దీనిని ఇప్పటిదాకా (ఈ బ్లాగ్గు రాసేటప్పటికి) నేను కింద ఇచ్చిన లింక్ నొక్కి ఒక కోటి నలభై లక్షల మంది చూసారు. నా కూతురు ఈ రోజుకి కూడా ఇది పెడితే చాలా ఆసక్తిగా చూస్తుంది. మా ఇంటికి ఒచ్చిన చిన్న పిల్లలందరికీ కూడా ఇది చూపించాను. అందరు పిల్లలకీ నచ్చింది. దీనికి లింక్ ఇదిగో.
ఈ పాట నాకు ఏనుగులు అంటే ఇష్టం అని ఎరిక్ హెర్మన్ అనే వ్యక్తి పాడుతూ - అవి చెట్ల మధ్య ఊగుతుంటే నాకు చాలా ఇష్టం అంటాడు. వెంటనే ఒక చిన్న పిల్ల "కాదు కాదు. అలా వూగేది ఏనుగులు కాదు, కోతులు" అని అంటూంది. అక్కడినించి చేప,కుక్క,పిల్లి,కోడి,ఎలుగు బంటి, కప్ప, ఎలుక గురించి అలాగే చెప్తే ఆ అమ్మాయి తప్పు అని చెప్తుంది. చివరకి గాడిద గురించి దాని తొండం గురించి చెప్తుంటే "అది గాడిద కాదు, ఏనుగు" అని చెప్తుంది. అదే నేను చెప్పేది నాకు ఏనుగులంటే ఇష్టం అని మళ్ళీ పాట మొదలెడతాడు ఎరిక్ హెర్మన్. "జంతువుల గురించి నీకు ఏమీ తెలియదు" అని అమ్మాయి అనడం తో ఈ యానిమేషన్ ముగుస్తుంది.ఇందులో ముఖ్యంగా పిల్లలు రంగులు వేసినట్లుగా వాళ్ళని నచ్చే రంగులు వాడడం వల్ల అనుకుంటా పిల్లలని బాగా ఆకట్టుకుంటుంది. దీనికి రంగుల బొమ్మలు చిన్న పిల్లలు వేసినవే తీసుకున్నారని ఎక్కడో చదివిన గుర్తు. ఇతని పాటల్ని ఇప్పటిదాకా ఇరవై కోట్ల మంది యుట్యూబ్ లో వీక్షించారని ఇతని వెబ్ సైట్ లో ఉంది. ఇతని సైట్ http://www.erichermanmusic.com/
ఇలాగే ఇంకొన్ని పాటలు వున్నాయి ఇతనివి. కానీ ఇది ఆకట్టుకున్నంతగా మిగిలినవి వుండవు. మీ ఇంట్లో పిల్లలు వుంటే ఇది చూపించండి. మీకే అర్ధం అవుతుంది. నాకు కూడా బానే అనిపిస్తుంది. ఈ పాట లాగ నేను కూడా మా అమ్మాయితో ఎప్పుడూ తప్పు చెప్పి దానితో ఒప్పు చెప్పించాలని ప్రయత్నిస్తా. కానీ పక్కనే వుండే నా అర్ధాంగి మా అమ్మాయి కంటే ముందు "నీకు ఇది కూడా తెలీదు" అని తనే చెప్పేస్తుంది. ఇక్కడ పంచ్ ఏంటంటే నేను ఎన్ని వందల సార్లు ట్రై చేసినా మా ఆవిడ నేను మా అమ్మాయి చేత చెప్పించే ప్రయత్నం చేస్తునాననే విషయం గుర్తుండక, ఇదేదో నన్ను సరిచేసే అవకాశం అనుకుని రెచ్చిపోయి "నీకు తెలీదు, నాకు తెలుసు. చివరకి నీ కూతురుకి కూడా తెలుసు" అని నన్ను వెర్రి పప్పని చేస్తుంది. ఇలాగే నడిచిందంటే మా అమ్మాయి ఇందులో పిల్లలాగ "మా నాన్నకి జంతువుల గురించే కాదు, దేని గురించీ తెలియదు" అని నాకు తప్ప అందరికీ చెప్పేస్తుందేమో అని నా భయం.
మా ఆవిడ ఎలాగో దానికి వంత పాడుతుంది కదా, ఇదే అవకాశం అని.