9, నవంబర్ 2011, బుధవారం

ఇది కధ కాదు... మీరేమంటారు?

ఏవిటది "ఇది కధ కాదు" అని టైటిల్ పెట్టాడు? కధ కాకపోతే ఇది ఆసక్తి కరమైన నిజంగా జరిగిన యదార్ధ సంఘటనా? లేక ఇది కధ కాదు సినిమా సమీక్షా? అని అనుకుంటున్నారు కదూ? ఇది కధో? కాదో? యదార్ధ సంఘటనో? తెలుసుకోవాలంటే మీరు మొత్తం చదవాల్సిందే..
   
మా పెద్ద అమ్మాయి సిరికి ఐదేళ్ళు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా కధ చెప్పమని అడుగుతూ వుంటుంది. ఇష్టం లేని తిండి పెట్టాలంటే, ఏదో ఒక కధ అప్పటికప్పుడు కల్పించి ఆ కధలో మా అమ్మాయి లీనం అయ్యేలా చేసి ఇష్టం లేని కూరో, చారో, పప్పో నోట్లో కుక్కెయ్యాలి. రాత్రి పూట అయితే పడుకునే ముందు ఒక పుస్తకం లో కధ చదివినా, లైట్ ఆర్పేక నాలో CREATIVITY పదును పెట్టి, దానికి నచ్చిన క్యారెక్టర్ ల మీద కధ చెప్పాలి. మా అమ్మాయి కుక్కల్నో, పిల్లుల్నో, కుందేల్నో, మనుషులనో.. ఎవరిని చెప్తే వాళ్ళ మీద కధ చెప్పాలి. అప్పటికీ ఒక జోల పాట పాడితే మనకి ఈ బుర్రకు పదును పెట్టి కధలు చెప్పే శ్రమ తప్పుతుందని ఎన్నో సార్లు పాట పాడే ఛాయస్ ఇచ్చినా, మా అమ్మాయి కధ చెప్తే  గాని కుదరదని మొండి పట్టు పట్టేది.
  
మొదట్లో మనకు తెలిసిన వాటిల్లో అవసరానికి గుర్తొచ్చిన కధలు కొన్ని చెప్పి కాలక్షేపం చేసినా, ఆ తరవాత కధలకి తడుముకునే పరిస్థితి ఒచ్చింది. సరే ఏ మహా భారతమో చెపుదామంటే సగం తెలుగు- సగం ఇంగ్లీష్ లో చెప్పలేక.. ఒక వేళ మొదలెట్టినా అందులో క్యారెక్టర్ లని ఇంట్రడ్యుస్ చెయ్యగానే మా అమ్మాయి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దాని నిద్ర సంగతి దేవుడెరుగు నాకు నిద్ర ఎగిరిపోయేది. ఎలాగో కధలన్నీ ఆ వయసులో నీతి కధలే కాబట్టి, మనం చెప్పాలనుకున్న నీతులు కధల్లో జొప్పించి కధలు చెప్తే బావుంటుందన్న ఒక ఐడియా బుర్రలో మెరుపులా మెరిసింది. ఇంక మనకి కొన్నాళ్ళు తిరుగులేకపోయింది.. కధలకి కొరతలేకుండా పోయింది..

 అయితే ఇలాంటి కధలు చెప్పేటప్పుడు కధలో క్యారెక్టర్ మా అమ్మాయిదే ఐనా, దానికి ఊరూ, పేరు, మన నీతికి కావాల్సిన కధ, కధనం మరియు CLIMAX అన్నీ అప్పలరాజే కదా.. అదే నండీ నేనే కద.. అందుకని మెల్లగా కొన్ని విషయాల్లో ఈజీ టెక్నిక్ లు పట్టాను. అంటే మన కద BEAR ల గురించి అనుకోండి పేర్లు సింపుల్ గా MAAMA BEAR , PAAPA BEAR , BABY BEAR అన్న మాట. కధలో మా అమ్మాయికి నీతి చెప్పాలని సృష్టించిన క్యారెక్టర్ మా అమ్మాయి టైపు అన్న మాట, అంటే మా అమ్మాయికి ఇష్టమైన రంగులు, హరివిల్లులు, సీతాకోకలు, మిణుగురులు, ఆట ఒస్తువులు, తిను బండారాలు అన్నీ మా అమ్మాయికి లానే అన్న మాట. ఆ క్యారెక్టర్ చేసే అల్లరి మా అమ్మాయి చేసింది అయ్యుంటుంది... కానీ చివరికి MORAL OF THE STORY మాత్రం మనం చెప్పాలని అనుకున్నది చెపుతాము అన్న మాట.. అబ్బో..మీరు నా తెలివికి బోలెడంత ఆశ్చర్యపోయారా.... అలా చెపుతున్నప్పుడు నా కళ్ళల్లో మెరుపులు .. నెత్తి వెనక స్పీడుగా చక్రం తిరిగి .. మొహమ్మీద నవ్వు (చిరు దరహాసం)తో  ... "అసలు నీకు తిరుగు లేదురా ... కధ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం నువ్వే రా అప్పలరాజు" అని నా భుజం నేనే చరుచుకున్నా.. 

  ఇది కధ కాదు అని మనకి తెలిసినా, చిన్న పిల్లకి కిలోల లెక్కన కధలు చెప్పిన మన ప్రతిభకి ఆస్కార్ కాకపోయినా ఏదో ఒక పురస్కార్ ఏనాటికి అయినా మనకి ఒస్తుందని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఒక రోజు జరిగిందో సంఘటన. "రెండు రోజులు నించి సరిగ్గా తిండి తినలేదు, ఏం తింటావు నాన్నా?" అని అడిగితే మా అమ్మాయి "పూరీ" అంది.  మా ఆవిడకి పూరీ చెయ్యడం రాదు. నాకేమో పూరి కోసం యు ట్యూబ్ లో RECIPE చూసి చేసే ఓపిక లేదు. మా అమ్మాయి అడిగింది కదా అని మా ఇంటికి ఒక ఇరవై మైళ్ళ దూరంలో వున్న  ఒక హోటల్ కి తీసికెళ్ళి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి పూరీ తినిపిస్తున్నా. (పూరి జగన్నాధ్ సినిమాలోలా నాకు  ఉప్మా తిందామని ఉన్నామా ఇంట్లో ఉప్మానాకు తప్ప ఇంకెవరికీ  నచ్చదు) .. అదే టైం లో అక్కడకి తెలుసున్న ఫ్యామిలీ రావడంతో వాళ్ళ అమ్మాయిని చూసి మా అమ్మాయి కంట్రోల్ తప్పింది. మా అమ్మాయి ఇంట్లో కొంచెం మన కంట్రోల్ లో వుండే కోతి (ఆడరా రామా... టైపు) . మేము కాకుండా తెలిసున్న మూడో మొహం.. ( ఇప్పుడు నాలుగో మొహం మా చిన్నమ్మాయితో కలిపి) కనిపిస్తే .... అదీ దానితో ఆడుకునే పిల్లలు అయితే  కళ్ళు తాగిన కోతిలా మన కంట్రోల్ తప్పుతుంది.. అంటే మిగిలిన టైం లో మన కంట్రోల్ లోనే  వుండే కోతి.. మా ఆవిడ అప్పటికీ మా అమ్మాయిని ఎంత అదుపులో పెడతామని ట్రై చేసినా, అసలు మాట వినట్లేదు.. ఒక పక్కన పిల్లని కంట్రోల్ చెయ్యలేని కోపంలో మా ఆవిడ కంట్రోల్ తప్పుతుంటే... మామూలుగా మనం ఉగ్ర నరసింహావతారం ఎత్తుతాము ఇలాంటి టైం లో (ఇంట్లో వుంటే) .. అప్పుడు అందరూ కంట్రోల్ లో కొస్తారు.. (అని నేను అనుకుంటూ వుంటాను కానీ, అది నా ఒత్తి భ్రమ అని ఆ తర్వాత తేల్చేస్తారు అనుకోండి) మరీ హోటల్ లో అవి కుదరవు కదా అని కళ్ళు పెద్దవి చేసి కాళికా అవతారం తో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశా.. మా ఆవిడకేసి - మా అమ్మాయి కేసి అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తే వాళ్ళు కంట్రోల్ లోకి రాలేదు.. సరి కదా కళ్ళు , నరాలు నొప్పెట్టాయి. ఒక పక్క మా చిన్న అమ్మాయి పాల కోసం ఏడుపుతో తలనొప్పి కూడా ఒచ్చింది..  హోటల్ లో జనాలు ఇదేమిటి ఫ్యామిలి ఫ్యామిలీ మొత్తం జూ లోంచి ఇక్కడికి ఎలా ఒచ్చారు అన్నట్లు ఆశ్చర్యంగా కౌంటర్ దగ్గర మానేసి మా ముందు క్యూ కట్టి చూస్తున్నారు.. ఈ గొడవకి ఆ హోటల్ వాడు "మీ ఫ్యామిలీ బయటికేల్తే మేము బిజినెస్ చేసుకుంటాము" అన్న లెవెల్ లో చూస్తున్నాడు.. ఆ దెబ్బకి "ప్యాక్ అప్" అని డైరెక్టర్ లా పెద్ద కేక పెట్టి అందరినీ కార్ లో ఎక్కించేసి హోటల్ నించి బయట పడ్డాము. 

దారి పొడుగునా  మా అమ్మాయికి ఒక పెద్ద క్లాసు పీకేసాను.. పనిలో పని మా ఆవిడ కూడా రెండు కేకలేసేటప్పటికి మా అమ్మాయి కంటి కొళాయిలు తిప్పింది... మెల్లిగా ఇంటి కొచ్చాక ఒక టైం అవుట్ తర్వాత ఒక జాదూ కి చప్పి (అదే నండీ మన మున్నా భాయ్ లాగా) ఇచ్చాక మా అమ్మాయి నా పక్కన సోఫా లో సెటిల్ అయ్యింది. కాసేపాగి డాడీ కూల్ అయ్యాడని అర్ధం అయ్యాక డాడీ నీకో కధ చెపుతానంది.. కధే కదా విందామని సరే నన్నా. మా అమ్మాయి చెప్పిన కధ తెన్గిలీసులో (నా తెలుగు మా అమ్మాయి ఇంగ్లీష్ లో).

ఒక KINGDOM లో ఒక కింగ్ K వున్నాడు, ఒక QUEEN Q వుంది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఒక ప్రిన్సుస్స్ P మరియు ఒక BABY ప్రిన్సుస్స్ B వున్నారు. ప్రిన్సుస్స్ P చాలా గుడ్ గర్ల్ కానీ అప్పుడప్పుడు కొంచెం అల్లరి చేస్తుంది. ఎందుకంటె అప్పుడప్పుడు బోర్ కొడుతుందని. బేబీ ప్రిన్సుస్స్ B కూడా ఏడుస్తూ వుంటుంది ఎందుకంటె మాటలు రావు కదా, అందుకని.. అయితే కింగ్ K అండ్ QUEEN Q ఎప్పుడూ ప్రిన్సుస్స్ P ని మాత్రమే తిడతారు. బేబీ ప్రిన్సుస్స్ B ని ఎప్పుడూ ఏమీ అనరు. ప్రిన్సుస్స్ P కి అప్పుడు బాగా ఏడుపు ఒస్తుంది.. ఎందుకంటె ప్రిన్సుస్స్ ని కింగ్ తో సహా ఎవ్వరూ తిట్టకూడదు కదా!  మోరల్ అఫ్ ది స్టొరీ ప్రిన్సుస్స్ P ని తిడితే ఏడుపొస్తుంది, కానీ ప్రిన్సుస్స్ లు ఏడవకూడదు. (ప్రతీ కధకి చివరన మోరల్ అఫ్ ది స్టొరీ చెప్పడం తప్పని సరి అని మా అమ్మాయి అనుకుంటుంది).

ఈ దెబ్బతో నాలో వున్న అప్పలరాజు.. అదే నండీ కధ-స్క్రీన్ ప్లే-DIRECTION ..రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా UTTER FLOP RAAJU (KING K ) అయ్యి కూర్చున్నాడు.. కంట్లో మెరుపుల దీపాలు ఆరిపోయి...వెనక తిరిగే చక్రం ఆగిపోయి... నా నవ్వు (దర హాసం) కెవ్వుగా మారి.. భుజం తడుముకోవడం మానేసి బుర్ర గోక్కోడం మొదలెట్టా.....  

ఇప్పుడు చెప్పండి అసలు ఇది కధ అంటారా? కాదంటారా? ఆ CONFUSION లోనే. ఇది కధ కాదని మొదలు పెట్టాను..మీరేమంటారు?

25, అక్టోబర్ 2011, మంగళవారం

నేను ఒక్క సారి కమిట్ అయితే....తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...

"అసలు అందరూ గుడికి ఎందుకు వెళ్తారు?" 
"ఇంకెందుకు, దైవ దర్సనం కోసము" అని అందరూ అనుకుంటారు కదూ.. అక్కడే మనకో చిక్కు ఒచ్చి పడింది. "చిన్నప్పుడు అమ్మతో పాటు విద్యా నగర్లో రామాలయానికి ఎందుకెళ్లాను?"
"అక్కడ చెప్పే హరి కధ నచ్చి" .. అని చెప్పాలని తెలుసు.. కానీ మనం వెళ్ళింది సెనగల కోసం కదా.. 
"కుర్ర వయసులో బిర్లా మందిర్ కి ఎందుకు వెళ్లానంటే యేమని చెప్పను.. ఆ పాల రాతి మందిరంలో దేవుడిని దర్సిన్చుకున్దామని".. అనవచ్చు.. కానీ అక్కడకి ఒచ్చే జన్తలబలకిషల (అందమైన అమ్మాయిల) కోసం కదా..
ఇలా నిజాయితీగా అంటే ఎవరూరుకుంటారు..ఇదంతా ఎందుకంటారా...
చెప్తాను...
నేను కొత్త గా పని చేస్తున్న (కొత్తగా అంటే ఒక సంవత్సరం అయ్యుంటుంది) ఆఫీసు పక్కనే, శివ-విష్ణు టెంపుల్ అని ఒక మంచి గుడి వుంది. పక్కనే గుడి అంటే మనకు ప్రసాదం ఆకలేస్తుంది కదా. అప్పుడప్పుడు అలా గుడి కెళ్ళి కాంటీన్ లో పులిహోర, దోస, ఇడ్లి లాంటివి కుమ్మేయచ్చు అన్న ఐడియా బుర్రలో తట్టినా, కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్తామని ఎవరికైనా తెలిసిపోతే, ఎంత అప్రదిష్ట.. అనుకుని.. సరే ఒకటి రెండు సార్లు పండగ పేరు చెప్పి గుడికి వెళ్ళినట్లు కలర్ ఇచ్చి, గుడికి వెళ్ళా. మన FATE కి కష్టపడి గుడికెల్లిన భాగ్యానికి,  మనకి భక్తులు వొండుకుని తలో స్పూను అన్నట్లు పెట్టిన రవ్వ కేసరి లాంటి రెండు చంచాల ప్రసాదం దక్కింది గానీ, గుడి DINING హాల్ లో కుమ్మేసే అవకాసం కరుణించలేదు. ఏమి చేస్తాము? దైవానుగ్రహం లేదని మిగిలిన భక్తుల గుంపులో కలిసి కొంత తీర్దం మరియు కిస్స్మిస్స్ (అదే నండి మరి సటగోపం పెట్టాక ఇచ్చేది అదేగా) తిని అర్ధాకలితో బయట కొచ్చి  పిజ్జాలో బర్గారో తినాల్సి ఒచ్చింది. మన మేమో ఇక్కడ వుండేది సోమ నించి గురువారం దాకానే. గుళ్ళో DINING హాల్ పండగ పూటే ఓపెన్ అట. మన అదృష్టం కొద్దీ పండగ ఒచ్చినా అది శుక్ర, శని, ఆది వారాల్లో రావడం.. ఒక వేళ మిగిలిన రోజుల్లో ఒచ్చినా, అప్పుడు ఆఫీసు నించి బయటకు ఒచ్చే టైం కి లేట్ ఐపోడం.. వెరసి మనకి ఆ ప్రసాద భాగ్యం కలగలేదు. 
మన అదృష్టం పండి, మొన్న దసరాకి నా పంట కూడా పండి గుళ్ళో DINING హాల్ తెరిచుంది.. ఇదే సందు అని ఒక పులిహోర, ఒక లెమన్ రైస్, ఒక పెరుగన్నం, ఒక చక్ర పొంగలి ప్లస్ రెండు MIXTURE పొట్లాలు తీసుకుని.. పనిలో పని ఒక నమస్కారం పెట్టేసి అట్నుంచి అటే కార్ లో మెక్కేసి.. "ఊసరవెల్లి... హిట్ సినిమా" అనుకుంటూ చెక్కేసా.. ఆ ఊసరవెల్లి MIXED టాక్ తో అంత హిట్టు కాకపోయినా.. మనం అన్నీ తినగా మిగిలిన  MIXTURE పొట్లాలు ఇంట్లోను, ఆఫీసు లో ను సూపర్ హిట్ అయ్యి కూర్చున్నాయి. అక్కడే మొదలియ్యింది చిక్కు. ఊసరవెల్లి లాంటి రివ్యూ దీనికి కూడా ఒచ్చుంటే, నాకీ పరిస్థితి ఒచ్చేది కాదు. MIXED రివ్యూ ఒచ్చిన MIXTURE మళ్ళీ తేవాల్సిన అవసరం వుండేది కాదు. కుదిరినప్పుడల్లా ఆ MIXTURE మళ్ళీ తీసుకురమ్మని రీమైన్డర్లు...

 మళ్ళీ పండగ  రోజుల్లో తెరిచే DINING హాల్ కోసం ఎదురు చూసి చూసి, ఒక రోజు టైం చేసుకుని గుడికి వెళ్ళా.. మరీ గుళ్ళో ఎంట్రన్సు లోనే వుండే DINING హాలులోకి వెళితే, అసలే ఖాళీగా వున్నప్పుడు జనాలు వీడు భక్తికి కాదు భుక్తికి ఒచ్చాడని పసి గట్టేస్తారని..ఆ పైన భుక్తులకు మార్గము అని DINING  హాలు ముందు బోర్డు పెడతారని బయమేసి.. ఆ హాలు వైపు ఒక కన్నేసి, పరమ భక్తుడిలా దర్సనానికి వెళ్లాను. అదే టైం లో ఒక నలుగురికి సటగోపం పెడుతున్న పూజారి ని చూసి ముందు తల, దాని వెనక చేతులు చాపాను.. సటగోపం మరియు ప్రసాదం అని అర్ధం అయ్యేలా...మొహంలో లేని భక్తీ రసాన్ని కొంచెం తెప్పించి మరీ.. మన సంగతి తెలిసినట్లు ఆయన కూడా కొంచెం వెయిట్ చెయ్యి వీళ్ళ తర్వాత నీ టర్న్ అని కళ్ళతోటే కమ్యునికేట్ చేసి అభిషేకానికి లోపలికేళ్లారు. పది కిస్స్మిస్సులకి పావుగంట అభిషేకం అయ్యే వరకు వేచి వుండే ఓపిక వుంటే మనం ఇలా ఎందుకు ఉంటాము అని అక్కడినించి తప్పించుకుని, DINING హాలు ముందుకి ఒచ్చా.. అక్కడ చూస్తే మన కొరకు ద్వారము తెరవకనే వున్నది... హత విధీ.. విధి ఎంత బలీయమైనది.. అనుకుని..  సరే కాసేపు ప్రదక్షిణం చేసినట్లు నటించి ... ఆ మార్గమున యెవరేని  అరుదెంచినచో.. క్రీగంట గమనించి ..సాగెదమని.. ప్రదక్షిణాలు మొదలు పెట్టా....ఒక వేళ ఎవరూ రాకున్నచో..  అక్కడ VOLUNTEER ని మాటల్లో పెట్టి DINING హాలు కధా-కమామీషు కనుక్కుని  పోదామని తిరుగుతున్నాను.

అప్పుడే జరిగింది అనుకోని సంఘటన.. భక్తి పారవశ్యం నటిస్తూ ప్రదక్షిణం చేస్తున్న నన్ను ఒక ముసలావిడ ఆపి.. "బాబూ! ఏం చేస్తున్నావు?" అని బిగ్గరగా ప్రశ్నించింది.
ఇది కూడా తెలియదా? అన్నట్లు భక్తితో సగం మూసుకుపోయిన (నటనలో) కన్నులతో "ప్రదక్షిణం" అన్నాను.. "ఇటునుంచి కాదు బాబూ. అటు నుంచి చెయ్యాలి ప్రదక్షిణం" అని ఆవిడ అరచిన అరుపుకి గుడిలో చెదురు ముదురుగా వున్న జనాలంతా... రోడ్డు మీద ఆక్సిడెంట్ అయితే బండి ఆపేసి చూసే డ్రైవర్ లలా, తమ తమ పనులు ఆపేసి గుళ్ళో ప్రదక్షిణము ఎలా చెయ్యాలో తెలియని ఈ భుక్తి రామదాసు ని చూడడానికి నా వైపు రావడం మొదలెట్టారు..
ఆ దెబ్బకి గుళ్ళో ప్రసాదం మాట దేవుడెరుగు... ఆ రౌండ్ తో ప్రదక్షిణం ఆపేసి బయటకు పరుగు పెట్టాను..
బుద్ధి ఒచ్చింది... ప్రసాదం కోసం గుడి కెళ్ళినోడు ప్రదక్షిణాలు చేస్తే ఇలాగే వుంటుంది అని.. ఆ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాను..ఈ సారి గుడి కెళ్ళినా ధైర్యంగా.. తిన్నగా DINING హాలుకే వెళ్ళాలని... నేను ఒక్క సారి కమిట్ అయితే... తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...
గమనిక: భక్తులు నా మీద కారాలు మిరియాలు నూరవద్దని మనవి....

18, అక్టోబర్ 2011, మంగళవారం

దూకుడు - మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్

     దూకుడు మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ మీ కోసం.
     
     
  • షార్ప్ వున్నవురా పంచ్ పడంగానే PROFESSION  చెప్పెసినవు
  • నువ్వులేపేసిన పోలీసులు వీక్ అయ్యుండచ్చు  నువ్వు కొనేసిన  పోలీసులు బోకులు అయ్యుండచ్చు హమ్ అలగ్
  • నేను నరకడం స్టార్ట్ చేస్తే నరకంలో హౌసేఫుల్ బోర్డు పెట్టేస్తారు
  • కళ్ళు ఉన్నాడు ముందు మాత్రమే చూస్తాడు...దమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు
  • ఈ దూకుడు లేకపోతే పోలిసోడికి పోస్ట్మాన్ కీ తేడా వుండదు సర్
  • పడుకున్న పులిని - పంచేసే పోలీసుని కెలికితే... వేటే
  • అబే సాలా నీకోసం వెయిట్ చెయ్యనీకి ఫాన్స్ ఉంటార్... పోలీస్
  • లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్న పరవాలేదు, కానీ ఒక్కడుంటాడు.. వాడితో పెట్టుకుంటే మాత్రం అసలు తల్లి కడుపులోంచి బయటకు ఎందుకొచ్చాము అనిపిస్తుంది.. ఆ ఒక్కడే నేను  
  • ఒక్క సారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళిపోతా.. విన..
  • అబే ఓహ్ బట్టేబాజ్. భయానికి మీనిన్గే తెలియని బ్లడ్ రా నాది
  • దందా పేరుతో దార్కారీ చేస్తే, చూస్తూ ఊరుకోనీకి ఫగాడ్ గాన్ని అనుకున్నావు
  • నువ్వు దమ్కీ ఇస్తే ధడుసుకోనీకి తూతుమ్బర్ గాన్ని అనుకున్నావు బె
  • అబే నాలాయాక్, నేనోచ్చింది నీ తమ్మున్ని అప్ప చెప్పనీకి కాదు.. నిన్ను తీస్కోపోనీకి
  • నాకు ఒక నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా... రెండు నిమిషాలు టైం ఇస్తే ఆక్షన్ లోకి దిగుత.. మూడు నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా..
  • మజాక్ చెయ్యనీకి దోస్త్ వా -సాలె గాని వా
  • నేనేవన్నైనా టార్గెట్ చేసానంటే వాడికి పైన బెర్త్ కన్ఫారం అయిపోయినట్లే
  • అబే సాల నీకు ఛాన్స్ ఇయ్యనీకి నేను ప్రోడుసుర్ని అనుకున్నావు బె



11, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మ గుండె - 2

(నేను ఈ సంవత్సరం మొదట్లో ప్రారంబించిన ఈ కధ మొదటి భాగం  పోస్ట్ చేసి తొమ్మిది నెలలు అయ్యింది..రెండో భాగం అప్పుడే పూర్తి చెయ్యాలని అనుకున్నాను. ఎందుకో రెండో భాగం రాయడానికి అస్సలు వీలు  కుదరలేదు.. టైం దొరికితే రాసే మూడు వుండేది కాదు..  మా అత్తయ్య పోయినప్పుడు కధ మొదలు పెట్టాను..ఆ అత్తయ్యః గురించి మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక సందర్భంలో మా పెద్దమ్మ కొడుకు తో చర్చిస్తుంటే  ఈ కధ పూర్తి చెయ్యాలనిపించింది.. జన్మనిచ్చిన తల్లిని చివరి దశలో చూసుకొని వాడికి  నేను సాయం చెయ్యను, ఎవడు చెప్పినా సరే అన్న వాడి మాటలకి ఈ కధ పూర్తి చెయ్యాలని అనిపించింది)

మొదటి బాగం ఇక్కడ చదవండి: 

నాకు పాతికేళ్ళ వయసులో అనుకుంటా, ఒక రోజు అమ్మ అడిగింది "జీవితంలో ఇంకేమి చేద్దామని అనుకుంటూ వున్నావు" అని. అప్పటికే డబల్ MA మరియు MCOM చేసిన నేను, బ్యాంకు లొ క్లెర్క్ నించి ఎదగడానికి రాయాల్సిన  పరీక్షలు MBA , IRPM , ML అని చెప్తే, ప్రేమగా ఒక మొట్టి కాయ వేసి, "వెర్రి తండ్రి. ఎప్పుడూ చదువేనా?" అంది. మీ మామయ్య నీకో సంబంధం తెచ్చాడు అని వివరాలు చెప్పి ఫోటో తెచ్చి చేతిలో పెట్టింది. అమ్మాయి పేరు సూర్య కాంతం అని చెప్పిన వెంటనే కొంచెం  కంగారు పడ్డాను. ఫోటో చూసాక నా కంగారు తగ్గింది.  పేరు సూర్య కాంతం అయినా అమ్మాయి బాపు బొమ్మలా ఉంది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, అందమైన ముఖం. ఎప్పుడూ చదువు తప్పు ఇంకోటి పట్టించుకోని నాకు మొట్ట మొదటి సారిగా ఏదో తెలియని గిలిగింతలు, పులకింతలు. పిల్లని చూడడానికి వెళ్లే రోజు దగ్గరపడుతుందని అమ్మ గుర్తు చేసాకా, ఆత్రంగా కొత్త బట్టలు, బూట్లు, అత్తర్లు .. నా అందమైన కలల రాణికి ఒక మంచి గిఫ్ట్ కూడా కొనేసాను. బయలుదేరేటప్పుడు అమ్మ చీర చూసాక మామయ్య కేకలేస్తే గాని గుర్తు రాలేదు,  అమ్మకి వున్నవి రెండే రెండు నేత చీరలు. అప్పుడు మామయ్య ఇంటి దగ్గర ఆపి అత్తయ్య చీర ఒకటి అమ్మని త్వరగా కట్టుకోమని చెప్పి నాకు చీవాట్లు పెట్టాడు. "ఒరేయ్! అప్పుడే కాబోయే పెళ్ళాం బెల్లం ఐపోయింది. మీ అమ్మ వెర్రి బాగులది, నువ్వోకడివే మిగిలిన ఆశా జ్యోతి. ఇప్పుడే మర్చిపోయావు, రేపు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ దాన్ని పట్టిన్చుకుంతావో, లేదో" . మామయ్య నోటి దురుసు నాకు చిన్నప్పటి నించీ అలవాటే కాబట్టి పెద్ద బాధపడలేదు. నిజానికి మామయ్యది చాలా మంచి మనసు, అందరికీ సాయం చేస్తాడు. 
మా చుట్టాల్లలో అందరూ మామయ్య కి ఎదురు చెప్పడానికి బయపడతారు, నేను కూడా... హడావిడిలో చీర మర్చిపోవడం తప్పే అయినా, నా కంగారులో నేను అసలు ఆఫీసు పనే సరిగ్గా చెయ్యలేదు.ఎప్పటిలాగానే నేను సమాధానం చెప్పలేదు.
 పెళ్లి అయిన కొత్తలో జీవితం ఎంత అందంగా ఉండేదో. అసలే వయసులో ఆడ వాసన తగల్లేదు, ఎంతసేపు పుస్తకాలే. రోజంతా ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేవాడిని. 
అందులోను సూర్యే కాంతం అందం నన్ను మత్తు ఎక్కించేది. అసలు అంతటి అందగత్తెని భార్యగా పొందిన అదృష్టానికి ఏమి చేసినా
తప్పులేదని అనిపించేది. ఆయస్కాన్తంని తలదన్నే ఆకర్షణ శక్తీ వున్న నా సూర్య కాంతానికి  ఆ పేరు పెట్టినందుకు  వాళ్ళ నాన్న మీద కోపం కూడా ఒచ్చింది . మా ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికి మా అమ్మ అప్పుడప్పుడూ చుట్టాల్ల ఇళ్ళకి వెళ్ళడం లాంటివి చేసేది. 
అప్పుడు మాకు అసలు ప్రతి రాత్రీ జాగారమే. ఒక సారి రొమాంటిక్ ట్రిప్ అరకు వెళ్ళామో లేదో, మా ఆవిడకు వాంతులు. రెండేళ్ళు తిరిగే లోపు ఇద్దరు పిల్లలు.  రెండు ఉద్యోగాలు, చదువు ల మధ్య నేను ఇంటికి ఎక్కువ సమయం కేటాయించ లేకపోయే వాడిని. ఆ వున్న కాసేపు నా పెళ్ళాం పిల్లలతో గడిచిపోయేది. మా ఆవిడ తరచూ అమ్మ మీద ఏదో ఒక చాడీ చెప్తూ వుండేది, మొదట్లో అమ్మ మీద నమ్మకంతో నేను మా ఆవిడ చాడీలన్నీవినీ విననట్లు ఉండేవాడిని. కొన్ని నాళ్ళకి నేను అసలు పట్టించు కోవట్లేదని నాకు అర్ధం అయ్యి, కుదిరినప్పుడు అమ్మని కొంచెం సర్దుకోమని చెప్పేవాడిని. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అమ్మ మీద చాడీలు చెప్పడం, ఎందుకూ పనికి రాని తమ్ముళ్ళు, నేను లేనప్పుడు అమ్మ కోసం ఒచ్చి వెళ్తుండడం నన్ను కొంచెం నొప్పించేవి. కానీ ఏమి చెయ్యను..అమ్మ కాబట్టి అర్ధం చేసుకుంటుందని ఒకటి రెండు సార్లు చెప్పి చూసా. 
అమ్మ అర్ధ రాత్రులు దగ్గుతూ వుంటే, ఆలస్యం గా అలిసి పోయి ఇంటికి ఒచ్చిన నాకు నిద్ర సరిపోవట్లేదని మా ఆవిడ బాదపడేది. మందులు ఇచ్చినా వేసుకోవట్లేదని మా ఆవిడ పదే పదే చెప్తుంటే నేను అమ్మని మందలించాల్సి ఒచ్చింది . అన్నిటికీ మౌనమే అమ్మ సమాధానం. ఇంతలో అమ్మకి చేతుల మీద మచ్చలు ఒచ్చాయి. అసలే నాన్న హింసలకు సాక్షిగా మొహం మీదా, మెడ మీదా మచ్చలు... దానితో పాటు ఈ చేతి మీద మచ్చలు మూలంగా మీ అమ్మ కనిపిస్తే ఇంటి చుట్టు పక్కల వాళ్ళు అందరూ దూరం జరుగుతున్నారని, వెనక చెవులు కొరుక్కుంటూ వున్నారని..  నాకు మా ఆవిడ పిల్లలు చెప్తూ ఒచ్చారు. మా అమ్మ మేడలో గొలుసు పోయిందని మా ఆవిడ చెప్పింది. నేను అమ్మని అడగలేదు, తనే చెప్తుందని. రెండు నెలల తర్వాత అమ్మ గాజులు కూడా పోయాయని మా చిన్న వాడు కంప్లైంట్. మీరు ఎందుకు మీ అమ్మని అడగరని మా ఆవిడ రోజూ విసిగించేది. ఒక రోజు మా ఆవిడ మా అమ్మని నిలదీసెంత వరకు ఊరుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఎవరికో ఇచ్చానంది, కానీ వివరాలు చెప్పలేదు.

రోజు రోజుకీ ఇంట్లో ప్రశాంతత కరువయ్యింది. దీనికి ఒకటే మార్గం.. ఆలోచించడానికే అదోలా వుంది.. పోనీ ఎక్కడికైనా పంపిద్దా మంటే.. నలుగురులో మనకి ఎంత అప్రదిష్ట.. ఇప్పటికే మనం మీ అమ్మని సరిగ్గా చూడట్లేదని మీ అమ్మ అందరికీ చెప్పడంతో .. మనం పెళ్ళిళ్ళకి పెరంటాల్లకి వెళితే అక్కడ జనాల సూటి పోటి మాటలతో నాకు తల కొట్టేసినట్లు ఉంటోంది అని మా ఆవిడ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.. ఇలా ఆలోచిస్తూ ఇంటికి  వెళ్లేసరికి మా అమ్మ కనపడట్లేదని మా ఆవిడా-పిల్లలు కంగారు.. ఇంతలో మామయ్యా ఫోను.. మీ అమ్మ కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందని.. మా ఆవిడ ఇచ్చిన ప్రోద్భలంతో ధైర్యం తెచ్చుకుని మామయ్యకి గట్టిగా చెప్పాను.. నన్ను అడగకుండా తీసుకేల్లినందుకు ఇంక అమ్మ భాద్యత నీదే నని.. ఇక పై మాకూ వాళ్లకి తెగ తెంపులని.. కొన్నాళ్ళు మేము హాయిగా వున్నాము.. అసలు పెళ్ళిళ్ళు పేరంటాలు లాటివి వెళ్ళడం మానేసి.... ఫ్లాట్ లో జనాలతో మా ఆవిడ పిల్లలు కలుపుగోలుగా వుండడం నాకు మంచి రిలీఫ్ నిచ్చింది.. నాకు ఆఫీసు నించి ఇంటికి రాడానికి ఉత్సాహంగా వుండేది..

మొన్ననే బెంగుళూరు ట్రిప్ లో వుండగా తెలిసింది అమ్మ పోయిందని.. వెళ్లి చుట్టపు చూపుగా వుండి, ఆ కార్యక్రమాలు అన్నీ కానిచ్చి ఒచ్చాను.. ఖర్చులూ అవీ అని మా మామయ్యా వాళ్ళు పంచాయితీ పెట్టినా మా ఆవిడ నోటితో నెగ్గుకొచ్చేసింది.

..............................................................సమాప్తం........................................................................


నమ్మక ద్రోహం చేసినవాడినైనా క్షమించచ్చు
అమ్మకి ద్రోహం చేసినవాడిని క్షమించకూడదు
అని నమ్మిన నేను..
ఇది చదివి ఒక్కరైనా మారతారేమో ననే ఆశతో...
మా అత్తయ్య జీవితం పైన రాసిన కధ..

ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి

కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, బృందావనం లో క్లాసు క్యారెక్టర్ తో పరవాలేదు అనిపించి తర్వాత శక్తీ లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చి.. మళ్ళీ వెరైటీ రోల్ తో ఊసరవెల్లి సినిమా లో కనిపించిన జూనియర్ N T R  హీరో గా, దేవి శ్రీ హిట్ మ్యూజిక్ కాంబినేషన్ చిత్రం ఊసరవెల్లి.  రిలీజ్ కి ముందర దూకుడు కి కళ్ళెం వేసి, దాని కలక్షన్ లకి గొళ్ళెం పెట్టే చిత్రంగా చెప్పబడింది. అబ్బో ఇంకేముంది ఇరగదీస్తుంది అని చొక్కా చించుకుని మా దగ్గరలో ఉన్న ధియేటర్ కి మొదటి ఆటకి వెళ్ళాను. నేను పని చేసేది మేరీ ల్యాండ్ లో. సాధారణంగా తెలుగు సినిమా అంటే వర్జీనియా వెళ్లి చూడాలి. ఈ మధ్య మేరీ ల్యాండ్ లో కూడా సినిమా వేస్తున్నారని వెళ్తే, సినిమా మొదలయ్యే టైం కి పది మంది కూడా లేరు హాల్లో. పద్దెనిమిది వందలు దియటర్ లలో సినిమా రిలీజ్ చేస్తే ధియేటర్ కి పదిమంది చొప్పున అసలు సినిమా ఎలా వర్క్ అవుట్ అవుతుందో నని బుర్ర గోక్కుంటూ, జుట్టు పీక్కుంటూ చేతిలోకోచ్చిన నాలుగు వెంట్రుకలూ చూసుకుని- నాలిక కరుచుకుని మళ్ళీ జుట్టులో దోపే ప్రయత్నం చేసి సినిమా టైటిల్ పడుతుంటే ఆసక్తిగా సీటు లో ముందుకు జరిగి మరీ చూసాను. 

ఎర్రటి అడ్డ గీతలు, నిలువు గీతలు అటూ ఇటూ కోణాలు కొంచెం మార్చి టైటిల్స్ వేసేసాడు. సరేలే టైటిల్స్ కే అంత ATTENTION  ఎందుకని సీట్ లోకి వెనక్కి జరుగుతుంటే ఇంతలో హీరో ని వాడెవడో అర్ధం కాని రీతిలో, "వీడు ఎవడికీ అర్ధం కాడని", అర్ధం పర్ధం లేకుండా వ్యర్ధం గా పరిచయం చేస్తుంటే పెద్ద సౌండ్ తో బాంబు పేలి, మిలిటంట్లు అదీ అని హడావిడి మొదలయ్యింది. కొంచెం సద్దు మునిగేలోపు ఒక ముద్దు సీన్ తో మొదటి పాటలోకి వెళ్ళిపోయారు మన దేవి శ్రీ ప్రసాద్ అండ్ తమన్నా. అదేమిటి దేవి శ్రీ మ్యూజిక్ అనుకున్నానే, ఇచ్చిన డబ్బులకి డప్పు కొట్టి, పాట పాడి పైగా పండగ ఆఫర్ అని చెప్పి పాటలో నటించేసాదేమో, డైరెక్టర్ ఎంత ఒద్దన్నా.. వినకుండా అని మళ్ళీ బుర్ర గోక్కోబోయి, ఎదర అర ఎకరం మీద నించి నాలుగు వెళ్ళు వెనక్కి పోనిస్తూ అంతకు ముందర ఊడిన వెంట్రుకలు గుర్తుకొచ్చి ఆగిపోయా. మళ్ళీ పరీక్షగా చూస్తే మన జూనియర్ NTR - అదేంటి ఇలా ఐపోయాడని అనుకుని, ఇది ఊసరవెల్లి ఒక రంగు మాత్రమే అని సరిపెట్టుకుని ఈ ఉబ్బిన ఊసరవెల్లి మిగిలిన రంగులెలా ఉంటాయో అని చూడడం మొదలెట్టా.  ముద్దు పెట్టిన హీరొయిన్ ని ప్రేమ కోసం ముష్టి ఎత్తుకుంటూ హీరో.. ఆ హీరో చేతిలో తన్నులు తింటూ ఒక కామెడీ గాంగు... మధ్యలో ఒకటి రెండు పాటలు అలా నడిచిపోతుంది సినిమా మొదటి సగం.. 
    ఇంక రెండో సగం లో ఒకటే ట్విస్టులు.. ఊసరవెల్లి రంగులు మారుతూ.. అయితే, ఇక్కడే మనం చూస్తున్న కత్తి లాంటి హీరొయిన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ వుందని. అదంతా మరిచిపోయి ఆవిడ కాట్రవల్లి (అదే నండీ కిక్ సినిమాలో అలీ క్యారెక్టర్) అయ్యిందని మనకి డైరెక్టర్ గారు కొంచెం సాగ దీసి మరీ అతలా కుతలంగా చూపిస్తారు. హీరొయిన్ అన్నయ్యకి జరిగిన అన్యాయం, ఫ్యామిలీ కి జరిగిన దారుణం చూపిస్తూ.. ఇంతలో హీరోకి తండ్రి ద్వారా నా వేస్ట్ లైఫ్ లో ఒక్క మచి పని కూడా చెయ్యలేదు కాబట్టి ఘోస్టులా నీ వెంట ఉంటా.. నువ్వు నాలాగా కాకుండా లైఫ్ లో ఒక మంచి పని చెయ్యమని చెప్పి చచ్చి ఘోస్ట్ అయిపోతాడు. బుర్రల్లో బుల్లెట్ వున్న హీరొయిన్.. బుర్ర బరువు పెరిగిందని జుట్టు కత్తిరించుకుని, వర్షం లో తడుస్తూ చీకట్లో హనుమంతుని విగ్రహం దగ్గర దేవుణ్ణి తనకు జరిగిన అన్యాయానికి నిలదీస్తుంది. అక్కడే విగ్రహం పైనించి చుక్క పడి, పక్క నించి డప్పులు మీద దరువు పడి, ఆ పైన వంద మందిని చితక బాదే హీరో కనపడి,  ప్రతీకారం తీర్చుకునే దారి కనపడి, తన పగ హీరో కిచ్చి తను మర్చిపోతుంది. అప్పటి నించీ కాట్రవల్లి లా నటిస్తుంది. ఒకడి తరవాత ఒకడిని వరసగా విల్లన్ గాంగు ని మన హీరో ఎందుకు బాబూ మమ్మల్ని ఇలా వేయించుకు తింటున్నావు అంటే  చెప్పకుండా వాళ్ళని విసిగించి చంపేస్తుంటాడు. సుత్తి కొట్టి ఇంకా చావని వాళ్ళని పొడుగాటి సుత్తితో కొట్టి చంపేస్తాడు.  మధ్యలో మాస్ కోసం అన్నట్లు పెద్దగా సంబంధం లేకపోయినా ఒక సాంగు సింగుతారు. ఇంతలో పెద్ద విల్లన్ ప్రకాష్ రాజ్ ఒస్తాడు. మరిన్ని మలుపులతో మన హీరో చేతి అందిన కర్రని,కొక్కాన్ని, సుత్తినీ వాడి ఒక్కొక్కళ్ళని చంపిన తరవాత అన్ని ఒస్తువులూ ఐపోయాయి అని మనం చంకలు గుద్దుకుంటే... CLIMAX లో పెద్ద విల్లన్, హీరో చేతికి అందిన ఒస్తువుతో చంపేస్తాడని అవన్నీ దూరంగా పెట్టి..కుర్చీకి బాగా టేప్ తో కట్టేసాక, ఇంకేమి చేస్తాడులే  అని డైలాగ్ చెప్తుంటే .. మన హీరో కుర్చీ లో కట్లతో పాటూ యెగిరి అందరి మీదా పడి చంపేస్తాడు. నాకు అప్పుడే కొంచెం కదిలితే నా కుర్చీ కూడా ఎగురుతుందేమో నని అనుమానం ఒచ్చి కాళ్ళు నేలకు తన్ని కుర్చీ హ్యాండ్ రెస్ట్ గట్టిగా పట్టునేటప్పటికి సినిమా ఐపోయింది..
  ఈ ఉబ్బిన ఊసరవెల్లి - కత్తి లాంటి కాట్రవల్లి నాకు మాత్రమే ఇలా అనిపించిందా.. లేక అందరికీ ఇలాగే అనిపించి ఉంటుందా అని ఆలోచించుకుంటూ మెల్లిగా హాలులోంచి బయటకు ఒస్తుంటే... నా ముందు ఒక ఏడుగురు సినిమా గురించి చర్చించుకుంటూ పార్కింగ్ లాట్  లోకి వెళ్తున్నారు. వీళ్ళు సినిమా మొదలయ్యాక ఒచ్చి వుండాలి ఎందుకంటె మనకి లోపలి వెళ్ళినప్పుడు కనపడలేదు కదా అని వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఒక చెవి అటు పడేసా.. అందులో ఒక వ్యక్తిని మిగిలిన వాళ్ళు తిడుతున్నారు ఈ సినిమాకి తీస్కోచ్చినందుకు.. ఇప్పుడు మాకు అర్జెంటు గా రెండు పెగ్గులు మందు పోయిస్తే గాని నిన్ను క్షమించేది లేదని చుట్టు ముట్టారు... సందిట్లో సడేమియా అని వాళ్ళతో చర్చ పెట్టాక తెలిసింది.. వాళ్ళు కూడా నాలాగే చొక్కా చించుకుని ఒచ్చినందుకు బాగా డిసప్పాయింట్ అయ్యారని..
 మీకు గనక సినిమా నచ్చుంటే నన్ను తిట్టుకోకండి.. ఎందుకంటె అంత హైపు ఇస్తే సినిమా అంచనాలు అందుకోవడం  కష్టం. పైగా ఇది జూనియర్ NTR ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు. కధ బానే వున్నా.. కధనం లో ఎక్కడో లోపం. మొదటి సగం పరవాలేదు అనిపించినా... రెండో సగం మెప్పించలేదు.. సినిమాటోగ్రఫీ చాలా బావుంది.. కత్తి లాంటి తమన్నా .. కాట్రవల్లి గా కూడా మెప్పించింది.. హీరో మేకప్పు చాలా అధ్వాన్నం గా వుంది, పైగా రంగుల దుస్తులు మన ఊసరవెల్లి కి నప్పలేదు.. ఏదో గొప్పగా ఊహించుకుంటే CLIMAX కుర్చీ తో కొంచెం వెటకారం అనిపించింది. డాన్సులు గానీ, ఫైటులు గానీ హీరో రేంజ్ లో లేవు. పాటలు బావున్నాయి.  ఎంతైనా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటే హీరో కనీసం ఫాన్సు ని మెప్పించచ్చు.. మళ్ళీ మళ్ళీ హాలుకి రప్పించావుచ్చు. ఇలాంటి సినిమాలు ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాలి.. ఇలాంటి రివ్యూ చదివాక సినిమా చూస్తే పరవాలేదు అనిపిస్తుంది.. కానీ నాలా పద్దెనిమిది ఒందల ప్రింటులని, ఇరగదీస్తుందని... చొక్కా చించుకుని వెళ్తే... మీ అంచనాలకు తగ్గట్లు ఉండదు.

14, సెప్టెంబర్ 2011, బుధవారం

సమర సింహా రెడ్డి మీరు సల్లంగుండాలే

మొన్న ఆ మధ్య ఒక పోస్ట్ లో తెలుగు సినిమాలలో మంచి పాటలు ఈ మధ్య రావట్లేదు అని రాసినప్పుడు, నాకు విజయ క్రాంతి గారు "నగరం నిద్ర పోతున్న వేళ" పాటలు వినమని సలహా ఇచ్చారు. ఒక రోజు డ్రైవ్ లో వుండగా వింటుంటే ఆ సినిమాలోని గోరటి వెంకన్న గారు రాసి, పాడిన ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది. ఈ సినిమా నేను చూడలేదు కానీ అసలు బాలేదని విన్నాను. ఈ పాటకి సినిమాలో సందర్భం ఏమిటో అని కుతూహలంతో కొంచెం చూస్తే.. ఇది కేవలం టైటిల్స్ అప్పుడు గోరటి వెంకన్న కోసం ఒక సీన్ పెట్టి నట్లు అనిపించింది. ఈ పాట ఆ సినిమాలో పెట్టి వేస్ట్ చేసారనిపించింది. సినిమాలో కొంచెం సాహిత్యం కూడా మార్చారు.. ఎందుకంటె పాటలలో రెడ్డి అని వుండటం వల్ల అనుకుంట. ఈ పాట సాహిత్యం ఫాక్షనిజం మూలంగా- ఫాక్షనిస్ట్ల అనుచరుల జీవితం ఎలా వుంటుందో కొత్త కోణంలో చెపుతుంది..
ఈ పాటని కేవలం సాహిత్యం, ఫీలింగ్ పరంగా వినండి.. చాలా బావుంటుంది. పాటలో కులం పట్టించుకోకుండా...

పాటకి లింకు:

సమర సింహా రెడ్డి మీరు సల్లంగుండాలే మీరు హాయిగుండాలే
భరత సింహా రెడ్డి మీరు బాంబు లియ్యాలే  మా వోళ్ళు బాట పట్టాలే
అరె చెన్నా కేశవ రెడ్డి .. భళా చెన్నా కేశవ రెడ్డి
మీరు చిటికలెయ్యాలే  మేమంత  చిందు తొక్కాలే  

మీ నెత్తి మీది గొడుగులం
మీ కాలి కింద చెప్పులం 
మీ చేతిలోని కత్తులం 
మీరు వుసుకో వుసుకో వుసుకో అంటే ఉరికె  వేట కుక్కలం 
మీరు కచ్చ కడితే.. మీరు కచ్చ గడితే
సొంత అన్ననైన కతం చేసే కొడుకులం
మీరు చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే..
మీ ఆఖరి బాబుకు అమెరికా వీస దొరకాలే
ఆడ సుక్కలు కొండాలే
మీ పెదబాబు ఎస్పీ అయ్యి లాటీ బట్టాలే
ఏ కేసులు లేకుండా మిమ్ము చూసుకోవాలే
కలకటేరు మీ అల్లులోలె  కాలు మోపాలే
అధికారమంతా మీ కావలి కుక్క లవ్వాలె
మా గొడ్లా గాసే కొడుకు. మా గొడ్లా గాసే కొడుకు 
మీ గొడ్డలందుకోవాలే
మీరెన్ని మెతుకులేస్తే మీరెన్ని మెతుకులేస్తే
వాడన్ని తలలు నరకాలే

చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే.. 
మీరు చల్లం గుండాలే ..బాబూ హాయిగుండాలే..

ఐదొందలిస్తే చెయ్యి చాపి అందుకోవాలే
ఐదేళ్ళు నరికి అప్పుడే  మీ చేతికియ్యలె
వెయ్యి నోట్ల కట్ట ఇస్తే కళ్ళ కద్దు కోవాలె
మా ఇంటి దీప మల్లె  మిమ్ము కోలుసుకోవాలే
మా చంటి పిల్ల చలి జ్వరముతో ఒనికిపోతున్నా
మీ కాపలంటే వేట కొడవలందుకోవాలే
పెళ్ళైన నెలకు ఆలి ఇంట్లో ఒంటి గుంటున్నా
మీ గడియ చుట్టూ రాత్రి పగలు గస్తీ కాయాలే  
మీరు బామ్బులిస్తే బంతులోలె ఇసురుకోవాలే
మీ మేలు కోరి మా నెత్తిన ఏసుకోవాలే

మీరు సభలు పెడితే లారిలేక్కి జైలు కొట్టాలె
పులిహోర పోట్లాలకై పోట్లాడుకోవాలే  
మీరు తెన్దారేస్తే పనికి మీరు తెన్దారేస్తే పని జరిగితే  మురిసి పోవాలె
పని జరగపోతే మా పానము పనము పెట్టాలె
రిగ్గింగ్ మేము వేస్తే మీరు గద్దేనేక్కలే
మీరు పదవులుంటే మేము మీ పంచనుండాలే

తన్నారీ తానీ ..అయ్యలో... ఓహ్ బాబులో.. పెద్ద దొరలో
అధికారము మీరే మా సాములు ....

హీరో లు మీ వేషమేసి హిట్టు కొట్టాలె
ఆ సినిమా సూసి మా వొళ్ళంతా సీటీ కొట్టలే
ఆ దేశనేతలై కీర్తి మీరు బొందాలే
కిరాయినంత బురదనింత మేము మొయ్యాలే
ఆ గాంధి నెహ్రు పక్కన మీ బొమ్మలుండాలే
పోలీసు స్టేసన్ల మా ఫోటోలుండాలే

బాబూ సల్లంగుండాలే బాబూ హాయిగుండాలే
మీరు సల్లంగుండాలే మీరు హాయిగుండాలే

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నువ్వొక జవాబు - నేనొక ప్రశ్న



నీ జీవిత పయనానికి గమ్యం నిర్దుష్టం
నాకు పయనమే జీవితమవ్వడం నా అదృష్టం

హద్దులలో సంచరించడం నీ గొప్పతనం
హద్దులు అధిగమించడమే నా అభిమతం

ఒడ్డించిన విస్తరి లాంటిది నీ జీవితం
విడదీయలేని చిక్కుముడి నా జీవితం

జీవితమనే ప్రశ్నకు నువ్వు జవాబైతే
జీవితానికే నేనొక ప్రశ్నను..


24, ఆగస్టు 2011, బుధవారం

నాకూ నా కూతురికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్


మా చిన్న అమ్మాయికీ నాకూ మధ్య చాలా కమ్యూనికేషన్ గాప్ వుంది. "నాకు ఆకలేస్తుంది", అని అది చెపితే అర్ధం చేసుకునే సీను మనకి లేదు. "నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు", అని నా కూతురు నాకు చెప్తున్నా దాని ఫీలింగ్ ఇది అని నేను గ్రహించట్లేదు. ఇలాంటి కమ్యూనికేషన్ గాప్ లని అధిగమించడానికి కలిసి కొంత టైం స్పెండ్ చెయ్యడం ద్వారా, మరియు చర్చల ద్వారా సాధ్యం అని చాలా మంది దగ్గర విన్నాను. టైం స్పెండ్ చెయ్యడానికి మనం వేరే వూరిలో వుద్యోగం వెలగబెడుతున్నాం. వీకెండ్ ఇంటికొస్తే ఒక పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, బండెడు చాకిరి.. కాబట్టి టైం ఎక్కువ కేటాయిన్చలేము. పోనీ చర్చల ద్వారా పరిష్కరించుదామంటే మా ఇద్దరికీ మధ్య ఒకళ్ళ గొడవ ఇంకొకళ్ళకు అర్ధం కాని పరిస్థితి.. అసలు కమ్యూనికేషన్ అన్నదే సరిగ్గా లేదు..

 అలాంటప్పుడే నేను నా చుట్టూ వున్న ప్రపంచంలో ఇలాంటి సమస్య ఎవరెవరికి వుంది అని ఆలోచిస్తుంటాను. మా అన్నయ్యకీ - నాన్నకీ మధ్య వుంది. నా చిన్నప్పుడు బాగా గుర్తు.. మా అన్నయ్య చాలా కష్టపడి చదివే వాడు. వాడి భవిష్యత్తు గురించి మా నాన్నకి చాలా స్కీములు ఉండేవి. ఆ రేంజ్ లోనే వాడి డిమాండ్స్ ఉండేవి. కొత్త కామెల్ GEOMETRY బాక్స్, కొత్త బుక్స్, కొత్త సైకిల్, కొత్త మోపెడ్ అన్నీ కొత్తవే.. మనకేమో అన్నీవాడు వాడి వోదిలేసినవి. ఎంత అరిచి గీ పెట్టి అన్నాహజారే లా అన్నయ్య తో సమాన హక్కుల కోసం నిరాహార దీక్ష చేసినా జీవితంలో ఒక నటరాజ్ GEOMETRY బాక్స్ తప్ప ఇంకేమి సాధించుకోలేదు.  అలాంటి తండ్రీ కొడుకుల మధ్య పెద్దగా మాటలు వుండవు. ఎప్పుడో ఒకటో రెండో మాటలు అవసరం వుంటే మాత్రమే మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్. తండ్రి ఆరోగ్యం గురించి కొడుకు ఆరా అడగలేనంత - కొడుకు ఆర్ధిక పరిస్థితి గురించి తండ్రి వివరాలు అడగలేనంత కమ్యూనికేషన్ గాప్.
ఇలాంటి తండ్రీ కొడుకులు మన చుట్టు పక్కల చాలా మంది వుంటారు.

  • పించను లేని తండ్రి నెలకి కనీస అవసరాలు ఖర్చు ఎంతో అడిగి, అది పెళ్ళానికి తెలియకుండా తండ్రికి ఇవ్వలేనని చెప్పలేనంత  కమ్యూనికేషన్ గ్యాప్.
  •  "ఆపరేషన్ చేయించుకో నేను దగ్గరుండి చూసుకుంటా", అని అనారోగ్యంతో వున్న తండ్రికి కొడుకు ధైర్యం చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్.
  • "అమ్మ కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను కానీ నీ అవమానాలు భరించలేను", అని నిత్యం అవమానించే ఆస్తి వున్న తండ్రికి, అంతస్తు లేని కొడుకు చెప్పలేనంత కమ్యూనికేషన్ గ్యాప్. 
  • "నా ఆస్తి నీకే ఇస్తాను. కానీ నన్ను, నా  భార్యని వృద్ధాప్యంలో సరిగా చూసుకో", అని ఆస్తి వుండి, కొడుకు ప్రేమ సంపాదించని  తండ్రి .. తన కొడుక్కి చెప్పలేని.. కమ్యూనికేషన్ గ్యాప్. 
  • "పిల్లలని నాలుగు రోజులు మీ దగ్గర ఉంచడానికి నా భార్యని ఒప్పించలేను", అని విదేశాల నించి ఒచ్చిన కొడుకు, తల్లి తండ్రులకి చెప్పలేని కమ్యూనికేషన్ గాప్.
  • "నా కోసం కాకపోయినా ఆస్తి కోసమైనా నా దగ్గరికి మీరు ఒస్తారు, అందుకని ఆస్తి పంచట్లేదు", అని డబ్బున్న తండ్రి వాటా కోసం ఇంటి కొచ్చి డిమాండ్ చేసే పిల్లలకు చెప్పలేనంత  కమ్యూనికేషన్ గ్యాప్. 

ఇవన్నీ కేవలం తండ్రీ కొడుకుల మధ్యన నాకు తెలిసిన ప్రపంచంలోని ఉదాహరణలు మాత్రమే. "నీకోసం గుండె కోసిస్తానమ్మా", అని కబుర్లు చెప్పి .. అనారోగ్యంతో ఉన్న తల్లిని తన ఓదార్పు కోసం మాత్రమే కాల్ చేసి.. తల్లి కోసం కాకుండా పెళ్లి కోసం ఇండియా వెళ్ళే కొడుకులు. ఇలాంటి కధలు ఎన్నో.. ఎన్నెన్నో...

అయితే నాకూ నా చిన్న కూతురికీ మధ్య వున్న కమ్యూనికేషన్ గ్యాప్ వీటంత సీరియస్ కాదని, ఇవన్నీ ఆలోచించాక నాకు అనిపించింది. దాని వయసు రెండు నెలలు.. కొంచెం వీకెండ్ సిరి (మా పెద్ద అమ్మాయి), నేను కలిసి కాస్త ట్రై చేస్తే సాహితి (మా చిన్నమ్మాయి) భాష కూడా (అదే ఏడుపుని బట్టి విషయం కనిపెట్టడం) అర్ధం అవుతుంది. ఆల్రెడీ సిరి కొంచెం దాని ఏడుపుని DECODE చేసే ప్రయత్నం చేస్తోంది. సాహితి ఎడ్చినప్పుడల్లా  "MAY BE WE NEED TO CHANGE HER DIAPER ".. అని.  DIAPER మార్చిన తరవాత ఏడుపు తగ్గకపోతే "SHE NEEDS మిల్క్" అనీ హడావిడి చేస్తూ వుంటుంది. సిరి సహాయంతో నాకూ-సాహితీకి వున్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోవచ్చు అనిపిస్తోంది. కానీ నా చుట్టూ వుండే మనుషుల మధ్య  కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా పూడ్చాలి అన్నదే పెద్ద సమస్య.

వృద్ధాప్యం లో అవసరమైన ఆసరా కోసం- పిల్లలని నిలదీస్తే పెద్దరికం కాపాడుకోలేమని తండ్రులు ముందడుగు వెయ్యలేకపోయినా.. పిల్లలు ఒక అడుగు ముందుకేసి.. వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఈ  కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుందేమో.. కానీ మనం చెప్తే విన్టారంటారా????


11, ఆగస్టు 2011, గురువారం

ప్రేక్షకులని హాలు నుంచి బయటకు పరుగెత్తించిన దడ

నాలాంటి ఒక సినిమా పిచ్చోడు ఆఫీసు లో ఆలస్యంగా పని చేసి... మళ్ళీ పొద్దున్నే ఆఫీసు పని పెట్టుకుని కూడా...  యాభై మైళ్ళు వెళ్లి చెప్పిన టైం కంటే గంట ఆలస్యంగా సినిమా వేసినా, సరి పెట్టుకుని ఆశగా సినిమా చూస్తే... అరగంట కి హాలు లో పదో వంతు జనాలు జంపు. నా జీవితంలో హాలులో నేను పూర్తిగా చూడకుండా బయటకు ఒచ్చిన సినిమాలు ఒకటో రెండో.. అలాంటి నేను గంట తరవాత పాటకి ఇంటికి వెళ్ళిపోతున్న మూడొంతుల మంది జనాలతో పాటూ .. బయటకి పరిగెత్తా.. అది ఈ సినిమా పరిస్థితి..



ఈ సినిమా రివ్యూ రాయడం అనవసరం.. కేవలం ఈ సినిమా కి జనాలు బలి కాకూడదని నేను చూసిన గంట సినిమాలో నా OBSERVATIONS.
  • సినిమాలో అసలు సహజత్వం లేదు 
  • కాజల్ ని అస్సలు చూడలేము.. MAKEUP చాలా బాడ్. కళ్ళు ఉబ్బినట్లు- మొహం మీద జాలీ పేస్ పౌడర్ రెండు అంగుళాలు మన్దమ్ కొట్టినట్లు ఉంది.. కాజల్ కనిపిస్తే జనాలు తల కొట్టుకున్నారు సినిమా మొదలైన పది నిమిషాలకు.
  • కామెడీ ఆర్టిస్ట్ లని పెట్టి మనం చదివిన కుళ్ళు జోకులని సినిమాలో జొప్పించే ప్రయత్నం చాలా పేలవంగా వుంది 
  • చైతన్య ఆక్షన్ సీన్ లకి అస్సలు పనికి రాడు అని సినిమా మొదట్లోనే నిరూపించేస్తాడు
  • సినిమా అమెరికాలో మొదలవుతుంది.. ఎందుకో మనకి అర్ధం కాదు.. 
  • సీన్ లన్నీ అతుకుల బొంతలా కలిపి కుట్టినట్లు వుంటాయి
  • చైతన్య డాన్సు అయితే అసలు నేటి హీరోల తో చూస్తే వేస్ట్ . ఇంకా చెప్పాలంటే నిన్నటి తరం కన్నా కూడా వేస్ట్ 
నాకు అనిపించిన ఒకే ఒక పాజిటివ్ - సినిమాటోగ్రఫీ. అది కూడా సినిమా మొదట్లో అనిపించింది.. కానీ ఎందుకో క్లోజ్ షాట్స్ లో ఎక్కడో తేడా జరిగిందని తర్వాత తెలిసిపోతుంది..

నాతో పాటు తిట్టుకుంటూ బయటకు ఒచ్చిన జనాల్ని చూస్తే అనిపించింది దీనికి కరెక్ట్ ట్యాగ్ లైన్..

దడ... ప్రేక్షకులకు టికెట్ కొన్నందుకు..  తప్పకుండా హాలు నుంచి బయటకు పరిగెత్తించే...

ఇమేజ్ సోర్సు: wallpapers.oneindia.in

9, ఆగస్టు 2011, మంగళవారం

జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే




ఈ మధ్య కాలంలో ఒక డజను కొత్త సినిమా పాటలు విన్నాను. చాలా మటుకు మళ్ళీ ఇంకోసారి విందాం అనిపించలేదు, ఒక్కటి తప్ప. వెంటనే లిరిక్ నచ్చేసి మళ్ళీ వినాలని అనిపించిన సాంగ్స్ కందిరీగ సినేమాలోవి.

ఈ పాటకి సాహిత్యం భాస్కరభట్ల .. పాడింది రంజిత్.
రాగా ద్వారా వినాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే
దండేసి పొగిడేరా నువ్వు ఫ్రీగా అన్నీ ఇస్తే
కాళ్ళ మీదే పడి పోరా జాలి గానీ చూపిస్తే
నువ్వు టెంప్ట్ ఐపోతే నీ బతుకు బస్ స్టాండ్ రో

ఎందుకలగా ఎందుకలగా
నువ్వు బెండ య్యవో తేడా తేడా
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
ఎహ నాలా బ్రతికై ఎడా పెడా
అలగలగా అలగలగా
ఈ బెండుకు నేనే దడా దడా

జెంటల్మన్ అంటారే పదిమందికి హెల్పే చేస్తే

ఆడాళ్ళకే రా  ఉంటాడి క్రేస్
కానట్టెర అంతంత ఫోసు
లవ్ యూ అంటే లాగెత్తుకొచ్చి పడిపోరే ఏ రోజు
ప్రేమించవే ఓ సారి అంటూ
పదే పదే తిరిగితే చుట్టూ
సారీ అంటే సడన్ గా నువ్వే ఐపోవా పేషెంట్
నువ్వు దగ్గరవ్వా లనుకుంటే వాళ్ళు దూరం పెడతారు
ఎెహా నెగ్లెక్ట్ చేస్తే మాగ్నెట్ లా పరిగెత్తుకు ఒస్తారే
ఈ అమ్మాయిలంతా రివర్స్ గెరేరో

చెప్పిందల్లా వినొద్దు బాసు
తోచిందేదో చెసెయ్యి బాసు
ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఇస్తాడు లెక్చర్స్
మోకాళ్ళళ్లో దాచేసుకోక
వాడాలీరా మెదడు ని బాగా
ప్రతీక్షణం పక్కోడి సలహా వింటావా గతిలేక

ఎవడెవడో చెప్తే వినకంద్రా అని మొత్తుకు చెపుతుంటే
గొర్రెల్ల నా మాటింటూంటే ఆది నా తప్పేమీ కాదే
ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రో

ఎందుకలగా ఎందుకలగా
నువ్వు మళ్లీ మొదటికీ రావోద్డురో
ఇప్పుడెలాగా ఇప్పుడెలాగా
పనికొచ్చే పనులే చూస్కోండీరో
అలగలగా అలగలగా
మల్లడిగారంటే తంతానురొ

ఇదొక్కటే కాదు.. మిగిలిన పాటలు కూడా బానే వున్నాయి ఈ సినిమాలో.

4, ఆగస్టు 2011, గురువారం

అతడు... అమ్మ కాలేడు..

చంటి పిల్లలని పెంచడం మొగాళ్ళ తరం కాదు. ఏ మగాడైనా కష్టపడి వండి పెట్టచ్చు, తిండి పెట్టచ్చు, జడ వెయ్యచ్చు, జో కొట్టచ్చు, పాట పాడచ్చు, ఎత్తుకుని మోయ్యచ్చు, చందమామని చూపించచ్చు. ఇన్ని చేసినా కాని, "అమ్మ లేకపోయినా పరవాలేదు నువ్వు వున్నావుగా..." అని ఏ నాన్ననీ అనుకోలేము. ఎందుకంటె "అమ్మ అంటే అమ్మే!". ఈ విషయంలో నాకు నా స్నేహితులకీ మధ్య ఎప్పుడూ ముష్టి యుద్దలయ్యే రేంజ్ గొడవలు జరుగుతూ వుంటాయి.. భార్య భర్తల మధ్య మనస్పర్ధల్లో తల్లిని కోల్పోయిన పిల్లల్ని పెంచే తండ్రులని .. తల్లిని దూరం చేసి పిల్లల్ని పెంచాలనుకునే తండ్రుల్ని.. నేనెప్పుడూ ఈ విషయంలో ప్రశ్నిస్తూ వుంటాను.

ఎందుకంటె నాకే చాలా సార్లు తెలుస్తూ వుంటుంది నా పిల్లలని పెంచేటప్పుడు. లాస్ట్ మంత్ నా రెండో కూతురుని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నేను రాకపోతే కుదరదని మా ఆవిడ పట్టు పట్టింది. సిరి పుట్టే ముందు అన్ని డాక్టర్ విసిట్స్ కీ ఒచ్చేవాడివి, సాహితి (మా రెండో కూతురు) ని కనే ముందు ఒక్క విసిట్ కి కూడా రాలేదు... అని చెప్పి ఆఫీసు పనిలో వున్నా సరే కుదరదని చెప్పి నన్ను బయలుదేర తీసింది. అప్పటికి సాహితి పుట్టి నాలుగు రోజులే అయ్యింది. అప్పటికి సాహితీ పెంపకంలో నా పాత్ర - దూరం నించి ఈల వేసి పలకరించడం .. మహా అయితే వేళ్ళతో బుగ్గలు నిమరడం మించి పెద్దగా సాహితిని ఎత్తుకున్నది లేదు. ఆసుపత్రినించి ఇంటికి ఒచ్చేముందు కార్ సీట్ లో పెట్టడానికి మాత్రం రెండు చేతులతో పట్టుకుని సీట్ లో పెట్టి ఇంటికి తెచ్చానంతే.

 తీరా మేము ఆసుపత్రి దగ్గరికి ఒచ్చేక నాకు కూడా అదే టైం కి అప్పాయింట్మెంట్ వుందని పిల్లని నాకు ఒదిలేసి మధ్యలో తన డాక్టర్ ఆఫీసు దగ్గర దిగిపోయింది. పక్కన మా ఆవిడ ఉంటుందనే ధైర్యంతో బయలుదేరిన నేను, ఒక్కడినీ తీసుకెళ్ళడానికి మానసికంగా తయ్యరయి.. "ఆ! ఏముంది.. మహా అయితే కార్ సీట్ తో సాహితిని మోసుకేల్తే సరిపోతుంది, మిగిలింది వాళ్ళే చూసుకుంటారు"  అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళాక నరసమ్మ (దాని ఎంకమ్మ)  పిల్లని తీసి బల్ల మీద పెట్టమంది. అదీ మామూలుగా కాదు, DIAPER తీసి. అప్పటిదాకా సరిగా ఎత్తుకోని నాకు రోజుల పిల్లని ఎత్తుతుంటే ఒకటే టెన్షన్. దానికి తోడు ముద్దుగా సాహితీ నిద్రపోతోంది. అసలే మూడు నెలలు ఒస్తే గాని మెడ నిలవదు అని సిరి చిన్నపిల్ల అప్పుడు మా అమ్మ చెప్పిన విషయం గుర్తు. LION KING సినిమాలో SIMBA ని RAFIKI Nపట్టుకున్నట్లు రెండు చేతులతో పట్టుకుని పైకి ఎత్తితే.. అసలు చేతులో బరువు అనిపించలా..

జాగ్రత్తగా ఎత్తి పడుక్కోపెట్టి  జారి పడిపోతున్దోమని నేను టెన్షన్ పడుతుంటే.. నా నిద్ర పాడు చేస్తావా అన్నట్లు కేర్ కేర్ మని ఏడుపు.. ఎలా ఊరుకోబెట్టాలో తెలియక కంగారు పడుతుంటే .. తొందరగా డ్రెస్సు
 DIAPER తియ్యమని నరసమ్మ పోరు. తీరా DIAPER తీసిన వెంటనే సాహితీ సుయ్యి మని సూ సూ చేసింది. ఇప్పుడెలా అని ఆలోచించి DIAPER కోసం వెతుకుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది.. మనం DIAPER బాగ్ తేలేదని. అక్కడున్న నాప్కిన్స్ తో క్లీన్ చేసి సాహితిని బరువు కొలిచే మెషిన్ మీద పెట్టి, మళ్ళీ తెచ్చి బల్ల మీద పెట్టి, సాహితీ ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంటే డాక్టరమ్మ ఒచ్చింది. పరీక్షల పేరుతో కడుపులో నొక్కి, కాళ్ళూ చేతులూ ఊపుతుంటే సాహితీ ఏడుపు పిచ్ పెంచింది. పరీక్షలు ముగించిన డాక్టరమ్మ, "అంతా బావుంది" అని నాకేసి అదోలా చూసి (ఆ చూపులో పసి పిల్ల మొదటి విసిట్ కి మగాడు రావడమేమిటి తల్లిని తీసుకురాకుండా అనే అర్ధంతో), ఇప్పుడు నీ తిప్పలు నువ్వు పడు అన్నట్లు కనీసం సాహితీ ని ఊరుకోబెట్టే ప్రయత్నం చెయ్యకుండా వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న ఆ నరసమ్మని బతిమాలకుని నాలుగు wipes ఒక DIAPER అడుక్కుని తంటాలు పడుతూ సాహితీని క్లీన్ చేసి DIAPER  వేసి డ్రెస్ చేశా. అయినా ఏడుపు పెరిగిందే గానీ కిన్చ్చిత్తైనా తగ్గలేదు. ఏమన్నా సాయం చేస్తుందేమో నని నరసమ్మ కేసి జాలిగా చూస్తుంటే.. అది చాలా కోపంగా నీకీ శాస్తి జరగాల్సిందే.. ఏడుపు ఆపెంతవరకూ ఈ గదిలోనే వుండు అన్న అర్ధం తో తలుపు మూసి పోయింది..

 ఇంక చూసుకో మన కష్టాలు.. పాలు పడదామా అంటే - సీసా DIAPER బాగ్ లో వుంది.. మన దగ్గర DIAPER బాగ్ లేదు.. ఎందుకు ఏడుస్తుందో తెలియదు.. సరిగ్గా ఎత్తుకుంటున్నానో  లేదో అని అనుమానం.  పోనీ మనకి తెలిసిన జోల పాడాలంటే - అది క్లినిక్ అయ్యె.. మనకి తెలిసిన విద్య ఈల ఒకటే... అది  వేస్తే ఏడుపు ఇంకా పెరిగింది ... ఆ టెన్షన్ కి ఈల రావడం మానేసి ఉత్తి గాలి బయటికొచ్చింది.. దాని ఏడుపు ఆపడం సంగతి అటుంచి నాకు ఏడుపొచ్చింది..

ఇంతలో నా కోసమే పంప బడ్డ దేవ కన్యలా, మా ఆవిడ తలుపు తీసుకుని ప్రత్యక్షం అయ్యింది. పాపం బుడ్డి గాడికి ఆకలనుకుంటా అని ఒల్లో పెట్టుకుని పాలు తాగించేటప్పటికి ఏడుపు టక్కున మాయమయ్యింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని.. ఎంతైనా అమ్మ అమ్మే.. ఎన్ని కబుర్లు చెప్పినా.. ఏ మగాడూ అమ్మ కాలేడు..అని మరోసారి అనుకున్నా.. అప్పుడు మటుకు మా ఆవిడ కూడా అమ్మతనంతో అమృత మూర్తిలా అనిపించింది...


అందుకే అమ్మ లేని లోటు లేకుండా చూసుకుంటా అనే నా స్నేహితులతో.. అలా చూసుకో గలరు అనే బరోసా ఇచ్చే వాళ్ళతో నేను ఎప్పుడూ బల్ల గుద్దేసి మరీ చెప్తూంటా "అతడు.. అమ్మ కాలేడు" అని...
  

13, జులై 2011, బుధవారం

నాన్నా! Don't Let Go



హడావిడిగా ఆఫీస్ కి బయలుదేరే నన్ను
"నాన్నా! నువ్వుండిపో"  అని ఆర్ధిస్తుంటే...


పని కెల్తే గాని పూట గడవని 
నా మధ్య తరగతి పేదరికం  నన్ను వెక్కిరుస్తుంది


ఆఫీస్ కి కాల్ చేసి 
"నాన్నా!!  ఈస్ ఇట్ ఫ్రైడే"  అని రోజూ అడుగుతూ అంటే  


ఎక్కువ డబ్బు కోసం దూరంగా వెళ్ళి చేసే ఉద్యోగంలో
ప్రతి నిమిషం నాకు పని భారం అనిపిస్తుంది 


ఫ్రైడే ఇంటికేళ్లే ముందు 
"నాన్నా! ఐ యాం వైటింగ్ ఫర్ యూ" అని నువ్వంటే 


అప్పుడే ఇచ్చిన పనిని వాయిదా వెయ్యలేని ఉద్యోగంలో ఇన్‌సెక్యూరిటీ ని
నా కోసం ఎదురు చూసే నీ కళ్ళు ప్రశ్నిస్తున్నట్లు వుంటుంది 



 సైకిల్ తొక్కుతుంటే వెనక పరిగెడుతూ ఆయాసంతో ఆగిపోయిన నన్ను 
"నాన్నా! Don't Let Go" అన్న నీ కేక 

జీవితమంతా జిమ్ ప్రోగ్రాం వాయిదా వేసే నాకు
నీకోసం నేను ఫిట్ అవ్వాలని గుర్తు చేస్తూ ఉంటుంది
 
Image from jeannewillis.com


19, జూన్ 2011, ఆదివారం

నేటి తండ్రులు ఆకాశమంత లో ప్రకాష్ రాజులు, గులాబిలో చంద్ర మోహన్లు



వీకెండ్ ఇంటికొచ్చిన నాకు మా అమ్మాయి ఒక SURPRISE అని చెప్పి, పైన చూపించిన పుస్తకం లాంటిది చేతిలో పెట్టింది. అప్పటికి FATHER 's డే ఇంకా ఒక రోజు వున్నా, నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని ఆత్రం కొద్దీ నన్ను చూసిన వెంటనే వాళ్ళ అమ్మ వెంట పడింది. నాకు ఇప్పుడు అర్జెంటు గా నేను ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ దాచావో వెతికివ్వు అని పీడించి మరీ వెతికిచ్చే దాకా ఊరుకోలేదు. ఆ తరవాత ప్రతి పది నిమిషాలకి నాకు ఒక ముద్దు పెట్టి, విష్ చెయ్యడం మొదలు పెట్టింది.

 అప్పుడు నేను కూడా మర్చిపోకుండా నాన్నకి విషెస్ చెప్పాలని అనుకున్నాను. చూసారా మనకి పిల్లలు పుట్టాకే మన అమ్మ నాన్నలు విలువ ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు తండ్రుల రోజు గురించిన ఆలోచనలో పడ్డాను. ఇంతకు ముందు తరంలో ఇలా తండ్రుల రోజు లాంటి ఆచారాలు లేవు. అసలు పిల్లల పెంపకంలో తండ్రులు అంత పెద్ద పాత్ర పోషించే వాళ్ళు కాదు. నాకు తెలిసి తండ్రి అంటే భయమే వుండేది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ మా తరం వాళ్లకి తండ్రులంటే సిగ్గుతో కూడిన భయంలాంటి గౌరవం అనుకోండి అతడు సినిమాలో చెప్పినట్లు.
అలాంటి తండ్రుల నించి ఈ తరం తండ్రులని చూస్తే చాల ఆశర్యం వేస్తుంది. చాల మంది మగాళ్ళు ఇంటి పనులు చేస్తారు ఈ రోజుల్లో, దానితో పాటు ఇంచుమించు తల్లి చేసే పనులన్నే చేస్తారు. ఈ రోజుల్లో తండ్రులు తల్లులు అంత కాకపోయినా, చాలా బాధ్యత తీసుకుంటున్నారు. నేనైతే అలాంటి తండ్రులను చాలా మందిని చూస్తున్నాను. ఇలాంటి తండ్రులందరికీ ఈ FATHER 's DAY సందర్భంగా విషెస్ చెప్తున్నాను.

ముఖ్యంగా.

  • పిల్లల diaper మార్చే తండ్రులు
  • అన్నం తినిపించే తండ్రులు
  • హోం వర్క్ చేయించే తండ్రులు
  • స్నానం చేయించే తండ్రులు
  • ఒంట్లో బాలేకపోతే సెలవో, వర్క్ ఫ్రం హోం అనో పక్కునుండే తండ్రులు
  • సినిమా మధ్యలో బాత్రూం కి తీసుకెళ్ళే తండ్రులు (అది కూడా ఆడ పిల్లలని)
  • సైకిల్ తొక్కుతుంటే వెనక పట్టుకుని పరిగెత్తే తండ్రులు
  • చొక్కాకి ముక్కు చీమిడి తుడిచేసే తండ్రులు
  • ఉప్పు మూట ఎక్కించుకుని షాపింగ్ మాల్ లో తిప్పే తండ్రులు

 
మారుతున్న కాలంతో పాటుగా, పెరుగుతున్న బాధ్యతలను భుజాన వేసుకుని, "మా నాన్న నాకు ఇలా చెయ్యలేదు కదా?" అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా చేసుకుపోయే...

నేటి నాన్నలూ - మీకు నా జోహార్లు..

ఇలాంటి చిన్న చిన్న గిఫ్టులు ఒచ్చినా రాకపోయినా, ఆఫీసు నించి అలసిపోయిన మీకు అందిన చిన్న చిన్న ముద్దులు, ఎదురు పడగానే వెదజల్లే చిరునవ్వుల సిరులు మీ కష్టాలకు ప్రతిఫలాలు.


మీరంతా ఆకాశమంత లో ప్రకాష్ రాజులు, గులాబిలో చంద్ర మోహన్లు.

2, జూన్ 2011, గురువారం

Toy Story - Princess Camera

నాకు చిన్నప్పటి నించీ కెమెరా కొనుక్కోవాలని సరదా వుండేది. మనం తీర్చుకోలేని సరదాలన్నీ మన పిల్లలకు తీర్చే బలహీనత అందరి తండ్రుల్లాగే నాకు కూడా వుంది. అందుకే సిరి కి మూడేళ్ళ వయసప్పుడే ఈ కెమెరా కొన్నాను. దీనితో ఒక్కో సారి స్కూల్ కెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ పిక్చర్స్ తీస్తుంది. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా బోలెడు పిక్చర్స్ తీసింది అందరికీ. ఇండియాలో ఇంత చిన్న వయసులో దానికి కెమెరా ఎందుకని అడిగిన వాళ్ళు లేక పోలేదు అనుకోండి. కెమెరా అంటే ఇష్టం తో పాటు, ఇది ప్రిన్సుస్స్ కెమెరా అవ్వడంతో సిరి కూడా ఈ గిఫ్ట్ బానే ఎంజాయ్ చేసింది. ధర కూడా అంత ఎక్కువేమి కాదు. అందరికీ "సే చీస్" అని మా అమ్మాయి ఫోటో తీస్తుంటే అబ్బో నా కూతురు పెద్ద సినిమాటోగ్రఫర్ ఐపోనట్లు నాకో చిన్న కల.

మీకు వెంకట్ రెడ్డి చిర్ర కనిపిస్తే గుండు మీద ఒకటి మొట్టండి.


మీకు వెంకట్ రెడ్డి చిర్ర కనిపిస్తే గుండు మీద ఒకటి మొట్టండి. ఎందుకని అడిగితే నా పేరు చెప్పండి. నా ఇ-మెయిల్ ఇవ్వండి. 

ఎందుకంటె వీడి ఆచూకీ కోసం నేను వెతుకుతూ .. ఎక్కడైనా దొరుకుతాడని అంతగా ఎదురు చూస్తున్నా.
పాత ప్రియురాలిని వెతుకుతున్న ప్రియుడు లాగా..
అప్పు ఎగ్గొట్టిన వాడిని వెతికే అప్పిచ్చిన వాడి లాగా ....
చిన్న నాటి స్నేహితుడిని వెతికినట్టు తెగ వెతుకుతున్నా.

అసలు ఎవడీ చిర్రా.. వీడు దొరక్కపోతే నీకెందుకు ఇంత చిర్రాకు అని అడిగితే అంత పెద్ద కారణాలేమి లేవు..
వీడు నేను కలిసి మహా అయితే ఒక సంవత్సరం స్నేహితులుగా వున్నాము.. వీడికీ నాకూ పెద్దగా కామన్ అలవాట్లు కానీ, అభిప్రాయాలు గానీ లేవు. కానీ చందు గాడికి నచ్చాడు. నాకు పక్క వాడిని దోచేసే మనుషుల మధ్యలో ఎవడన్న అమాయకుడు తగిలితే వాడికి ఫ్రెండ్ ఐపోయి వాడికి నేను ఫ్రెండ్ అని వాడిచేత అనిపించేసి.. వాడిని మబ్బులా కమ్మేయటం అలవాటు. పైగా నాకు ఒక్క సారి ఫ్రెండ్ అయితే వంద ఏళ్ళకు ఫ్రెండ్ అయినట్లే. నాకు ఫ్రెండ్ అయితే వాళ్ళు అన్యాయంగా లైఫ్ లాంగ్ లాక్ హో గయా. మనల్ని విడిపించుకోవడం కష్టమో, వదిలేస్తో నష్టమో, స్నేహం అంటే ఇష్టమో లేక వాళ్ళ ఖర్మమో.. అలా అయిపోతుంది అంతే..

వీడూ నేను కలిసి పెంటా ఫోర్  లో ఒక క్రాష్ కోర్సు చేసాము. ఆ తరవాత కలిసి ఉద్యోగ ప్రయత్నం, COMBINED  స్టడీ, ఆ ప్రయత్నంలో మా ఇంట్లో కొన్ని రోజులు వాడు, వాడింట్లో కొన్ని రోజులు నేను వున్నాము. వీడిది విజయవాడ. వీడో పెద్ద అజహరుద్దీన్ ఫ్యాన్. (ఇంకా అలాగే వుండుంటాడని నా అనుమానం) ఆ తరవాత ఇద్దరం అమెరికాలో చేరాము. నేను ఫస్ట్ కార్ కొన్నప్పుడు నా కార్ పక్కన ఫోటో తీయించుకుని అది వాడి కారే అని ఊర్లో అందరినీ నమ్మిన్చానని కూడా చెప్పాడు. అవును మరి నా గ్యాంగ్ లో ఫస్ట్ కార్ నేనే కొన్నాను. పైగా స్పోర్ట్స్ కార్ టూడోర్ తీసుకుంటుంటే, వెనక కూర్చునేది మేము కాబట్టి నాలుగు డోర్ లు వుంది తీరాల్సిందే అని పట్టు బట్టి మరీ కొనిపించారు.
ఆ కార్ చూసి అందరూ ఇంత చిన్న స్పోర్ట్స్ కార్ ఎవడైనా ఫౌర్ డోర్ కొంటాడా అని పిలిచి మరీ వెటకారం చేసేవారు.
అప్పుడు వీడు పోకప్సీ న్యూ యార్క్ దగ్గరలో పని చేసేవాడు (అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో). ఆ తరవాత అసలు టచ్ లోనే లేడు. ఇప్పటికీ పెంటా ఫోర్ బాచ్ లో ఎవరితో మాట్లాడినా, "వీడు తగిలాడా?" అని అడుగుతూ ఉంటా.
ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న సాఫ్ట్వేర్ రంగం లో, అందునా అంతరజాలం లో జల్లెడ పట్టే అవకాసం వున్న ఈ రోజుల్లో వీడిని పట్టుకోలేక పోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడు ఎక్కుడున్నా సంతోషంగా ఉన్నాడని తెలిస్తే కొంచం నా మనసు కుదుటపడుతుంది.

వీడు మీకు తెలిస్తే నాకు ఆచూకి చెప్పగలరు..
కలిస్తే నెత్తి మీద గట్టిగా మొట్టగలరు ..

WOH AJANBEE THOO BHEE KABHEE AAWAAZ DE KAHEE SE ......

1, జూన్ 2011, బుధవారం

Toy Story - Pete the Parrot


I wanted to post Siri's favorite toys along with comments. This is my first post in the Toy story series. I got this little bird called
"Pete the Parrot". It is cute and repeats every thing twice after you say it. She was scared when she was one year old, but later fell in love with it. A great toy for kids of 2+ years. Makes a great gift.



10, మే 2011, మంగళవారం

స్థితప్రజ్ఞున్ని అయిపోలేదు కదా?


కంటి మీద కునుకు రావట్లేదు
ఆఫీసు పని మీద మనసు పోవట్లేదు

ఎవడు తిట్టినా కోపం రావట్లేదు
పక్క వాడు ఎదిగినా అసూయ కలగట్లేదు

డబ్బులు తక్కువైనా గాభరా పడట్లేదు
అనారోగ్యాలెక్కువైనా అసలు మూలగట్లేదు

వొత్తైన జుట్టు కత్తిరించట్లేదు
మాసిన గడ్డం గీకేయ్యట్లేదు

బాకీ ఎగ్గొడితే తిట్టట్లేదు
మోసం చేసినోని కొట్టట్లేదు

విజయమొస్తే పొంగిపోవట్లేదు
పరాజయాలతో కున్గిపోవట్లేదు

అసలు నాకేమయ్యింది
కొంప దీసి స్థితప్రజ్ఞున్ని అయిపోలేదు కదా?

1, మే 2011, ఆదివారం

ఇది నిజం... ఒసామా మరణించాడు...

FLASH న్యూస్:

ఇది నిజం... ఒసామా మరణించాడు...

కావాలంటే టీవీ చూడండి..

28, ఏప్రిల్ 2011, గురువారం

100% Love పాట +-X=Infatuation


సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 100 % లవ్. ఆర్య-2 పాటలు ఎంత సూపర్ హిట్టో మనకు తెల్సిందే.  దానికి కూడా మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాదే. వీళ్ళిద్దరి కలయికలో  ఒస్తున్న ఈ సినిమా పాటలు హైప్ కి తగ్గట్టే బాగా అనిపించాయి. అందులో బాగా ఇంప్రెస్స్ చేసిన పాట Infatuation . చంద్ర బోస్ రాసిన ఈ పాట అద్నాన్ సామీ పాడారు. ఈ పాట కాలేజీ పిల్లలని అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అందులోనూ చిన్నప్పుడు తెలుగు మీడియం లో చదువుకున్ననాలాంటి వాళ్లకి మరీ మరీ నచ్చుతుంది. మీరేమీ "నువ్వేంటి ?కాలేజీ కుర్రాడితో కంపారిజన్ ఏంటి రా?", అని మనసులో అనుకో అక్కరలే. నేనూ ఒక సినిమా హీరో అయ్యుంటే బాలయ్య లాగ, వెంకి బాబు లాగ, నాగ బాబు లాగ పుస్తకం పట్టుకుని కాలేజీ కి వెళ్ళిన scenelo నటించే వాడిని,   మీరు కూడా వేరే దారిలేక సినిమా చూసేవారు.

సరే నా గురించి పక్కన పెట్టి పాట విషయానికొద్దాము. బహుసా ఈ పాట రాసిన చంద్ర బోస్, మ్యూజిక్ కొట్టిన దేవి శ్రీ, దర్శకుడు సుకుమార్ అందరూ ఇంజనీర్ లనుకుంట. ఈ సినిమా పాటలలో ఆ చాయలు కనిపిస్తాయి. కొత్త బంగారు లోకం స్కూల్(ఇంటర్ ఏమో)  ప్రేమ అయితే అందులో కళాశాలలో పాట ఎంత బావుందో దానికి ఒక మెట్టు ఎక్కువ ఇది. కాలేజీ ప్రేమ కాబట్టి ఈ పాటలో చంద్ర బోస్ లెవెల్  పెంచాడు.
ఇదిగో మీ కోసం కింద సాహిత్యం మరియు ఆ పాటకు లింకు.



Infatuation:

కళ్ళు కళ్ళు ప్లస్సు  వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటీ ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్‌ఫాచుయేషన్  |2|


ఎడమ బుజము కుడి బుజము కలిసి ఇక కుదిరె కొత్త త్రిబుజం  
పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం

సరళలేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతున్దోయ్ ఉష్ణం
                                                                       
                                         కళ్ళు కళ్ళు ప్లస్సు   ||


దూరాలకు మీటెర్ లంట భారాలకు కేజీ లంటా
కోరికలకి కొలమానం ఈ జంట

సెంటిగ్రేడ్ సరిపోదంట  farenheit  పనిచెయ్య దంట
వయసు వేడి కొలవాలంటే తంటా

లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్ధం కాదు ఏ సైన్సు కైనా

పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్ర్యావిటేషన్
పైన కింద తల కిందులవుతది ఇన్‌ఫాచుయేషన్

                                          కళ్ళు కళ్ళు ప్లస్సు  ||

సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోలు అమ్మాయంట రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట   రుణావేశం అమ్మాయంట   కలిస్తే కరంటే పుట్టే నంట
ప్రతీ స్పర్శ ప్రశ్నే నంట  మరో ప్రశ్న జవాబట ప్రాయానికే పరీక్షలంట  -ఓ

పుస్తకాల పురుగులు రెండంట ఈడు కొచ్చె నంట
అది అక్షరాల  చెక్కెర తింటూ మైమరచే నంట

                                          కళ్ళు కళ్ళు ప్లస్సు  ||
Song లింక్:

Song Source: http://www.raaga.com/
Special Thanks to SURI for telling me to listen to this movie songs.

27, ఏప్రిల్ 2011, బుధవారం

లాలీపాప్ దొంగతనం


నా కూతురిని ప్రతి సోమవారం కుమోన్ కి ఇంగ్లీష్ రీడింగ్ కి తీసుకెళ్తూ వుంటాను. అక్కడ దాని హోం వర్క్ అయ్యాక అక్కడున్న పెద్ద సీసాలోంచి లాలిపాప్ తీసుకుని బయటకు రావడం అందరు పిల్లల లాగే మా అమ్మాయికి అలవాటు. అయితే వాళ్ళ అమ్మ కోసం గడ్డి పూలు, నాన్న కోసం పూసలు లాంటివి దొరికితే తెచ్చి నీకోసం తెచ్చానని ఇవ్వడం నా కూతురికి అలవాటు. అలా అప్పుడప్పుడు ఒక లాలిపాప్ బదులు రెండు తీసుకుని ఒచ్చి"నాన్నా! నీ కోసం", అని నాకు ఇవ్వడం జరుగుతూంటుంది.

సాధారణంగా ఇంటి దగ్గర వుంటే కుమోన్ బాధ్యత నాదే. డే కేర్ నించి తీసుకొచ్చి కొంచెం తిండి పెట్టి కుమోన్ తీసుకెళ్ళడం, అది కూడా సోమ వారం కాబట్టి  కొంచెం హేక్టిక్.  ఆ హడావిడిలో నేను ఆ రోజు తినకుండా బయలుదేరాను. వెనక నించి మా ఆవిడ "నీకు ఆకలేస్తుంది కదా! డబ్బా కట్టివన్నా?" అంటుంటే ఆలస్యమైపోయిందని అలాగే బయలుదేరా. ఎప్పటి లాగే కుమోన్ ఐపోయాక నా కూతురు లాలిపాప్ కోసం సీసా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ కుమోన్ హెడ్, మిస్సెస్ పి (ఆవిడ పేరు పార్వతి) అక్కడే నిలబడి వుంది. నా కూతురు మిస్సెస్ పి ని గమనిస్తూ తన వైపు చూడట్లేదని నిర్ధారణ చేసుకుని రెండు లాలిపాప్ లు తీసింది. తీసాక చేతులు వెనక్కి పెట్టుకుని మిస్సెస్ పి ని దాటుకుని బయటకు ఒచ్చింది. ఇదంతా గమనిస్తున్న నేను నాకోచ్చే నవ్వుని ఆపుకుని "ఎందుకు నీ చేతులు వెనక్కి పెట్టుకుని ఒచ్చావు?" అని అడిగాను. "మిస్సెస్ పి చూస్తే ఒక్కటే తీసుకోవాలి అంటుంది డాడీ" అంది. "మరి ఒక్కటే తీసుకోవాలి కదా!" అన్నాను. "నీ కోసం డాడీ. నీకు ఆకలేస్తుందని", అని నా చేతిలో ఒక లాలిపాప్ పెట్టింది. అసలే ఆకలి మీదున్న నాకు దాని మాటతోటే సగం కడుపు నిండింది, నా కూతురు నాకోసం దొంగతనంగా తెచ్చిన లాలిపాప్ చప్పిరిస్తూంటే కడుపు మిగిలిన సగం నిండింది. కానీ మనసులో ఎక్కడో నేను బాధ్యత గల తండ్రిగా అలా చెయ్యకూడదని, క్లాసు పీకకుండా ఎందుకున్నానని ఆలోచించడం మొదలెట్టా.  



నిజానికి నేను చిన్నప్పుడు "సత్యమేవ జయతే", "ధర్మో రక్షతి రక్షితః","ఎల్లప్పుడూ సత్యమే పలుకవలెను", "దొంగ తనం మహా పాపం" లాంటి వన్నీ ఎంతో నిజాయితీగా పాటించేవాడిని. కానీ పెరిగే కొద్దీ అన్ని వేళల్లోనూ, అన్ని పరిస్థితుల లోను అల్లా వుంటే మనం బ్రతకలేము అని అర్ధం అయ్యింది.
చేసే పని సరయినది అయితే మార్గం ఎలా వున్నా పర్లేదు అనే మార్పు ఒచ్చింది. మంచి అనిపించింది (నా దృష్టిలో) చెయ్యాలంటే ఒక్కో సారి అబద్దమో, మోసమో చెయ్యక తప్పదు అనిపించేది. ముఖ్యంగా నా చుట్టూ ఉన్న కొంత మంది నిజాయితీ పరులు, సత్యవంతులు ఓడిపోతున్నప్పుడు వాళ్ళన్ని నిలబెట్టాలంటే ఏం చేసినా తప్పు లేదని నిర్ణయానికి ఒచ్చాను. పెళ్ళాం దగ్గర నిజాయితీ కోసం తల్లి తండ్రుల అవసరలాకి పనికి రాని కొడుకుల నిజాయితీ నాకు అక్కర్లేదని అనిపించింది. కొంచెం ఎక్కువ ఆలోచించినా నా కూతురుకి క్లాసు పీకకూడదని తీర్మానానికి ఒచ్చి, "నాన్న గురించి ఆలోచించినందుకు థాంక్స్, కానీ నువ్వు ఒక్కటే తీసుకో" అని మెత్తగా మందలించాను.

కానీ ఆలోచనలు అక్కడితో ఆగుతాయా.
"నాన్నా మా టీచర్ కళ్ళ జోడు విరిగిపోయిందట, కొని పెట్టు", అని వాల్మార్ట్ లో కళ్ళజోళ్ళ షాప్ చూపించి అడిగిన విషయం.
"మా టీచర్ దగ్గర డబ్బు లేవట, పిక్నిక్ అప్పుడు అందరి పిజ్జాలకి నువ్వు డబ్బులు కట్టు", అని డే కేర్ లో నా జేబులో చెయ్యి పెట్టిన విషయం....
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు "నీకోసం తెచ్చా", అని దాని బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టిన సందర్భాలు గుర్తుకొచ్చి...

మనసులో ఎక్కడో "మిస్సెస్ పి లాలిపాప్ దొంగిలించి నాన్నకు పంచినట్లు, రేపొద్దున్న ఆస్తులు దోచి అందరికీ పంచదు కదా? రాబిన్ హుడ్ సినిమాలోలా", అనిపించింది.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

నాన్న చెప్పని నిజాలు

నా చిట్టి తల్లికి..

      నీ చిన్నప్పుడు నీకు నాన్న చెప్పని కొన్ని నిజాలు.

  •  నాన్నసూపర్ మాన్ కాదు... నీకోసం అప్పుడప్పుడు అలా అయిపోతాడు (నొప్పులు లెక్క చెయ్యకుండా).
  • నాన్నకు మంత్రాలు తెలియవు... నోటితో చిత్ర విచిత్ర శబ్దాలు చేసింది నీకు దెబ్బ తగిలిందని నువ్వు మర్చిపోడానికి.. నాన్న మంత్రాలకు చింతకాయలు రాలవు... కానీ.. నీ మొహం మీద చిరునవ్వు తెప్పిస్తాయి...
  • నాన్న మంచి గుర్రం.. కానీ TILES మీద మోకాళ్ళ తో పరిగెత్తితే ఏ గుర్రానికైనా నొప్పులోస్తాయి
  • నాన్న ఓడిపోయే కుందేలు - నిన్ను నెగ్గించే తాబేలు (పాలు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు)  
  • నాన్న కధలన్నీ కట్టు కధలే.. నీకు చెప్పాలనుకున్నది జంతువుల కధలతో చెప్తాడు  
  • నాన్న చూసినవి అన్నీ నీకు తప్పు చెప్పేది (గుర్రాన్ని గాడిద అనీ, కుక్కని పండి అనీ) ఎందుకంటె, నువ్వు సరి చేసినప్పుడు నీకు తెలుసో లేదో తెలుసుకోడానికి.. తెలియకపోతే నేర్పడానికి..
  • నాన్నకి మేజిక్ రాదు.. ఏదీ మాయం చెయ్యలేదు.. అన్నీ నాన్న చేతిలోనో, చొక్కాలోనో వున్నాయి
  • నువ్వు సోఫా మీద గెంతేటప్పుడు చుట్టూ దిళ్ళు వెయ్యడం ఆట కాదు.. నువ్వు పడితే దెబ్బ తగలకూడదని.
  • నీ ఫ్రెండ్స్ అందరూ నాన్న ఫ్రెండ్స్.. అందుకనే నాన్న నిన్ను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి తీసుకెళతాడు..నీకు ఆడుకోడానికి కంపెనీ కోసం
  • నువ్వు క్రికెట్ ఆడితే నాన్న బౌలర్, base బాల్ ఆడితే pitcher , బాస్కెట్ బాల్ ఆడితే కోచ్, ఫుట్ బాల్ ఆడితే గోలీ....
  • నువ్వు నాన్న బుజాలు ఎక్కినప్పుడు, నీ వెనక నాన్న చేతులు నువ్వు పడిపోకుండా పట్టుకోవాలని.. నువ్వు ఒద్దన్నా సరే.. 
  • మన చేపలు వాల్మార్ట్ కి వెళ్ళలేదు... మన నత్త పారిపోలేదు... (అవన్నీ చచ్చిపోయాయి..)
  • నాన్నకి అందరిలాగే వుద్యోగం వుంది.. చాలా పని  వుంది, ఆఫీసు కష్టాలు వున్నాయి, బాధించే బాసులు వున్నారు ... అవన్నీ నీ కంటే ముఖ్యం కాదు.. అందుకే నాన్న ఆఫీసు లో లేడు.  నీతోనే వున్నాడు నీకు అవసరం ఐనప్పుడు...  
  •  నాన్నకి జడ వెయ్యడం రాదు, బెండకాయలు ఏరడం రాదు, పియానో వాయించడం తెలియదు.. కానీ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు.. నీకోసం నేర్చుకోడానికి.
  •  నాన్న ఎప్పుడూ పూరియే ఆర్డర్ ఇస్తాడు.. నువ్వు తింటే నాన్నకి కడుపు నిండుతుందని
  • నువ్వు తినకుండా మారాం చేసినప్పుడు, పప్పు అన్నం ముద్దలు జంతువుల SHAPE లో మారవు. అవి నీ నోటిలోంచి పొట్టలోకి వెళ్లి అక్కడ పార్టీ చేసుకోవు..
  •  నాన్న కింగ్ కాదు. నిన్ను PRINCESS చెయ్యాలని నాన్న కింగ్ అయ్యాడు.. కింగ్ లు నిన్ను నవ్వించడానికి పిచ్చి గెంతులు వెయ్యరు. నీతో కలిసి డాన్సు చెయ్యరు..
ఐదేళ్ళు నిండిన నువ్వు పదే పదే, "డాడీ! ఐ యాం బిగ్ గర్ల్ నౌ", "దట్ ఈస్ ఫర్ బేబీస్, నాట్ ఫర్ మీ" అని అంటుంటే.. ఇక నిన్ను ఇంతకు ముందులా మభ్య పెట్టలేనని....

5, ఏప్రిల్ 2011, మంగళవారం

మా అమ్మాయి కొట్టిన తీన్ మార్ మ్యూజిక్

మా అమ్మాయిని పియానో పాటాలకు పంపడం మొదలుపెట్టి ఇంచుమించు సంవత్సరం అవుతుంది. అయితే పేరుకు పియానో లెస్సన్ అయినా, దాని మనసు అంతా DRUMS మీదే. క్లాసు ఇంకా మొదలు పెట్టక ముందే అది దాని టీచర్ తో బేరం మొదలు పెడుతుంది, "నేను DRUMS వాయిస్తాను" అని.  చివ్వర్లో వాయిద్దువు గాని అని సర్ది చెప్పి వాళ్ళ టీచర్ పియానో పాటం మొదలు పెడుతుంది. అసలు అదేదో నేర్చుకున్నట్లుగా కాకుండా, నా కూతుర్ని ఆ టీచర్తో ఆడుకోడానికి తీసుకోచ్చినట్లుంది ఆ అరగంట మ్యూజిక్ క్లాస్. పైగా అరగంటకి పద్దెనిమిది డాలర్స్ తీసుకుంటుంది. అరగంట సేపు ఏదో పుస్తకంలో రాతలు గీతలు, కాసేపు మా అమ్మాయి యక్ష ప్రశ్నలు, ఇంకాస్సేపు మాట వినని నా కూతుర్ని బుజ్జగించడం. అప్పటికి ఒక ఇరవై నిమిషాలు అయిపోతాయి. చివరి పది నిమిషాలు ఏదో భంగిమ టైపు లో చేతులు ఏ పోసిషన్ లో పెట్టాలో (చేతుల్లో బుడగలు వున్నట్లు అవి పగలకుండా పటుకున్నట్లు),
 పియానో ముందు ఎలా కూర్చోవాలో లాంటి వాటితో మొదలెట్టి ఒక ఐదు నిముషాలు తూతూ మంత్రం కింద పియానో
టప టపా బాది, (నాకేమో క్షణం క్షణం లో సీన్ గుర్తొస్తూ వుంటుంది) ఐపోయిన్దనిపిస్తారు.  పోనీ నేనేమైనా ఆ టీచర్ ని కొంచెం గట్టిగా పియానో నేర్పించమని అడుగుదామంటే అసలే పెద్ద అంద గత్తె, మనకేమో ఆడపిల్లని చూస్తే మాట రాదు, అందులో అందమైన ఆడపిల్లలని అసలు ఏమి అనలేము. దానికి తోడు నేను కూడా ఈవిడ దగ్గర నాలుగైదు పియానో పాటాలు నేర్చుకున్నాను లెండి. నా కూతుర్ని ఇంటి దగ్గర ప్రాక్టీసు చేయించాలంటే మనకి సంగీతంలో ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా అని.
అలా క్లాసు ఐపోయే టైం కి నా కూతురు మోహంలో వెలుగు, ఇంక తీన్ మార్ డప్పు కొట్టొచ్చు అన్న ఆనందం. ఇదిగో ఈ కింద వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మా అమ్మాయి తీన్ మార్ టాలెంట్.

3, ఫిబ్రవరి 2011, గురువారం

టాం అండ్ జెర్రీ - మాం అండ్ సిరి



ఈ మధ్య మా ఇంట్లో కొత్తగా టాం అండ్ జెర్రీ ఎపిసోడ్ లు ఎక్కువ ప్లే అవుతున్నాయి. ఇన్నాళ్ళు చిన్న పిల్లలు టాం అండ్ జెర్రీ చూసి చిన్న తనంలో వెకిలి చేష్టలు.. అంటే చూపుడు వేళ్ళతో నోరు చెరో వైపు లాగి కళ్ళు పెద్దవి చెయ్యడం  నాలిక బయటకి పెట్టి ఆడించడం.. నోట్లోంచి తుస్సు మని గాలి తెచ్చి . అందినవి విసిరేసి.. ఆకలేస్తే నోరు పెద్దగా తెరిచి రెండు వేళ్ళు నోటి లోకి పాయింట్ చేసి చూపించడం.. సోఫాలు లాంటి వాటి మీద నించి ఎక్కి దూకేయ్యడం.. నేల మీద పడి దొర్లుతూ నవ్వడం.. ఎవరైనా పడిపోతే కిత కితలు పెట్టి నవ్వడం.. పాత్ర లు అవ్వీ గాట్టి శబ్దం ఒచ్చేల విసిరెయ్యడం... ఇవి మచ్చుకు కొన్ని అన్న మాట. ఇలాంటివి చాలా పిల్లలు చేస్తారని కొందరు చెప్పగా విని ఇన్నాళ్ళూ నా కూతురికి టాం అండ్ జెర్రీ ఎపిసోడ్లు కంట పడకుండా జాగ్రత్త పడ్డాము. ఎప్పుడైనా పొరపాటన ఏదైనా ఛానల్ లొ ఒస్తే వెంటనే ఛానల్ మార్చేసి, ఎవరిన్టికైనా వెళ్ళినప్పుడు ఆ ఛానల్ పెట్ట వద్దని  ముందుగానే చెప్పి గడిపేసాము. ఈ మధ్య నా కూతురు సెల్ ఫోన్ తీసుకుని తనే గేమ్స్ ఆడుకోవడం, కంప్యూటర్ లొ గేమ్స్ మరియు వీడియో లు చూడడం అలవాటు చేసుకుంది. ఎలా నేర్చుకుందో నా సెల్ ఫోన్ లొ కూడా యు ట్యూబ్ లొ వీడియో లు ప్లే చెయ్యడం నేర్చుకుంది. నేనెప్పుడో దాని కోసం పెట్టిన లిస్టు లొ వీడియో లు ప్లే చేసి, ఆ తర్వాత  వాడు చూపించే వీడియో లు కూడా చూడడం మొదలెట్టింది. అలా ఎప్పుడో టాం అండ్ జెర్రీ చూసి నచ్చేసిన నా కూతురు, అప్పటినించి టీ వీ పెట్టు అన్న మాట వొదిలి టాం అండ్ జెర్రీ పెట్టు అనే మాట  పట్టుకుంది.
ఒకటి రెండు ఎపిసోడ్ లు టీ వీ లొ చూసాక, సరే నాన్న ఇంట్లో లేని టైం లొ తల్లీ కూతురు  ఇద్దరూ  నవ్వు కుంటూ చూస్తున్నారు కదా అని నేను టాం అండ్ జెర్రీ ఎపిసోడ్ లను రికార్డు చెయ్యడం మొదలెట్టా. అక్కడే ఒచ్చింది తంటా. ఎక్కువ చూసేస్తోంది అని వాళ్ళ అమ్మ, నేను చూస్తే కానీ ముద్ద తినను అని కూతురు తరచుగా యుద్ధాలు మొదలెట్టారు. దానికి తోడు అందులో చూపించిన చేష్టలన్నీ అనుకరిస్తోందని మా ఆవిడ ఒకటే గోల. పోనీ ఇంకేదన్నా చూపించమంటే టాం అండ్ జెర్రీ తప్పు ఇంకేదీ చూడనని నా కూతురు పంతం పట్టింది. నేను ఆఫీసు లొ ఏదో పనిలో వుంటే నాకు ఇంటి నించి ఫోను "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు"  అని కూతురు ఏడుపు. టాం అండ్ జెర్రీ మధ్యలో ఒచ్చిన మూడో జంతువుకి అటూ ఇటూ కూడా దెబ్బలు పడే ఎపిసోడ్ ఆఫీసు లొ వున్న నాకు. వీకెండ్ ఇంటి కెళ్తే  "నీ కూతురు ఇలా దూకింది, అలా కరిచింది, గట్టిగా అరిచింది, జబ్బ చరిచింది,  వెక్కిరించింది" లాంటి పెద్ద లిస్టు మనకోసం సిద్దం. అప్పటికీ మా నాయనమ్మ గుర్తుకొచ్చి, నేనొక చండ శాసన మున్దావాడినని ఇలాంటివి సహించేది లేదు అని ఇద్దరికీ టైం అవుట్ అని చీకటి గదిలో పెడితో, అక్కడ ఇద్దరూ ఇక-ఇకలు పక-పకలు. పోనే విభజించి పాలించాలని వేరే వేరేగా పెడితే రెండు నిమిషాలలో "మేము తప్పు తెలుసుకున్నాం . ఇక మళ్ళీ చెయ్యం." అని హామీ  ఇచ్చేస్తారు. మళ్ళీ రిపీట్ చెయ్యద్దని చెప్పి  టాం అండ్ జెర్రీ  లేకుండా వారాంతం గడిచిపోతుంది.
మళ్ళీ సోమవారం ఆఫీసు పనిలో వుండగా ఫోన్ రింగవుతుంది. ఇంటి నించి ఫోను అని ఎత్తితే "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు"  అని కూతురు ఏడుపు. 
ఇంట్లో టాం అండ్ జెర్రీ - ఫోన్ లొ మాం అండ్ సిరి ఎపిసోడ్లు. ఈ రెంటి మధ్యలో నా బాధలు యేమని చెప్పను. 


1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...



వారం అంతా ఎక్కడో పని చేసి, వీకెండ్ ఇంటికి ఒచ్చి నా కూతురు చెప్పిన కబుర్లు వింటూ భోజనం చేసి టీవీ ఆన్ చేసాను. నాతో పాటు TV చూస్తున్న నా కూతురు "మా" టీవీ లొ ఒస్తున్న సినేమా "రోబో" లొ యుగళ గీతం చూసి నన్ను ఒక డౌట్ అడిగింది. "డాడీ! WHY BOYS ALWAYS FALL IN LOVE WITH GIRLS ?" అని. కళ్ళు తిరిగి కింద పడినంత పని అయ్యింది. ఎందుకంటె నా కూతురు వయసు ఇంకా నాలుగే. నిజానికి నా ముద్దుల తల్లి అడిగే ప్రశ్నలకి నేను అలవాటు అయ్యి అంతగా ఆశ్చర్యపోను. మొదట్లో అదేదో సినిమాలో గిరిబాబులా ఆకాశం కేసి చూసి "దేవుడా! ఎందుకు నాకు కూతుర్నిమ్మంటే క్వొశ్చన్  బ్యాంకు నిచ్చావు" అని ప్రశ్నించేవాడిని. తరవాత మెల్లిగా ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇది ఎంసెట్ లొ అవుట్ అఫ్ సిలబస్ క్వొశ్చన్, అదీ యం పీ సి  వాడికి బోటనీ క్వొశ్చన్ లాంటిది. ఈ ప్రశ్న దాని మనసులోకి ఎలా ఒచ్చిందంటే, అది చూసే అరా-కొరా తెలుగు సినిమాలలో ఎప్పుడూ హీరొయిన్ వెంట హీరో పడడం, చివరికి ROBO సినిమాలో ROBO కూడా హీరొయిన్ వెంట పడుతుంటే దానికి ఇలాంటి సందేహం ఒచ్చింది. నేను వెంటనే ఆపుకోలేని నవ్వుని, నా ముఖ కవలికలని కవర్ చేసుకుని "ఎక్కడ నేర్చుకున్నావు ఇది?' అని అడిగా లేని కోపం చూపించే ప్రయత్నం చేస్తూ. "నో వేర్" అని చెప్పి మాట మార్చేయడం నా కూతురికి అలవాటు.




నా కూతురు తెలివి గురించి చెప్పాలంటే- నేను మా ఆవిడ ఎప్పుడైనా ఘర్షణ పడితే ఇది నేను ఏమి చెయ్యలేదు, నేను గుడ్ గర్ల్ అంటుంది. మీ ఇద్దరూ కోపం నా మీద చూపించకండి ఇందులో నా తప్పేమీ లేదని అందులో అర్ధం. ఎప్పుడైనా వాళ్ళ అమ్మను కార్ లోంచి డ్రాప్ చేసి "మీ అమ్మ ని ఓదిలేసాను, ఇంక నువ్వు డాడీ దగ్గరే వుండాలి" అని ఏడిపిస్తే, "చిన్న పిల్లలు మమ్మీ లేకుండా ఉండలేరు.", అని సెంటిమెంట్ తో కొట్టి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నేను కంగారుగా ఓదార్చే స్టేజి కి తీసుకొస్తుంది. పైన రెండు సందర్భాలలో అది ప్రదర్శించే తెలివి నన్ను కొంచెం పుస్తకాలూ అవీ చదివి, దాని వయసుని బట్టి ఆలోచనలు పసిగట్టే ప్రయత్నం చేసేలా చేసాయి. అయినా సరే నా కూతురు వయసుకి మించిన పరిణతి తో నా ప్రిపరేషన్ సరిపోవట్లా. 

నా కూతురు నాకు ఇలాంటి షాక్ లు చిన్నప్పటి నించీ ఇస్తోంది. రెండేళ్లప్పుడు అనుకుంటా ఒక సారి ఇంటికి ఒచ్చి "నిక్ గాడికి నేను నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటాడట" అన్నప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.


మూడేల్లప్పుడు ఒక సారి ఇంటికి ఒచ్చి "నాన్న, నేను ఎందుకు బ్రౌన్ గా వున్నాను. తెల్లగా ఎందుకు లేను?" అంది. అప్పుడేదో ఇంద్ర ధనుసులో రంగుల్లా అన్ని రంగులలో మనుషులు వుంటే లోకం అందంగా వుంటుంది అని చెప్పి సర్దేసా. ఏం చేస్తాము నా వన్నీ నీ పోలికలు అని చెప్తే, తెల్లగా వున్న అమ్మ పక్షం చేరుతుందని, లేదా మరిన్ని ప్రశ్నలు సందిస్తుందని. అప్పటినించీ దీనికి నలుపు, బ్రౌన్ రంగుల గురించి ఏది చెప్పాలన్నానేను బాగా ఆలోచించి మరీ చెప్తా.


ఒక రోజు ఇంటికి ఒచ్చాక "నాన్నా! నాకు డే కేర్ లొ ఒక ట్విన్ సిస్టర్ ఉంది" అంది. ఈ మధ్య డే కేర్ లొ కొత్తగా చేరిన జయ (నల్ల అమ్మాయి) రంగూ, నా రంగూ ఒకటే కాబట్టి అది నా ట్విన్ సిస్టర్ అని వాదిస్తూ కూర్చుంది. దీని చేత అది కాదు అని ఒప్పించే టప్పటికి నా తల ప్రాణం తోకలో కొచ్చింది. మీరు మరీ ఎక్కువ ఊహించకండి- నాకు తోక లేదు. ఏదో సామెత అంతే.  హమ్మయ్య దీన్ని కన్విన్సు చేసానని సంబరపడుతుంటే నిన్న "నాన్నా నేను నువ్వు ఒకే రంగులో, బుగ్గ సోట్టల్తో ఒకేలా  ఉంటాము. నువ్వు నేను ట్విన్స్" అనడం మొదలెట్టింది.
ఈ మధ్యనే TANGLED సినిమాకి వెళ్తే నా కూతురు అడిగిన ప్రశ్నలకు నా వెనక కూర్చున్న ముసలామె సినేమా అయ్యాక నన్ను తట్టి మరీ నా కూతురు వయసెంత అని అడిగింది. నాలుగు అని చెప్తే ఆవిడ సమాధానం "మీ అమ్మాయి ప్రశ్నలు వింటే ఏడో ఎనిమిదో అనుకున్నా, ఎత్తు చూస్తే తక్కువ అనిపించి అలా అడిగాను. నాలుగేళ్ళకే ఇన్ని ఇలాంటి ప్రశ్నలా?" అంది.



ఇలా వుంటుంది నా కూతురితో.  దీనికి తోడు మా ఆవిడ లేని పోని చిన్ని కృష్ణుడు కధలు చెప్పి, కృష్ణుడు  ఒస్తాడని కాకమ్మ కబుర్లు చెప్తే, "కృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు? ఎలా ఒస్తాడు? ఎప్పుడు ఒస్తాడు?" అని ఒక రోజంతా పదే పదే విసిగించింది.


పోనిలే అవసరానికో అబద్ధం అని చెప్పి మా అమ్మాయి ప్రశ్నల నించి తప్పించుకోడం చాలా కష్టం. ఎప్పుడైనా మనం వేరే సమాధానం చెప్తే "మరి నా మూడేల్లప్పుడు నాకు అలా చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్పావు" అని నిలదీస్తుంది. ఒక సారి మా అమ్మాయికి DRY COUGH ఒస్తే, "తల్లి! కొంచెం మంచినీళ్ళు తాగు. నీకు DRY COUGH ఒచ్చింది" అన్నాను. "DRY అంటే తెలుగులో ఏంటి?" అని అడిగింది. పొడి- అని చెప్పాను. వెంటనే "డాడీ! పొడి అంటే నాయనమ్మ నాకు దోశ లలోకి నంచుకోడానికి పంపించేది, కదా!" అని నిలదీసింది. అది పుట్నాల పొడి, ఇది పొడి దగ్గు అని చెప్తే ఊరుకోలేదు. అదే పొడి ఇది కాదు అంటుంది.  
ఈ సారికి ఎలాగోలా దాటేసినా "అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...?" అనే ప్రశ్నకు దాని వయసుకు తగ్గ సమాధానం చెప్పడానికి నేను విపరీతమైన research చెయ్యాలి. ఈ టపా చదివే మీరు సరైన సమాధానం తెలిసీ చెప్పక పోయారో  ప్రశ్నా పత్రం లాంటి నా కూతురు లాంటి పిల్లలు మీ ఇంట కూడా పుట్టి ప్రశ్నలతో మిమ్ములను వేధించు గాక! తెలిస్తే కామెంటి నా కష్టం తీర్చండి.