31, అక్టోబర్ 2010, ఆదివారం

యురేకా! అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ ఈ రోజుతో ముగిసింది

యురేకా!  అనుకోకుండా ఈ అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ పోటీ గురించి తెలిసింది. తెలిసాక సరదాగా ప్రయత్నిద్దామని అనుకున్నాను.నేను అసలు సిసలు ఆంధ్రుడ్ని కదా! అందుకని ఇది అయ్యే పని కాదులే అని నాకు నేను సరిపెట్టేసుకున్నాను. అదే నండీ మన ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నారు కదా - అందుకని అన్న మాట.  పైగా నా విషయంలో ఇది వున్న మాట, నలుగురి నోటిలో నేను విన్న మాట.  అలా మొదలయ్యింది ఈ టప-టప టపా రాయాల్సిన  అవసరం.
మన శ్రీ శ్రీ గారు చెప్పినట్లు: కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల - కావేవోయ్ కవిత కనర్హం అని. ఒక సారి నన్ను నేను వెన్ను తట్టుకుని, వేళ్ళు విరుచుకుని కంప్యూటర్ మీద, నా వేళ్ళతో అడ్డొచ్చిన టాపిక్ మీద ఇష్టం ఒచ్చిన పద్ధతిలో టపాలు వోదిలాను.
రోబో తో మొదలెట్టి, యానిమేషన్ తో పొడిగించి, ఆలోచనలకో తాడూ బొంగరం కలిపించి, రాజకీయం మీద కవిత కక్కి, లక్ష్మణుడి గీత ని, చిత్ర పటాలని, నా బ్లాగు పేరు వెనుక ఉద్దేశ్యాన్ని పరిచయం చేసాను.
ఆ తరవాత మా అమ్మాయి kaleidoscope లో నాకు కనిపించిన రంగులు, నిండుగా తిరిగొచ్చే మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకు చూపించే చుక్కలు, ఎంత సాగినా మారని ఆకతాయి బాండ్ లు, వలస వెళ్ళిన చేపలతో కొంచెం టపాలు రాయడానికి అలవాటుపడ్డాను.
అనంతరం రివ్యూ లలో లేని ఖలేజా ని, మా లాంటి వాళ్ళ వయసులో వృద్ధాప్యాన్ని, ఏకాకి జీవితాన్ని, నా జీవిత పల్లపు ఆలోచనలని కొంచం వివరించాను.
ఆ తరవాత అంతగా ఆకట్టుకోని చంటిపిల్లల అనారోగ్యం చార్టు, రేపటి స్వప్నాల పాట, బృందావనం రివ్యూ తో కొంత విసిగేత్తించాను.  ఆలోచించి తల గోక్కుని ఆధిపత్యాల పోరు కవితతో,  కుక్క పిల్ల మీద కట్టు కధతో, అలరించిన చందమామ పాటతో, పురి విప్పిన నెమలి ఆర్టుతో బానే బ్లాగులోకంలో రెక్కలు విచ్చుకున్నాను.
చివరలో బెండకాయ బాధితుల్ని, మా అమ్మాయి నా కళ్ళు తెరిపించిన కలని, విదేశాలలో స్వదేసీలతో పడే బాధలని, మా బ్లాకు పార్టీ ని పరిచయం చేసాను.
అంతటితో ఆగక, నా కిళ్ళీ కొట్టు అనుభవాలు, నోములు నోచే బార్యల భర్తలు పడే కష్టాలు, మా ఎదురింటి పరిచయాలు చెప్పి - కుక్క పిల్ల టపా కి అనర్హం కాదని మరో సారి గుర్తు చేస్తూ "బౌ బెల్లా -అనే కుక్క పిల్ల" టపా ప్రచురించాను.
         ఈ రోజుతో అక్టోబర్ ముగిసింది. ఈ పోటీ పరిచయం చేసిన sree కి నా కృతజ్ఞతలు. ఈ పోటీలో బహుమతి ఏమిటంటే, నాకు ఒచ్చిన కామెంట్లు, హిట్లు మరియు తిట్లు. సరదాకి మొదలు పెట్టినా, నేను ఈ నెల రోజులూ బాగా ఎంజాయ్ చేసాను. ఇన్నాళ్ళు నా బ్లాగులను చదివిన మీ కందరికీ నా కృతజ్ఞతలు. ఇక నించి రోజూ కాకపోయినా, అప్పుడప్పుడు బ్లాగుతూ వుంటాను.


ఈ పోటీ వివరాలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి.
http://www.nablowrimo.blogspot.com/

8 కామెంట్‌లు:

  1. ఓహో ఆ లెక్కన రాశారా?
    విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. Congrats....ఇన్ని రొజులు వ్రాసారు కదా! ఇక ఇదే అలవాటు చేసేసుకోండీ :) అప్పుడు మీరు రోజూ వ్రాయోచ్చు మేము రోజు చదవొచ్చు :)

    రిప్లయితొలగించండి