22, సెప్టెంబర్ 2010, బుధవారం

రాముడు Gentleman హనుమంతుడు Superman

హమ్మయ్య! పైన టైటిల్ తో మీరు అనేకానేక ఆలోచనలతో ఈ బ్లాగ్గరుడు ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నార్ధకంతో చదవడం మొదలుపెట్టారా.
అసలు విషయం ఏమిటంటే. నా నాలుగేళ్ల కూతురికి రామాయణం లాంటివి చెప్పాలని చాలా సార్లు అనుకుంటూ, అలా చెప్పే ప్రయత్నం చెయ్యని నన్ను నేను నిందించుకుంటూ, బద్ధకం బూజు దులిపి ఒక సారి వుపక్రమించా. అప్పుడు గాని తెలియలేదు కధలు చెప్పడం ఎంత గొప్ప కళో అని. ఒక సారి కళ్ళ ముందు గుండ్రాలు చుట్టుకుని నా బాల్యం లో నాకు రామాయణం లాంటివి ఎవరు చెప్పినవి మెదడులో ముద్ర పడ్డాయి అని గతం లోకి వెళ్ళాను. అప్పుడు గుర్తుకొచ్చింది మా లంక మామ్మ.

ఇక్కడ లంక మామ్మ గురించి కొంత చెప్పి తీరాలి. తప్పదు! నాకు వున్న అభిమానం అలాంటిది. చిన్నప్పుడు పెళ్లి పేరంటం లాంటివి జరిగేటప్పుడు పిల్లలని అందరిని ఒక చోటి చేర్చి కధలు చెప్పే ఒక నాయనమ్మో, అమ్మమ్మో వుంటారు కదా. సరే! ఒక వేళ మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్లకు ఐనా సరే ఉండి వుంటారు. అలాంటి బామ్మ కోసం పిల్లలు అందరూ ఎంతో ఎదురు చూస్తూ వుంటారు. అలాంటి మామ్మే ఈ లంక మామ్మ. ఈ లంక మామ్మ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ ఆ రోజుల్లో రామాయణం రాసింది. ఆ సంగతి నాకు పెద్దయాక తెలిసింది అనుకోండి. ఇంతకీ ఈవిడ కధ చెపుతుంటే ఏడ్చే పిల్లవాడు కూడా ఆపేసి, మనం ఏదో మిస్ ఐపోతున్నాము, ఈ ఏడుపు తరవాత ఏడవచ్చులే అని కళ్ళు పత్తి కాయల్లా తెరుచుకుని, చెవులు రిక్కించి మరీ వింటారు. అంత అద్భుతంగా వుండేది. మన చిత్ర పరిజ్ఞానం వుపయోగించి అంత బాగా చెప్పడంలో సూత్రం గురించి ఆలోచించడం మొదులు పెట్టా.

ఇంతకీ నీ కూతురు కి చెప్తున్న రామాయణం ఏమయ్యిందిరా? అనే ఒక చొప్పదంటు ప్రశ్న మీకు వొచ్చి ఉండవచ్చు. అంటే మరి మామూలుగా అంటే, అంటే మామూలుగా ఇలాంటి పరిస్థితిలో ఏ తండ్రైనా ఏమి చేస్తాడు. టీవీ, కంప్యూటర్ లాంటివి కూతురి చేతిలో పెట్టి పెళ్ళాం రాకుండా కవర్ చేయడమో, ఒస్తే ఏం చెప్పాలో ఆలోచించుకుని రెడీ గా వుంటారు. (ఇక్కడ కొందరు ఆడవాళ్ళు పళ్ళు నూరి, కుడి చేతి వేళ్ళు ఎడం చేతిలో - ఎడం చేతి వేళ్ళు కుడి చేతిలో విరిచి, సచ్చినోళ్ళు -మగాళ్ళందరూ ఇంతే అని అనుకునే అవకాశం ఉంది). మళ్ళీ నా ఆలోచన లంక మామ్మ కధల వైపు సాగింది. మొహమ్మీద చుట్టిన గుండ్రాలు ఫేడ్ అవుతుండగా - ఆవిడ చెప్పిన కధలలో రామాయణం, భారతం మరియు బాగవతం గుర్తు చేసుకుంటుంటే నాకు లంక మామ్మ కధలు ఏవీ సరిగ్గా గుర్తు రావట్లేదు,  సరికదా చెప్పేటప్పుడు లంక మామ్మ చేసే హావ భావాలు, ముఖ కవళికలు మాత్రమె గుర్తుకొచ్చాయి. అప్పుడు అర్ధం అయ్యింది లంక మామ్మ కధ కంటే- కధ చెప్పే పద్ధతి బావుందని, అది మన దగ్గిర లేదు కాబట్టి మన కధలు కంచికి మన పిల్లలు టీవీ కి దగ్గిరవుతున్నారని.
  ఐనా సరే పట్టు వదలని విక్రమార్కుడు, లంచం వదలని అక్రమార్కుడు లాగ ఏదో ఒక కధ చెప్పాలని రామాయణం మొదలు పెట్టాను. దశరధుడు గురించి మొదలు పెట్టి పెళ్ళాల లిస్టు, పిల్లలకోసం కష్టాలు చెపుతుంటే నాకే అంత ఆసక్తి అనిపించలా. ఇక రాముడు గురించి పొగుడుతుంటే నాకు ఎందుకో చిన్నప్పుడు నీతులు చెప్తే నిద్దరవొచ్చినట్లు వొచ్చేసింది. రాముడు ఎంత gentleman అని అనుకుని కధ  మర్చిపోవచ్చు. ఇంతలో నా కూతురు "హనుమాన్ గురించి చెప్పు, హనుమాన్ గురించి చెప్పు" అని ఎగురుతుంటే మన బుర్రలో బల్బ్ వెలిగింది. లంక మామ్మ సుందర కాండ అద్భుతంగా చెప్పేది, హనుమంతుడి లా మూతి పెట్టి, ఒక చేతిలో గద పట్టుకున్నట్లు చిత్ర విచిత్రమైన హావ భావాలతో చెప్పేది. అది చాలా ఆకట్టుకునేది మమ్మల్ని. మేము అంతా మళ్ళీ మళ్ళీ అని అల్లరి చేస్తుంటే, అందరికీ ముద్దలు కలిపి పెట్టేసేది పనిలోపని. ఇంకా లోతుగా ఆలోచించాక తెలిసింది అసలు concept,  రాముడు gentleman హనుమంతుడు superman అని. Gentleman సినిమాలు ఆడవు, అదే Superman సినిమాలైతే మళ్ళీ మళ్ళీ తీస్తారు, మనం మళ్ళీ మళ్ళీ చూస్తాము.
   మనం కావాలంటే Gentlemen ని పొగుడుతాము కొంచెం పెద్దయ్యాక, కానీ Superman ని ఆరాధిస్తాము చిన్నప్పటినించి. పిల్లల దగ్గర చూడండి హనుమాన్, చోటా భీం లాంటి కధలు ఆకట్టుకుంటాయి. అంతే కాదు మనకి కష్టం వొస్తే మనం ఎవరికి మొక్కుకుంటాం? Superman కి!.  పిల్లలకైనా సరే కధ చెప్పేటప్పుడు వాళ్లకి ఆసక్తి కలగాలంటే Gentleman తో మొదలు పెట్టినా Superman  కధతో ఆకట్టుకోండి.

నేను మటుకు డిసైడ్ అయిపోయా! గో Superman - ఇక నించి ఇంట్లో మనం కధ చెప్పాల్సి వొస్తే కిష్కింద కాండే. వేరే వాళ్ళింట్లో అయితే లంకా దహనమే. మీ పిల్లలకి మీరు కధలు చెప్పలేక ఇబ్బంది పడితే నాకు చెప్పండి. మీ ఇంటికొస్తా, నా కూతుర్ని తీసుకొస్తా. మంచి interesting  కధ చెప్తా. మీరు ఇంక పూరీ జగన్నాధ్ "పోకిరి" లో లాగ "దహనమే" అని పాడుకుంటూ గడిపేయచ్చు - నేను కధ చెపుతుంటే.  మీకు నాకు గొడవయితే తరవాత నేను "జగడమే" అని పాడుకుంటూ నిష్క్రమిస్తా- మా వానర సేనతో.

8 కామెంట్‌లు:

  1. హహహ బాగుందండీ....మీ సూపర్ మాన్,జెంటిల్ మాన్ కథ... :)

    రిప్లయితొలగించండి
  2. was a little blue today chandu.. meeru raasina teeruki chaala relaxed read anipinchindi.. raastoone undandi.

    రిప్లయితొలగించండి
  3. and by the way, maa intiki meeru siri and siri's mom kooda welcome.. india vacchinappudu ikkada pedadaam kishkindakaanda.

    రిప్లయితొలగించండి