25, అక్టోబర్ 2011, మంగళవారం

నేను ఒక్క సారి కమిట్ అయితే....తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...

"అసలు అందరూ గుడికి ఎందుకు వెళ్తారు?" 
"ఇంకెందుకు, దైవ దర్సనం కోసము" అని అందరూ అనుకుంటారు కదూ.. అక్కడే మనకో చిక్కు ఒచ్చి పడింది. "చిన్నప్పుడు అమ్మతో పాటు విద్యా నగర్లో రామాలయానికి ఎందుకెళ్లాను?"
"అక్కడ చెప్పే హరి కధ నచ్చి" .. అని చెప్పాలని తెలుసు.. కానీ మనం వెళ్ళింది సెనగల కోసం కదా.. 
"కుర్ర వయసులో బిర్లా మందిర్ కి ఎందుకు వెళ్లానంటే యేమని చెప్పను.. ఆ పాల రాతి మందిరంలో దేవుడిని దర్సిన్చుకున్దామని".. అనవచ్చు.. కానీ అక్కడకి ఒచ్చే జన్తలబలకిషల (అందమైన అమ్మాయిల) కోసం కదా..
ఇలా నిజాయితీగా అంటే ఎవరూరుకుంటారు..ఇదంతా ఎందుకంటారా...
చెప్తాను...
నేను కొత్త గా పని చేస్తున్న (కొత్తగా అంటే ఒక సంవత్సరం అయ్యుంటుంది) ఆఫీసు పక్కనే, శివ-విష్ణు టెంపుల్ అని ఒక మంచి గుడి వుంది. పక్కనే గుడి అంటే మనకు ప్రసాదం ఆకలేస్తుంది కదా. అప్పుడప్పుడు అలా గుడి కెళ్ళి కాంటీన్ లో పులిహోర, దోస, ఇడ్లి లాంటివి కుమ్మేయచ్చు అన్న ఐడియా బుర్రలో తట్టినా, కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్తామని ఎవరికైనా తెలిసిపోతే, ఎంత అప్రదిష్ట.. అనుకుని.. సరే ఒకటి రెండు సార్లు పండగ పేరు చెప్పి గుడికి వెళ్ళినట్లు కలర్ ఇచ్చి, గుడికి వెళ్ళా. మన FATE కి కష్టపడి గుడికెల్లిన భాగ్యానికి,  మనకి భక్తులు వొండుకుని తలో స్పూను అన్నట్లు పెట్టిన రవ్వ కేసరి లాంటి రెండు చంచాల ప్రసాదం దక్కింది గానీ, గుడి DINING హాల్ లో కుమ్మేసే అవకాసం కరుణించలేదు. ఏమి చేస్తాము? దైవానుగ్రహం లేదని మిగిలిన భక్తుల గుంపులో కలిసి కొంత తీర్దం మరియు కిస్స్మిస్స్ (అదే నండి మరి సటగోపం పెట్టాక ఇచ్చేది అదేగా) తిని అర్ధాకలితో బయట కొచ్చి  పిజ్జాలో బర్గారో తినాల్సి ఒచ్చింది. మన మేమో ఇక్కడ వుండేది సోమ నించి గురువారం దాకానే. గుళ్ళో DINING హాల్ పండగ పూటే ఓపెన్ అట. మన అదృష్టం కొద్దీ పండగ ఒచ్చినా అది శుక్ర, శని, ఆది వారాల్లో రావడం.. ఒక వేళ మిగిలిన రోజుల్లో ఒచ్చినా, అప్పుడు ఆఫీసు నించి బయటకు ఒచ్చే టైం కి లేట్ ఐపోడం.. వెరసి మనకి ఆ ప్రసాద భాగ్యం కలగలేదు. 
మన అదృష్టం పండి, మొన్న దసరాకి నా పంట కూడా పండి గుళ్ళో DINING హాల్ తెరిచుంది.. ఇదే సందు అని ఒక పులిహోర, ఒక లెమన్ రైస్, ఒక పెరుగన్నం, ఒక చక్ర పొంగలి ప్లస్ రెండు MIXTURE పొట్లాలు తీసుకుని.. పనిలో పని ఒక నమస్కారం పెట్టేసి అట్నుంచి అటే కార్ లో మెక్కేసి.. "ఊసరవెల్లి... హిట్ సినిమా" అనుకుంటూ చెక్కేసా.. ఆ ఊసరవెల్లి MIXED టాక్ తో అంత హిట్టు కాకపోయినా.. మనం అన్నీ తినగా మిగిలిన  MIXTURE పొట్లాలు ఇంట్లోను, ఆఫీసు లో ను సూపర్ హిట్ అయ్యి కూర్చున్నాయి. అక్కడే మొదలియ్యింది చిక్కు. ఊసరవెల్లి లాంటి రివ్యూ దీనికి కూడా ఒచ్చుంటే, నాకీ పరిస్థితి ఒచ్చేది కాదు. MIXED రివ్యూ ఒచ్చిన MIXTURE మళ్ళీ తేవాల్సిన అవసరం వుండేది కాదు. కుదిరినప్పుడల్లా ఆ MIXTURE మళ్ళీ తీసుకురమ్మని రీమైన్డర్లు...

 మళ్ళీ పండగ  రోజుల్లో తెరిచే DINING హాల్ కోసం ఎదురు చూసి చూసి, ఒక రోజు టైం చేసుకుని గుడికి వెళ్ళా.. మరీ గుళ్ళో ఎంట్రన్సు లోనే వుండే DINING హాలులోకి వెళితే, అసలే ఖాళీగా వున్నప్పుడు జనాలు వీడు భక్తికి కాదు భుక్తికి ఒచ్చాడని పసి గట్టేస్తారని..ఆ పైన భుక్తులకు మార్గము అని DINING  హాలు ముందు బోర్డు పెడతారని బయమేసి.. ఆ హాలు వైపు ఒక కన్నేసి, పరమ భక్తుడిలా దర్సనానికి వెళ్లాను. అదే టైం లో ఒక నలుగురికి సటగోపం పెడుతున్న పూజారి ని చూసి ముందు తల, దాని వెనక చేతులు చాపాను.. సటగోపం మరియు ప్రసాదం అని అర్ధం అయ్యేలా...మొహంలో లేని భక్తీ రసాన్ని కొంచెం తెప్పించి మరీ.. మన సంగతి తెలిసినట్లు ఆయన కూడా కొంచెం వెయిట్ చెయ్యి వీళ్ళ తర్వాత నీ టర్న్ అని కళ్ళతోటే కమ్యునికేట్ చేసి అభిషేకానికి లోపలికేళ్లారు. పది కిస్స్మిస్సులకి పావుగంట అభిషేకం అయ్యే వరకు వేచి వుండే ఓపిక వుంటే మనం ఇలా ఎందుకు ఉంటాము అని అక్కడినించి తప్పించుకుని, DINING హాలు ముందుకి ఒచ్చా.. అక్కడ చూస్తే మన కొరకు ద్వారము తెరవకనే వున్నది... హత విధీ.. విధి ఎంత బలీయమైనది.. అనుకుని..  సరే కాసేపు ప్రదక్షిణం చేసినట్లు నటించి ... ఆ మార్గమున యెవరేని  అరుదెంచినచో.. క్రీగంట గమనించి ..సాగెదమని.. ప్రదక్షిణాలు మొదలు పెట్టా....ఒక వేళ ఎవరూ రాకున్నచో..  అక్కడ VOLUNTEER ని మాటల్లో పెట్టి DINING హాలు కధా-కమామీషు కనుక్కుని  పోదామని తిరుగుతున్నాను.

అప్పుడే జరిగింది అనుకోని సంఘటన.. భక్తి పారవశ్యం నటిస్తూ ప్రదక్షిణం చేస్తున్న నన్ను ఒక ముసలావిడ ఆపి.. "బాబూ! ఏం చేస్తున్నావు?" అని బిగ్గరగా ప్రశ్నించింది.
ఇది కూడా తెలియదా? అన్నట్లు భక్తితో సగం మూసుకుపోయిన (నటనలో) కన్నులతో "ప్రదక్షిణం" అన్నాను.. "ఇటునుంచి కాదు బాబూ. అటు నుంచి చెయ్యాలి ప్రదక్షిణం" అని ఆవిడ అరచిన అరుపుకి గుడిలో చెదురు ముదురుగా వున్న జనాలంతా... రోడ్డు మీద ఆక్సిడెంట్ అయితే బండి ఆపేసి చూసే డ్రైవర్ లలా, తమ తమ పనులు ఆపేసి గుళ్ళో ప్రదక్షిణము ఎలా చెయ్యాలో తెలియని ఈ భుక్తి రామదాసు ని చూడడానికి నా వైపు రావడం మొదలెట్టారు..
ఆ దెబ్బకి గుళ్ళో ప్రసాదం మాట దేవుడెరుగు... ఆ రౌండ్ తో ప్రదక్షిణం ఆపేసి బయటకు పరుగు పెట్టాను..
బుద్ధి ఒచ్చింది... ప్రసాదం కోసం గుడి కెళ్ళినోడు ప్రదక్షిణాలు చేస్తే ఇలాగే వుంటుంది అని.. ఆ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాను..ఈ సారి గుడి కెళ్ళినా ధైర్యంగా.. తిన్నగా DINING హాలుకే వెళ్ళాలని... నేను ఒక్క సారి కమిట్ అయితే... తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...
గమనిక: భక్తులు నా మీద కారాలు మిరియాలు నూరవద్దని మనవి....

18, అక్టోబర్ 2011, మంగళవారం

దూకుడు - మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్

     దూకుడు మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ మీ కోసం.
     
     
  • షార్ప్ వున్నవురా పంచ్ పడంగానే PROFESSION  చెప్పెసినవు
  • నువ్వులేపేసిన పోలీసులు వీక్ అయ్యుండచ్చు  నువ్వు కొనేసిన  పోలీసులు బోకులు అయ్యుండచ్చు హమ్ అలగ్
  • నేను నరకడం స్టార్ట్ చేస్తే నరకంలో హౌసేఫుల్ బోర్డు పెట్టేస్తారు
  • కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు...దమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు
  • ఈ దూకుడు లేకపోతే పోలిసోడికి పోస్ట్మాన్ కీ తేడా వుండదు సర్
  • పడుకున్న పులిని - పంచేసే పోలీసుని కెలికితే... వేటే
  • అబే సాలా నీకోసం వెయిట్ చెయ్యనీకి ఫాన్స్ ఉంటార్... పోలీస్
  • లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్న పరవాలేదు, కానీ ఒక్కడుంటాడు.. వాడితో పెట్టుకుంటే మాత్రం అసలు తల్లి కడుపులోంచి బయటకు ఎందుకొచ్చాము అనిపిస్తుంది.. ఆ ఒక్కడే నేను  
  • ఒక్క సారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళిపోతా.. విన..
  • అబే ఓహ్ బట్టేబాజ్. భయానికి మీనిన్గే తెలియని బ్లడ్ రా నాది
  • దందా పేరుతో దార్కారీ చేస్తే, చూస్తూ ఊరుకోనీకి ఫగాడ్ గాన్ని అనుకున్నావు
  • నువ్వు దమ్కీ ఇస్తే ధడుసుకోనీకి తూతుమ్బర్ గాన్ని అనుకున్నావు బె
  • అబే నాలాయాక్, నేనోచ్చింది నీ తమ్మున్ని అప్ప చెప్పనీకి కాదు.. నిన్ను తీస్కోపోనీకి
  • నాకు ఒక నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా... రెండు నిమిషాలు టైం ఇస్తే ఆక్షన్ లోకి దిగుత.. మూడు నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా..
  • మజాక్ చెయ్యనీకి దోస్త్ వా -సాలె గాని వా
  • నేనేవన్నైనా టార్గెట్ చేసానంటే వాడికి పైన బెర్త్ కన్ఫారం అయిపోయినట్లే
  • అబే సాల నీకు ఛాన్స్ ఇయ్యనీకి నేను ప్రోడుసుర్ని అనుకున్నావు బె



11, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మ గుండె - 2

(నేను ఈ సంవత్సరం మొదట్లో ప్రారంబించిన ఈ కధ మొదటి భాగం  పోస్ట్ చేసి తొమ్మిది నెలలు అయ్యింది..రెండో భాగం అప్పుడే పూర్తి చెయ్యాలని అనుకున్నాను. ఎందుకో రెండో భాగం రాయడానికి అస్సలు వీలు  కుదరలేదు.. టైం దొరికితే రాసే మూడు వుండేది కాదు..  మా అత్తయ్య పోయినప్పుడు కధ మొదలు పెట్టాను..ఆ అత్తయ్యః గురించి మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక సందర్భంలో మా పెద్దమ్మ కొడుకు తో చర్చిస్తుంటే  ఈ కధ పూర్తి చెయ్యాలనిపించింది.. జన్మనిచ్చిన తల్లిని చివరి దశలో చూసుకొని వాడికి  నేను సాయం చెయ్యను, ఎవడు చెప్పినా సరే అన్న వాడి మాటలకి ఈ కధ పూర్తి చెయ్యాలని అనిపించింది)

మొదటి బాగం ఇక్కడ చదవండి: 

నాకు పాతికేళ్ళ వయసులో అనుకుంటా, ఒక రోజు అమ్మ అడిగింది "జీవితంలో ఇంకేమి చేద్దామని అనుకుంటూ వున్నావు" అని. అప్పటికే డబల్ MA మరియు MCOM చేసిన నేను, బ్యాంకు లొ క్లెర్క్ నించి ఎదగడానికి రాయాల్సిన  పరీక్షలు MBA , IRPM , ML అని చెప్తే, ప్రేమగా ఒక మొట్టి కాయ వేసి, "వెర్రి తండ్రి. ఎప్పుడూ చదువేనా?" అంది. మీ మామయ్య నీకో సంబంధం తెచ్చాడు అని వివరాలు చెప్పి ఫోటో తెచ్చి చేతిలో పెట్టింది. అమ్మాయి పేరు సూర్య కాంతం అని చెప్పిన వెంటనే కొంచెం  కంగారు పడ్డాను. ఫోటో చూసాక నా కంగారు తగ్గింది.  పేరు సూర్య కాంతం అయినా అమ్మాయి బాపు బొమ్మలా ఉంది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, అందమైన ముఖం. ఎప్పుడూ చదువు తప్పు ఇంకోటి పట్టించుకోని నాకు మొట్ట మొదటి సారిగా ఏదో తెలియని గిలిగింతలు, పులకింతలు. పిల్లని చూడడానికి వెళ్లే రోజు దగ్గరపడుతుందని అమ్మ గుర్తు చేసాకా, ఆత్రంగా కొత్త బట్టలు, బూట్లు, అత్తర్లు .. నా అందమైన కలల రాణికి ఒక మంచి గిఫ్ట్ కూడా కొనేసాను. బయలుదేరేటప్పుడు అమ్మ చీర చూసాక మామయ్య కేకలేస్తే గాని గుర్తు రాలేదు,  అమ్మకి వున్నవి రెండే రెండు నేత చీరలు. అప్పుడు మామయ్య ఇంటి దగ్గర ఆపి అత్తయ్య చీర ఒకటి అమ్మని త్వరగా కట్టుకోమని చెప్పి నాకు చీవాట్లు పెట్టాడు. "ఒరేయ్! అప్పుడే కాబోయే పెళ్ళాం బెల్లం ఐపోయింది. మీ అమ్మ వెర్రి బాగులది, నువ్వోకడివే మిగిలిన ఆశా జ్యోతి. ఇప్పుడే మర్చిపోయావు, రేపు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ దాన్ని పట్టిన్చుకుంతావో, లేదో" . మామయ్య నోటి దురుసు నాకు చిన్నప్పటి నించీ అలవాటే కాబట్టి పెద్ద బాధపడలేదు. నిజానికి మామయ్యది చాలా మంచి మనసు, అందరికీ సాయం చేస్తాడు. 
మా చుట్టాల్లలో అందరూ మామయ్య కి ఎదురు చెప్పడానికి బయపడతారు, నేను కూడా... హడావిడిలో చీర మర్చిపోవడం తప్పే అయినా, నా కంగారులో నేను అసలు ఆఫీసు పనే సరిగ్గా చెయ్యలేదు.ఎప్పటిలాగానే నేను సమాధానం చెప్పలేదు.
 పెళ్లి అయిన కొత్తలో జీవితం ఎంత అందంగా ఉండేదో. అసలే వయసులో ఆడ వాసన తగల్లేదు, ఎంతసేపు పుస్తకాలే. రోజంతా ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేవాడిని. 
అందులోను సూర్యే కాంతం అందం నన్ను మత్తు ఎక్కించేది. అసలు అంతటి అందగత్తెని భార్యగా పొందిన అదృష్టానికి ఏమి చేసినా
తప్పులేదని అనిపించేది. ఆయస్కాన్తంని తలదన్నే ఆకర్షణ శక్తీ వున్న నా సూర్య కాంతానికి  ఆ పేరు పెట్టినందుకు  వాళ్ళ నాన్న మీద కోపం కూడా ఒచ్చింది . మా ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికి మా అమ్మ అప్పుడప్పుడూ చుట్టాల్ల ఇళ్ళకి వెళ్ళడం లాంటివి చేసేది. 
అప్పుడు మాకు అసలు ప్రతి రాత్రీ జాగారమే. ఒక సారి రొమాంటిక్ ట్రిప్ అరకు వెళ్ళామో లేదో, మా ఆవిడకు వాంతులు. రెండేళ్ళు తిరిగే లోపు ఇద్దరు పిల్లలు.  రెండు ఉద్యోగాలు, చదువు ల మధ్య నేను ఇంటికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోయే వాడిని. ఆ వున్న కాసేపు నా పెళ్ళాం పిల్లలతో గడిచిపోయేది. మా ఆవిడ తరచూ అమ్మ మీద ఏదో ఒక చాడీ చెప్తూ వుండేది, మొదట్లో అమ్మ మీద నమ్మకంతో నేను మా ఆవిడ చాడీలన్నీవినీ విననట్లు ఉండేవాడిని. కొన్ని నాళ్ళకి నేను అసలు పట్టించు కోవట్లేదని నాకు అర్ధం అయ్యి, కుదిరినప్పుడు అమ్మని కొంచెం సర్దుకోమని చెప్పేవాడిని. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అమ్మ మీద చాడీలు చెప్పడం, ఎందుకూ పనికి రాని తమ్ముళ్ళు, నేను లేనప్పుడు అమ్మ కోసం ఒచ్చి వెళ్తుండడం నన్ను కొంచెం నొప్పించేవి. కానీ ఏమి చెయ్యను..అమ్మ కాబట్టి అర్ధం చేసుకుంటుందని ఒకటి రెండు సార్లు చెప్పి చూసా. 
అమ్మ అర్ధ రాత్రులు దగ్గుతూ వుంటే, ఆలస్యం గా అలిసి పోయి ఇంటికి ఒచ్చిన నాకు నిద్ర సరిపోవట్లేదని మా ఆవిడ బాదపడేది. మందులు ఇచ్చినా వేసుకోవట్లేదని మా ఆవిడ పదే పదే చెప్తుంటే నేను అమ్మని మందలించాల్సి ఒచ్చింది . అన్నిటికీ మౌనమే అమ్మ సమాధానం. ఇంతలో అమ్మకి చేతుల మీద మచ్చలు ఒచ్చాయి. అసలే నాన్న హింసలకు సాక్షిగా మొహం మీదా, మెడ మీదా మచ్చలు... దానితో పాటు ఈ చేతి మీద మచ్చలు మూలంగా మీ అమ్మ కనిపిస్తే ఇంటి చుట్టు పక్కల వాళ్ళు అందరూ దూరం జరుగుతున్నారని, వెనక చెవులు కొరుక్కుంటూ వున్నారని..  నాకు మా ఆవిడ పిల్లలు చెప్తూ ఒచ్చారు. మా అమ్మ మేడలో గొలుసు పోయిందని మా ఆవిడ చెప్పింది. నేను అమ్మని అడగలేదు, తనే చెప్తుందని. రెండు నెలల తర్వాత అమ్మ గాజులు కూడా పోయాయని మా చిన్న వాడు కంప్లైంట్. మీరు ఎందుకు మీ అమ్మని అడగరని మా ఆవిడ రోజూ విసిగించేది. ఒక రోజు మా ఆవిడ మా అమ్మని నిలదీసెంత వరకు ఊరుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఎవరికో ఇచ్చానంది, కానీ వివరాలు చెప్పలేదు.

రోజు రోజుకీ ఇంట్లో ప్రశాంతత కరువయ్యింది. దీనికి ఒకటే మార్గం.. ఆలోచించడానికే అదోలా వుంది.. పోనీ ఎక్కడికైనా పంపిద్దా మంటే.. నలుగురులో మనకి ఎంత అప్రదిష్ట.. ఇప్పటికే మనం మీ అమ్మని సరిగ్గా చూడట్లేదని మీ అమ్మ అందరికీ చెప్పడంతో .. మనం పెళ్ళిళ్ళకి పెరంటాల్లకి వెళితే అక్కడ జనాల సూటి పోటి మాటలతో నాకు తల కొట్టేసినట్లు ఉంటోంది అని మా ఆవిడ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.. ఇలా ఆలోచిస్తూ ఇంటికి  వెళ్లేసరికి మా అమ్మ కనపడట్లేదని మా ఆవిడా-పిల్లలు కంగారు.. ఇంతలో మామయ్యా ఫోను.. మీ అమ్మ కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందని.. మా ఆవిడ ఇచ్చిన ప్రోద్భలంతో ధైర్యం తెచ్చుకుని మామయ్యకి గట్టిగా చెప్పాను.. నన్ను అడగకుండా తీసుకేల్లినందుకు ఇంక అమ్మ భాద్యత నీదే నని.. ఇక పై మాకూ వాళ్లకి తెగ తెంపులని.. కొన్నాళ్ళు మేము హాయిగా వున్నాము.. అసలు పెళ్ళిళ్ళు పేరంటాలు లాటివి వెళ్ళడం మానేసి.... ఫ్లాట్ లో జనాలతో మా ఆవిడ పిల్లలు కలుపుగోలుగా వుండడం నాకు మంచి రిలీఫ్ నిచ్చింది.. నాకు ఆఫీసు నించి ఇంటికి రాడానికి ఉత్సాహంగా వుండేది..

మొన్ననే బెంగుళూరు ట్రిప్ లో వుండగా తెలిసింది అమ్మ పోయిందని.. వెళ్లి చుట్టపు చూపుగా వుండి, ఆ కార్యక్రమాలు అన్నీ కానిచ్చి ఒచ్చాను.. ఖర్చులూ అవీ అని మా మామయ్యా వాళ్ళు పంచాయితీ పెట్టినా మా ఆవిడ నోటితో నెగ్గుకొచ్చేసింది.

..............................................................సమాప్తం........................................................................


నమ్మక ద్రోహం చేసినవాడినైనా క్షమించచ్చు
అమ్మకి ద్రోహం చేసినవాడిని క్షమించకూడదు
అని నమ్మిన నేను..
ఇది చదివి ఒక్కరైనా మారతారేమో ననే ఆశతో...
మా అత్తయ్య జీవితం పైన రాసిన కధ..

ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి

కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, బృందావనం లో క్లాసు క్యారెక్టర్ తో పరవాలేదు అనిపించి తర్వాత శక్తీ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చి.. మళ్ళీ వెరైటీ రోల్ తో ఊసరవెల్లి సినిమా లో కనిపించిన జూనియర్ N T R  హీరో గా, దేవి శ్రీ హిట్ మ్యూజిక్ కాంబినేషన్ చిత్రం ఊసరవెల్లి.  రిలీజ్ కి ముందర దూకుడు కి కళ్ళెం వేసి, దాని కలక్షన్ లకి గొళ్ళెం పెట్టే చిత్రంగా చెప్పబడింది. అబ్బో ఇంకేముంది ఇరగదీస్తుంది అని చొక్కా చించుకుని మా దగ్గరలో ఉన్న ధియేటర్ కి మొదటి ఆటకి వెళ్ళాను. నేను పని చేసేది మేరీ ల్యాండ్ లో. సాధారణంగా తెలుగు సినిమా అంటే వర్జీనియా వెళ్లి చూడాలి. ఈ మధ్య మేరీ ల్యాండ్ లో కూడా సినిమా వేస్తున్నారని వెళ్తే, సినిమా మొదలయ్యే టైం కి పది మంది కూడా లేరు హాల్లో. పద్దెనిమిది వందలు దియటర్ లలో సినిమా రిలీజ్ చేస్తే ధియేటర్ కి పదిమంది చొప్పున అసలు సినిమా ఎలా వర్క్ అవుట్ అవుతుందో నని బుర్ర గోక్కుంటూ, జుట్టు పీక్కుంటూ చేతిలోకోచ్చిన నాలుగు వెంట్రుకలూ చూసుకుని- నాలిక కరుచుకుని మళ్ళీ జుట్టులో దోపే ప్రయత్నం చేసి సినిమా టైటిల్ పడుతుంటే ఆసక్తిగా సీటు లో ముందుకు జరిగి మరీ చూసాను. 

ఎర్రటి అడ్డ గీతలు, నిలువు గీతలు అటూ ఇటూ కోణాలు కొంచెం మార్చి టైటిల్స్ వేసేసాడు. సరేలే టైటిల్స్ కే అంత ATTENTION  ఎందుకని సీట్ లోకి వెనక్కి జరుగుతుంటే ఇంతలో హీరో ని వాడెవడో అర్ధం కాని రీతిలో, "వీడు ఎవడికీ అర్ధం కాడని", అర్ధం పర్ధం లేకుండా వ్యర్ధం గా పరిచయం చేస్తుంటే పెద్ద సౌండ్ తో బాంబు పేలి, మిలిటంట్లు అదీ అని హడావిడి మొదలయ్యింది. కొంచెం సద్దు మునిగేలోపు ఒక ముద్దు సీన్ తో మొదటి పాటలోకి వెళ్ళిపోయారు మన దేవి శ్రీ ప్రసాద్ అండ్ తమన్నా. అదేమిటి దేవి శ్రీ మ్యూజిక్ అనుకున్నానే, ఇచ్చిన డబ్బులకి డప్పు కొట్టి, పాట పాడి పైగా పండగ ఆఫర్ అని చెప్పి పాటలో నటించేసాదేమో, డైరెక్టర్ ఎంత ఒద్దన్నా.. వినకుండా అని మళ్ళీ బుర్ర గోక్కోబోయి, ఎదర అర ఎకరం మీద నించి నాలుగు వెళ్ళు వెనక్కి పోనిస్తూ అంతకు ముందర ఊడిన వెంట్రుకలు గుర్తుకొచ్చి ఆగిపోయా. మళ్ళీ పరీక్షగా చూస్తే మన జూనియర్ NTR - అదేంటి ఇలా ఐపోయాడని అనుకుని, ఇది ఊసరవెల్లి ఒక రంగు మాత్రమే అని సరిపెట్టుకుని ఈ ఉబ్బిన ఊసరవెల్లి మిగిలిన రంగులెలా ఉంటాయో అని చూడడం మొదలెట్టా.  ముద్దు పెట్టిన హీరొయిన్ ని ప్రేమ కోసం ముష్టి ఎత్తుకుంటూ హీరో.. ఆ హీరో చేతిలో తన్నులు తింటూ ఒక కామెడీ గాంగు... మధ్యలో ఒకటి రెండు పాటలు అలా నడిచిపోతుంది సినిమా మొదటి సగం.. 
    ఇంక రెండో సగం లో ఒకటే ట్విస్టులు.. ఊసరవెల్లి రంగులు మారుతూ.. అయితే, ఇక్కడే మనం చూస్తున్న కత్తి లాంటి హీరొయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ వుందని. అదంతా మరిచిపోయి ఆవిడ కాట్రవల్లి (అదే నండీ కిక్ సినిమాలో అలీ క్యారెక్టర్) అయ్యిందని మనకి డైరెక్టర్ గారు కొంచెం సాగ దీసి మరీ అతలా కుతలంగా చూపిస్తారు. హీరొయిన్ అన్నయ్యకి జరిగిన అన్యాయం, ఫ్యామిలీ కి జరిగిన దారుణం చూపిస్తూ.. ఇంతలో హీరోకి తండ్రి ద్వారా నా వేస్ట్ లైఫ్ లో ఒక్క మచి పని కూడా చెయ్యలేదు కాబట్టి ఘోస్టులా నీ వెంట ఉంటా.. నువ్వు నాలాగా కాకుండా లైఫ్ లో ఒక మంచి పని చెయ్యమని చెప్పి చచ్చి ఘోస్ట్ అయిపోతాడు. బుర్రల్లో బుల్లెట్ వున్న హీరొయిన్.. బుర్ర బరువు పెరిగిందని జుట్టు కత్తిరించుకుని, వర్షం లో తడుస్తూ చీకట్లో హనుమంతుని విగ్రహం దగ్గర దేవుణ్ణి తనకు జరిగిన అన్యాయానికి నిలదీస్తుంది. అక్కడే విగ్రహం పైనించి చుక్క పడి, పక్క నించి డప్పులు మీద దరువు పడి, ఆ పైన వంద మందిని చితక బాదే హీరో కనపడి,  ప్రతీకారం తీర్చుకునే దారి కనపడి, తన పగ హీరో కిచ్చి తను మర్చిపోతుంది. అప్పటి నించీ కాట్రవల్లి లా నటిస్తుంది. ఒకడి తరవాత ఒకడిని వరసగా విల్లన్ గాంగు ని మన హీరో ఎందుకు బాబూ మమ్మల్ని ఇలా వేయించుకు తింటున్నావు అంటే  చెప్పకుండా వాళ్ళని విసిగించి చంపేస్తుంటాడు. సుత్తి కొట్టి ఇంకా చావని వాళ్ళని పొడుగాటి సుత్తితో కొట్టి చంపేస్తాడు.  మధ్యలో మాస్ కోసం అన్నట్లు పెద్దగా సంబంధం లేకపోయినా ఒక సాంగు సింగుతారు. ఇంతలో పెద్ద విల్లన్ ప్రకాష్ రాజ్ ఒస్తాడు. మరిన్ని మలుపులతో మన హీరో చేతి అందిన కర్రని,కొక్కాన్ని, సుత్తినీ వాడి ఒక్కొక్కళ్ళని చంపిన తరవాత అన్ని ఒస్తువులూ ఐపోయాయి అని మనం చంకలు గుద్దుకుంటే... CLIMAX లో పెద్ద విల్లన్, హీరో చేతికి అందిన ఒస్తువుతో చంపేస్తాడని అవన్నీ దూరంగా పెట్టి..కుర్చీకి బాగా టేప్ తో కట్టేసాక, ఇంకేమి చేస్తాడులే  అని డైలాగ్ చెప్తుంటే .. మన హీరో కుర్చీ లో కట్లతో పాటూ యెగిరి అందరి మీదా పడి చంపేస్తాడు. నాకు అప్పుడే కొంచెం కదిలితే నా కుర్చీ కూడా ఎగురుతుందేమో నని అనుమానం ఒచ్చి కాళ్ళు నేలకు తన్ని కుర్చీ హ్యాండ్ రెస్ట్ గట్టిగా పట్టునేటప్పటికి సినిమా ఐపోయింది..
  ఈ ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి నాకు మాత్రమే ఇలా అనిపించిందా.. లేక అందరికీ ఇలాగే అనిపించి ఉంటుందా అని ఆలోచించుకుంటూ మెల్లిగా హాలులోంచి బయటకు ఒస్తుంటే... నా ముందు ఒక ఏడుగురు సినిమా గురించి చర్చించుకుంటూ పార్కింగ్ లాట్  లోకి వెళ్తున్నారు. వీళ్ళు సినిమా మొదలయ్యాక ఒచ్చి వుండాలి ఎందుకంటె మనకి లోపలి వెళ్ళినప్పుడు కనపడలేదు కదా అని వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఒక చెవి అటు పడేసా.. అందులో ఒక వ్యక్తిని మిగిలిన వాళ్ళు తిడుతున్నారు ఈ సినిమాకి తీస్కోచ్చినందుకు.. ఇప్పుడు మాకు అర్జెంటు గా రెండు పెగ్గులు మందు పోయిస్తే గాని నిన్ను క్షమించేది లేదని చుట్టు ముట్టారు... సందిట్లో సడేమియా అని వాళ్ళతో చర్చ పెట్టాక తెలిసింది.. వాళ్ళు కూడా నాలాగే చొక్కా చించుకుని ఒచ్చినందుకు బాగా డిసప్పాయింట్ అయ్యారని..
 మీకు గనక సినిమా నచ్చుంటే నన్ను తిట్టుకోకండి.. ఎందుకంటె అంత హైపు ఇస్తే సినిమా అంచనాలు అందుకోవడం  కష్టం. పైగా ఇది జూనియర్ NTR ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు. కధ బానే వున్నా.. కధనం లో ఎక్కడో లోపం. మొదటి సగం పరవాలేదు అనిపించినా... రెండో సగం మెప్పించలేదు.. సినిమాటోగ్రఫీ చాలా బావుంది.. కత్తి లాంటి తమన్నా .. కాట్రవల్లి గా కూడా మెప్పించింది.. హీరో మేకప్పు చాలా అధ్వాన్నం గా వుంది, పైగా రంగుల దుస్తులు మన ఊసరవెల్లి కి నప్పలేదు.. ఏదో గొప్పగా ఊహించుకుంటే CLIMAX కుర్చీ తో కొంచెం వెటకారం అనిపించింది. డాన్సులు గానీ, ఫైటులు గానీ హీరో రేంజ్ లో లేవు. పాటలు బావున్నాయి.  ఎంతైనా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే హీరో కనీసం ఫాన్సు ని మెప్పించచ్చు.. మళ్ళీ మళ్ళీ హాలుకి రప్పించావుచ్చు. ఇలాంటి సినిమాలు ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాలి.. ఇలాంటి రివ్యూ చదివాక సినిమా చూస్తే పరవాలేదు అనిపిస్తుంది.. కానీ నాలా పద్దెనిమిది ఒందల ప్రింటులని, ఇరగదీస్తుందని... చొక్కా చించుకుని వెళ్తే... మీ అంచనాలకు తగ్గట్లు ఉండదు.