పొదిగిన గుడ్డు పిల్ల ఐనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలిగే ఆనందం లాంటి
పుత్రోత్సాహం అని ఒకటి వుంటుంది కదా. ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ! నిజమే, మీ బుర్ర ఇంకా తెలుగు సినిమాలు అంతగా మర్చిపోలేదు. ఇది "నువ్వు నాకు నచ్చావు" లో వెంకటేష్ డైలాగ్. అయితే ఇక్కడ చిన్న తేడా. నా విషయంలో అది పుత్రికోత్సాహం అని మార్చుకోవాలనుకోండి. అలాంటి సందర్భాలు కొన్ని మనకు పిల్లల చిన్నప్పుడు ఒస్తాయి కదా. అల్లాంటి ఒక సందర్భం గురించే ఈ బ్లాగు.
ఈ మధ్య నా కూతురు దానికిష్టమైన యానిమేషన్ సినిమా చూస్తుంటే, "నాన్నా! సినిమా pause లో పెట్టు, piss కొట్టి ఒస్తా" అంది. మా ఆవిడ ఒకటే నవ్వు. ఆ నవ్వు చివరలో నాకేసి ఒక రకమైన నాసిరకం చూపు. ఎలాంటి చూపు అంటే - మనం బోలెడు డబ్బులు కొనుక్కుని విమానం ఎక్కి కొంచెం స్టైల్ కొడుతుంటే, మన పక్కనే spicejet వాడి ఆఫర్ లో వందరూపాయలు పెట్టి (రూపాయి చిల్లర తిరిగి తీసుకుని మరీ) టికెట్ కొని వాడు మన పక్క సీట్ లో కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటే ఎలా చూస్తాము. అలాంటి చూపు అన్న మాట. ఇంకా అర్ధం కాలేదు కదా, మన క్లాసు పక్కన ఈ మాస్ ఏంటి అనే ఫీలింగ్ తో చూసే చూపు అన్న మాట. ఇంతసేపు చూపు గురించి చెప్పావు, ఇంక మేటర్ లోకి వెళ్ళకపోతే నీ అంతు చూస్తా అని మీరు అనుకునే లోపు నేను కొంచం నా గురించి మరి కొంచెం మా ఆవిడ గురించి చెప్పాలి.
ఈవిడ నన్ను చేసుకునే (అంటే ఏమిటి నువ్వు చేసుకోలేదా ఈవిడని అని అడక్కుండా వినండి.. అదే చదవండి) రోజులకి ఈవిడకి తెలుగు సినిమాలు తెగ చూసే వాళ్ళమీద అంత మంచి అభిప్రాయం వున్నట్లు లేదు. నాకు పెళ్ళైన కొత్తలో ఒక సారి మా ఆవిడని సినిమాకి తీసుకేళ్తానంటే, "అబ్బ! నేను రెండో ఆటకి రాను, నిద్ర చెడిపోతుంది" అంది. నాకు అస్సలు అర్ధం కాలేదు. అసలు మనం శివ రాత్రి అయితే రాత్రి అంతా సినిమాలు వేస్తారు కదా అని చూసే బాపతు. అమెరికాలో సినిమాకి మొగుడు తీసుకు వెళ్ళట్లేదు అని బాధపడే భార్యలని చూసిన నాకు, ఇది అనుకోని షాకు. పైగా ఎన్నో చోట్ల సినిమా హాలులో తెలుగు సినిమా చూసే అవకాశం అరుదు ఈ అమెరికాలో. ఒక వేళ వున్నా, టికెట్ ధర మరియు దూర భారం లాంటి వంకలతో చాలా మంది చూడరు. ఇందులోంచి తేరుకుంటున్న రోజుల్లో, మా ఆవిడ ఒక సారి "అంత కక్కుర్తిగా తెలుగు సినిమా చూడడం ఎందుకు" అనే మాట ఎవరితోనో అంటూంటే విన్నాను. అంటే మా ఆవిడ కొంచం తెలుగు సినిమా అంటే తక్కువగా చూసే టైపు అని అర్ధం అయ్యింది.
నా గురించి చెప్పాలంటే, నేను చదువుకునే రోజుల్లో నోట్ బుక్ పట్టుకుని బయటకు వెళుతుంటే మా ఇంట్లో అందరూ "ఇవ్వాళ్ళ ఏ సినిమాకో?" అని కామెంట్ కొడితే, వాళ్ళు గుర్తు చేసినందుకు తప్పకుండా సినిమాకి వెళ్లే టైపు. అసలు రోజుకొక సినిమా చూస్తే గాని నిద్ర పట్టని కజిన్ ఒకడున్నాడు నాకు. వీడూ నేను కలిసి ఎంసెట్ కోచింగ్ జాయిన్ చేస్తే, అది నచ్చక - రోజుకు రెండు సినిమాలు చూసి ఇంటికి వోచ్చేవాళ్ళం. మాతోపాటు కోచింగ్ లో వున్న మిగిలిన కజిన్ గాడు అక్కడ క్లాసు లో, ఇక్కడ ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేసేవాడు, ఎందుకంటే వాడు బుద్ధిమంతుడు అని బ్రాండ్ వేయబడ్డ వాడు. మనం చదువుకునే రోజుల్లో అలా సినిమా చూసిన బేవార్స్ బాపతు అన్నమాట.
ఆ తర్వాత కాలం కలిసిరాక మనం సినిమాలు చూడడం తగ్గిపోయి, మెల్లగా రోజుకొక సినిమాతో సరిపెట్టుకుని ఏదో వుద్యోగం చేస్తూ గడిపేసేవాడిని. పెళ్లి ఐన తరవాత, సినిమా చూసేటప్పుడు మా ఆవిడ పక్క నించి వేసే కామెంట్ తట్టుకోలేక ఒక్కో సారి ఇద్దరి మధ్యా యుద్ధం అయిపోయేది. "వాడెవడి సినిమా మీదో మనం కామెంట్ చేస్తే వీడికేంటి మంట" అని మొదట్లో మా ఆవిడకి అర్ధం కాలేదు. మెల్లిగా తెలుసుకుంది, ఇదొక కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి టైపు లో సినిమా పిచ్చి అని.
అల్లా కామెంట్ కొట్టేసే మనిషిని మార్చకుండా వుంటే మన జీవితం ఎలా? అందుకని మెల్లిగా మా ఆవిడ బుర్రలో సినిమా అంటే వెర్రి కాకపోయినా, కనీసం చూసేవాడు పిచ్చోడు కాదు అనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం అప్పుడే మొదలెట్టేసా. కొద్ది కొద్ది గా సినిమాల పట్ల hype తీసుకురావడం, సినిమా ముచ్చట్లు, తీయడానికి పడే కష్టాలు లాంటి వాటి మీద TV9 వాడు రోజూ పొద్దున్న పెట్టే కార్యక్రమాల లాంటివి తరచూ పెట్టడం. నాలాంటి కొందరు సినిమా పిచ్చోలని పోగేసి వందల మైళ్ళు కారు వేసుకుని సినిమాకెళ్ళడం, వగైరాలు చేసి కొంచెం మా ఆవిడని సినిమా చూసే హాబీ లోకి తీసుకొచ్చాను. అప్పుడే సినిమాలో ట్విస్ట్ లాగ నా జీవితంలో ఒక ట్విస్ట్ - నా కూతురు పుట్టింది.
అక్కడి నించి చిన్న పిల్లను తీసుకుని సినిమా హాల్ కేంటి? అని రెండేళ్ళు సినిమా లేకుండా గడిచింది. ఆ తరవాత ధైర్యం చేసి నా కూతురితో సినిమా కెళ్తే నా కూతురు మొదటి సారి ఆ సౌండ్ కి ఒకటే ఏడుపు. ఐన మనం వదలుతామా, ఏంటి? ప్రతీ ఆరు నెలలకి ఒక trial వేసి చూసేవాడిని. మన పరిస్థితి, హాల్లో తక్కువ బయట ఎక్కువ. మరి కష్ట పడి సినిమా అలవాటు చేసి మనం చూడనివ్వక పోతే మా ఆవిడ ఊరుకుంటుందా, అందుకని మనం హాల్ బయట పిల్లని ఆడించడం. ఇదేదో బావుందని ఏడ్చే పిల్లల తల్లులు, వాళ్ళ పిల్లల్ని కూడా నాతో ఒదిలేయడం. బయట పాప్కార్న్అమ్మే వాడు నన్ను చూసి కిసుక్కున నవ్వడం. ఇలా, ఎన్నో సినిమాలకు వెళ్లి కనీసం అరగంట కూడా చూడకుండా వొచ్చిన రోజులున్నాయి. నా కూతురుకి సినిమా పడకపోతే నా జీవితం ఇలా ఉంటుందా అని నేను విపరీతమైన బాధపడి, "చచ్చీ- చెడీ మా ఆవిడని సినిమా దారిలోకి తెచ్చాను, ఇప్పుడు మళ్లి కధ మొదటికి వొచ్చింది కూతురితో" అని అనుకుంటున్న రోజుల్లో జరిగిందీ సంఘటన.
వీడికి బొమ్మ పడితే రెప్ప పడదు అని ముద్ర పడ్డ తండ్రికి - "నాన్నా! సినిమా pause లో పెట్టు piss కొట్టి ఒస్తా" అన్న నా కూతురి మాటలు (పక్కన మా ఆవిడ చూపుని కూడా పట్టించుకోకుండా) గొంతులో విస్కీ పోసినట్టు (సారీ చెవిలో సీసం పోసినట్టు) అనిపించి , నన్ను అంతులేని పుత్రికోత్సాహంతో పొంగిపోయేలా చేసాయి. నేను వెంటనే మళ్ళీ సగటు తండ్రిలా, మనం అవ్వలేక పోయినా దీన్నైనా ఒక రైటరో, డైరెక్టర్ఓ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఇదేమి పోయేకాలం డాక్టరో, ఇంజనీరో అవ్వాలనుకోవాలి కానీ! అని బాక్గ్రౌండ్ లో మా ఆవిడ గొణుగుడు. కౌంటర్ వేద్దామని మా ఆవిడ వైపు తిరిగితే అవే చూపులు, అదేనండి! ముందే చెప్పానుగా మనది spicejet వాడి ఆఫర్ లో 99 రూపాయల టికెట్ అని.
cinema picchi, i can so identify with it.. :).. and so siri peru ki nyayam chestundannamaata mee ooha correct aite..
రిప్లయితొలగించండిsree garu,
రిప్లయితొలగించండిNyayam chesthundo ledo kaani, cinema enjoy chesthtundani nenu full happy.
mee ammayi dialogue super..
రిప్లయితొలగించండినాకు ఒంటికి వచ్చిందంటే చాలు ఇంటర్వెల్ డిక్లేర్ చేస్తా.
రిప్లయితొలగించండిJaabili garu,
రిప్లయితొలగించండిThank you.
శరత్,
Thanks for the comment.