20, అక్టోబర్ 2010, బుధవారం

కట్టు కధ - స్నానం చెయ్యని కుక్కపిల్ల నోబి

 ఈ మధ్య మా అమ్మాయిని పొద్దున్న నిద్ర లేపడం ఒక ప్రహసనం. అందులో కొన్ని అరుపులు, కేకలు, తన్నులు (మా అమ్మాయి కాలు విసిరితే) , ఏడుపులు లాంటివి సర్వ సాధారణం ఐపోయాయి. నేను కొంచెం పిల్లల పెంపకంలో అరుపులు సహించలేను - అవి నా అరుపులు కాకపోతే అస్సలు భరించలేను. ఆ టైం కి పరిస్థితిని బట్టి ప్రత్యక్షం అయ్యి, ఏదో ఒక లాగ మా అమ్మాయి దృష్టి ఏడుపు నించి తప్పించి ఒక సారి కళ్ళు తిడిచి మొహం కడిగేసి ఒంటి మీద నీళ్ళు పోస్తే ఇంకా మా అమ్మాయి స్వింగ్ లోకి ఒచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో ఇవ్వాళ్ళ మనం చేసిన రోబో వేషాలు చెల్లలేదు. అప్పటికీ వొస్తువులు పట్టి తెచ్చే రోబో, తేలు లాగ కుట్టే రోబో, పాట పాడుతూ డాన్సు చేసే రోబో లాంటి చిన్నెలు చూపించా. దాని ఏడుపు పెరిగింది గానీ తగ్గలేదు. రోబో దిక్కు తోచక బిక్కుమంది. ఇంతలో తట్టిన కట్టు కధే "కుక్క పిల్ల నోబి".
  ఒక ఇంట్లో పిల్లలకి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల దొరికింది. అది వాళ్ళ అమ్మ, నాన్న మాట వినకుండా దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోయింది, అందుకని తప్పి పోయింది. దానికి చాలా భయం వేసి, కూ కూ అని ఏడ్చుకుంటూ రోడ్డు మీద మెల్లగా వెళ్తోంది, వెతుక్కుంటూ. ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చి పిల్లలు ఆడుకుంటారు. అయితే ఇది ఎప్పుడు స్నానం చేయించాలన్నా అసలు చేయించ నివ్వదు. 'బౌ బౌ నో బాత్, బౌ బౌ నో బాత్" అని అరుస్తుంది. ఇక్కడ కొంచెం మిమిక్రీ అవసరం. కుక్క పిల్ల లా అరిస్తే పిల్లల ఏడుపు సగం తగ్గుతుంది, పైగా ఆసక్తి పెరుగుతుంది. అసలు ఇంట్రో లేకుండా కూడా ఈ అరుపుతో స్టొరీ మొదలు పెట్టాల్సిన అవసరం పడచ్చు. ఇంక కధలో కొస్తే, ఆ కుక్కపిల్ల పేరు నోబి, ఎందుకంటె అది "NO BATH BABY " కాబట్టి. (మీకు పేరు నచ్చకపోతే మార్చుకోండి, అంత కంటే బెటర్ పేరు ఆ ఫ్లో లో తట్టలేదు మరి).
ఇలా స్నానం చెయ్యని నోబి ని పిల్లలు పెట్ చెయ్యాలని వున్నా, అది కంపు కుక్క అని (స్టిన్కి), డర్టీ అని పిల్లలు పెట్ చెయ్యరు. ఇంక లాభం లేదని ఒక రోజు అందరూ బలవంతంగా నోబి ని పట్టుకుని స్నానం చేయించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొంచెం సబ్బు, నురుగ, నీళ్ళు మన టాలెంట్ ని సందర్భాన్ని పట్టి ఉపయోగించి నోబి మీద ఇలా పోశారు అని చెప్పి స్నానం చేయిన్చేయ్యాలి.
ఇంతేనా స్టొరీ అయిపోయిందా అని అనుకుంటున్నారా. లేదు, మా అమ్మాయి స్నానం ఐపోయింది. మళ్ళీ అవసరం అయ్యి, పనికి ఒస్తే కధ జరిగిన కధ చెప్పి మళ్ళీ కొనసాగించే అవకాశం రావొచ్చు.
అయినా ఇదేమన్న స్టొరీ సిట్టింగ్ అనుకున్నారా- కధ కంటిన్యూ చెయ్యడానికి. నా కసలే పొద్దున్న తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన   ఎనిమిదింటి ఆఫీసు కాన్ఫరెన్స్ కాల్ టైం అయ్యింది. అది లేక పోతే ఇలాంటి కట్టు కధలు లక్ష చెప్పినా నేను లేవను- మా అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. చిన్నప్పుడు మా నాన్న గారి దెబ్బల కి బయపడి లేచేవాడిని, లేక పోతీ మా నాన్న ఇల్లాంటి కధలు చెప్పలేక ఏం చేసేవారో? పిల్లలని భయపెట్టకుండా పెంచాలంటే కొంచెం కష్టమే మరి.
Image source: blogspot

2 కామెంట్‌లు: