29, అక్టోబర్ 2010, శుక్రవారం

మా ఎదురింటి గీతాంజలి యువ జంట

 మా ఎదురింటి యువ జంటని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. మరీ యువ జంట మీద కన్ను వేసి - వారిని చూసే వెదవ బుద్ది అని అనుకునేలోపే మీకు వాళ్ళ వయసు చెప్పాలి. అతని వయసు డెబ్భై పైన, ఆమె వయసు అరవై పైన. కాకపోతే మేము ఈ ఇంట్లో దిగిన రెండు సంవత్సరాలకు, వాళ్ళు కూడా ఎదురింట్లో దిగారు (అంటే ఎదురింటి పక్కిల్లు అనుకోండి). వయసుకి ముసలి వాళ్ళు ఐనా, జంట మాత్రం యువ జంటే. ఎందుకంటె ఇంట్లోకి దిగే ముందే పెళ్లి చేసుకున్నారు. అసలు దిగక ముందు ఇద్దరూ చెరొక కొత్త ఇల్లు కొనుకున్నారట. ఇంతలో ఇద్దరికీ ఏ చర్చి లోనో పరిచయం - తదుపరి ప్రణయం. ఆ రెండూ అమ్మేసి ఈ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు.
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి, పైగా ఇద్దరికీ మనుమలు, మనుమరాళ్ళు వున్నారు. కానీ ఇద్దరూ చాలా అన్యోనంగా వుంటారు. ఇద్దరి మనస్తత్వాలు చాలా తేడాగా వుంటాయి. అతని పేరు జిమ్ము, ఆమె పేరు రూతు. జిమ్ము చిన్న పిల్లాడిలా ఎప్పుడూ నవ్వుతో ఉంటాడు. చెయ్యత్తు మనిషి, భారీ ఖాయం. మాట్లాడితే మా ఆవిడ బోదర కప్ప గొంతు అంటుంది. కంచు కంటం. అందరినీ పలకరిస్తాడు, ఒక సారి మొదలు పెట్టడంటే ఆపడు. కలుపుగోలు మనిషి. ఇంటి దగ్గరే ఉంటాడు. మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ లకి పిలిస్తే ఒస్తాడు. అన్నీ కొంచెం కొంచెం తిని, నచ్చినవి బాగా గుర్తు పెట్టుకుంటాడు.
రూతు మరీ మిత భాషి. అంత తొందరగా కలిసే రకం కాదు. మా అమ్మాయి పుట్టిన రోజుకి పిలిచినా ఎప్పుడూ ఒచ్చిన గుర్తు లేదు. స్కూల్ లో ప్రిన్సిపాల్ గా ఇంకా వుద్యోగం చేస్తోంది. కొంచెం తెలియని వాటికి దూరంగా వుండే రకం అనిపిస్తుంది. కానీ పలకరిస్తే మాట్లాడుతుంది. వారాంతాలలో బయట తోట పని చేస్తూ కనిపిస్తుంది. 
 మొన్నామధ్య జిమ్ముకి బాగా అనారోగ్యం చేసింది, చాలా కంగారు పెట్టాడు. అప్పుడు వాళ్ళతో కొంత సమయం గడిపాను, అప్పుడు వాళ్ళ అనుబంధం చూస్తే ఆశ్చర్యమేసింది.  ఇంతకీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇలా వృద్ధాప్యంలో తోడు వెతుక్కోడం అనేది మన దేశంలో జరగదు. అసలు ఆ వయసులో వాళ్లకి తనతో పాటు ఇంట్లో ఇంకో మనిషి వుండడం, ఒకళ్ళ బాగోగులు ఇంకొల్లు చూసుకోడం వాళ్లకు చాలా అద్రుష్టం. దాని మూలంగా ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత తో కూడిన ప్రేమ వుంటుంది. ఈ వయసులో ఆకర్షణతో తీసుకునే నిర్ణయాలు ఎలాగో వుండవు. అంత వయసు ఒచ్చాక ఎవరిని నమ్మి, ఎవరి మీద ఆధారపడగలరు.  వీళ్ళని చూస్తే నాకు గీతాంజలి సినిమా ప్రేమ అనిపిస్తుంది. అందులో చివరకి చెప్పినట్లు "ఎంత కాలం బతుకుతారో తెలియదు, కానీ బతికినంత కాలం కలిసే బతుకుతారు"  
అదండీ మా ఎదురింటి గీతాంజలి యువ జంట కధ.

10 కామెంట్‌లు:

  1. చాలా బావుంది.
    ఇదే టాపిక్కు మీద రెంటాల కల్పన గారు ఐదోగోడ అనే కథ రాస్తే, ఆ వయసులో "అమ్మ" ఇంకో మగ తోడుని వెతుక్కోవడం అవసరమా - అక్ఖర్లేదు! అని తీర్మానించింది మన సమాజం.

    రిప్లయితొలగించండి
  2. చాలా బావుందండి..
    మామూలుగా మనవాళ్ళు పెళ్ళి అంటే కేవలం శారీరక సంబంధమే కాదు సుఖదుఃఖాల్లో ఒకరికొకరు తోడు అని గంభీరంగా చెప్తూ వయసుమళ్ళిన వాళ్ళు పెళ్ళి చేసుకుంటే మాత్రం 'ఈ వయసులో పెళ్ళి అవసరమా!' అని తెగ ఆశ్చరయపోతుంటారు! Too sad!

    రిప్లయితొలగించండి
  3. నిజమే..మనవాళ్ళకి ఇంత ఆలోచనా...ధైర్యం బహుశా 2050 లొ అయినా వస్తాయో రావో!! జీవితం మనది మనం ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు అనుకునే వాళ్ళకంటే చుట్టూపక్కలవారు...బంధువులు..ఏమనుకుంటారో అనే ఆలోచనే ఎక్కువ! మనం దేశం ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళను అంగీకరించే స్థితి లోనే లేదు....ఇక ఇలాంటివి ఎప్పటికి జరిగేను???

    రిప్లయితొలగించండి
  4. కొత్త పాళీ ,
    నచ్చినందుకు థాంక్స్. ఆ కధకి ఏవైనా లింకులు ఉంటే పంపండి.

    రిప్లయితొలగించండి
  5. నిషిగంధ.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ తరంలో కొంత మంది సుఖాలకే పరిమితం నా తోడు అన్న టైప్ లో వుంటున్నారు కూడా.

    రిప్లయితొలగించండి