో చూసుకొని వాడికి  నేను సాయం చెయ్యను, ఎవడు చెప్పినా సరే అన్న వాడి మాటలకి ఈ కధ పూర్తి చెయ్యాలని అనిపించింది)

మొదటి బాగం ఇక్కడ చదవండి: 

నాకు పాతికేళ్ళ వయసులో అనుకుంటా, ఒక రోజు అమ్మ అడిగింది "జీవితంలో ఇంకేమి చేద్దామని అనుకుంటూ వున్నావు" అని. అప్పటికే డబల్ MA మరియు MCOM చేసిన నేను, బ్యాంకు లొ క్లెర్క్ నించి ఎదగడానికి రాయాల్సిన  పరీక్షలు MBA , IRPM , ML అని చెప్తే, ప్రేమగా ఒక మొట్టి కాయ వేసి, "వెర్రి తండ్రి. ఎప్పుడూ చదువేనా?" అంది. మీ మామయ్య నీకో సంబంధం తెచ్చాడు అని వివరాలు చెప్పి ఫోటో తెచ్చి చేతిలో పెట్టింది. అమ్మాయి పేరు సూర్య కాంతం అని చెప్పిన వెంటనే కొంచెం  కంగారు పడ్డాను. ఫోటో చూసాక నా కంగారు తగ్గింది.  పేరు సూర్య కాంతం అయినా అమ్మాయి బాపు బొమ్మలా ఉంది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, అందమైన ముఖం. ఎప్పుడూ చదువు తప్పు ఇంకోటి పట్టించుకోని నాకు మొట్ట మొదటి సారిగా ఏదో తెలియని గిలిగింతలు, పులకింతలు. పిల్లని చూడడానికి వెళ్లే రోజు దగ్గరపడుతుందని అమ్మ గుర్తు చేసాకా, ఆత్రంగా కొత్త బట్టలు, బూట్లు, అత్తర్లు .. నా అందమైన కలల రాణికి ఒక మంచి గిఫ్ట్ కూడా కొనేసాను. బయలుదేరేటప్పుడు అమ్మ చీర చూసాక మామయ్య కేకలేస్తే గాని గుర్తు రాలేదు,  అమ్మకి వున్నవి రెండే రెండు నేత చీరలు. అప్పుడు మామయ్య ఇంటి దగ్గర ఆపి అత్తయ్య చీర ఒకటి అమ్మని త్వరగా కట్టుకోమని చెప్పి నాకు చీవాట్లు పెట్టాడు. "ఒరేయ్! అప్పుడే కాబోయే పెళ్ళాం బెల్లం ఐపోయింది. మీ అమ్మ వెర్రి బాగులది, నువ్వోకడివే మిగిలిన ఆశా జ్యోతి. ఇప్పుడే మర్చిపోయావు, రేపు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ దాన్ని పట్టిన్చుకుంతావో, లేదో" . మామయ్య నోటి దురుసు నాకు చిన్నప్పటి నించీ అలవాటే కాబట్టి పెద్ద బాధపడలేదు. నిజానికి మామయ్యది చాలా మంచి మనసు, అందరికీ సాయం చేస్తాడు. 
మా చుట్టాల్లలో అందరూ మామయ్య కి ఎదురు చెప్పడానికి బయపడతారు, నేను కూడా... హడావిడిలో చీర మర్చిపోవడం తప్పే అయినా, నా కంగారులో నేను అసలు ఆఫీసు పనే సరిగ్గా చెయ్యలేదు.ఎప్పటిలాగానే నేను సమాధానం చెప్పలేదు.
 పెళ్లి అయిన కొత్తలో జీవితం ఎంత అందంగా ఉండేదో. అసలే వయసులో ఆడ వాసన తగల్లేదు, ఎంతసేపు పుస్తకాలే. రోజంతా ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేవాడిని. 
అందులోను సూర్యే కాంతం అందం నన్ను మత్తు ఎక్కించేది. అసలు అంతటి అందగత్తెని భార్యగా పొందిన అదృష్టానికి ఏమి చేసినా
తప్పులేదని అనిపించేది. ఆయస్కాన్తంని తలదన్నే ఆకర్షణ శక్తీ వున్న నా సూర్య కాంతానికి  ఆ పేరు పెట్టినందుకు  వాళ్ళ నాన్న మీద కోపం కూడా ఒచ్చింది . మా ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికి మా అమ్మ అప్పుడప్పుడూ చుట్టాల్ల ఇళ్ళకి వెళ్ళడం లాంటివి చేసేది. 
అప్పుడు మాకు అసలు ప్రతి రాత్రీ జాగారమే. ఒక సారి రొమాంటిక్ ట్రిప్ అరకు వెళ్ళామో లేదో, మా ఆవిడకు వాంతులు. రెండేళ్ళు తిరిగే లోపు ఇద్దరు పిల్లలు.  రెండు ఉద్యోగాలు, చదువు ల మధ్య నేను ఇంటికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోయే వాడిని. ఆ వున్న కాసేపు నా పెళ్ళాం పిల్లలతో గడిచిపోయేది. మా ఆవిడ తరచూ అమ్మ మీద ఏదో ఒక చాడీ చెప్తూ వుండేది, మొదట్లో అమ్మ మీద నమ్మకంతో నేను మా ఆవిడ చాడీలన్నీవినీ విననట్లు ఉండేవాడిని. కొన్ని నాళ్ళకి నేను అసలు పట్టించు కోవట్లేదని నాకు అర్ధం అయ్యి, కుదిరినప్పుడు అమ్మని కొంచెం సర్దుకోమని చెప్పేవాడిని. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అమ్మ మీద చాడీలు చెప్పడం, ఎందుకూ పనికి రాని తమ్ముళ్ళు, నేను లేనప్పుడు అమ్మ కోసం ఒచ్చి వెళ్తుండడం నన్ను కొంచెం నొప్పించేవి. కానీ ఏమి చెయ్యను..అమ్మ కాబట్టి అర్ధం చేసుకుంటుందని ఒకటి రెండు సార్లు చెప్పి చూసా. 
అమ్మ అర్ధ రాత్రులు దగ్గుతూ వుంటే, ఆలస్యం గా అలిసి పోయి ఇంటికి ఒచ్చిన నాకు నిద్ర సరిపోవట్లేదని మా ఆవిడ బాదపడేది. మందులు ఇచ్చినా వేసుకోవట్లేదని మా ఆవిడ పదే పదే చెప్తుంటే నేను అమ్మని మందలించాల్సి ఒచ్చింది . అన్నిటికీ మౌనమే అమ్మ సమాధానం. ఇంతలో అమ్మకి చేతుల మీద మచ్చలు ఒచ్చాయి. అసలే నాన్న హింసలకు సాక్షిగా మొహం మీదా, మెడ మీదా మచ్చలు... దానితో పాటు ఈ చేతి మీద మచ్చలు మూలంగా మీ అమ్మ కనిపిస్తే ఇంటి చుట్టు పక్కల వాళ్ళు అందరూ దూరం జరుగుతున్నారని, వెనక చెవులు కొరుక్కుంటూ వున్నారని..  నాకు మా ఆవిడ పిల్లలు చెప్తూ ఒచ్చారు. మా అమ్మ మేడలో గొలుసు పోయిందని మా ఆవిడ చెప్పింది. నేను అమ్మని అడగలేదు, తనే చెప్తుందని. రెండు నెలల తర్వాత అమ్మ గాజులు కూడా పోయాయని మా చిన్న వాడు కంప్లైంట్. మీరు ఎందుకు మీ అమ్మని అడగరని మా ఆవిడ రోజూ విసిగించేది. ఒక రోజు మా ఆవిడ మా అమ్మని నిలదీసెంత వరకు ఊరుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఎవరికో ఇచ్చానంది, కానీ వివరాలు చెప్పలేదు.

రోజు రోజుకీ ఇంట్లో ప్రశాంతత కరువయ్యింది. దీనికి ఒకటే మార్గం.. ఆలోచించడానికే అదోలా వుంది.. పోనీ ఎక్కడికైనా పంపిద్దా మంటే.. నలుగురులో మనకి ఎంత అప్రదిష్ట.. ఇప్పటికే మనం మీ అమ్మని సరిగ్గా చూడట్లేదని మీ అమ్మ అందరికీ చెప్పడంతో .. మనం పెళ్ళిళ్ళకి పెరంటాల్లకి వెళితే అక్కడ జనాల సూటి పోటి మాటలతో నాకు తల కొట్టేసినట్లు ఉంటోంది అని మా ఆవిడ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.. ఇలా ఆలోచిస్తూ ఇంటికి  వెళ్లేసరికి మా అమ్మ కనపడట్లేదని మా ఆవిడా-పిల్లలు కంగారు.. ఇంతలో మామయ్యా ఫోను.. మీ అమ్మ కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందని.. మా ఆవిడ ఇచ్చిన ప్రోద్భలంతో ధైర్యం తెచ్చుకుని మామయ్యకి గట్టిగా చెప్పాను.. నన్ను అడగకుండా తీసుకేల్లినందుకు ఇంక అమ్మ భాద్యత నీదే నని.. ఇక పై మాకూ వాళ్లకి తెగ తెంపులని.. కొన్నాళ్ళు మేము హాయిగా వున్నాము.. అసలు పెళ్ళిళ్ళు పేరంటాలు లాటివి వెళ్ళడం మానేసి.... ఫ్లాట్ లో జనాలతో మా ఆవిడ పిల్లలు కలుపుగోలుగా వుండడం నాకు మంచి రిలీఫ్ నిచ్చింది.. నాకు ఆఫీసు నించి ఇంటికి రాడానికి ఉత్సాహంగా వుండేది..

మొన్ననే బెంగుళూరు ట్రిప్ లో వుండగా తెలిసింది అమ్మ పోయిందని.. వెళ్లి చుట్టపు చూపుగా వుండి, ఆ కార్యక్రమాలు అన్నీ కానిచ్చి ఒచ్చాను.. ఖర్చులూ అవీ అని మా మామయ్యా వాళ్ళు పంచాయితీ పెట్టినా మా ఆవిడ నోటితో నెగ్గుకొచ్చేసింది.

..............................................................సమాప్తం........................................................................


నమ్మక ద్రోహం చేసినవాడినైనా క్షమించచ్చు
అమ్మకి ద్రోహం చేసినవాడిని క్షమించకూడదు
అని నమ్మిన నేను..
ఇది చదివి ఒక్కరైనా మారతారేమో ననే ఆశతో...
మా అత్తయ్య జీవితం పైన రాసిన కధ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి